(CS Saleem Basha)
తెలుగు సినిమా చరిత్రలో ఒక వినూత్న, విశిష్టమైన, తనకే ప్రత్యేకమైన పంథాతో ఆణిముత్యం లాంటి సినిమాలు తీసిన దర్శకుడు ” ఆదుర్తి సుబ్బారావు”.
ఆయన సినిమా జీవితం మొత్తం ఎంతో వైవిధ్య భరితం! ఎన్ని సినిమాలు తీశాడు అని కాదు, ఎలా తీశాడు అన్నది దర్శకుడికి ముఖ్యం అనుకుంటే మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన పేరు ఆదుర్తి సుబ్బారావు . “రాసి కన్నా వాసి ముఖ్యం” అని అనుకున్నా కూడా ఆయన పేరే చెప్పుకోవాలి.
ఆయన సినీ జీవిత ప్రారంభమే చిత్రంగా జరిగింది. బొంబాయి సెయింట్ జేవియర్స్ కళాశాలలో పోటోగ్రఫీ చదివి, ఎడిటర్ గా సినిమాల్లోకి అడుగు పెట్టి, డైరెక్టర్ గా మారి, ప్రొడ్యూసర్ గా సినిమాలు తీసిన ఆదుర్తి సుబ్బారావు, తెలుగు ప్రేక్షకులు చిరకాలం గుర్తుపెట్టుకోదగ్గ సినిమాలు తీశాడు. తన సినిమాలకు జాతీయ స్థాయిలో ఏడు సార్లు ( 6 తెలుగు, 1 తమిళ్ )రాష్ట్రస్థాయిలో మూడు సార్లు(నంది అవార్డులు) అవార్డులు పొందిన ఏకైక తెలుగు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు!
ఫోటోగ్రఫీ కోర్సు పూర్తయిన తర్వాత, ముంబైలో Dina narvekar దగ్గర ఎడిటింగ్ కి సహాయకుడిగా చేరాడు. 1948 లో ఉదయ శంకర్ ” కల్పన” ఈ సినిమాతో అసిస్టెంట్ గా సినీ జీవితాన్ని మొదలుపెట్టిన ఆదుర్తి సుబ్బారావు, తెలుగు సినిమా రంగంలో “బాలానందం” సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు.
తర్వాత దర్శకుడిగా “అమర సందేశం” అనే సినిమా తీసినా, 1957 తీసిన ” తోడికోడళ్ళు” సినిమా ద్వారా తనేంటో సినీ రంగానికి తెలియపరిచాడు. ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి షూటింగ్ చేయడం జరిగింది. తెలుగు తమిళ్ లో కొంతమంది యాక్టర్స్ ఒక్కరే కావడం విశేషం. ఈ సినిమాకి ఎడిటింగ్, స్క్రీన్ ప్లే కూడా ఆదుర్తి సుబ్బారావే . రెండు భాషల్లో సినిమాలు హిట్ అయ్యాయి .
బెంగాలీ నవల ” అగ్నిపరీక్ష” ఆధారంగా 1959 తెలుగు(మాంగల్య బలం) తమిళ్లో(మంజల్ మహిమార్)తీసిన రెండు సినిమాలు హిట్ అయ్యాయి. మాంగల్యబలం సినిమా జాతీయ స్థాయిలో అవార్డు, ఫిలిం ఫేర్ ఉత్తమ చిత్రం అవార్డు వచ్చాయి. ఈ సినిమాకు రచయిత కూడా ఆయనే.
ఎన్నో అపురూప చిత్రాలు మనకు అందించిన ఆదుర్తి సుబ్బారావు జీవితంలో మనకు తెలియని ఎన్నో విశేషాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
** ఫోటోగ్రఫీ కోర్సు చేసినప్పటికీ ఆయన తన సినిమాలకు ఫోటోగ్రాఫర్ గా పని చేయలేదు
** తెలుగులో కేవలం ఒక్క సినిమాకు మాత్రమే అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు
** ఎప్పుడు వైవిధ్యంగా సినిమాలు తీయాలని ప్రయత్నం చేసేవాడు. అంతవరకూ ద్విపాత్రాభినయం చెయ్యని నాగేశ్వరరావుతో ” ఇద్దరు మిత్రులు” చేశాడు. అది సూపర్ హిట్ అయింది
** అది వరకు రొటీన్ ప్రేమ కథలు వచ్చేవి. అందుకు భిన్నంగా Platonic love ( మూగ ప్రేమ అనొచ్చు) నేపథ్యంలో తీసిన మూగమనసులు (1964) సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ
సినిమా క్లైమాక్స్ లో సుడిగుండాలు గోదావరి నదిలో గుంత తవ్వి సుడిగుండాలు సృష్టించడం ఆయనకే చెల్లింది.( తర్వాత అక్కినేని నాగేశ్వరావు సహా నిర్మాతగా ” సుడిగుండాలు”(1967) తీయడం విశేషం. ఆ సినిమాకి జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు వచ్చింది. సినిమా అంతగా బాగా ఆడలేదు అది వేరే విషయం. కానీ అదే సినిమాను తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శిస్తే బాగా డబ్బులు వచ్చి ఆ విధంగా లాస్ కవర్ అయిపోయింది.
** తేనె మనసులు సినిమా ద్వారా సూపర్ స్టార్ కృష్ణ ను సినీరంగానికి పరిచయం చేశాడు. మళ్లీ ఆయనతోనే మాయదారి మల్లిగాడు సినిమా తీసి సూపర్ హిట్ చేశాడు. ఆ సినిమా 20 సెంటర్లలో 50 రోజులు, అదే సెంటర్లలో నూరు రోజులు ఆడడం విశేషం. అప్పటివరకు కౌబాయ్ సినిమా ల తో ఫేమస్ అయిన కృష్ణ తో ఇలాంటి సినిమా తీయడం ఆయనకే చెల్లింది
** ఒక ఎద్దు నేపథ్యంలో నమ్మినబంటు సినిమా తీశాడు. ఆ సినిమా తో సహా పాటలు కూడా సూపర్ హిట్
** ఆయన తన సినిమాలో పాటల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించే వాడు. మంచి మనసులు సినిమా పాటల కోసం రచయిత ఆత్రేయ తో పాటు హంపి కి వెళ్లి కూర్చుని పాటలు రాయించుకున్నాడు. పాటలు కూడా ఎలా అంటే అలా ఉండేవి కావు. సందర్భోచితంగా ఉండేవి. ఏ సీన్ కి ఏ పాట కావాలో ఆయనకు బాగా తెలుసు. సందర్భాన్ని బట్టి పాటలు పెట్టడం ఆయనకి తెలిసిన విద్య. ఈ రచయిత తో ఎటువంటి పాట రాయించాలో ఆయనకు బాగా తెలుసు. కరుణరసం కావాలంటే దాశరథి తో, సిచువేషన్ కు తగినట్టు పాట రావాలంటే కొసరాజుతో, ఇతర పాటలు ఆత్రేయతో రాయించుకునే వాడు.
** హీరోల కోసం ప్రత్యేకంగా పాటలు పెట్టేవాడు కాదు. పూలరంగడు సినిమా కోసం ఒక అందమైన గీతాన్ని( “చిగురులు వేసిన కలలన్నీ”) శోభన్ బాబుకు పెట్టాడు. నాగేశ్వరరావు కాదు. కెబికె మోహన్ రాజు పాడిన ఈ పాట ఎంత పాపులర్ అయిందో చెప్పనవసరంలేదు.
** ఆర్టిస్టులకు ఆయన చాలా ఫ్రీడం ఇచ్చేవాడు. మూగమనసులు సినిమా లో సావిత్రితో ” నువ్వు ఎంత టైం అయినా తీసుకో, కానీ బాగా ఏడ్చు” అని చెప్పాడు. ఆమె ఏడవటం నేచురల్ గా ఉండడం కోసం అంత తపన పడ్డాడు. తర్వాత సావిత్రి చాలా సహజంగా ఏడవటం వల్ల ఆ సీన్ పండింది.
** సినిమా ఎడిటింగ్ చేసేటప్పుడు రీలు చేతుల్లో పెట్టుకొని, “ఇంతవరకు చాలు” అని చేతితో అక్కడిదాకా చించేయడం ఆయనకే చెల్లింది! కే.విశ్వనాథ్ కూడా అలాగే చేసేవాడట
** తేనె మనసులు సినిమా కోసం హేమమాలిని సెలక్షన్స్ కు వస్తే ” నువ్వు అందంగా ఉన్నావు కానీ నటనకు పనికిరావు” అని రిజెక్ట్ చేశాడు. అదొక్కటే ఆయన చేసిన పొరపాటు!
ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్,నటుడు కృష్ణ ఆయనకు శిష్యులు. కృష్ణ ఆయన జీవిత చరిత్రను వెలువరించాడు. 1975 లో తన చివరి సినిమా “మహాకవి క్షేత్రయ్య” మధ్యలోనే ఆయన చనిపోయినా(అక్టోబర్ 1, 1975) డైరెక్టర్ సి.ఎస్.రావు దాన్ని పూర్తి చేశాడు. దానికి కూడా నంది అవార్డు రావడం విశేషం! ఎన్నో అపురూపమైన ఆణిముత్యాలు తీసిన ఆదుర్తి సుబ్బారావు, నిజంగానే ఒక అరుదైన దర్శకుడు.
(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)