వైద్యసేవలందిస్తున్న కుటుంబాల గురించి చెప్పుకోవల్సి వస్తే డాక్టర్ జాన్ వెస్లీ కుటుంబం పేరు ముందుచెప్పుకోవాలి. గత ముప్పై సంవత్సరాలుగా ఈ కుటుంబం మొత్తం ప్రజలకు ఎనలేని వైద్య సేవలందిస్తూ ఉంది.వైద్యో నారాయణోఃహరిః అనిఅంటుంటారు. అది ఆయనకుటుంబానికి పూర్తి గా వర్తిస్తుంది. లక్షలాది రోగులకు ఆ కుటుంబం పునర్జీవితం ప్రసాదించింది. వైద్యం ఖరీదైపోయి ఆసుపత్రికి వెళ్లేందుకు భయపడి ఎంతో మంది పేదలు వైద్యం ఒంట్లో దాచుకుని బతుకెళ్లదీసే ఈ రోజుల్లో మదనపల్లి ప్రాంతంలో నిరుపేదల కుటుంబాలకు ఆలంబనగా నిలచిన కుటుంబం అది.
ఎవరాకుటుంటం?
శతాబ్ద కాలంగా మదనపల్లె నుంచి సేవలందిస్తున్న ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ (ఎఎంసి) దిశానిర్దేశకుడుగా 30 సంవత్సరాలుగా పనిచేస్తూ వైద్యవృత్తికే వన్నె తెచ్చిన డాక్టర్ వెస్లీ కుటుంబం అది.
వైద్య వృత్తి విలువలు మారిపోయాయి. వైద్యం సరుకు (commodity)అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలో వైద్యవృత్తి ధన సంపాదనకు మాత్రమే కాదు రోగుల సేవ అనే ఆలోచన రావడం కష్టం.అందుకే ఈ రోజుల్లో డాక్టర్ జాన్ వెస్లీ కుటుంబం గురించి మాట్లాడుకోవడం అవసరం. అంతరించి పోతున్న పాత మానవీయ కోణం చివరి గుర్తులు ఇలాంటి కుటుంబాలు.
ఎంతో సంతృప్తిగా ఉంది- డాక్టర్ వెస్లీ
శక్తివంచన లేకుండా రోగుల వ్యాధులు నయం చేయడంలో 30 వసంతాలు ఇట్టే గడచి పోయాయని, ఈ జీవితం ఎంతో సంతృప్తిగా ఉందని డాక్టర్ వెస్లీ ట్రేండింగ్ తెలుగు న్యూస్ (TTN) వెబ్ సైట్ కు వివరించారు. ఈ ప్రాంతంలో డాక్టర్ వెస్లీ బాగా పేరున్న వైద్యడు. పేద ప్రజలకు వైద్య సేవలందించడంలో ఆయన నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్నారు. 39 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన టిటిఎన్ తో మాట్లాడారు.
“మొతం 39 సంవత్సరాలు ఈ వృత్తిలో ఉన్నాను. కొన్ని వేల శస్త్ర చికిత్సలు చేశాను.30 యేళ్లుగా ఎంఎల్ ఎల్ లో ఉంటున్నాను. సుమారు 70 వేల మంది క్షయ వ్యాధి గ్రస్తుల జబ్బు నయం చేశాం. ఇది చాాలా సంతృప్తినిచ్చే విషయం. ఒక డాక్టర్ కు ఇంతకంటే ఏం కావాలి?,’అని ఆయన అన్నారు. సంపాదన ఎపుడూ ఈ కుటుంబం ప్రోగ్రాం కాలేదు.కుటుంబం నుంచి కొత్తగా తయారయిన ప్రతి డాక్టర్ ఈ సేవకు అంకితం కావడం విశేషం.
ఆయన భార్య శ్రీమతి శీలావెస్లీ నర్సింగ్ చదివారు. ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ (ఎఎంసి)లో ఆయనతో పాటు 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గా, వైద్యశాల నర్సింగ్ సూపరింటెండెంట్ గా ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు.
ఆయనకు ఇరువురు కుమారులు, ఒక కుమార్తె. పెద్దకుమారుడు రిచర్డ్స్ డాక్టర్ గా, రెండవ కుమారుడు వైద్యశాల పాలనాధికారిగా, ఆయన కుమార్తె మిస్ క్రిస్టినా మైక్రోబయాలజీ విభాగాధిపతిగా ఎఎంసిలోనే సేవలందిస్తున్నారు. కోడలు విమలా కృప డాక్టర్ గా, ఆయన అల్లుడు రేడియాలజీ సెంటర్ నిర్వాహకుడుగా అక్కడే పనిచేస్తున్నారు.
నాలుగు దశబ్దాల వైద్యవృత్తిలో మరచిపోలేని అనుభూతి ఏమిటని అడిగినపుడు ఆయన చెప్పిన సమాధానం వృత్తి పట్ల ఆయనకు ఉన్న కమిట్ మెంట్ ను చెబుతుంది.
‘విజయవంతంగా ఒక రోగికి శస్త్ర చికిత్స పూర్తిచేసినపుడు, వ్యాధి నుండి కోలుకుని ఎవరైనా ఇళ్లకు వెళుతూన్నపుడు… వారి కళ్ళలో కనిపించే మెరుపు, కృతజ్ఞతా భావం అందించే అనుభూతి మేం కూడకట్టుకున్న సంపద. వారికి హృదయపూర్వకంగటా వీడ్కోలు చెప్పడం నాకు మాటల్లో చెప్పలేనంత సంతృప్తినిస్తుంది. దాని ప్రభావం చాలా రోజులు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది,’ అని డాక్టర్ వెస్లీ చిరునవ్వుతో వివరించారు.
‘ వైద్యం కోసం మాదగ్గిరకు వచ్చిన రోగల విషయంలో ఆర్థిక పరమయిన అంశాలను మేము పట్టించుకోం. వైద్యం నుంచి మేమాశించింది సంతృప్తి.అది సమృద్ధిగా దొరికింది. డబ్బు విషయం ఎపుడూ మాకు ప్రధానం కాలేదు. ఉన్నంతలో సంతృప్తిగా జీవిస్తున్నాం. కుటుంబమంతా రోగుల సేవలోనే ఉంటున్నాం. ఇది ప్రభువు అజ్ఞగా భావిస్తున్నాము,’ అని ఆయన అధ్యాత్మికంలోకి వెళ్లిపోతారు.
ఎవరీ డాక్టర్ జాన్ వెస్లీ
పేరేదో పారిన్ మిషనరీలా కనిపిస్తుంది కదూ. ఆయన ఆంధ్రుడు, అచ్చ తెలుగు వాడు. కడప జిల్లా ముద్దనూరుకు చెందిన వాడు. గతంలో ఇక్చడి చర్చి పాస్టర్ గా పనిచేసి ఫాదర్ బి.జె. దొరస్వామి, కనకమ్మ దంపతులకు 10వ సంతానం. పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురంలో డాక్టర్ వెస్లీ జన్మించారు. ఆయన బాల్యమంతా అందరిలాగే సాగింది. ప్రాధమిక విద్య సింహాద్రిపురం, పులివెందులలో సాగింది. తర్వాత డిగ్రీ కడప ఆర్ట్స్ కళాశాలలో పూర్తి చేశారు. ఆ తర్వాత వేలూరు సీఎంసీ లో ఎంబిబిఎస్, ఎంఎస్ పూర్తి చేశారు. తమిళనాడు కు చెందిన వేలూరు నివాసి కుమారి షీలా ను ఆయన 1982లో పులివెందులలో వివాహం చేసుకున్నారు. ఆమె వేలూరు మెడికల్ కాలేజీలో నర్సింగ్ చేశారు.
చదువు పూర్తి చేసిన వెంటనే ఆయన మదనపల్లి లోని మేరీ లాట్ లైల్స్ ( ఎంఎల్ ఎల్) హాస్పిటల్ లో వైద్య వృత్తి ప్రారంభించారు. మూడు సంవత్సరాలు అక్కడ పని చేసి ఆ తర్వాత జమ్ములమడుగు క్యాంప్ బెల్ హాస్పిటల్లో 6 సంవత్సరాలు పనిచేశారు. తర్వాత ఆరోగ్యవరం(ఎంసిసి)కి వచ్చారు.
మదనపల్లిలో యూనియన్ మిషన్ ట్యూబర్క్ లోసిస్ శానటోరియం 1915లో మొదలయింది. అప్పటి గవర్నర్ లార్డ్ పెంట్ ల్యాండ్ దీనిని ప్రారంభించారు. డాక్టర్ క్రిష్టియన్ ప్రిమోట్ మోలర్ మొదటి సూపరిరింటెండెంట్. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ క్షయ నివారణ కేంద్రంగా పేరొందింది.నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కూడా ఈ కేంద్రాన్ని సందర్శించారు.
1990 ఫిబ్రవరిలో ఆరోగ్యంవరం మెడికల్ సెంటర్ బాధ్యతలను డాక్టర్ వెస్లీ స్వీకరించారు. ఇధి సేవా నిరతిని, వృత్తి నైపుణ్యాన్ని వచ్చిన గుర్తింపు, ఈ పదవీబాధ్యతలు చేపట్టి సరిగ్గా 30 సంవత్సరాలుగా అవుతూ ఉంది.
అభివృద్ధి పధంలో ఎఎంసి
తన పదవీ కాలంలో ఏఎంసిని అభివృద్ధి చేయడానికి కృషి చేశామని, 350 పడకలున్న ఈ వైద్యశాలలో ప్రస్తుతం 200కు పైగా సిబ్బంది పనిచేస్తున్నారని, ఇక్కడ నర్సింగ్ కళాశాల, కొన్ని సర్టిఫికెట్ కోర్సులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం క్షయ వ్యాధికి కాకుండా అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందిస్తున్నామని, శస్త్ర చికిత్సలు చేయడంతో పాటు , మాతాశిశు సంరక్షణ కార్యక్రమాలు చేపడతామని ఆయన చెప్పారు.
కోవిద్-19 తో పాటు అనేక వ్యాధులపై అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయం తో కలసి రీసెర్చి ప్రోగ్రాం చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఇంతవరకు ఈ వైద్యశాల నిర్వహణకు అన్ని రకాల సహాయ సహకారాలందించి, వెన్నుదన్నుగా నిలచిన దాతలకు, ప్రభుత్వ సంస్థలకు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.