ఈ రోజు తెలుగు వాళ్ల ‘బాపు’ వర్ధంతి

(CS Saleem Basha)
సత్తిరాజు లక్ష్మీనారాయణ, అంటే “బాపు” గురించి రాయడానికి ఏం ఉంటుంది, అనుకుంటే ఏమీ ఉండదు, రాయాలనుకుంటే చాలా ఉంటుంది. బాపు జీవితం ఆయన లాగే ఉంటుంది.
ఇందులో ఏముంది గొప్ప, ఎవరి జీవితమైనా అంతే కదా? ఇక్కడే మనం తప్పులో కాలు వేస్తాం? తన జీవితాన్ని తన లాగే బతకడం చాలా మందికి రాదు. మన జీవితం మనలాగే బతకాలి అనుకుంటే, బాపు ని చూస్తే తెలుస్తుంది.
బాపు తను ఏం చేయాలో అదే చేశాడు, అలాగే వెళ్ళిపోయాడు, చెప్పా పెట్టకుండా, సరిగ్గా ఈ తేదీనే, ఆరేళ్ల క్రితం. బాపు లాంటి వాళ్ళు మనకి అరుదుగా కనపడతారు. బొమ్మ గీసినా, రాసినా, తీసినా వాళ్ళు మనకి వినపడరు. కనపడతారు అంతే ! బాపు తన మొదటి సినిమా “సాక్షి”(1967) తోనే తనేంటో చెప్పకనే చెప్పాడు. అందుకే తాష్కెంట్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్షించబడింది.
బాపు బొమ్మ గిస్తే ఒద్దికగా, రాస్తే పద్ధతిగా, తీస్తే తీరుగా ఉంటుంది. బాపు కార్టూన్లలో, సుతి మెత్తని సెన్సాఫ్ హ్యూమర్, మనల్ని గిలిగింతలు పెడుతుంది. కథలకు బాపు వేసే బొమ్మలు చూస్తే కథ అర్థం అయిపోతుంది. బాపు డిజైన్ చేసిన ఏ పుస్తకం కవర్ పేజీ అయినా, చూస్తే ఇట్టే చెప్పగలుగుతాం, ఇది ఇది బాపు చేతి నుంచి జాలువారిన కళాఖండం అని. ఆయన పెయింటింగులు కూడా అంతే! బాబు ఏది చేసినా ఇట్టే గుర్తుపట్టే గలుగుతాం. సంతకం అవసరం లేదు. బాబు ఏది చేసినా ఇట్టే గుర్తుపట్టే గలుగుతాం. సంతకం అవసరం లేదు. బాపు గీసిన నవరస నాయిక, నాయకుల బొమ్మలు ఆ రసాల కే అందాన్ని ఇచ్చాయి అని చెప్పొచ్చు. చిరకాలం నిలిచే కళాఖండాలు
బాపు తక్కువగా మాట్లాడతాడట. నిజమే మరి! ఆయన బొమ్మలు, రాతలు, సినిమాలు లాడతాయి కదా? పైగా ఆయన ఆల్టర్ ఈగో అనబడే ముళ్ళపూడి వెంకట రమణ ఆయన కోటా మాటలు కూడా రాసేశాడు, మాట్లాడేశా డు కదా! బాపు బొమ్మలు,కార్టూన్ ల గురించి చెప్పటం, కొండకచో మెచ్చుకోవటం జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యం వేసే ప్రయత్నం.. అందుకే ఆ పని(అంటే చెప్పటం) చెయ్యటంలా. బాపు గురించి మాత్రం కొంచెం చెప్పక తప్పదు. వర్ధంతి సందర్భంగా, ఆయనను గుర్తుచేసుకుంటూ వ్రాసే ఆర్టికల్ కదా?
బాపు గురించి చెప్పాలంటే, ముళ్ళపూడి గురించి చెప్పక తప్పదు. ఆయన బాపు కన్న పెద్దవాడు. అందుకే కాస్త ముందు వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరు ప్రాణ మిత్రులు అని అందరికీ తెలుసు. ఒకరి గురించి ఒకరు అంత బాగా అర్థం చేసుకున్న మిత్రులు మనకు కనబడరు. రమణ గారు బానే మాట్లాడుతాడు, కానీ బాపు మాట్లాడడు. వాళ్ళిద్దరి మధ్య అర్థం చేసుకోకపోవడం అన్న సమస్య రాదు. అంత బాగా ఇద్దర్ని ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. బాపు మాట తీరు ఎలా ఉంటుందో చిన్న సంఘటన చెప్పుకోవాలి.
ఓసారి ముళ్ళపూడి బాపు కి నాకు డబ్బు కావాలి అని ఫోన్ చేశారు.
“ఎప్పుడు కావాలి?” అని బాపు అడిగాడు
“మొన్నటికి” అని ముళ్ళపూడి జవాబు.
ఇలా ఉండేవి వారి మధ్య మాటలు. ఇద్దరికీ చమత్కారము, చత్వారం రెండూ ఎక్కువే! ముళ్ళపూడి అప్పు తీసుకోకుండానే వెళ్ళిపోతే మూడేళ్ల తర్వాత బాపు అప్పు ఇవ్వడానికి వెళ్లిపోయా డు. బాపు కి తన మీద కన్నా ముళ్ళపూడి మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ. అందుకే తన మొదటి సినిమా ” సాక్షి”లో కృష్ణని హీరోగా తీసుకున్నాడు! అప్పటికి కృష్ణకు మూడు నాలుగు సినిమాలు చేసిన అనుభవం ఉంది. పైగా ఇద్దరు మొనగాళ్లు, గూడచారి 116, యాక్షన్ చిత్రాలు. ఒక కొత్త నటుడిని, ఇమేజ్ కి భిన్నంగా, పూర్తి అమాయకమైన పాత్ర కు తీసుకోవడం సాహసమే! దాంతోపాటు అంత ప్రాముఖ్యం లేనిచాలామంది నటీనటులను తీసుకున్నాడు. దానికి కారణం ముళ్ళపూడి కథ మీద ఉన్న నమ్మకం! హిందీ సినిమాలు తప్ప బాపు అన్ని సినిమాలకు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు ముళ్ళపూడి వే. విజయా సంస్థ తీసిన  రాజ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ (1976) మాత్రం ముళ్ళపూడి గారు. పాలగుమ్మి పద్మరాజు గారు కథా మాటలు రాస్తే, చక్రపాణి గారు స్క్రీన్ ప్లే రాశారు
మరి బాపు ముళ్ళపూడి ల మధ్య గొడవలు లేవా? ఒక్కసారి అంటే ఒక్కసారి వారు కొన్ని రోజులు మాట్లాడకుండా ఉన్నారు. ముళ్ళపూడి గారు ఒకసారి తన బర్త్ డే సందర్భంగా “వీణ వాయిద్య” క్యాసెట్లు ఒక 12 కొనుక్కున్నారు. వాటిని వింటుండగా బాపుకి కొంచెం చికాగ్గా అనిపించింది. దాంతో వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. కొన్ని రోజులు మాట్లాడకుండా ఉన్నారు. చివరికి ముళ్ళపూడి తల్లిగారు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. ఆ స్నేహానికి చంద్రుని మచ్చలా ఇదొకటి. ఈ విషయం ముళ్ళపూడి తన జీవిత చరిత్రలో ప్రస్తావించాడు .
సాక్షి సినిమా తీసినప్పుడు దాన్ని ఎవరు కొంటారు అని తిరుగుతున్న కాలంలో, కర్ణాటకలో పేరుప్రఖ్యాతులు ఉన్న ” భక్త” అనే ఫైనాన్సియర్ ని కలిశారు. చర్చలు ముగిసిన దశలో ఉన్నట్టుండి బాపు ఆయనతో ” బాగా ఆలోచించుకోండి. ఈ సినిమా కొన్నిచోట్ల నేను సరిగ్గా తీయలేక పోయాను, ఎందుకంటే బడ్జెట్ ప్రాబ్లం. అయినా ఈ సినిమాను మీరు కొంటాను అంటే మీ ఇష్టం” అని లేచి వెళ్లిపోయాడు. దాంతో ముళ్ళపూడి కొంచెం టెన్షన్ పడ్డాడు. భక్త కి బాపు నిజాయితీ నచ్చి ఆ సినిమాను కొనేశాడు. తర్వాత జీవితాంతం బాపు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నాడు. ఇది బాపు నిజాయితీకి నిదర్శనం.
ఈ సంఘటన బాపు గురించి రెండు విషయాలను మనకు తెలియజేస్తుంది. ఒకటి బాపు నిజాయితీ, రెండు బాపు పర్ఫెక్షన్ నిజం. బాపు కు బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే అంటే ఇష్టం. ఆయన కోసం ” సీతాకల్యాణం” సినిమా ప్రత్యేకంగా ప్రదర్శించాడు. ఈ సినిమా ఫిలింఫేర్ అవార్డ్ తో పాటు, మరో గొప్ప అవార్డు పొందింది. British Film Institute కోర్సులో భాగమైపోయింది!
సత్యజిత్ రే లాగే బాపు కూడా స్క్రిప్టులో అక్షరాల కన్నా, బొమ్మలు వేసేవాడు. దాంతో నటీనటుల కీ, ఇతర సాంకేతిక నిపుణులకి మంచి క్లారిటీ ఉండేది. బాపు క్రియేటివిటీకి ఇదొక నిదర్శనం. “రామాయణ విషవృక్షం” రచయిత్రి ముప్పాళ్ల రంగనాయకమ్మ, ఆ పుస్తకం కోసం కవర్ పేజీని డిజైన్ చేయమని బాపు కి ఒక డిమాండ్ డ్రాఫ్ట్ పంపింది. పరమ రామభక్తుడైన బాపు అ డ్రాఫ్ట్ వెనక “రామ రామ” అని రాసి వెనక్కు పంపాడు. అది బాపు పంథా! బాపు కున్న ఎకైక ఇతరా అలవాటు పైపు తాగటం. ఆయన వైపు నుంచి వచ్చే పొగ కూడా ఆయన బొమ్మ లాగే వయ్యారంగా, చాలా పద్ధతిగా వచ్చేదని కొంతమంది అనుకునేవారట.
బాపు సృష్టించిన తెలుగమ్మాయి/bapuramaneeyam blog నుంచి
బాపు సినిమాల గురించి రాయడానికి కుదరదు. అవి చూడాలంతే. ఆయన ఏ సినిమా తీసినా, అదొక కాన్వాస్ పై గీసిన చిత్రాల సమాహారం గా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు మనం ఒక ఆల్బమ్ చూసినట్లే ఉంటుంది. ఈ సందర్భంగా “ముత్యాల ముగ్గు” సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. రామాయణంలో సీతాపహరణం, దరిమిలా సీతను రాముడు తిరిగి తెచ్చుకోవడం అంశంపై తీసిన సాంఘిక సినిమా. గోదావరి పై బోటు పడవలో చిత్రీకరించిన ” ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు” (నాకు బాగా నచ్చిన సినిమా) గురించి చెప్తే అది మసకబారి పోతుంది. దాన్ని చూసి ఎంజాయ్ చేయాలి అంతే ! ఆయన రామభక్తుడు. అందుకే రామాయణానికి సంబంధించిన సినిమాలు తీశాడు. అన్నీ చిరకాలం గుర్తుంచుకోదగ్గ కళాఖండాలే. ఆయన చివరగా బాలకృష్ణ రాముడిగా ” శ్రీరామరాజ్యం” గా సినిమా తీశాడు. ఆ సినిమా, 28.11.2011 భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రత్యేకంగా ప్రదర్శించారు.అలా ఏ సినిమా తీసుకున్నా అంతే. ముళ్ళపూడి భాషలో చెప్పాలంటే, పుంజిడు సినిమాలే తీసినా, మంచి సినిమాలే తీశాడు.
ఆయన తీసిన సినిమాల్లో, అందాల రాముడు, మన ఊరి పాండవులు, తూర్పు వెళ్ళే రైలు, రాధాగోపాలం, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం నాకు బాగా నచ్చిన సినిమాలు.మిగతా సినిమాలు నచ్చలేదా అంటే, ముళ్ళపూడి వారి భాషలో చెప్తాను.” అన్ని సినిమాలు నాకు సమానంగా నచ్చాయి. ఈ సినిమాలు మాత్రం కొంచెం ఎక్కువ సమానం గా నచ్చాయి!”
చివరగా ,బాపు సినిమాల గురించి ఒక్కముక్కలో చెప్పాలంటే “చూసి ఆస్వాదించడానికి తప్ప మరేమీ చేయడానికి వీల్లేని సినిమాలు!”
బాపు-రమణ ‘బుడుగు’/ bapuramaneeyam blog నుంచి
బాపూ బొమ్మలు, బాపూ కార్టూన్లు ఎంత పాపులరోచెప్పాల్సిన పనిలేదు. ఆయన కార్టూన్ల జీవితం ఆంధ్రపత్రికతో ప్రారంభమయింది. అపుడు ఆయన వేసిన పాకెట్ కార్టూన్ పత్రికకు గుండెకాయ అయింది. ముళ్లపూడితో కలసి ఆయన సృష్టించిన బుడుగు ను తెలుగువాళ్లెప్పటికీ మర్చిపోలేరు. 60 దశకంలో సినిమా వైపు దృష్టిపెట్టే దాకా ఆయన కార్టూన్లు బొమ్మలు గీసే వారు. ఆ రోజుల్లో ప్రతిరచయితా తన పుస్తకం కవర్ పేజీకీ బాపూబొమ్మ ఉండాలని కోరుకునే వాళ్లు. బాపురాత, గీత యూనిక్. అవి మరకొరికి రావు. రెండింటిలో వయ్యారముంటుంది. బాపు తెలగమ్మాయిన అంతపాపుల అయ్యేందుకు కారణం ఈ వయ్యారమే. ఆయన రాత బాపు స్క్రిప్ట్ గా స్థిరపడిపోయింది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఆయన గీత రాత సినిమా అన్నీ నూటికి నూరు పాళ్ల తెలుగు దనం.
బాపు చాలా పర్ఫెక్షనిస్ట్. ఒక పని తాలూకు ఫలితం బాగా వచ్చేంతవరకూ మళ్లీమళ్లీ చేసేవాడు. చావు కి కూడా ఆయన పర్ఫెక్షనిస్ట్ అని తెలుసు కాబోలు, అందుకే ఫలితం వచ్చేంతవరకూ, ఆయనకు జీవితం లో చాలా సార్లు గుండె పోటును ఇచ్చింది. ఆగస్టు 31, 2014 న, మరో సారి ట్రై చేసి చివరికి సక్సెస్ అయింది. బాపు ని మన నుండి దూరంగా తీసుకెళ్ళి పోయింది.
Saleem Basha CS

(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)