వరదల్లో చిక్కుకున్న 54 మంది కరోనా రోగులను కాపాడిన పోలీసులు

 .ఎస్.ఐ., సిబ్బందిని అభినందించిన కడప  ఎస్.పి కే.కే.ఎన్ అన్బు రాజన్ .
(యనమల నాగిరెడ్డి)  
.కడప జిల్లాలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఊరు వాడా నీళ్లలో మునిగి తేలుతున్నాయి. అదేవిధముగా కడప జిల్లా చెన్నూరు సమీపంలోని హజ్ భవన్ కూడా నీటమునిగింది. అయితే కోవిద్-19 నేపథ్యంలో అధికారులు హజ్ భవన్  ను కూడా క్వారంటైన్ కేంద్రంగా మార్చి కరోనా వ్యాధి సోకిన 54 మందిని అక్కడ ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో   శనివారం హజ్ భవన్ కు సమీపంలోని వాగుకు వరద పోటెట్టడంతో హజ్ భవన్ కూడా వరద నీటిలో చిక్కుకొని  ముంపునకు గురయింది. కరోనా వ్యాధి గ్రస్తులంతా అక్కడ చిక్కుకున్నారు. 
కరోనా మహమ్మారి పేరు వింటేనే భయపడి పోయే ప్రస్తుత పరిస్థితుల్లో చెన్నూరు ఎస్.ఐ. నాగ తులసి ప్రసాద్, సిబ్బందితో కలసి  కోవిడ్ భయాన్ని పక్కన పెట్టి  బాధితులను ఆదుకుని తమ మానవతాన్ని చాటారు.
తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ‘హజ్ భవన్’  నుండి సాహసోపేతంగా  ఎస్.ఐ నాగ తులసి ప్రసాద్, తన సిబ్బంది  జగన్ నాయక్,, ఎం. జాకీర్ హుస్సేన్, కె.నాగరాజు, డి.వి భార్గవ, డి. నరసింహులు, జి.రాజీవ్ కుమార్, హెచ్. చంద్రశేఖర్, పి. సుబ్రమణ్యంతో కలసి  హజ్ భవన్ నుండి 54 మంది కరోనా  వ్యాధిగ్రస్తులను, అక్కడున్న సిబ్బందిని   సినిమా పక్కీలో హజ్ భవన్ కు ఒడ్డుకు  తాడు కట్టి అందరినీ వాగు దాటించారు .

కరోనా వ్యాధిగ్రస్తులకు వైద్యులు చికిత్స అందించే సమయంలో పూర్తి స్థాయిలో వ్యక్తిగత భద్రత కోసం  అత్యున్నత ప్రమాణాలతో కూడిన కిట్లను ఉపయోగిస్తారు. అయితే పోలీసులు మాత్రం . ఎలాంటి వ్యక్తిగత భద్రత చర్యలు లేకుండా  నేరుగా రంగంలోకి దిజి అందరినీ కాపాడటాన్ని అందరు ప్రశంసిస్తున్నారు.
 ముందుగా మందపాటి  తాడును భవంతి వద్దకు తీసుకువెళ్ళి తాడు  సాయంతో ఒక్కొక్కరినీ  ఎత్తైన ప్రదేశానికి విధి తరలించారు. తర్వాత బాధితులను సమీపంలోని గ్లోబల్ ఇంజినీరింగ్ కాలేజి క్వారంటీన్ సెంటర్ కు తరలించారు.  

విధి నిర్వహణలో  కరోనాను లెక్కచేయకుండా సాహసం చేసి మానవత్వం చూపిన  చెన్నూరు ఎస్.ఐ నాగ తులసి ప్రసాద్, సిబ్బంది ని జిల్లా ఎస్.పి అన్బు రాజన్. అభినందించి రివార్డులు ప్రకటించారు.
కరోనా వైరస్ ను సైతం లెక్కచేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్ బాధితులను కాపాడి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన వీరిని పలువురు  కొనియాడారు.

(యనమల నాగిరెడ్డి, సీనియర్ జర్నలిస్టు, కడప)