ప్రభుత్వ సలహాదారుల్లో బడుగుబలహీనవర్గాల వారేరీ?
రూ.2 వేలు 3వేలు జీతాలు తీసుకునే పదవులకు 50% రిజర్వేషన్లు, క్యాబినెట్ ర్యాంకు పదవులన్నీ ఒకే కులానికా?
(డోలా బాల వీరాంజనేయ స్వామి, శాసన సభ్యులు,కొండెపి)
దళితులపై అడుగడుగునా వివక్ష చూపిస్తూ దళిత వ్యతిరేకిగా జగన్మోహన్ రెడ్డి మారారు.
ప్రభుత్వ సలహాదారులుగా వందల మందిని నియమిస్తున్న జగన్ రెడ్డి దళితులకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు.?
దళితుల్లో విద్యావంతులు లేరా.? మేధావులు లేరా.? ఉన్నత స్థానాల్లో పని చేసిన వారు లేరా.? లేక దళితుల సలహాలు తీసుకోవాల్సిన అవసరం మాకు లేదని భావిస్తున్నారా.?
దళితుల్లో అర్హులు లేరంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి దళిత సమాజాన్ని అవమానించారు. ఇప్పుడు దళితులకు అవకాశాలు కల్పించకుండా అడుగడుగునా దగా చేస్తున్నారు.
నామినేటెడ్ పదవుల్లో బడుగు బలహీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రకటించి ప్రభుత్వ సలహాదార్లలో ఎంత మంది దళితులకు అవకాశం ఇచ్చారు?
రూ.2వేలు, రూ.3వేలు జీతాలొచ్చే వాలంటీర్ల వంటి ఉద్యోగాలను బడుగు బలహీన వర్గాలకు ఇచ్చి.. లక్షల్లో వేతనాలు, కేబినెట్ హోదా, ప్రభుత్వ వాహనాలు, ప్రభుత్వ నివాసం అందే పదవులను సొంత సామాజిక వర్గానికి కేటాయించడం దళిత ద్రోహం కాదా..?
సలహాదార్ల విషయంలో రిజర్వేషన్ ప్రతిపాదనను పాటించకపోవడం వంచన కాదా.? రాష్ట్ర సరిహద్దులు కూడా తెలియని వ్యక్తుల్ని సలహాదర్లుగా, కేబినెట్ హోదాల్లో నియమించడం అత్యంత హేయం.
సామాజికవర్గం చూసి కట్టబెడుతూ మళ్లీ రిజర్వేషన్లు అంటూ చట్టాలు చేయడం, ప్రగల్భాలు పలకడం దళితులను అవమానించడం కాదా.? మీరు చేసే చట్టాన్ని మీరే అమలు చేయనపుడు అలాంటి చట్టం ఎందుకు.?
గతంలో ఒకరిద్దరు సలహాదార్లకు మాత్రమే కేబినెట్ ర్యాంకు ఉండేది. కానీ.. ఇప్పుడు ఒకే విభాగం నుండి పది మంది సలహాదారులు, వారందరికీ కేబినెట్ ర్యాంకులు, లక్షల్లో వేతనాలు ప్రజల సొమ్ము దుబారా చేస్తున్నారు. ఇదెక్కడి సలహాదార్ల వ్యవస్థ.? ఇదెక్కడి ప్రభుత్వ పాలన.?
సలహాదార్ల వ్యవస్థ సలహాలు ఇవ్వడం కోసమా.. లేక ముఖ్యమంత్రి కోసమో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా ప్రభుత్వ వ్యవస్థలను మారుస్తూ.. ప్రజాస్వామ్య విలువలను దిగజారుస్తున్నారు.
బంధుప్రీతి, కుల ప్రీతి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ.. దాన్ని ప్రజలపై రుద్దడం, మిగిలిన సామాజికవర్గాలను వంచించడం, ప్రజా ధనాన్ని దుర్వినియోగం అత్యంత హేయమని జగన్ రెడ్డి తెలుసుకోవాలి. కుల, మతాలకు అతీతంగా పాలిస్తానంటూ ప్రమాణ స్వీకారం చేసి. ఒక కులానికి ప్రాధాన్యం కల్పిస్తూ.. మిగిలిన వారిని వంచించడం దుర్మార్గం. ఇప్పటికైనా జగన్ రెడ్డీ కుల పిచ్చి తగ్గించుకోండి. అన్ని సామాజిక వర్గాలను సమానంగా చూడడం నేర్చుకోండి. లేకుంటే ఓట్లేసి గెలిపించిన దళితులు రేపు నిట్టనిలువునా ముంచడం ఖాయమని గుర్తుంచుకోండి.