గండికోట ముంపు గ్రామాల ప్రజల విషయంలో మీరు తక్షణమే జోక్యం చేసుకుని వారెదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇ. ఏ. ఎస్. శర్మ ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. 2013 భూసేకరణ చట్టాల మేరకు ముంపువాసులకు నష్టపరిహారం చెల్లించడం, పునరావాసం కల్పించడంతో పాటు, ప్రజల మనోభావాలను కూడా ముఖ్యమంత్రి గౌరవిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
2013 భూసేకరణ చట్టం క్రింద నిర్వాసితులు అయ్యే ప్రజలతో అధికారులు ముందుగా సంప్రదించాలని, వారికి కలిగే నష్టాలకు పరిష్కారాలు చూపించాల్సి ఉంటుందని, ప్రజలు అంగీకరించిన తరువాతనే భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని ఆయన వివరించారు. అటువంటి ప్రజాభిప్రాయ సేకరణ, పునరావాస చర్యలు తీసుకోకుండా భూసేకరణ చేయకూడదని చట్టం స్పష్టంగా చెప్పిందని ఆయన గుర్తుచేశారు. అటువంటి పునరావాస ప్రణాళిక ఇంతవరకు సరిగ్గా అమలు జరగలేదు.
ఈ నేపథ్యంలో కడప జిల్లా అధికారులు 2013 భూసేకరణ చట్టం ఉల్లంఘించి గండికోట జలాశయంలో నీరు నిల్వ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అందువల్ల మీ స్వంత జిల్లాలో తాళ్ల ప్రొద్దటూరు, చామలూరు, ఎర్రగుడి గ్రామాలు ముంపుకు గురి అవుతున్నాయని ఆయన తన లేఖలో వివరించారు. గండికోట జలాశయం రెండవ ఫేజు పేరుతో చట్ట ప్రకారం తీసుకోవలసిన చర్యలు తీసుకోకుండా అక్కడి గ్రామ ప్రజలను ఉన్నఫళంగా ఇళ్లను, సామానులను వదులుకుని వెళ్లాలని అధికారులు బలవంతం చేయడం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రామాల ప్రజలలో చాలా మందికి 2013 భూసేకరణ చట్టం క్రింద రావలలిసిన నష్టపరిహారం కూడా రాలేదన్నారు.
పౌరుల ప్రాధమిక హక్కులకు, మానవహక్కులకు మన రాజ్యాంగంలో ఉన్న ప్రత్యేకమైన ప్రాముఖ్యత ను దృష్టిలో పెట్టుకోవాలని, ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజలకు జవాబు దారీగా ఉండాలన్న విషయం గుర్తించకుండా అధికారులు పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టం ముఖ్యంగా ఇటువంటి అ ప్రజాస్వామ్య విధానాలను నిరోధించడానికే ఏర్పాటైన విషయం విశేషమైన ప్రజాభిమానంతో గద్దెనెక్కిన మీకు గుర్తు చేయవలసి రావడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలను బలవంతంగా నిర్వాసితులను చేయడం, వారి మానవహక్కులు ఉల్లంఘించడమేనని, వారి కోసం పనిచేస్తున్న మానవహక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు, న్యాయవాది జయశ్రీని గృహ నిర్బంధం చేయడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం ఆమెమీద ఉన్న ఆంక్షలను సడలించాలని, ముంపువాసులకు చట్టబద్దమైన సౌకర్యాలు కల్పించి, ఆ తర్వాత వారిని తరలించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.