నిర్మల్ ఆసుప్రతిలో చికిత్స తీరును పరిశీలించిన సిఎల్ పి నేత భట్టి

నిర్మల్, ఆగస్టు28: కరోనాపై మొద్దు నిద్ర పోతున్న ప్రభుత్వం మత్తు వదిలే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
కరోనా చికిత్సలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎక్కడ చూసినా కనబడుతూ ఉందని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయంమీద ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన హెచ్చరించారు.
సీఎల్పీ బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వాసుపత్రుల సందర్శన యాత్రలో భాగంగా భట్టి ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నా వైద్యం అందించే డాక్టర్లు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎల్పీ నేత భట్టి కోరారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రులను నిర్వీర్యం చేసిందని  ఒక్కో ఆసుపత్రిలో పాతిక, ముప్పై మందికి కూడా సరైన చికిత్స అందటం లేదన్నారు.
ఏడు లక్షల మంది జనాభాలో కనీసం ఒక్కశాతం మందికి కూడా టెస్టులు చేయలేక పోతున్నారంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర మంత్రులుగా ఉన్న కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గాల్లోనే ప్రాధమిక వైద్యం పడకేసిందంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో అర్ధం కావటం లేదని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల ప్రాణాలను పట్టించుకోని ఈ దుర్మార్గపు ప్రభుత్వం వల్ల అనేక మంది చనిపోతున్నారని దీనికి ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాలని సీఎల్పీ నేత భట్టి డిమాండ్ చేశారు.
ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలని, కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చి పేదలకు అండగా నిలవాలని కోరారు.