ఇంగ్లీష్ అన్నది ఒక అవసరం, అది జీవితం కాదు…

(CS Saleem Basha)
దేశ భాషలందు తెలుగు లెస్స
తేనెకన్నా తీయనైన భాష తెలుగు
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్
ప్రాచీన భాషలలో ఒకటి తెలుగు
కమ్మనైన భాష తెలుగు…
అమ్మదనం నిండిన కమ్మనైన భాష తెలుగు
ఏ దేశమేగినా ఆత్మబంధువు తెలుగు
ఇలా చెప్తూ పోతే ఈ జాబితా ఒక పుస్తకం అవుతుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ జాబితా చివరలో ” తెలుగు ఒక మృత భాష” అని అని చేర్చవలసి వస్తుంది! అంతరించిపోతున్న జాతులు లాగా ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలుగు కూడా అంతరించిపోతుంది.( (అలా జరగడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది అది వేరే విషయం) మన మాతృభాష, మృతభాష అయిపోతుంది. వ్యవహారిక భాషా ఉద్యమకర్త గిడుగు రామ్మూర్తి పంతులు లాంటి వారు చేసిన కృషి వల్లనే మనం గ్రాంధిక భాష నుంచి వాడుక భాష వరకూ వచ్చాము. ఇప్పుడు దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత తెలుగువారందరి. ఆయన తెలుగుభాష కోసం చేసిన కృషికి గుర్తుగా ఆయన జయంతిని( ఆగస్టు 29) తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
ఇక తెలుగు భాష విశిష్టత ఏంటో చూద్దాం..
** తెలుగు భాష క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం నుంచి ఉంది.
** క్రీస్తుశకం 6వ శతాబ్దం నుంచి తెలుగు ప్రాచుర్యంలో ఉంది.
** 2012 లో జరిగిన రెండవ World Alphabet Olympics లో తెలుగు భాష లిపి, రెండో ఉత్తమ లిపి గా ఎంపికైంది. మొదటిది కొరియన్ లిపి
** అష్టావధానం, శతావధానం , సహస్రావధానం వంటి అద్భుతమైన ప్రక్రియలు కేవలం తెలుగు భాషలోనే ఉన్నాయి. ఇతర(తమిళ్ తప్ప) ఏ భాషలో లేవు
** పద్యం అనే ప్రక్రియ ఉండేది తెలుగులోనే, ఇతర ఏ భాషలో లేదు.
** ఆసియా ఖండంలో హిందీ, బెంగాలీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగే
అదే ప్రపంచంలో తెలుగు 15వ స్థానంలో ఉంది.
** కేంద్ర ప్రభుత్వం దీనికి ప్రాచీన భాష హోదా ఇచ్చింది
** భారత ప్రభుత్వం గుర్తించిన 6 క్లాసికల్ భాషలలో తెలుగు కూడా ఒకటి
** తెలుగు పరిశోధకుల ప్రకారం గత నాలుగు సంవత్సరాలుగా తెలుగు భాష పై దాడి జరుగుతూనే ఉంది. దానికి కారణం సంస్కృతం, పర్షియన్, ఉర్దూ, ముఖ్యంగా ఇంగ్లీష్! అయినా సరే తెలుగు భాష వాటిని తట్టుకుని నిలబడి ఉంది. ఇప్పుడు ఈ దాడి మరింత ఉధృతమైంది. దానికి కారణం కొంతవరకూ తెలుగువారు కూడా.
** 1939 వరకు నాణేలపై చివరగా ముద్రించబడిన దక్షిణాది తెలుగే కావడం గమనార్హం
** కుతుబ్ షాహీ సుల్తానులు పర్షియా నుంచి వచ్చినప్పటికీ, తెలుగు సుల్తానులు గా నిలబడడానికి ఇష్టపడేవారు. వారు తెలుగు రాయడం మాట్లాడటం రెండు నేర్చుకున్నారు. తెలుగు కవులను గౌరవించారు.ముఖ్యంగా ఇబ్రహీం కులీ కుతుబ్ షా (నాలుగో కుతుబ్ షాహి సుల్తాన్) తెలుగు ను ప్రోత్సహించేందుకు చాలా చర్యలు తీసుకున్నారు. ఆయన ఆస్థానంలో చాలా మంది తెలుగు కవులు కళాకారులుండేవారు. ఆయన తెలుగు  మీద ఇంత ప్రేమ పుట్టేందుకు కారణానికి ఒక కథ చెబుతారు.  సుల్తాన్ కాకముందు ఆయన కొద్ది రోజులు విజయనగర రాజ్యంలో ప్రవాసంలో ఉండేవారు. 1543 నుంచి 1550దాకా ఆయన విజయనగర రాజ్యంలో ఆశ్రయం పొందారు. ఆయన పదవీచ్యుతుని చేసేందుకు సుభాన్ కులీని కొంతమంది గద్దె మీద కూర్చోబెట్టారు.  అపుడాయన విజయనగర రాజ్యం పారిపోయారు. విజయనగర రాజుల రక్షణలో ఉన్నారు. అపుడే ఆయన తెలుగు నేర్చుకున్నారు. తర్వాత తాను మళ్లీ సింహాసనమెక్కగానే ఆయన తెలుగును చాలా బాగా ప్రోత్సహించారు. తెలుగును ఇంతగా ప్రోత్సహించిన ముస్లిం సుల్తాన్ మరొకరు లేరు. అద్ధంకి గంగాధ, కందుకూరు రుద్రకవి, పొన్నగంటి తెలగనార్యాలను ఆయన ఆదరించారు. అంతేకాదు, గంగాధరను అస్థాన కవిగా నియమించారు. భారతంలోని తపతీ సంవరణుల కథ  తీసుకుని తపతీ సంవవరణోపాఖ్యానం అనేకావ్యం రచ్చింది ఇబ్రహీం కులీకుతుబ్ షాకు అంకితమిచ్చారు. తెలుగు నాట ఇభరామ (Ibharama) అనే పేరు తెచ్చుకున్న సుల్తాన్ ఆయనే.
ప్రపంచం మొత్తం మీద ఇలా ఒక భాష పేరు మీద తమని తాము తెలుగు రాజులుగా గుర్తించ బడడానికి ఇష్టపడిన విదేశీ రాజవంశస్తులు గొల్కొండ సులానులే ! అందుకే గొల్కొండ తెలుగు రాజ్యమయింది. అది తెలుగు భాష గొప్పదనం!
** అతి క్లిష్టమైన కర్ణాటక సంగీత కచేరీలలో చాలామంది శాస్త్రీయ గాయకులు తెలుగులోనే పాడడం విశేషం!
**తృతీయ పురుషలో(third person- pronouns) గౌరవార్థక సర్వనామములు ఉండేది ఒక్క తెలుగు భాషలోనే. ఆయన, ఆవిడ. అలాగే వాడు, వీడు అనే అవమానకరమైన
సర్వనామములు కూడా తెలుగు భాషకే ప్రత్యేకం. ఇంకా ద్వితీయ పురుష లో కూడా గౌరవార్థకాలు సర్వనామము ” తమరు” అనేది ఉండటం కూడా తెలుగులోనే.
అయితే, ఇది అంతరించిపోయే ప్రమాదం వైపుకి అడుగులు వేయడం విచారకరం.
దీనికి కారణం పరోక్షంగా ఇంగ్లీష్! తర్వాత గ్లోబలైజేషన్ నేపథ్యంలో ఇంగ్లీషు ప్రాధాన్యత పెరుగుతుందని భావించడం.
ఇంగ్లీష్ నేర్చుకోకపోతే వెనుకబడి పోతామన్న భావన. అది సమంజసం కాదు. భాషను సంస్కృతిని వేరు చేసిన దేశాలు అభివృద్ధిలో వెనక పడిపోయాయి. స్థూలంగా చెప్పాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా అవసరం. కానీ జీవితాన్ని ఇంగ్లీష్ మయం చేసుకోవడం కాదు. ఇప్పుడు చైనా కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటోంది, కానీ మాండరిన్ ని నిర్లక్ష్యం చేసి, పక్కన పెట్టి కాదు. ” జీతం కోసం మాత్రమే ఇంగ్లీష్, జీవితం కోసం మాత్రం మాతృభాష’ అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి.
 Language profoundly influences the way people see the world అని చాలా పరిశోధనల్లో తేలింది.
భాష సంస్కృతికి ప్రతిబింబం. మనం పరాయి భాషని ఒంటబట్టించుకుని, దాన్ని నెత్తికి ఎక్కించుకొని, దానిద్వారా ప్రపంచాన్ని చూసే దృష్టి మారిపోవడం అంటే సంస్కృతి కూడా మారిపోవడం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది ఇదే!
ప్రస్తుతం ఇంగ్లీష్ అన్నది ఒక అవసరం, అది జీవితం కాదు. భాష గురించి, సంస్కృతి గురించి అర్థం చేసుకోలేని వాళ్లు చాలామంది ఉన్నారు. ఏ భాష అయినా సంస్కృతిని ప్రతిబింబిస్తుంది, సంస్కృతిని పరిపుష్టం చేస్తుంది. అలాగే సంస్కృతి కూడా భాష ను అభివృద్ధి చేస్తుంది. సంస్కృతి భాష రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడి, ఒకదాన్ని ఇంకోటి అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తాయి. జనసామాన్యంలో ఏ భాష అయితే ఉంటుందో, అదే ఎక్కువ కాలం మన్నుతుంది.
Language is also used to transmit values, laws, and cultural norms, including taboos. Language, since it expresses and reinforces culture, influences the personal identity of those living within the culture and creates boundaries of behavior.
ఈ మధ్య ఆంధ్ర ప్రదేశ్ లో ఇంగ్లీష్ మీడియా మీద చాలా చర్చ జరుగుతోంది. ఈ మాతృభాషా దినోత్సవం సందర్భంగా నా అభిప్రాయం చెప్పడం సమంజసమని భావిస్తున్నాను. నేను కూడా టీచర్ గా చాలా కాలం పనిచేశాను. ప్రస్తుతం విద్యా రంగంతో సంబంధమున్న పనులు చేస్తున్నాను. నేను స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ గా కూడా పని చేస్తున్నాను. ఇంగ్లీష్ అనేది అందరూ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కేవలం కెరీర్ కోసం ఇంగ్లీష్ తప్పకుండా నేర్చుకోవాలి. అయితే
ఉద్యోగం వేరు, జీవితం వేరు.
శాస్త్రీయంగా, సామాజిక పరంగా, చరిత్రపరంగా చూస్తే కూడా, ప్రాథమిక స్థాయిలో అంటే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మాతృభాషలో చదువుకున్నవారు, పైస్థాయి చదువుల్లో, ఉద్యోగాల్లో, జీవితంలో కూడా ఒక స్థాయిలో ఉంటారు. ఇది ఇప్పటికే చాలామంది మేధావులు, విద్యావేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు విపులంగా చెప్పి ఉన్నారు. నా అభిప్రాయం కూడా అదే. ఐదేళ్ల వయస్సు నుంచి పదేళ్ల వయసు వరకు ఒక మనిషి వ్యక్తిత్వ వికాసం, జ్ఞానసముపార్జన కోసం వేసే అడుగులు, తను నిరంతరమూ ఉన్న సంస్కృతి, మాట్లాడుతున్న భాష ద్వారానే, సరిగ్గా వేయ గలుగుతాడు. అయితే నా ఉద్దేశం ఇంగ్లీష్ మీడియం వద్దని కాదు. అది కచ్చితంగా ఉండాలి. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పరిస్థితులతో పోటీ పడాలంటే అది తప్పదు. కానీ పునాది మాత్రం గట్టిగా ఉండాలంటే తన సొంత భాషతో నే సాధ్యం. దానికి రుజువు కావాలంటే నేను నాతో పాటు చదువుకున్న వాళ్ళు. మేము కూడా ఒకటి నుంచి ఐదో తరగతి మాతృభాషలోనే చదువుకున్నాం!
About one crore students discontinue studies every year in the country owing to lack of proper guidance which could be reduced if education is given in the mother tongue, అని నూతన విద్యావిధానం 2020 రూపొందించిన డాక్టర్ కస్తూరిరంగన్ ఒక సందర్భంలో అన్నారు.
Saleem Basha CS

(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)