(Ahmed Sheriff)
తమ తమ వృత్తుల్లో నిష్ణాతులయిన నలుగురు ఔత్సాహిక సినిమా రంగ వ్యక్తులు వర్తమానాన్ని వదిలి అయిదారు దశకాల అవతల భవిష్యత్తులోకి తొంగి చూసి తమ సృజనాత్మకతకు తార స్థాయి రూపాన్నిస్తే ఒక తెలుగు మాయా బజార్ (1957) పుడుతుంది.
“మాయా బజార్” ఈ పేరు వింటునే మనకు ఎన్. టీ. ఆర్. కృష్ణుడుగా, ఏ. ఎన్. ఆర్. అభిమన్యుడుగా ఎస్. వీ. రంగారావు ఘటొత్కచుడుగా, సావిత్రి శశిరేఖ గా 35 ఎం. ఎం. బ్లాక్ అండ్ వైట్ సినిమా ఒకటి కనిపిస్తుంది. నిజానికి ఈ సినిమా పేరు లాగే ఈ సినిమా కథ, దీని చరిత్ర కూడా మాయా బజారే.
చాలా కాలం క్రిందట, ఒక మహా నాటక రచయిత ఎవరో, బలరాముడి కూతురిగా వ్యాసుడి మహా భారతం లో లేని ఒక స్త్రీ పాత్రను ఊహించి, మాయా మర్మాలూ, అల్లరీల మధ్య ఆమె అర్జునుడి కుమారుడైన అభిమన్యుడిని పెళ్లాడే ఓ నాటకాన్ని మాయా బజార్ గా రాశాడు. ఈ నాటకం ఆధారంగా బాబూరావ్ పెయింటర్ అనే వ్యక్తి మూడు సార్లు (1919, 1921, 1923) మాయా బజార్ మూకీ సినిమాలు తీశాడు. దీనిలో ప్రఖ్యాత దర్శకుడు వి శాంతారాం కృష్ణుడి పాత్ర వేయటం ఓ విశేషం .
1931 లొ భారతదేశపు మొదటి టాకీ, ఆలం ఆరా వచ్చిన తరువాత, 1932 లో నానూభాయి వకీల్ దర్శకత్వం లో మాయా బజార్ మొదటి సారి టాకీ గా హిందీ లో వచ్చింది. ఇది 1935 లో తమిళం లోనూ, మరుసటి సంవత్సరం (1936) తెలుగు సినిమా లోనూ ప్రవేశం సంపాదించింది. సురభి డ్రామా ట్రూపుల పుణ్యమా అని 1950 వచ్చేసరికి తెలుగు నాట ప్రతి నోటా మాయా బజార్ పేరు వినిపించ సాగింది.
టూకీగా ఇదీ కథ :
బలారాముడు తన కూతురు శశిరేఖ ను అర్జున, సుభద్రల కుమారుడు అభిమన్యుడికిచ్చి వివాహం చేస్తానని వారి బాల్యం లో మాట ఇస్తాడు. కాలం గడిచి పిల్లలు పెద్దవాళ్లు అయ్యేటప్పటికి, పాండవులు రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలవుతారు. దీనికి తోడు శకుని మాయ తో పరిస్థితులు అన్నీ కౌరవులకు సుముఖంగా తయారవుతాయి. బలరాముడు చెల్లెలు సుభద్ర కి ఇచ్చిన మాట మరిచి శశిరేఖను దుర్యోధనుడి కుమారూడు లక్ష్మణకుమారుడి కి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటాడు.
ఈ మధ్యలో శ్రీ కృష్ణుడు భీమసేనుడూ, హిడింబీ ల పుత్రుడయిన ఘటొత్కచుడిని రంగం లో ప్రవేశ పెడతాడు. ఘటొత్కచుడు తన ఇంద్రజాల మహేద్ర జాల శక్తులతో పరిస్థితులు చక్కబెట్టి, అభిమన్యు శశిరేఖల వివాహం అయ్యేట్టు చూస్తాడు.
ఈ చిత్ర నిర్మాణం లో చెప్పుకోతగ్గ విశేషాలివి. చిత్ర నిర్మాణానికి ముందు కె. వి. రెడ్డి దాదాపు ఒక సంవత్సరం పాటు నిర్మాణ పూర్వపు పనుల్లో గడిపాడు. పింగళి నాగేంద్ర రావు మాయా బజార్ లోని ముఖ్య భాగాన్ని తీసుకుని ఈ చిత్రానికి తనదైన మూల కథా , మాటలూ, గీతాలూ రాశాడు. అస్మదీయులు (మిత్రులు), తస్మదీయులు (శత్రువులు), హై హై నాయకా, సత్య పీఠం (లై డిటెక్టర్), ప్రియదర్శిని (లాప్టాప్ లో స్కైప్ ద్వారా వీడియో చూడగల్గిన పరికరం లాంటిది) లాంటి నూతన పదాల ఆవిష్కారం చేశాడు. ఆ కాలం లో బలరాముడు తదితరులు ఈ ప్రియదర్శిణి లో వీడియో చూశే సన్నివేశం వుండటం ఊహల (imagination) కు పరాకాష్ట.
ఈ చిత్రం లోని ప్రియదర్శిని స్నన్నివేశం చూస్తే ఈ చిత్రపు గొప్పతనం చెప్పే అవసరం ఎక్కువగా వుండదు. ప్రియదర్శిని అనేది అభిమన్య్దు శశిరేఖకు పంపించిన ఒక బహుమతి. ఇది ఓ చిన్న పెట్టెలాంటి పరికరం (ఈ నాటి లాప్ టాప్ తో పోల్చవచ్చు) దీనిలో కి ఎవరు చూస్తే వారికి ప్రియమైన మనుషులూ వస్తువులూ,కనిపిస్తాయి. ఈ సన్నివేశం లో మొదట దీన్లో కి బల్లరాముడి భర్య రేవతి చూసినప్పుడు ఆమెకు మణులూ, మాణిక్యాలూ, స్వర్ణాభరణాలూ కనిపిస్తాయి. అవి ఆమెకు ప్రియమైన వస్తువులు. ఇక్కడ దర్శకుడు ఆ తరువాత బలరాముడు తన చెల్లెలికిచ్చిన మాట మర్చి శశిరేఖ వివాహం దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణ కుమారుడికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించు కున్నప్పుడు రేవతి అతడ్ని బల పర్చడానికి కారణం ధనాశ అనే విషయానికి నాంది ఈ సన్నివేశం ద్వారా చూపించాడు. ఆ తరువాత దీనిలో బలరాముడికి దుర్యోధనుడు, కృష్ణుడికి శకుని కనిపించడం కథలో జర గబొయే విషయలను ఊషించే వీలు కలిగిస్తాయి.
ఛాయా గ్రాహకుడు మార్కస్ బార్ట్ లే తనకు దొరికిన విలువైన వనరు అని కె వి రెడ్డి చెప్పుకున్నాడు. సాంకేతికత అంతగా లేని ఆరొజుల్లో, మార్కస్ బార్ట్ లే ద్వారా సృష్టించబడిన రెండు సన్నివేశాల గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. శశి రేఖ బాల్యం లో ఓ కొలను దగ్గర కూర్చున్నప్పుడు ఆమె ప్రతిబింబం నీళ్లలో కనబడుతుంది. నీళ్లు చెదిరి అలలు వుత్పన్నమై ఆ ప్రతి బింబం కనిపించ కుండా పోతుంది. కాస్సేపటికి, తిరిగి అలలు సర్దు కున్నప్పుడు ఈ సారి పెద్దదయిన శశిరేఖ (సావిత్రి) ప్రతిబింబం కనిపిస్తుంది. ఏమి సృజనాత్మకత !
ఇక రెండొ విశేషం లాహిరి లాహిరి లాహిరి లో పాట చిత్రీకరణ. ఈ పాటను శశిరేఖా, అభిమన్యులు ఓ వెన్నెల రాత్రి సరస్సు లో నావలో ప్రయాణిస్తూ పాడతారు. ఈ పాట సినిమాకే హైలైట్ . అయితే ఈ పాటలో కొన్ని నిముషాల ఫ్రేములు మాత్రమే పట్ట పగలు అడయార్ నదిలో (కొంతమంది ఎన్నూర్ సరస్సు లో అంటారు) చిత్రీకరించాడట. పగలు ని రాత్రి గా భ్రమింపచేయడానికి వాడిన ఫిల్టర్లు అతడి కళా కౌశలమే. మిగతా పాటను స్టుడియో సెట్టులో చిత్రీకరించాడు. అప్పట్లొ స్టూడియోలో వెన్నెల ను సృష్టించడం ఇతడి ట్రేడ్ మార్కు గా వుండిందిట. ఇలాంటి వెన్నేల సన్నివేశాలొచ్చినపుడు ఒక్కోసారి “విజయా వారి వెన్నెల” అని కూడా సినిమా వాళ్లు వ్యవహరించే వారట.
ఈ చిత్రానికి ముందు ఎన్ టీ ఆర్ “సొంత వూరు” సినిమాలో కృష్ణుడిగా కనిపించాడు. ఆ పాత్రను అప్పట్లో ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. దానితో నేను కృష్ణుడి పాత్రకు సరిపోనేమో అని ఈ చిత్రం లో కృష్ణుడి వేషం వేయడానికి మొదట్లో రామా రావు సంకోచించాడట. అపుడు కె. వి. రెడ్డి ఎన్ . టీ. ఆర్. ముఖం లో ఈ పాత్రకు సరిపడే కళ వుందనీ ఇటువంటి పౌరాణీక పాత్రలకు అతడే సరి అనీ ఒప్పించాడట. అప్పట్లో పీతాంబరం, భక్తవత్సలం ల మేకప్ రామా రావు కి భౌతికమైన కృష్ణుడి రూపాన్ని సమకూరిస్తే తన హావ భావాలతో కృష్ణుణ్ణి భారత ప్రజల గుండెల్లో నిలిపాడు రామారావు.
Like this story? Share it with a friend!
రామారావు కౄష్ణుడిగా వున్న ఫోటో తో అప్పట్లో నలభై వేల రంగుల కాలెండర్లని పంచారట. ప్రజలు ఆ కాలండర్లని డ్రాయింగు రూముల్లో అలంక రించుకున్నారట. కొంతమంది వాటిని పూజ గదుల్లో పెట్టుకున్నారట. ఇప్పుడు తెలుగు ప్రజలు రాముడూ కృష్ణుడూ అంటే రామారావుని తప్ప వుహించలేరు.
1936 లో మాయాబజార్ సినిమాని తెలుగు ప్రేక్షకులకు పి.వి దాస్ పరిచయం చేశాడు. ఆ చిత్రం లో సంగీత దర్శకుడు ఎస్. రాజేశ్వర రావు అభిమన్యుడి చిన్నప్పటి పాత్ర చేశాడు. మన మాయా బజారు చిత్రానికి ఆయనే సంగీత దర్శకుడు. అయితే ఒక రోజు ప్రొడక్షన్ ఆఫీసులో రాజేశ్వర రావూ, పింగళి నాగేంద్ర కూర్చుని లాహిరి లాహిరి లాహిరి లో పాట బాణీ కడుతున్నప్పుడు అదే రూములో నిర్మాతలూ, దర్శకుడూ, ఇంకా కొంతమంది కూర్చుని చర్చలు చేస్తున్నారట. అప్పటికి పాట పల్లవి బాణీ పూర్తయింది.
రాజేశ్వర రావు చరణానికి స్వరం సమకూరుస్తున్నప్పుడు ఈ చర్చలు అతడి ఏకాగ్రతను భంగ పరిచాయిట. వెంటానే అతడు లేచి ఇంటికి బయలుదేరాడు. నిర్మాతలు ఎంత సర్ది చెప్పినా వినలేదు. ఆ తరువాత ఈ చిత్రానికి సంగీతం ఇవ్వలేదు. అంతవరకూ అతడి ద్వారా” శ్రీ కరులు దేవతలు”, “చూపులు కలిసిన శుభ వేళా”, “నీ కోసమే నే జీవించునదీ” , “లాహిరి లాహిరి లాహిరి” లో నాలుగు పాటలు రికార్డు అయ్యాయి. ఆ తరువాత ఈ చిత్రానికి సంగీత సారధ్యం ఘంటసాల వహించాడు. “నీవేనా నను తలచినదీ”, “అహ నా పెళ్లి అంట”, పాటలతో కలిపి మిగతా పాటలూ ఆయనే స్వర పరిచాడు. ఈ చిత్రం లోని పాటలు సంగీతమూ ఈనాటికీ మరువలేనివి. ఇంతకు ముందు కూడా మిస్సమ్మ చిత్ర నిర్మాణమప్పుడు ఎస్. రాజేశ్వర రావు చిత్రం మధ్యలో సంగీతం మానేశాడని చిత్ర ప్రముఖులు చెబుతారు.
ఈ చిత్రం తో సింగీతం శ్రీనివాస్ కె వి రెడ్డి కి సహాయ కుడిగా అరంగేత్రం చేశాడు. ఆ తరువాత అతనెంత చరిత్ర సృష్టించాడొ అందరిక్ తెలిసిందే.
ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో ఒకే సారి నిర్మించారు. తారాగణం లో కొద్ది పాటి మార్పులు చేశారు. తమిళం లో అక్కినేని నాగేశ్వర రావు పాత్రను జెమిని గణేషన్, రేలంగి పాత్రను తంగవేలు పోషించారు.
ఈ చిత్రం మార్చి 27, 1957 న విడుదలయింది. 24 సెంటర్లలో 100 రోజులూ, 4 సెంటర్లలో సిల్వర్ జుబిలీ చేసుకుంది. ఈ చిత్రపు శతదినోత్సవ వేడుకల్లో తన నటీనటులు, టెక్నీషియన్లూ మిగతా దాదాపు నాలుగు వందల మంది స్టూడియో కార్మికులను వుద్దేశ్యించి “నా బలగమే నా సంపద” అని చెప్పాడట నాగిరెడ్డి. ఆ గొప్ప విజయాన్ని పురస్కరించుకుని తన యూనిట్ సభ్యులందరికీ, నాలుగు నెలల బోనస్ ప్రకటించి శత దినోత్సవ వేడుకల్ని ఓ పండగలాగే జరిపించాడట నాగిరెడ్డి.
అప్పటి సినిమా నిర్మాణ వర్గం లో నిర్మాతలుగా నాగిరెడ్ది, చక్రపాణీ (విజయా వాహినీ ప్రొడక్షన్సు), దర్శకుడిగా కె. వి. రెడ్డి, రచయిత గా పింగళి నాగేంద్ర రావు, కళ మాధవ పెద్ది గోఖలే, కళాధర్, చాయాగ్రహణం మార్కస్ బార్ట్ లే, ల దే అత్యుత్తమ కలయిక. ఈ గ్రూపు ద్వారా వచ్చిందే మన మాయా బజార్.
ఈ రకంగా మాయా బజార్ వివిధ రకాల కథల్తో అనేక రకాల రూపాల్లో కి మారినా, 1957 లో విజయా ప్రొడక్షన్సు ద్వారా విడుదలయిన మాయాబజార్ భారత దేశపు 100 అత్యుత్తమ చిత్రాల జాబితాలో ఉత్తమ స్థానాన్ని సంపాదించుకుంది..
ఈ చిత్రం గురించి ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావు “ఏం సినిమా అండి అది” అని ఆశ్చర్య భరితమైన గౌరవాన్ని ప్రకటించడం చెప్పుకో దగ్గ విశేషం. ఈ చిత్రం ఇప్పుడు రంగుల్లొ కూడా ఉపలబ్ధం. కానీ వీలయితే పాత సినిమాని యూ ట్యూబ్ లోనో, లేక డీవిడీ లోనో చూస్తే నిజమైన ఆనందం కలుగుతుంది.
Ahmed Sheriff, PMP, CMQ/OE, ACS, FLMI, PSM
Consultant, PMP Certification, Project Management, Quality
Mob: +91 9849310610
Mob: +91 9849310610