రాయలసీమ దుస్థితి నాకు తెలుసు: ప్రణబ్ ముఖర్జీ

ఒక సారి తనను కలసిన రాయలసీమ ప్రతినిధి బృందానికి ఎంతో  సహనంతో 15 నిముషాల పాటు సమయం కేటాయించి, బృంద సభ్యుల కంటే ముందు రాయలసీమ గురించి తానే వివరంగా చెప్పిన  నేత  మాజీ రాష్ట్రపతి  ప్రణబ్ ముఖర్జీ. ఆయనను కలసుకోవడం రాయలసీమ ఉద్యకారులకు ఓ మరచిపోలేని అనుభవం. ఈ వ్యాసకర్త కూడా ప్రతినిధి బృందంలో ఓ సభ్యుడు. ఆ అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాడు.    
(యనమలనాగిరెడ్డి) 
“I know about Rayalaseema and its pathetic condition. I will try to help with in my limitations” రాష్ట్ర విభజనకు ముందు తనను కలసిన రాయలసీమ ప్రతినిధి బృందంతో దివంగత నేత , భారత రత్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్న మాటలు.
రాయలసీమ ప్రతినిధి బృందం సభ్యుడు, అప్పటి దేవాదాయశాఖ మంత్రి సి. రామచంద్రయ్య ప్రతినిధిబృందం తరపున వినతి పత్రం అందచేసి సీమ దుస్థితి, సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి  వివరించడానికి ప్రయత్నించిన వెంటనే అడ్డుపడిన ప్రణబ్ ముఖర్జీ రాయలసీమ గురించి, ఇక్కడ గతంలో ఏర్పడిన కరువులు, ప్రజల జీవన స్థితిగతుల గురించి వివరించడంతో ప్రతినిధి బృందం ఆశ్చర్యపోయింది.   
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తప్పదన్న పరిస్థితుల నేపథ్యంలో  రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీని  రాయలసీమ డెవెలప్మెంట్ అండ్ రైట్స్ ఫోరమ్ ప్రతినిధి బృందం ప్రముఖ కార్మిక నాయకుడు, ఫోరమ్ కన్వీనర్ సిహెచ్ చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాదులో కలిసి ఆయనకు 17 పేజీల వినతి పత్రం  అందచేసింది.
రాష్ట్రపతిని కలసిన ప్రతినిధి బృందం తరపున రాయలసీమ పరిస్థితిని గురించి, రాయలసీమ అవసరాల గురించి అప్పటి దేవాదాయశాఖ మంత్రి సి. రామచంద్రయ్య వివరించడానికి ప్రారంభించగానే ప్రణబ్ ముఖర్జీ రాయలసీమ చరిత్ర, ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, ఇక్కడ సంభవించిన కరువులు ఇతర సమస్యల గురించి వివరించారు. 
 “రాయలసీమ దుస్థితి, వెనుకబాటు తనం గురించి తనకు పూర్తిగా తెలుసునని, తన పరిధిలో వీలున్నంత మేరకు సహాయం చేస్తానని” అప్పటి రాష్ట్రపతి,  దివంగత నేత  ప్రణబ్ ముఖర్జీ తనను కలిసిన రాయలసీమ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. 
ఆ తర్వాత ఆయన రాయలసీమ అప్పటి స్థితిగతుల గురించి ఆరా తీశారు. సుమారు 15 నిముషాల పాటు ఆయన ప్రతినిధి బృందంతో గడిపారు. 
ప్రతినిధి బృందం 
రాయలసీమ ఉద్యమకారుడు, ప్రముఖ కార్మిక నాయకుడు, ఫోరమ్ కన్వీనర్ సిహెచ్ చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో రాయలసీమ డెవెలప్మెంట్ అండ్ రైట్స్ ఫోరమ్ ప్రతినిధి బృందంలో  అప్పటి దేవాదాయశాఖ మంత్రి సి. రామచంద్రయ్య, ఆంధ్రప్రదేశ్  ఆరోగ్య, వైద్య శాఖ కు చెందిన కార్పొరేషన్ చైర్మన్ శివరామకృష్ణ రావు  (కాంగ్రెస్), మాజీ మంత్రి కె. ఇ  క్రిష్ట్నమూర్తి, ఎమ్మెల్సీ సతీష్ కుమార్ రెడ్డి (టీడీపీ),  శ్రీమతి కె. శాంతారెడ్డి (బీజేపీ) ఫోరమ్ కో-కన్వీనర్లు ఎస్.  రమణయ్య, వై. నాగిరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామి రెడ్డి, కుందు పోరాటసమితి నాయకుడు వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రం విడిపోక తప్పదని, రాయలసీమ వాణిని వినిపించి, సీమ సాగు, తాగు నీటి అవసరాలు తీర్చుకోవడం కోసం   కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెట్టడానికి తగిన సమయమని, అందుకోసం భారీగా ప్రజా ప్రతినిధులతో కలసి రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయాలన్న ఆలోచన తో   ఈ కార్యక్రమం  చేపట్టడం జరిగింది.  
రాష్ట్రపతితో సమావేశానికి ఈ ప్రతినిధి బృందం లో పాల్గొనడానికి నలుగురు మంత్రులు, ఇరువురు ఎంపీలు, 34 మంది శాసనసభ్యులు 13 మంది రాయలసీమ ఉద్యమకారులు కలసి మొత్తం 53 మంది అంగీకరించారు. వీరందరితో సంప్రదించి వారి అనుమతితోనే లిస్టు తయారుచేసి రాష్ట్రపతి భవన్ నుండి అనుమతి పొందాము కూడా. 
 అయితే రాష్ట్ర విభజన కాలంలో రాయలసీమ సమస్యల గురించి  రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయడంకంటే కూడా అతి ముఖ్యమైన పనులలో మునిగిన సీమ ప్రజా ప్రతినిధులు  మాత్రం రాష్ట్రపతిని కలవలేక పోయారు. ప్రతినిధి బృందంలో పేర్లు నమోదు చేసుకొని కూడా రానివారి కోసం రాష్ట్రపతి సెక్యూరిటీ అధికారులు అక్కడకు వెళ్లిన ప్రతినిధి బృందాన్ని గంటకు పైగా నిలిపివేయడం ఈ యాత్రకు కోసం మెరుపు. 
యనమల నాగిరెడ్డి
రాయలసీమ పై  అపార సానుభూతి చూపిన  ప్రణబ్ ముఖర్జీ గారి ఆత్మకు శాంతి కలగాలని, ఈ విషాదాన్ని తట్టుకోవడానికి ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు  ధైర్యాన్ని, స్తైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకొంటున్న  ప్రతినిధి బృందం కో-కన్వీనరు& వ్యాసకర్త.