నేటి ట్రెకింగ్: చంద్రగిరి కొండ మీద ఉరికంబం

తిరుపతి కొండపై ఎగువతిప్పయిన్ విలసిల్లు
వేంకటేశ్వరుడి గుడిగంట
చంద్రగిరిపై హవణిల్లెడు రామదేవుడి
బంగారు జయగంట!
ఒక్కపరి ఖంగు ఖంగున మోగుచుండునంటయా
సిరి రఘనాథ యాచమ విశిష్ట
బహూకృతిరంట ఱేనికిన్!! (అమ్మిశెట్టి లక్ష్మణయ్య)
చంద్రగిరి దుర్గం మీద ఉరికంబంగా పిలిచే గుమ్మం ఒకటుంది. రాజుల కాలంలో అందరూ చూస్తుండగా నేరస్తులను  బహిరంగంగా ఉరితీసేవారని, ఇది దాని చారిత్రక అవశేషమని ప్రజల్లో ప్రచారం లో ఉంది.
నిజానికి ఉరికంబం కాదు. గంటా గుండు. ఈ కాలపు మాటల్లో చెప్పాలంటే కాలింగ్ బెల్.
చంద్రగిరి మహారాజు రామదేవరాయలు తిరుమల వెంకటేశ్వరుని పరమ భక్తుడు. శ్రీ స్వామివారికి నైవేద్యం పెట్టాక గాని ఆయన భోజనం చేసే వాడు కాదు. ఇక్కడికి సమీపంలోని వెంకటగిరిని పాలించే సామంత ప్రభువు పేరు రఘనాథయాచమ నాయకుడు. మహారాజు కోసం తిరుమల మార్గంలో అవ్వాచారి కోన కొండకొమ్మున ఒక మండపం కట్టిదానికి పెద్ద గంటను వేలాడదీశాడు. అదే విధంగా చంద్రగిరి కోటలో మరోక బంగారు గంట ఉండేది. తిరుమలలో  శ్రీవారికి నైవేద్యం పెట్టాక గంటమోగిస్తారు. దీని ప్రభావంతో అవ్వాచారి కొండకొమ్మున ఉండే గంట కూడా మోగేది. ఈ శబ్దతరంగాలు పడమటవైపున చంద్రగిరి కోట దాకా ప్రయాణించి అక్కడి రాజమహల్ లో ఉన్న బంగారు గంటను తాకి ఖంగున మోగించేవి. ఇది రాజుగారికి కాలింగ్ బెల్. ఈ గంటనాదం విని తిరుమల దేవుడికి నైవేద్యం అయిందని భావించి రామదేవరాయుడు భోజనానికి కూర్చునేవాడు.  ఇది కూడా జన శృతియే.
ఇక్కడి ట్రెకింగ్ ఆహ్లాదరకంగా ఉంటుంది. పూతలపట్టు-నాయుడు పేట జాతీయ రహదారి మీద వెళ్లుతుంటే ఈ గుమ్మం కనిపిస్తుంది. తిరుపతి నుంచి చంద్రగరి పట్టణం చేరుకుని, అక్కడి నుంచి ఉరికంబం దగ్గిరకు ట్రెకింగ్ చేసుకుంటూ వెళ్లవచ్చు.

pictures: Bhooman, Tirupati