(బొజ్జా దశరథ రామి రెడ్డి, అధ్యక్షులు, రాయలసీమ సాగునీటి సాధన సమితి,సీతా రామి రెడ్డి,మాజీ చైర్మన్, ఆర్ డి ఎస్,ట్రెజరర్, తుంగభద్ర జలాల హక్కుల సాధన సమితి)
తుంగభద్ర మీద గుండ్రేవుల రిజర్యాయర్ నిర్మాణం పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయడం, ఈ విషయం పై తెలంగాణ ప్రభుత్వం కూడ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించింన డి పి ఆర్ పంపమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలో వెనకబడిన ప్రాంతాలలోని సాగునీటి ప్రాజక్టులకు సక్రమంగా నీరందించడానికి అత్యంత కీలకమైన గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం పై రెండు రాష్ట్రలు సంయుక్తంగా సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాము.
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో కె సి కెనాల్, తుంగభద్ర దిగువ కాలువ, ఆర్ డి ఎస్ , జి డి పి ఆయకట్టు రైతులతో 2012వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తీర్మానం చేయడమైనది. ఈ ప్రాజక్టు సాధనకు ఆర్ డి ఎస్ చైర్మెన్ సీతా రామి రెడ్డి, కె సి కెనాల్ డిస్ట్రిబ్యూటర్ చైర్మన్ దేవగుడి చంద్ర మౌళీశ్వర రెడ్డి, ఎల్ ఎల్ సి చైర్మెన్ విష్ణువర్ధన రెడ్డి, కె.సి కెనాల్ చైర్మన్ శ్రీనివాస రెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి ల కార్యవర్గంతో తుంగభద్ర జలాల హక్కుల సాధన సమితి అనే పేరుతో ఒక తాత్కాలిక సంస్థను ఏర్పాటు చేసి ఉమ్మిడి ఆంధ్రప్రదేశ్ లో పలు రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టడం జరిగింది. రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వై ఎన్ రెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు సెప్టెంబరు 2012 లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి దీబగుంట్లలో అందచేసిన విజ్ఞాపన పత్రం ఆదారంగా అప్పటి ప్రభుత్వం డి పి ఆర్ తయారు చేయడానికి 56 లక్షలు నిదులను కేటాయిస్తు అధికారిక అనుమతులను జారీచేసింది.
రాయలసీమ సాగునీటి సాధన సమితి, ఇతర రైతు మరియు ప్రజా సంఘాలు నిర్వహించిన అనేక సమావేశాలు, నిరసన కార్యక్రమాలు, పాదయాత్ర ల ఒత్తిడికి పాలకులు గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపడతామని పలు సందర్భాలలో ప్రకటించారు, కాని నిర్దిష్ట కార్యక్రమాలు చేపట్టలేదు.
ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఈ ప్రాజక్టు నిర్మాణంపై చర్చలలో పాల్గొనడాన్ని ఆహ్వానిస్తున్నాము. ఈ ప్రాజక్టు నిర్మాణం రెండు తెలుగు రాష్ట్రాలలోని వెనుకబడిన ప్రాంతాలకు అత్యంత కీలకం. రెండు తెలుగు రాష్ట్రాలలోని వెనుకబడిన ప్రాంతాలకు జీవన్మరణ సమస్య అయిన తాగు, సాగునీటి అవసరాలకు అత్యంత కీలకమైన ఈ ప్రాజక్టు నిర్మాణంపై రెండు తెలుగు రాష్ట్రాలలోని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రాజక్టు నిర్మాణానికి సానుకూల నిర్ణయాలం చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము.