ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండు బ్లాక్ అయిపోద్దో… మైండ్ బ్లాక్ అయితే ఏమవుతుంది?

(Ahmed Sheriff)

“ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండు బ్లాక్ అయిపోద్దో వాడే పండు” పోకిరీ సినిమాలో మహేష్ బాబు చెప్పిన  డైలాగు. చాలా పాపులర్ అయింది. ఇది వినని తెలుగు వాళ్లుండరేమో.
మైండు బ్లాక్ అవడమంటే ఏమిటి?
ఏ విషయమూ గుర్తుకు రాక పోవడమన్నమాట (కనీసం ఆ టైములో).మహేష్ బాబు కొడితే అలా ఏవిషయం  గుర్తు రానంతగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. తెలిసినా గుర్తుకు రాకపోవడం మైండ్ బ్లాక్.అయితే ఇంత దెబ్బతినక పోయినా ఒక్కోసారి మన మైండ్ బ్లాక్ అవుతూ ఉంటుంది.
మైండ్ బ్లాక్ అవడం ఏమిటో బాగా వివరంగా చెప్పే ఒక గూఢచారి కథ చెబుతాను.
ఒకసారి అనుకోకుండా అతని మైండ్ బ్లాక్ అవుతుంది.
మైండ్ బ్లాక్ అయినపుడు పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఈ కథలో చూడవచ్చు. ఇలా ఏదో ఒక సందర్బంగా మనందరికి మైండ్ బ్లాక్ అవుతూ ఉంటుంది.విద్యార్థులకుయితే పరీక్షలపుడు ఎదురయ్యే పెద్ద సమస్య ఇదే. యేడాది కాలమంతా చదివింది ఆ గంటలో గుర్తుకురాదు. విషయం తెలుసు, మెదడులో ఎక్కడో అది ఉంది. ఎంతకు రిలీజ్ కాకుండా మైండ్ బ్లాక్ అయింది.
ఇలా ఒక సారి  ఒక గూఢాచారి విషయంలో జరిగింది. మహేష్ బాబు లాంటి వ్యక్తి కొట్టినందుకు కాదు గాని, సహజంగా అతడి మైండు తాళం పడింది.
చాలా కాలం క్రిందట రీడర్స్ డైజెస్టు (Reader’s Digest) లో ఈ ట్రూ స్టోరీ  చదివాను. బహుశా ఇది రెండొ ప్రపంచ యుద్ధ కాలం నాటిది కావచ్చు.
వృత్తి రీత్యా వేరే దేశం లో ఇరుక్కుపోయిన ఒక గూఢాచారి, తానున్న దేశం నుండి మరో దేశానికి వెళ్లాలి.   అతడు ఎడ్వర్డ్ బ్లాక్ (పేరు మార్చ బడింది) అనే మారు పేరు తో పాస్ పోర్టు తయారు చేసుకుని వెళుతూ వుంటాడు. అతడి దురదృష్టానికి  అతడు ప్రయాణించే రైలు పెట్టె నిండా శత్రు సైనికులే వుంటారు. వారిలో ఓ అధికారి అతణ్ణి మాటల్లో పెట్టి  “నీ పేరేమి” టని అడుగుతాడు. ఈ గూఢాచారి కి తానే పేరుతో వెళుతున్నదీ ఠక్కున గుర్తు కు రాదు. అంతలో ఆ అధికారి ఈ గూఢాచారిని చదరంగం ఆడటానికి పిలుస్తాడు.  తన మారు పేరేమిటొ గుర్తు కు రావటం లేదు. ఆ అధికారి మళ్లీ పేరడుగుతా డేమోనని గూఢాచారిలో ఆతృత పెరిగి పోతూ వుంటుంది. ఎందుకంటే ఆ అధికారి అడిగినప్పుడు తన పేరు చెప్పక పోతే అనుమానం వస్తుంది. అరా తీస్తే తాను దొరికిపోతాడు. తన నకిలీ పేరు గుర్తు తెచ్చు కోవడానికి విశ్వ ప్రయత్నం చేసినా అది గుర్తు రాదు.
ఆట మొదలవుతుంది. గూఢాచారి మంచి చదరంగపు ఆటగాడు. అయినా ఆ ఆటలో తాను , ఆ అధికారి తో గెలవ కూడదు. చదరంగం లో ఓడిపోవడం  ఆ దేశస్థులకు నచ్చదు. అయితే కావాలనే ఓడిపోయినట్లు కూడా కనిపించ కూడదు. గూఢాచారి తెలివైన వాడు.  జాగ్రత్తగా ఆడుతూ వుంటాడు. ఈ మధ్యలో ఆ అధికారి మళ్లీ ఒకసారి గూఢాచారి పేరు అడుగుతాడు. గూఢాచారి కి తన పేరు ఇంకా గుర్తు రాలేదు. అనుమానం రాకుండా   ఆటలో ఓ విషయం మీద దృష్టి మళ్లించి ఆ సమయం లో తప్పించుకుంటాడు. ఆటను జాగ్రత్తగా ఆడాలి, తన పేరు గుర్తు తెచ్చుకోవాలి.  ఆట మీద ధ్యాసతో ఆ అధికారి కాస్సేపు పేరడగటం మరిచిపోతాడు. ఈ లోపు అతడు దిగ వలసిన స్టేషను వస్తుంది.
దిగుతున్న గూఢాచారిని ఆ అధికారి దబాయించి  మళ్లీ అడుగుతాడు “ఇంతకీ నీ పేరు చెప్పనే లేదు” అని. వెంటనే ఆ గుఢాచారి తనకు తెలీకుండానే “ఎడ్వార్డ్ బ్లాక్” అని తన పాస్ పొర్టు లో వున్న పేరు చెబుతాడు.
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, మన మెదడు పనిచేసే తీరు అది వున్న స్థితి మీదా చాలా అధార పడివుంటుంది. దాని చుట్టు సంకుల వాతావరణం వుంటే దాని క్షమత తగ్గి పోతుంది.  విషయాలను గుర్తు తెచ్చుకోవడం (మెమరీ రికాల్) మీద భయం, ఆతృతా, నిద్రలేమి లాంటి విషయాలు చాలా ప్రభావం చూపుతాయి. అదే మన మెదడు మీద ఎలాంటి ప్రెషర్ లేకుండా రిలాక్స్ అయివుంటే విషయాలు సులభంగా గుర్తు కు వస్తాయి.
వయసు పెరిగే కొద్దీ అరోగ్యం మీద దాని ప్రభావాలు మనం అనుభవిస్తూ వస్తాం. వీటిలో ఒకటి జ్ఞాపక శక్తి కి సంబంధించింది. మనం తరచూ చిన్నచిన్న విషయాలు మరిచిపోతున్నట్లు గమనిస్తాం . ఉదాహరణకి రీడింగ్ గ్లాసెస్ ఎక్కడో పెట్టి మరిచి పోతాము. ఎవరిదో పేరు గుర్తు కు తెచ్చు కోవడానికి తంటాలు పడతాం. మాత్రలు వేసుకోవడానికి మరిచి పోతాము ఇలా జరుగుతున్నప్పుడు మనలో విశ్వాసం తగ్గిపోయి మనం డిమెన్షియా (dementia) లాంటి మతిమరపు వ్యాధికి లోనవుతామేమో అని  కలవర పడటం సహజం.  అయితే వయసు పెరిగే కొద్దీ ఇలాంటి లోపాలు సహజమేననీ వీటి గురించి హైరానా పడవలసిన అవసరం లేదనీ అంటున్నారు న్యూరో సైకాలజిస్టులు.
ఎన్నో ఏళ్లుగా  మనం నేర్చుకుంటూ వచ్చిన విషయాల్నీ, సేకరించు కున్న సమాచారం మొత్తాన్నీ గుర్తు పెటుకోవటం మాటలు కాదు. అందుకే ఆప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న  మరపులు వుండవచ్చు.    అయితే ఇవి తరచూ గా జరుగుతుంటే వైద్యులను సంప్రదించడం మంచిది. ఎందుకంటే ఇలాంటి మరపులు నిద్ర లేమి, ఆతృత,  డిప్రెషన్ లాంటి అనేక అనారోగ్య కారణాల వల్ల కలగొచ్చు. చాలా విషయాలు తాత్కాలిక మైనవి కావచ్చు.  చాలా వాటిని మనం నయం చేసుకోవచ్చు.
మాత్రలు వేసుకోవడం, కరెంటు బిల్లు, ఫోను బిల్లులు కట్టడం లాంటి అవసరమైన విషయాల్లో ఇలాంటి  మరపులు జరిగి జీవన శైలి కి అంతరాయం కలిగిస్తూ వుంటే  మన డాక్టర్ల సూచన మేరకు, న్యూరో సైకాలజిస్టులు మన జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, కార్యనిర్వహణ లాంటి కాగ్నిటివ్ స్కిల్స్ మీద ,  కొన్ని పరీక్షలు చేసి మన మెదడు పని చేసే తీరులో ఏవైనా సమస్యలుంటే నిర్ధారిస్తారు.
మనం కొంతమందిని వుద్దేశించి ఆప్పుడప్పుడూ ఆబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ అంటూవుంటాము. వీళ్లు అనేకమైన విషయాలు మీద వేసుకుని వాటిలో ముఖ్యమైన వాటిని గుర్తు పేటుకుని తక్కువ ప్రాధాన్యత గల విషయాలను  మరిచిపోతుంటారు. కానీ మరిచి పోయే ఈ చిన్న చిన్న విషయాలు   చెప్పుకోతగ్గ పర్యవసానాలకు దారి తీయ వచ్చు. వుదాహరణకి మనం బయటికి వెళుతూ వున్నప్పుడు రీడింగ్ గ్లాసెస్ కానీ ఫోను గానీ మరిచిపోయా మనుకోండి, చాలా కష్ట పడవలసి వస్తుంది.
చాలా సార్లు మనం  బాత్ రూముల్లో, కిచన్ లో లైటు తీసెయాడం మరిచి పోతూవుంటాము.  కిచన్ తలుపు మీద కానీ, స్టవ్ కి ఎదురుగా గోడమీద కానీ “లైటు తీయాలి” అనే ఒక రిమైండరును వుంచుకోవచ్చు. బెడ్ రూములో టేబులు మీద ఒక ట్రేలో ఫోనూ, అద్దాలూ, పెన్నూ, మాత్రలు వున్న బాక్సు ఒకేచోట వుండేటట్లు పెట్టుకోవచ్చు. కావాలంటే రాత్రి పడుకోబోయే ముందు ఒక చెక్ లిస్టు లాంటిది పెట్టుకుని  దానిలోని అంశాలను టిక్కు పెట్టవచ్చు.
అప్పుడప్పుడు మైండు బ్లాక్ అవుతుంది. కొన్ని పేర్లూ, విషాయలు గుర్తుకు రావు. నాలుక చివర్లోనె వుంది కానీ గుర్తుకు రావడం లేదు అంటాము. ఇలా గుర్తు కు రాని విషయాలను గుర్తు చేసుకోవడానికి పెగ్గులు (మందు పెగ్గులు కాదు) వాడవచ్చు. పెగ్గులంటె ఏదయినా వేలాడదీయడానికి గోడకు కొట్టే ఇనుప లేదా చెక్క ముక్కలు. ఇలాంటివి మానసికంగా   మనం తయారు చేసుకోవచ్చు. ఒక పేరు గుర్తుంచుకోవడానికి దాని జతగా మరో విషయాన్ని తగిలించ వచ్చు. ఈ విషయాలు, చేసే పని కావచ్చు, ఒక పాట కావచ్చు, లేదా ఒక వస్తువు కావచ్చు. వుదాహరణకి ఒక పేరు గుర్తుంచుకోవడానికి ఆ పేరు గల మనిషి జీవిత భాగస్వామి పేరు ను జత చేసి గుర్తు పెట్టుకోవచ్చు. విద్యార్థులకు ఈ ప్రక్రియ బాగా పనికి వస్తుంది.
కొన్ని సార్లు మనం ఒక ఫోను నంబరు గుర్తు పెట్టుకుంటాం (ఎవరో స్నేహితుడిచ్చింది). దాన్ని కొన్ని రోజులు వాడక పోతే మన మెదడు దాన్ని మెమొరీ లోనుంచి తొలగిస్తుంది. ఇలాంటి ప్రక్రియ ఒకటి విండోస్ ఆపరేటింగ్ సిస్టం లో చూడ వచ్చు. చాలా కాలం వాడని ఫైల్సు ను తొలగించి బాక్ అప్ లో పెట్టాలా? అని ఆపుడప్పుడు సిస్టం అడుగుతూ వుంటుంది. అలాగే మన మెదడు కూడా తరచూ వాడని విషయాలని తొలగిస్తుంది. అయితే దీనికి బాకప్ వుండదు. ఒక విషయం ముఖ్యమైనది అని తెలిసినప్పుడు దానిని తరచూ మననం చెసుకుంటూ వుండడం ద్వారా అదొక ముఖ్యమైన విషయమని మెదడు గ్రహిస్తుంది. దానిని మెమరీ లోనుంచి తొలగించకుండా వుంచుతుంది  . మీరు గమనించే వుంటారు గుర్తు పెట్టుకోవాలని అనుకున్న విషయాన్ని మనం పదేపదే మననం చేసుకుంటాము.
మెమరీ మానేజిమెంటు కి ఏం చేయాలి?
మన జ్ఞాపక శక్తిని అరోగ్యంగా వుంచుకోవడం లో ఈ క్రింది విషయాలు పాలు పంచు కుంటాయి. మెమరీ మానేజిమెంటులో  మన మెదడు కి తగిననత శక్తినివ్వడం, దాన్ని ఒక ప్రశాంత వాతావరణం లో వుంచడమనే విషయాలు  ముఖ్యం.
మన శారీరక ఆరోగ్యం:  
మొట్టమొదట మన శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని చక్కగా వుంచుకోవాలి. అంటే డయబెటీసు, కొలెస్టరాల్, బి.పి. వగైరాలు అదుపులో వుంచుకోవాలి. అధిక బరువు, పొగ త్రాగటం వంటివి లేకుండా చూసుకోవాలి .
వ్యాయామం:
మనం చేసే రోజు వారీ పనుల్లో మెదడుకి రక్త సరఫరా బాగా వుండేట్లు  చేసే పనుల్ని కలుపుకోవాలి. వీటిలో వాకింగ్, స్విమ్మింగ్, కార్డియో  లాంటి వ్యాయామాలను  చేర్చు కోవచ్చు.
మంచి పోషకాహారం::
మనం తీసుకునే ఆహారం మంచి పోషకాహారం  గా వుండేట్లు చూసుకోవాలి. ఆహారం లోంచి జంక్ ఫుడ్ తీసేసి. పళ్లూ, కూరగాయలు, చేపలూ, సిరి ధాన్యాలు లాంటి వాటిని చేర్చుకోవాలి. మన మెదడు పనిచేసే తీరు దాని ఆరోగ్యం పై ఆధార పడి వుంటుంది. . మనం తీసుకునే ఆహారం మెదడు ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తుంది.
మెదడుకి మేత:
మన మెదడుని అతిగా కాకుండా,  తగినంతగా అలోచించేటట్లు పని లో పెట్టాలి. దానికి నేర్చుకోవడం, తర్కించడం  లాంటి కాగ్నిటివ్ స్కిల్స్ లో సమస్యలనూ సవాళ్లనూ ఇవ్వాలి.ఉదాహరణకి సమస్యా పూరణాలూ,  గళ్ల నుడికట్టు లాంటివి. మన మెదడు ని ఎల్లప్పుడు ఆరోగ్యకరంగా ఆలొచించే స్థితి లో పెట్టాలి.
సాంఘిక జీవనం:
సాంఘిక సహవాసాల్ని పోషించాలి. ఒంటరి తనమూ, సంఘం తో విడివడి వుండటమూ కాగ్నిటివ్ స్కిల్సు ను బలహీన పరిచి తద్వారా మేధో శక్తిని  తగ్గిస్తాయని పరిశొధనలు చెబుతున్నాయి. మనుషులతో కలివిడిగా వుండడం మన మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది.
మెదడుకి విరామం:
మన మెదడు తగినంతగా రిలాక్స్ అయేటట్లు చూసుకోవాలి. దీనికోసం మనం యోగా, వ్యాయామం, చదవడం, రాయడం, పాటలు వినడం లాంటి విషయాలను ఉపయోగించవచ్చు.
మంచి నిద్ర:
ఇది చాలా మంది కి సమస్య కావచ్చు. మన మెదడు మనం మేల్కొని వున్నప్పటి కంటే మనం  నిద్ర పోతున్నప్పుడే ఎక్కువ పనిచేస్తుంది. మన నిద్ర లో అది మనకు హాని కలిగించే  విషాలను(టాక్సిన్లను)  శుభ్ర పరుస్తుంది. జ్ఞాపక శక్తి లో సర్దు బాట్లు చేసి దాన్ని బలపరుస్తుంది. ప్రతి మనిషికి  7 నుండి 9 గంటల నిద్ర అవసరం.  నిద్రా రీతిని క్రమ బధ్ధం చేసుకోవాలి. ప్రతిరోజూ ఒకే సమయం లో నిద్రపోయేటట్లు చూసుకోవాలి. ఈ నిద్రా సమయం కనీసం 7 గంటల పాటు వుండేటట్లు చూసుకోవాలి.
Ahmed Sheriff
(Ahmed Sheriff, PMP, CMQ/OE, ACS, FLMI, PSM
Consultant, PMP Certification, Project Management, Quality
Mob: +91 9849310610)