ఇళ్లు చూపించమంటే కళ్లు తేలేసిన తెలంగాణ ప్రభుత్వం: భట్టి

హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 19:
గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో ల‌క్ష ఇండ్ల‌ను చూపిస్తామ‌న్న ప్ర‌భుత్వం, ఇండ్లు చూపించ‌లేక‌ పారిపోయింద‌ని సీఎల్పీ నేత బ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు శ‌నివారం తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.
మంత్రి తలసాని తలసాని శ్రీనివాస యాదవ్ ఏర్పాటుచేసిన  డ‌బుల్ బెడ్ రూమ్ (2BHK) ఇండ్ల ప‌రిశీల‌న శుక్ర‌వారం అర్థాంత‌రంగా ఆపేసుకుని  మీకు చూపించ‌లేమ‌ని  వెళ్లిపోవడంపై ఆయ‌న తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.
శ‌నివారం గాంధీభ‌వ్ లోని ఇందిరా భ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మాట్లాడారు. ఈ కార్య‌క్ర‌మంలో భ‌ట్టి విక్ర‌మార్కతో పాటుగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి, మాజీ ఎంపీలు అంజ‌న్ కుమార్ యాద‌వ్‌, వీ హ‌నుమంత‌రావు, దాసోజు శ్ర‌వ‌ణ్‌, యూత్ కాంగ్రెస్ అద్య‌క్షుడు అనిల్ కుమార్‌, ఎన్‌.ఎస్‌.యూ.ఐ అధ్య‌క్షుడు బ‌ల్మూరి వెంక‌ట్, ఎస్సీ సెల్ ఛైర్మ‌న్ నాగ‌రిగారి ప్రీత‌మ్, నాపంల్లి నాయ‌కులు ఫిరోజ్ ఖాన్‌ ఇత‌ర సీనియ‌ర్ నాయ‌కులు పాల్గొన్నారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ కు ఎన్నిక‌లు వ‌స్తున్న త‌రుణంలో ప్ర‌జ‌ల‌ను మ‌రోమారు మోసం చేసేందుకు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మ‌రొసారి రెడీ అయింద‌ని బ‌ట్టి అన్నారు.
ఎన్నిక‌లు వ‌చ్చిన ప్ర‌తి సంద‌ర్భంలోనూ ల‌క్ష డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్లు రెడీగా ఉన్నాయి.. ఎన్నిక‌లు అవ్వ‌గానే పంపిణీ చేస్తామంటూ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ లు ప్ర‌జ‌ల్ని మోసం చేస్తున్నార‌ని భ‌ట్టి విమ‌ర్శించారు.
ఎన్నిక‌లు రాగానే.. పేద‌ల‌వాళ్ల అవ‌స‌రాలు, ఇబ్బందుల‌ను ఆస‌రాగా చేసుకుని వారి ఓట్ల‌ను టీఆర్ఎస్ వేయించుకుని.. అస‌వ‌రం తీరాక వారిని ప‌క్క‌న పెట్ట‌డం కేసీఆర్ కు ఆన‌వాయితీగా మారింద‌న్నారు.
ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేటీఆర్‌, త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ లు డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌పై వివిధ సంద‌ర్భాల్లో స‌భ‌లో మాట్లాడిన మాట‌ల‌ను ఈ సంద‌ర్భంగా భ‌ట్టి మీడియాకు చూపించారు. అందులో కేసీఆర్‌‌ హైద‌రాబాద్ ప‌రిధిలో 2.60 ల‌క్ష‌ల ఇండ్ల‌ను నిర్మిస్తామ‌న్న వీడియోల‌ను బ‌ట్టి మీడియాకు చూపారు. అలాగే హైద‌రాబాద్ న‌గ‌రంలో ల‌క్ష ఇండ్లు రెడీగా ఉన్నాయ‌న్న మంత్రులు , కేటీఆర్, త‌ల‌సాని మాట‌ల‌ను ఆయ‌న మీడియాతో పంచుకున్నారు.
గ‌తంలోనూ ఎన్నిక‌ల‌ప్పుడు మోడ‌ల్ హౌస్ ల‌ను నిర్మించి వాటిని పేద ప్ర‌జ‌ల‌కు చూపి మ‌మ్మ‌ల్ని గెలిపిస్తే ఇలాంటి ఇండ్ల‌ను క‌ట్టించి ఇస్తామ‌ని చెప్పి పేద‌ల‌ను మోసం చేశారని అన్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ గ్రేట‌ర్ ప‌రిధిలోని ఏ నియోక‌వ‌ర్గంలోనూ 4 వేల ఇండ్ల‌ను క‌ట్ట‌లేద‌ని అన్నారు. ప్ర‌భుత్వం చెప్పిన వివ‌రాల మేర‌కు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 96 వేల డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్లు క‌ట్టాల్సి ఉండ‌గా.. కేవ‌లం 3,428 మాత్ర‌మే క‌ట్టార‌ని తీవ్ర స్థాయిలో విమ‌ర్శించారు.
గ్రేట‌ర్ లోని జియాగూడ‌, గోడెకీ ఖ‌బ‌ర్‌, కట్టెల మండి, ఇందిరాగాంధీ కాల‌నీ, బ‌న్సీలాల్ పేట్ ప్రాంతాల్లో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ చూపించింది కేవ‌లం 3,428 ఇండ్లు మాత్ర‌మేన‌న్నారు. మ‌రుస‌టి రోజు గ్రేట‌ర్ లో ఇండ్లు చూపిస్తామ‌ని చెప్పి రంగారెడ్డి జిల్లా మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని తుక్కుగూడ మునిసిపాలిటీలో 2016 ఇండ్ల‌ను చూపించార‌న్నారు.
గ‌తంలో ప్ర‌తినియోజ‌వ‌ర్గంలోనూ 4 వేల ఇండ్ల‌ను క‌ట్టిస్తామ‌ని ముఖ్య‌మంత్రి చెప్పిన విష‌యాన్ని భ‌ట్టి గుర్తుచేస్తూ.. ఈ రెండువేల 16 ఇండ్లు నియోజ‌క‌వ‌ర్గానికి చెందుతాయ‌ని చెప్పారు.
అక్క‌డే ఇంకో 2 వేల ఇండ్ల నిర్మాణం జ‌ర‌గాల్సి ఉంద‌న్నారు. తుక్కుగూడ మునిసిప‌ల్ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ.. వారికి ఈ ఇండ్ల‌ను కేటాయిస్తామ‌న్న టీఆర్ఎస్ హామీల‌ను భ‌ట్టి గుర్తు చేశారు.
ఇప్పుడు ఎమ్మెల్యే, మునిసిప‌ల్ ఎన్నిక‌లు పూర్త‌య్యాయి కాబ‌ట్టి.. ఆ ఇండ్ల‌ను గ్రేట‌ర్ ప్ర‌జ‌ల‌కు ఇస్తామ‌ని కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల్ని మోసం చేస్తోంద‌ని విమ‌ర్శించారు. ఇదిలావుంటే ఇది మా ప్రాంతం.. మాకే ఇండ్లు కేటాయించాల‌ని ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నార‌ని భ‌ట్టి చెప్పారు. మేడ్చ‌ల్ జిల్లా నాగారం మునిసిపాలిటీలోనూ ఇదే ప‌రిస్థితి ఉంద‌ని ఆయ‌న చెప్పారు. నాగారంలోనూ 6240 డ‌బుల్ ఇండ్లున్నాయి.. ఇదిలావుండ‌గా నాగారం నుంచి మాకు వేరే ప‌నులున్నాయి.. మీకు లిస్టిస్తాం.. మీరే చూసుకోండి అంటూ మంత్రి అర్ధాంతరంగా వెళ్లిపోయారని భ‌ట్టి మీడియాకు వివ‌రించారు.
ల‌క్ష ఇండ్ల పేరుతో ప్ర‌జ‌ల్ని ఇంకా ఎంత‌కాలం మోసం చేస్తార‌ని ప్ర‌భుత్వాన్ని భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు ఆగ్ర‌హంతో ప్ర‌శ్నించారు. పేద‌ల్ని ఓట్ బ్యాంక్ చూడ‌వ‌ద్ద‌ని ఈ సంద‌ర్భంగా కేసీఆర్ ప్ర‌భుత్వానికి భ‌ట్టి సూచించారు. అలాగే గ‌తంలో డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి పునాదిరాళ్లు వేసిన చోట‌.. త్వ‌ర‌గా నిర్మించి వాటిని పేద‌ల‌కు అందించాల‌ని బ‌ట్టి డిమాండ్ చేశారు. డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల విష‌యంలో వాస్త‌వాలు తెలుసుకోవ‌డంతో పాటు వాటిని ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌నే ల‌క్ష్యంతోనే స‌వాల్ ను స్వీక‌రించి మంత్రితో ప‌రిశీల‌న చేసిన‌ట్లు భ‌ట్టి చెప్పారు. దీనివ‌ల్లే హైద‌రాబాద్ లో ఉన్న మొత్తం డ‌బుల్ బెడ్ రూమ్ సంగ‌తి నాతో పాటు యావ‌త్ ర‌ష్ట్రానికి తెలిసింద‌ని భ‌ట్టి చెప్పారు.
ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని అంబేద్క‌ర్ బ‌స్తీలో 150 కుటుంబాల‌ను ఖాలీ చేయించి ఇండ్ల నిర్మాణానికి పునాదులేసి నాలుగేళ్లు అవుతున్నా.. వాటికి దిక్కుమొక్కూలేద‌ని భ‌ట్టి అన్నారు. ల‌బ్దిదారులు సొంతిల్లు లేక అద్దెలు క‌ట్టుకుంటూ నానా అగ‌చాట్లు ప‌డుతున్నార‌న్నారు. ఇలా న‌గ‌రంలో చాలాచోట్ల జ‌రిగింద‌ని భ‌ట్టి వివ‌రించారు.
గ‌తంలో వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణంలోనూ డ‌బుల్ బెడ్ రూముల వ్య‌వ‌హారంలోనూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇలాగే వ్య‌వ‌హ‌రించార‌న్న విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. అంతేకాక అప్ప‌ట్లో డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఓపెనింగ్ కు వ‌స్తా.. కోడికూర‌.. క‌ల్లు తెచ్చిపుట్టండి.. దావ‌త్ చేసుకుందాం.. అన్న కేసీఆర్ మాట‌ల‌నుద్దేశించి.. క‌ల్లు పులిసిపోతోంది.. కోడి కుళ్లిపోతోంది.. ఇండ్లు మాత్రం రెడీకాలేద‌ని బ‌ట్టి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.