తెలంగాణ ప్రజలకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎపుడూ గుర్తుంటారు. ఎందుకంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యేందుకు కారణమయిన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లు-2014 బిల్లును ఆమోదించి సంతకం చేసిన రాష్ట్రపతి ఆయనే.
అంతేకాాదు,ఆయన తొలినుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా ఉంటూ వచ్చారు.
యుపిఎ ప్రభుత్వం మొట్టమొదట వేసిన చిన్న రాష్ట్రాల ఏర్పాటు (2005) అధ్యయన కమిటీకి సారధ్యం వహించిందాయనే. అపుడు ఆయన రక్షణ మంత్రిగా ఉన్నారు.
తెలంగాణ డిమాండ్ వచ్చినపుడల్లా కాంగ్రెస్ పార్టీ కి ఆ విషయాన్ని ప్రణబ్ కే అప్పగించేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమయిన రాష్ట్రం కావడంతో ఆ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేయడమేనేది కాంగ్రెస్ పార్టీకి ఎపుడూ కష్టంగానే ఉండేది. అయితే, తెలంగాణను సోనియా నాయకత్వంలోని పార్టీ పూర్తిగా ఎపుడూ తిరస్కరించలేదు కూడా. దీనికి కారణం ప్రణబ్ ముఖర్జీయే.
అయితే, కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటు ఎందుకు జాప్యం చేసిందనేందుకు కారణం పశ్చిమ బెంగాల్ పరిస్తితే నని చెబుతారు. బెంగాల్ కు గూర్ఖాలాండ్ సమస్య ఎప్పటి నుంచో ఉంది. తెలంగాణ ఇస్తే ప్రత్యేక గూర్ఖాల్యాండ్ ఉద్యమం వస్తుందని కాంగ్రెస్ భయపడింది. తెలంగాణకు అనుకూలమయినా దేశమంతాచిన్న రాష్ట్రాలు ఏర్పాటుచేయడానికి కాంగ్రెస్ సుముఖంగా లేదు.పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలను విభజించడానికి సుముఖంగా లేని కాంగ్రెస్ , ఈ విషయం బయటకు చెప్పకుండా రకరకాలుగా తెలంగాణ ఏర్పాటునువాయిదా వేస్తూ వచ్చింది. ప్రణబ్ ముఖర్జీ తననివేదికను చాలా కాలం సమర్పించకుండా వాయిదావేస్తూ వచ్చారు. అన్ని పార్టీలు అభిప్రాయాలు తెలపాలిన ఒక క్లాజ్ పెట్టి కొద్దిరోజులు, అన్ని పార్టల మధ్య కాన్సెన్సస్ తీసుకు రావాలని కొద్ది రోజులు ఇలా వాయిదావేస్తూ వచ్చింది కూడా ఆయనే.
ఆయితే, తెలంగాణ ఏర్పాటుకు ఎపుడో సిగ్నల్ పంపిస్తూ వచ్చారు. ఆయన తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా అనేది విషయం ఉద్యమానికి బాగా స్ఫూర్తినిచ్చింది. చాలా సార్లు తెలంగాణ నేతలు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ ఆయనను కలుసుకునేవారు. ఆయనకూడా తెలంగాణ ప్రతినిధి బృందాలను ఎపుడూ నిరుత్సాహ పరచలేదు. కాంగ్రెస్, టిఆర్ ఎస్, బిజెపి బృందాలను వెళ్ళినపుడల్లా ఆయన ఉద్యమం గురించి వాకబు చేసే వారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్ న్యాయమయిందని కూడా చెప్పేవారు ఆయనతో నిత్య సంపర్కంలో ఉన్నది కెసిఆర్. ఎంపిగా, కేంద్రమంత్రిగా కెసిఆర్ ఎపుడు ప్రణబ్ ముఖర్జీ సలహాలు తీసుకుంటూ ఉండేవారు. ఆయన హైదరాబాద్ విడిదికి వచ్చినపుడు కూడా తెలంగాణ ముచ్చట్లేఉండేవి. తెలంగాణ ఉద్యమాలను, తెలంగాన రాష్ట్ర సమితి ఏర్పాటును, తెలంగాణ రాష్ట్ర ఎర్పాటును మూడింటిని చూసిన రాష్ట్రపతి ఆయన ఒక్కరే. తెలంగాణ కలనెరవేరాక ప్రత్యేక రాష్ట్రాన్ని రాష్ట్రపతి గా సందర్శించడం మరొకవిశేషం.
ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం
మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రణబ్ ముఖర్జీ ప్రాణాలు కాపాడడానికి వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడం దురదృష్టకరమన్నారు.
తెలంగాణ అంశంతో ప్రణబ్ కు ఎంతో అనుబంధం ఉందని సిఎం అన్నారు. యుపిఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు వేసిన కమిటీకి నాయకత్వం వహించిన ప్రణబ్, చివరికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారని కేసీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర డిమాండ్ లో న్యాయం ఉందని భావించే వారని, తాను కలిసిన ప్రతీ సారి ఎన్నో విలువైన సూచనలు చేసే వారని సిఎం గుర్తు చేసుకున్నారు. ఒక నాయకుడికి ఉద్యమాన్ని ప్రారంభించి, విజయతీరాలకు చేర్చే అవకాశం దక్కడం అరుదుగా సంభవిస్తుందని, ఆ ఘనత తనకు (కేసీఆర్ కు) దక్కిందని అని తనను ప్రత్యేకంగా అభినందించారని కేసీఆర్ చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ రాసిన ‘ద కొయలేషన్ ఇయర్స్’ పుస్తకంలో కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారని, కేసీఆర్ కు తెలంగాణ అంశమే తప్ప పోర్టు ఫోలియో అక్కరలేదని పేర్కన్నారని గుర్తు చేశారు. దీన్ని బట్టి తన జీవితకాలంలో తెలంగాణ అంశాన్ని అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నదిగా గుర్తించినట్లు అర్థమవుతున్నదని కేసీఆర్ అన్నారు. యాదాద్రి దేవాలయన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను అభినందించారన్నారు.
ప్రణబ్ మరణం తీరని లోటని సిఎం బాధను వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తన తరుఫున, తెలంగాణ ప్రజల తరుఫున ప్రణబ్ కు నివాళి అర్పించారు. ప్రణబ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.