ఏ బాబు అధికారంలో ఉన్నా ప్రజల అధో గతే : జయశ్రీ 

గత కొన్ని దశాబ్దాలుగా కడప జిల్లాలోనూ, ఇతర ప్రాంతాలలోను అణగారిన వర్గాలకు, మహిళలకు, దళితులకు అండగా నిలిచి వారికి జరిగిన అన్యాయాలను ఎదిరించి ఒంటరిగా పోరాడుతున్న మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మహిళా న్యాయవాది శ్రీమతి జయశ్రీ గండికోట ముంపువాసుల కోసం జరుపుతున్న పోరాటంపై “ట్రెండింగ్ తెలుగు న్యూస్. కామ్” కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ  
(యనమల నాగిరెడ్డి)
అధికారంలో ఏ బాబు ఉన్నా ప్రజల గతి అధోగతే నని, ఈ విషయాన్నిగతంలో  చంద్రబాబు ప్రభుత్వం, ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గండికోట ముంపుబాధితుల పట్ల అనుసరిస్తున్న “అమానవీయ” ధోరణి రుజువు చేస్తున్నదని మానవహక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమతి జయశ్రీ ఆవేదన వ్యక్తం  చేశారు. 
గత 15 రోజులుగా గండికోట ముంపువాసులు చేస్తున్న ఆక్రందనలు అధికారులకు, పాలక పక్ష నేతలకు వినిపించడం లేదని, వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఈ ప్రజలను పట్టించుకోకుండా రోజు రోజుకు గండికోటలో నీటి మట్టం పెంచుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రాజెక్టులో 12 టీఎంసీ లకు మించి  నీటిని నిల్వ చేస్తే ప్రాజెక్టు రెండవ దశలో 8 గ్రామాలు నీట మునుగుతాయని ఆమె వివరించారు. ఈ విషయం తెలిసినా ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ముంపువాసుల గోడు పట్టించుకోకుండా నీటి నిల్వలను ఇష్టానుసారం పెంచుతున్నారని, ప్రస్తుతానికి ప్రాజెక్టులో సుమారు 14 టీఎంసీ ల నీటిని నిలిపారని ఆమె వివరించారు. 

2017లో చంద్రబాబు ప్రభుత్వం కొంతైనా స్పందించింది
2017లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టు మొదటి దశలో నీళ్లు నిలపడానికి ప్రయత్నించిందని, అధికారుల తప్పుడు లెక్కలు కారణంగా రెండొదశలో మునగవలసిన కొండాపురం మొదటి దశలోనే మునిగిందని ఆమె గుర్తు చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకులు, ప్రజా సంఘాలు చేసిన ఆందోళనలకు తలా ఒగ్గిన ప్రభుత్వం నీటి నిల్వను తగ్గించడం, అందిరికీ నష్టపరిహారం ఇచ్చి, వారికి రవాణా ఖర్చులు కూడా ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు. అంతకు ముందే కొందరికి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు, పునరావాస పనులను కొంతమేరకు పూర్తి చేసి రోడ్లు, విద్యుత్, తాగునీరు ఏర్పాటు చేశారని, కొందరు ఇల్లు పూర్తి చేసుకోగా మరి కొందరు గోడల వరకు ఇల్లు నిర్మించుకున్నారని ఆమె వివరించారు. అప్పటి ప్రభుత్వం ముంపువాసులకు తగినంత సమయం కూడా ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు. 
ప్రస్తుత జగన్ ప్రభుత్వం పట్టించుకోవడమే లేదు …..  
దళిత, బిసి, రైతు పక్షపాతిగా చెప్పుకుంటున్న ప్రస్తుత జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం ముంపువాసుల గోడు వినడానికి కూడా సిద్ధంగా లేదని, అధికారులు అసలు పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. రెండవదశ ముంపు లో మొదటగా మునుగుతున్న తాళ్ల ప్రొద్దుటూరు ముంపువాసుల ఆందోళనలను పట్టించుకోకుండా  “పొమ్మనలేక పొగ పెట్టినట్లు” ప్రాజెక్టులో నీటి మట్టం పెంచితే విధి లేని పరిస్థితిలో గ్రామస్తులే  చావలేక ఊర్లు విడిచి పెడతారనే  ఎత్తుగడ వేశారని , కులాల మధ్య విభేదాలు సృష్టించారని, ఇది అత్యంత దారుణమని ఆమె వాపోయారు. అందరికీ నష్ట పరిహారం ఇవ్వకుండా, వారి పునరావాసానికి చర్యలు తీసుకోకుండా ఉన్న ఫళంగా ఖాళీ చేయమంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు.

 

Like this story? Share it with a friend!

గతంలో చంద్రబాబు నీళ్లు పెడతామన్నపుడు తమతో కలిసి నానా యాగీ చేసిన వైసీపీ ప్రజా ప్రతినిధులు ఇప్పుడు ఫోన్లు కూడా ఎత్తడం లేదని ఆమె ఆరోపించారు. పైగా ఒకటిగా బృతుకుతున్న కొందరు అమ్ముడు పోయిన రెండవ శ్రేణి నాయకులు గ్రామస్తులను  “కులాల పేరిట విడదీసి” తమ పబ్బం గడుపుకుంటున్నారని ఆమె తీవ్రంగా విమర్శించారు . ప్రస్తుతం ఈ ముంపులో మొదట మునిగేది దళితులు, ఆ తర్వాత వెనుకపడిన తరగతులకు చెందిన వారు, ఆ తర్వాతనే అగ్ర వర్ణాల రైతులని ఆమె వివరించారు. మరి దళిత, బిసి ల పక్షపాతిగా చెప్పుకుంటున్న జగన్ ప్రభుత్వం మొదట ఎందుకు రైతులకు డబ్బు చెల్లించి, దళితులను, బిసి లను ఎందుకు పక్కన పెట్టిందని ప్రశ్నించారు.  ఇంకా అనేకమంది దళితులకు, బిసిలకు, కొందరు రైతులకు అధికారులు నష్ట పరిహారం ఇవ్వలేదని ఆమె తెలిపారు. కేవలం ఖాళీ స్థలం చూపి ఇళ్ళు ఖాళీ చేయమనడం ఏమి ధర్మమన్నారు.  జిల్లా అధికారులు నాయకుల అండతో  అసలు ముంపువాసుల  వైపు చూడటం లేదని, పోలీసులను కూడా వెన్నక్కి పిలిపించారని, జేసీబీ లు పెట్టి ఇళ్లు పడగొట్టడం మానివేశారని, ప్రాజెక్టులో నీళ్లు నింపుతూ అందరినీ ముంచుతున్నారని ఆమె తీవ్రంగా ఆరోపించారు. ప్రభుత్వానికి తోడు, వర్షం కూడా వీరి పై పగ పట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

 

“ప్రాజెక్టులో నీటి మట్టం పెంచితే విధి లేని పరిస్థితిలో గ్రామస్తులే  చావలేక ఊర్లు విడిచి పెడతారనే  ఎత్తుగడ వేశారు”

 

కరువు ప్రాంతాలకు నీళ్లివ్వడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే ఆ సాకుతో ముంపుకు గురౌతూ ఇల్లు వాకిలి వదులుకొని వెళుతున్న ఈ నిర్భాగ్యులను ఆదుకోవడం కూడా ప్రభుత్వ భాధ్యతేనని, పాలకులు మరచి పోవడం దారుణమని, తాము ప్రభుత్వానికి ఆ భాద్యత గుర్తు చేస్తున్నామని  ఆమె వివరించారు. 
2017లో చంద్రబాబు చేస్తే జగన్ బాబు సైన్యం అండగా నిలిచిందని, ఇపుడు జగన్ బాబు అదే అన్యాయం చేస్తుంటే చంద్రబాబు సైన్యం మాత్రం నిద్ర పోతున్నదని ఆమె ఆరోపించారు.  ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరచి ముంపువాసుల గోడు విని పరిష్కరించాలని ఆమె ప్రభుత్వానికి, పాలకపక్ష ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. 
          

(యనమల నాగిరెడ్డి, సీనియర్ జర్నలిస్టు, కడప)