అవును. నిజం! మన శరీరానికి ఒక భాష ఉంటుంది. ఆంగ్లంలో Body Language అంటారు ఇది చాలా ముఖ్యమైనది. కమ్యూనికేషన్ లో దీన్ని Nonverbal కమ్యూనికేషన్ అంటారు. Verbal కమ్యూనికేషన్ అంటే ఏదో ఒక భాష ద్వారా వివిధ పద్దతుల్లో కమ్యూనికేట్ చెయ్యటం.
Nonverbal కమ్యూనికేషన్ అంటే, సైగలు,సంకేతాలు, సంజ్ఞల ద్వారా కమ్యూనికేట్ చేయడం. ఇవన్నీ చేయడానికి మన శరీరాన్ని ఉపయోగిస్తాము కాబట్టి, దీన్ని బాడీలాంగ్వేజ్ అంటే శరీర భాష అంటారు. దీనికి భాష అవసరం లేదు. ఇది లిపి లేని దేహ భాష. భావ వ్యక్తీకరణకు భాషతోపాటు, శరీర భాష కూడా అవసరం. ఈ రెండింటిని కలిపి ” కమ్యూనికేషన్ స్కిల్స్” అంటారు. ఒకటి రెండు ఉదాహరణలు చూద్దాం. “ఎందుకు అంత కోపంగా ఉన్నావు?”, అని మనం ఎవరినైనా అడుగుతాం. నిజానికి వాళ్ళు మనకి “నేను కోపంగా ఉన్నానని” చెప్పరు. మరి మనకి ఎట్లా తెలిసింది. అంటే వాళ్ళ ముఖం చూసి, ఆ భావం మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. అదే బాడీ లాంగ్వేజ్.
శరీర భాషకు సంబంధించిన కొన్ని హావభావాలు, వాటిని ప్రదర్శించే శరీర భాగాలు చూద్దాం ” ముఖం చిట్లించుకోవటం = ముక్కు,నోరు” “ఎలా నడుస్తున్నాడు చూడు మహారాజు లాగా”= కాళ్ళు చేతులు, తల ” ముఖం ఎర్రగా కందిపోయింది చూడు” = ముఖం ” ఎంత భయపడుతున్నాడు చూడు”= కళ్ళు “ఎలా నవ్వుతున్నాడు చూసారా?”= ముఖం మొత్తం
మన భావ వ్యక్తీకరణ లో వెర్బల్ కమ్యూనికేషన్ (భాష ) ఎంత ముఖ్యమో, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ (శరీర భాష) కూడా అంతే ముఖ్యం. నిజానికి కొన్ని సార్లు మాటల కన్నా బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం చెప్పదల్చుకున్న విషయాన్ని ఎఫెక్టివ్ గా చెప్పగలుగుతాం. మరికొన్నిసార్లు మన మాటల శరీర భాష కూడా తోడైతే, భావ ప్రకటన మరింత ఫస్ట్ స్పష్టంగా ఉంటుంది.
ఉదాహరణకు, ” నేను కోపంగా ఉన్నాను” అని ఏమాత్రము శరీరాన్ని కదిలించకుండా, ఏ గొంతులో విధమైన భావాలు లేకుండా చెప్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. చప్పగా ఉంటుంది. అవతల వాళ్ళు దాన్ని కామెడీగా తీసుకున్న తీసుకోవచ్చు.
అలా కాకుండా మాటలతో పాటు, ముక్కుపుటాలు ఆదరడం, కళ్ళు పెద్దవి చేయడం, చేతులు ఊపడం, గొంతులో తీవ్రత ఉండడం, లాంటివి జతచేస్తే నిజంగా కోపంగా ఉన్నట్లు అందరికీ తెలుస్తుంది. అంటే మనం భాషతోపాటు, శరీర భాష కూడా జోడిస్తే తప్ప మన వ్యక్తీకరణ అంత ఎఫెక్టివ్ గా ఉండదు. J కారణం, మాటల్లో వ్యక్తీకరించలేని విషయాలను కూడా బాడీ లాంగ్వేజీ వ్యక్తీకరిస్తుంది. ఒక్కొక్క సారి చెప్పకూడదనుకున్న విషయాన్ని బాడీ లాంగ్వేజీ మనకు తెలియకండా లీక్ చేస్తుంటుంది.
గదిలో ఒక మూలగా నిలబడి, చేతులు కట్టుకుని, చాలా స్పష్టంగా నిదానంగా, ” నేను చాలా సంతోషంగా ఉన్నాను” అని చెప్పి చూడండి. మీకే తెలుస్తుంది. కాబట్టి భాషతోపాటు, మన శరీర భాషను కూడా కలిపి కమ్యూనికేట్ చేస్తే మనం ఏం చెప్పాలని అనుకున్నామో అది అవతలి వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది.
మన శరీరంలో ప్రతి భాగానికి ఒక భాష ఉంటుంది. శరీరంలో కమ్యూనికేషన్ కి అత్యంత ముఖ్యమైన భాగం మన ముఖం. Face is the index of mind అని అందుకే అన్నారు. మన లోపల దాచుకున్న దాగని భావాలను బయటపడేస్తుంది. మళ్లీ అందులో ముఖ్యమైన భాగం మన కళ్ళు. కళ్ళు ఎప్పుడు అబద్దం చెప్పవు. కళ్లు ఎన్నో భావాలను చాలా ప్రతిభావంతంగా, చాలా స్పష్టంగా , కొన్నిసార్లు సృజనాత్మకంగా కూడా పలికిస్తాయి. జంధ్యాల తీసిన శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమాలో ” లిపి లేని కంటి భాష” అనే పాట ఉంటుంది. అది కళ్ళకి చక్కగా సరిపోతుంది. కళ్ళ కి మాట్లాడటం రాదు, కానీ భావాలను చాలా చక్కగా వ్యక్తం చేస్తాయి. కోపంగా ఉన్నప్పుడు ( గుడ్లురిమి చూడడం), సంతోషంగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దిగులు గా ఉన్నప్పుడు కళ్ల ద్వారా మాత్రం ఎఫెక్టివ్ గా ఎవరైనా సరే చిన్ని ఆ ఎమోషన్స్ ని చక్కగా పలికించ గలరు. కళ్లకున్న శక్తి అలాంటిది.
సినిమా పాటల రచయితలు ఈ విషయాన్ని చాలా చక్కగా రాశారు. అలాంటి పాటలు కొన్ని చూద్దాం .. ” నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని (ప్రేమాభిషేకం,1981)
“కంటి చూపు చెబుతోంది. కొంటె నవ్వు చెపుతోంది మూగ మనసులో మాట ఓ పిల్లా (జీవితచక్రం,)”
మన ముఖంలో నవ్వు ఎన్నో రకాల భావాలను ప్రతిఫలిస్తుంది. నవ్వటానికి ముఖంలో కళ్ళు పెదవులు, ముక్కు, నోరు వంటివి పనిచేస్తాయి. నవ్వుల్లో రకాలుంటాయి
కొంటె నవ్వు
చిలిపి నవ్వు వెర్రి నవ్వు మొహమాటం నవ్వు విరక్తితో నవ్వు వెకిలి నవ్వు ఇలా ఎన్నో రకాల భావాలతో తో కూడిన నవ్వు కోసం ముఖాన్ని ఉపయోగిస్తాం..
ఇక చేతులు, చేతి వేళ్లతో మనం దాదాపు ఐదు వేల రకాల సంజ్ఞ లు, సైగలు చేయగలమని తెలుస్తోంది. కేవలం చేతివేళ్ళతో నే సంభాషించ కలగడం మనం ఆదివారం వచ్చే బధిరుల వార్తల ద్వారా తెలుసుకోవచ్చు. అంటే దాన్ని బట్టి చేతులు కూడా ఎంతో ప్రాధాన్యత ఉన్న భాగాలు. ఉదాహరణకు చేతి వేళ్లలో ఒక వేలితో , లేదా రెండు వేళ్ళతో మనం ఎన్నో సంగతులు అడుగుతున్నా. చూపుడు వేలు చాలా శక్తివంతమైనది. దీన్ని threatening finger అంటారు. మనం ఎవరినైనా బెదిరించడానికి మాటలతో పాటు ఈ వేలును వాడతాం. దీంతో మధ్యవేలిని కలిపితే విజయానికి సంకేతంగా చూపించగలుగుతా ము. మనం ఏదైనా విషయము, సినిమా, వస్తువు, మాట చాలా బావుంది అని చెప్పాలంటే , బొటన వేలికి చూపుడు వేలు పెట్టి చూపిస్తాం. బొటనవేలు విక్టరీకి, OK కి సంకేతం, వాట్సాప్ లో ఇది తరచూ వాడుతున్నాం. అలాగే అరచెయ్యి మొత్తం కొన్ని సంకేతాలను పెట్టబడుతుంది.
మన భుజాలు కూడా పలుకుతాయి. నాకేమీ తెలియదు అన్నప్పుడు భుజాలు ఎగరేస్తాం. భుజాలు వంగి పోతే ఏదో బాధలోనో కష్టాలలోనో ఉన్నట్లు మనం సూచిస్తున్నట్లు లెక్క. మన తల కూడా కొన్ని భావాలను వ్యక్తీకరిస్తుంది. వద్దని చెప్పడానికి తల అటూ ఇటూ ఊపుతాము. అవును, కావాలి అని చెప్పటనికి పైకి, కిందికి ఆడిస్తాం.
మన శరీరంలోని వివిధ భాగాల ద్వారా కూడా మన ఇతరులతో మాట్లాడుతాము. కమ్యూనికేషన్ లో మనం ఒకసారి భాష తో కాకుండా, కేవలం బాడీ లాంగ్వేజ్ తో కూడా విషయాన్ని చక్కగా అవతలి వాళ్ళకి చెప్పగలుగుతాం.
(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)