రాయలసీమ ఆత్మగౌరవం నిలిపిన చిలుకూరి నారాయణరావు !

(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)
రాయలసీమ నామకరణంతో సీమ ఆత్మగౌరవం నిలిపిన చిలుకూరి వారు..
రాయలసీమ అని ఆత్మగౌరవంతో మాట్లాడుతున్నాము అంటే అది చిలుకూరి నారాయరావు గారి చలువే అని చెప్పక తప్పదు దాదాపు 130 సంవత్సరాలు దత్తమండళాలు , సీడెడ్ జిల్లాలు అంటూ అవమానకరంగా పిలుచుకునే ప్రాంతానికి రాయలసీమ అని గౌరవప్రదంగా పిలుచుకునే నామకరణం చేసింది చిలుకూరి వారే.

 

ఇవి కూడా చదవండి
1890 సెప్టెంబర్ 10 , 26 తేదీల్లో వారి జన్మదినం  జన్మదినం విషయంలో స్పష్టత ఎలా ఉన్నా రెండు తేదీల మధ్య వారిని స్మరించుకోవడం సముచితంగా ఉంటుంది.
1800 సంవత్సరంలో నిజాం నవాబు ఎలుబడిలో ఉన్న నేటి సీమ ప్రాంతం సైనిక ఒప్పందంలో భాగంగా ఆంగ్లేయులకు నిజాము వదిలి వేయించుకున్నారు. అందుకే నాటి నుంచి సీడెడ్ జిల్లాలు అని పిలిచేవారు. సీడెడ్ అంటే అర్థం వదిలివేయించుకోవడం ఈ పెరు అవమానకరంగా ఉన్నదన్న పేరుతో ఆంగ్లేయులు దత్త మండలాలు అని కూడా పిలిచారు. ఇలా 1928 వరకు సాగింది. ఉత్తరాంధ్రకు చెందిన చిలుకూరి నారాయణరావు తెలుగు అధ్యాపకుడిగా అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో చేరారు. ఈ ప్రాంతంలోని గొప్పతనాన్ని పరిశీలించిన వారు ఇంత గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతానికి అవమానకరంగా సీడెడ్ , దత్తమండలాలు అని పిలవడం సరికాదని భావించారు.
chilukooru narayana rao family
1928 నవంబరులో ఆంధ్రమహాసభలు నంద్యాలలో జరిగింది. ఈ సభలలో సీమ నేతల కోరిక మేరకు 17,18 తేదీన దత్తమండళాల ప్రధమ మహాసభ కడప కోటి రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సభలో పాల్గొన్న చిలుకూరి నారాయణరావు  ఘన చరిత్ర కలిగిన ఈ ప్రాంతానికి దత్తమండలం , సీడెడ్ జిల్లాలు అని పిలవడం సరికాదని రాయలేలిన ప్రాంతం కనుక రాయలసీమ అని పేరు పెట్టాలని ప్రతిపాదించారు. ఇదే సభలో పాల్గొన్న పప్పూరి రామాచార్యులు , నీలం సంజీవరెడ్డిలు బలపరచడంతో సభ ఆమోదించింది. నాటి నుంచి రాయలసీమగా మారింది.
ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు , ప్రజల గొప్పతనానికి ఎందరో మహానుభావులు రాయలసీమను ప్రేమించినారు. నేటి కేసి కెనాల్ ఆంగ్లేయులు నిర్మించినదే. థామస్ మన్రో లాంటి వారి కృషిని రాయలసీమ ఎప్పటికీ మరవదు. ఉత్తరాంధ్రకు చెందిన చిలుకూరి నారాయణరావు ఈ ప్రాంతాన్ని పరిలించి రాయలసీమ అని పెరుపెట్టారు. అలా ఈ ప్రాంతానికి అతిధిగా వచ్చిన వారు చివరకు దోపిడీ చేయడానికి వచ్చిన ఆంగ్లేయులు కూడా రాయలసీమను ప్రేమించారు. కానీ రాయలసీమలో పుట్టి పాలకులయిన వారు మాత్రం ఈ ప్రాంతానికి అన్యాయం చేసారు. చిలుకూరి లాంటి వారి చరిత్రను చూసిన తర్వాత అయిన మన పాలకులు మారుతారన్న చిన్న ఆశ.
(చిలుకూరి నారాయణ రావు కుటుంబం ఫోటో సౌజన్యం శోభనాచల బ్లాగ్ స్పాట్)

 

(మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి రాయలసీమ విద్యావంతల వేదిక కన్వీనర్, రాజకీయ విశ్లేషకుడు)