(Ahmed Sheriff)
ఫోర్డు ఆడిటోరియం – డెట్రాయిట్, అమెరికా, – 1976 ఆగస్టు 26, ముఖేష్, లతామమంగేష్కర్ ల కచేరి.
ఇది నా జీవితపు మొట్ట మొడటి పాట అంటూ అతడు పాడటం మొదలెట్టాడు “దిల్ జల్ త హై తొ జల్నే దో”
పాట అయిపోగానే ఆడిటోరియం చప్పట్లతో మారు మోగింది .
ఆ తరువాత, కొద్ది గంటల లోపే ఆ సమ్మోహన స్వరం శాశ్వతంగా మూగపోయింది.
ముఖేష్ చంద్ మాథుర్, ప్రజలందరి “ముకేష్” గుండె నొప్పితో ఆ కచేరి తరువాత డెట్రాయిట్ లోనే చివరి శ్వాస తీసుకున్నాడు. అతడి భౌతిక కాయాన్ని, లతా మంగేష్కర్ భారత దేశానికి తీసుకు వచ్చింది. తమ షో లో అయన మరణం గురించి మాట్లాడుతూ ఒక వీడియో లో ఆమె,
“ఆ చివరి షో లో ఆయన జీవితపు మొదటి పాట, ఆయన జీవితపు చివరి పాట గా మారింది” అంది.
“హం చోడ్ చలే హై మహ ఫిల్ కో యాద్ ఆయే కభీ తో మత్ రోనా“(నేను జన సమ్మేళనాన్ని వీడి వెళుతున్నాను. ఎప్పుడైనా గుర్తు కు వస్తే ఏడవకు.)
జీ చాహతా హై చిత్రానికి కళ్యాన్ జీ అనంద్ జీ ద్వయం సంగీతం సమకూర్చిన ఈ పాట, అతడి అభిమానుల్లో తన ఉనికిని శాశ్వతంగా ప్రతిష్టించే వీడ్కోలు సందేశం అయింది.
ముఖేష్ గొంతుక ప్రత్యేకంగా వుంటుంది. తన తోటి గాయకుల గళాలతో పోలిస్తే అతడి గొంతు కచ్చితంగా “ఆడ్ మాన్ ఔట్” గా నిలబడుతుంది. ఈ ప్రత్యేకత అతడి అభిమానుల్ని నిలదీసి సమ్మోహన పరిచే “మాయ” గా మారింది.
60, 70, 80 దశకాలను సినీ సంగీత ప్రపంచపు స్వర్ణయుగంగా వర్ణిస్తారు అందరూ. ఈ సమయలో హిందీ సినీ సంగీతంలో మేల్ ప్లేబాక్ గాయకులు మహమ్మద్ రఫీ, ముకేష్, కిశోర్ కుమార్, మన్నాడే.
వీరిలో ఎవరు గొప్ప అని నన్నెవరైనా అడిగితే, నేను దాన్నొక అర్థం లేని ప్రశ్న అంటాను. అలా కాక ఎవరైనా నన్ను వీరందిరిలో నీకెవరంటే ఇష్టం అని అడిగితే నిస్సంకోచంగా “ముఖేష్” అని జవాబిస్తాను.
ముఖేష్ పాటల్లో ఒక రకమైన విలక్షణత వుంది. ఆ పాటలు ఆవేదనను పంచుతున్నట్లు ఉంటాయి, లేదా దుఖాన్ని ఎలా అధిగమించాలో చెబుతునట్లు వుంటాయి. మొత్తానికి ముకేష్ పాటల చుట్టు ఆరొగ్యకరమైన ఆవేదన అయితే వుంటుంది. ఆ ఆవేదనను మనం కూడా గుండెలకు హత్తు కుని స్వంతం చేసుకోవాలనే తపన కలిగిస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే ఆయన పాటలు మనం కావాలని కోరుకునే బాధ. విచిత్ర మేమిటంటే, ముకేష్ కి కూడా ఇలాంటి పాటలంటేనే ఇష్టం. . బి.బి. సి హిందీ చానెల్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ముకేష్ “నాకు పది లైట్ పాటలు, ఒక సాడ్ సాంగ్ ఇస్తే, నేను పది లైట్ పాటల్ని వదిలేసి ఒక్క శాడ్ సాంగ్ నే ఎంచుకుంటాను” అన్నాడు.
ముఖేష్ 1923 వ సంవత్సరం జూలై 22 న ఢిల్లీ లో మాథుర్ కాయస్త కుటుంబం లో పుట్టాడు. తండ్రి జోరావర్ చంద్ మాథుర్, తల్లి చంద్రాణి మాథుర్. చిన్న తనం లో తన సోదరికి జరిగే సంగీత పాఠాల్ని పక్క గదిలోనించి వినే వాడుట ముకేష్. ఆ రకంగా అతడిలో సంగీతం పట్ల ఆసక్తి పెరిగి వుండ వచ్చు.
పదవ తరగతి తరువాత ముకేష్ ఢిల్లీ లోనే పి. డబ్ల్యూ.డి డిపార్ట్ మెంట్ లో ఉద్యోగి గా చేరాడు. అప్పట్లో అతడు, సంగీత వాద్యాలతో, పాటల రికార్డింగుల తో ప్రయోగాలు చేసే వాడు.. . మొదట్లో ముకేష్ కొంతకాలం నటుడిగా, నిర్మాత గా సినిమాల్లో ప్రయత్నించాడు. రెండు మూడు చిత్రాల్లో నటించాడు కూడ. అయితే ఈ క్షేత్రం అతనికి అచ్చి రాలేదు. తిరిగి గాయకుడిగా స్థిర పడ్డాడు.
చెప్పాలంటే ముఖేష్ అందగాడు. బి.బి.సీ. హిందీ వాళ్లు ఒక ఇంటర్వూ లో ఈ విషయాన్ని ప్రస్తావించి “నువ్వు సినిమాల్లో నటుడిగా ఎందుకు ప్రయత్నం చేయకూడదు?” అంటే “చేశానుగా” అని నవ్వేశాడు ముఖేష్.
నటుడు, గాయకుడు మోతీలాల్ ముఖేష్ కు దూరపు బంధువు. ఆయన ముకేష్ తన సోదరి పెళ్లిలో పాడిన పాట విని, ముఖేష్ లో మంచి గాయకుడున్నట్లు గమనించి, ముంబై తీసుకెళ్లి పండిత్ జగన్నాథ్ ప్రసాద్ దగ్గర సంగీతం నేర్చు కునే ఏర్పాటు చేశాడు. ఈ సమయం లోనే ముకేష్ కి “నిర్దోష్” (1941) అనే సినిమాలో గాయక, నటుడిగా అవకాశం వచ్చింది.
తన పాటలు తనే పాడుకునే మోతీలాల్ 1945 లో తనకు ప్లేబాక్ పాడటానికి ముఖేష్ కు అవకాశం ఇచ్చాడు.” పహలి నజర్” అనే ఆ చిత్రం లో ముకేష్ తన మొట్టమొదటి ప్లేబాక్ పాట “దిల్ జల్ త హై తొ జల్నే దో” ను పాడాడు.
అయితే ఈ సినిమా విడుదల కు ముందు ముఖేష్ దీని నిర్మాత మజహర్ ఖాన్ ను కలవడం జరిగింది. దరిమిలా మజహర్ ఖాన్ ముఖేష్ ఈ పాటను సినిమాలోంచి తొలగిస్తూ వుండటం చూసిన ముఖేష్ పాటను ఎందుకు తొలగిస్తున్నారని అడిగాడు. ఆపుడు మజహర్ ఖాన్ మోతీ లాల్ కి ఈ పాట సూట్ అవ్వదు, అతడు చేసే రోల్సు హుషారు గొలి పేవి గా వుంటాయి. ఈ పాటేమో బోరింగు గానూ, సాగదీసేది గానూ వుంది అన్నాడు. అప్పుడు ముఖేష్ ఆ పాటను తీయొద్దని చెప్పి బతిమాలుకున్నాడు. చాలా తర్జన భర్జన తరువాత ఆ పాటను ఒక వారం సినిమాలో వుంచడానికి ఒప్పుకున్నాడు మజహర్ ఖాన్. నడిస్తే ఓకె. లేక పోతే అప్పుడు తీసేస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని ముఖేషే స్వయంగా బి.బి.సి. హిందీ ఇంటర్వూ లో చెప్పాడు. (ఈ ఇంటర్వూ వీడియో అంతర్జాలం లో వుంది).
ఆ తరువాత ఈ పాట ఒక చరిత్ర సృష్టించడం అందరికీ తెలిసిన విషయమే.
మొదట్లో ముఖేష్ మీద అలనాటి మేటి గాయకుడు కె.ఎల్.సైగల్ ప్రభావం చాలా వుండేది. ముకేష్ కె. ఎల్. సైగల్ కు వీరాభిమాని. ముకేష్ మొదటి పాట “దిల్ జల్త హై తో జల్నేదో అచ్చు కె.ఎల్. సైగల్ పాడినట్లే వుంటుంది.
అయితే అప్పటి మేటి సంగీత దర్శకుడు నౌషాద్ ముఖేష్ ను కలిసి నువ్వు ఎవరినీ అనుకరించకు. నీకంటు ఒక మంచి గొంతు వుంది. ప్రక్రుతి సిధ్ధమైన ఆ గొంతుక తోనే పాడు అని ప్రభొదించాడుట. అలా నౌషాద్ ముకేష్ ప్రత్యేక స్వరాన్ని వెలికి తీయడం లో సహాయ పడ్డాడు. ముఖేష్ తో మేలా చిత్రం లో దిలీప్ కుమార్ కు ప్లేబాక్ గా “గాయె జ గీత్ మిలన్ కె తు అపుని లగన్ కె సజన్ ఘర్ జానా” పాట (పైన) పాడించాడు. ముఖేష్ అనుకరణ లేకుండా తన స్వీయ గళం తో పాడిన ఈ పాట సూపర్ హిట్ అయింది. విచిత్రంగా మొదట్లో, దిలీప్ కుమార్ కు ముకేష్ గాత్రాన్ని ఇస్తే, రాజ్ కపూర్ కి రఫీ ప్లే బాక్ పాడే వాడు.
ముఖేష్ తోటి గాయకులతో, గాయనీ మణులతో మంచి సంబంధాలు కలిగి వుండే వాడు. ముఖేష్, రఫీ ఒకరినొకరు చాలా ఇష్ట పడే వారు. తంకు నచ్చిన ఏదయినా ఒక మంచి పాట పాడినపుడు ముకేష్ రఫీ కి ఫొను చేసి మరీ చెప్పేవాడుట “ఈ పాట చాలా బాగా పాడావు” అని. ఆ స్నేహ బంధం వల్లే ముకేష్ అంతిమ యాత్రలో పాల్గొనడానికి రఫీ (అప్పుడు హాస్పిటల్ లో వున్నాడు) హాస్పిటల్ నుంచి దొంగతనంగా జారుకుని మిత్రుడి చివరి చూపుకి చేరుకున్నాడట. లతా ముకేష్ ల అనుబంధం కూడా గొప్పగా వుండేది. ముకేష్ కంటే చిన్నదయిన లతా ముకేష్ ని భయ్యా అని పిలిచేది. ముకేష్ లతా ని దీదీ అని పిలిచే వాడు. ముకేష్ కి అహంభావం ఏ మాత్రం వుండేది కాదు. తన కుమారుడు నితిన్ ముకేష్ తనను అనుకరించి పాడు తున్నాడని తెలిసి, ” నేను నా లాగా ఎలాగూ పాడుతున్నాను. నువ్వు కూడా నాలా పాడకు. రఫీ లా పాడు అని చెప్పాడుట. ఈ విషయం ఓ ఇంటర్వూ లో స్వయంగా నితిన్ ముఖేషే చెప్పాడు.
ఒక పాటలోని పదాలూ, పదార్థాలూ, పాడే వారి గొంతుక, పాట కు చేసిన స్వర కల్పన, – వీటిమధ్య సమన్వయం కుదిరినప్పుడే పాట అందం ఇనుమడిస్తుంది, అది ఒక గొప్ప పాట గా నిలిచిపోతుంది. ఎలా కుదిరేవో ఈ విషయాలన్నీ. ముఖేష్ ప్రతీ పాట విన సొంపయిన పాట గానే వుంది.
ప్రతి సంగీత దర్శకుడికీ తన దంటూ ఒక ప్రత్యేకమైన శైలి వుంటుంది. ఈ శైలి వల్లే మనం ఒక పాట విన్నప్పుడు దాని స్వర కర్త ఎవరో ఊహించ గలం. ప్రతి గాయకుడు వేర్వేరు సంగీత దర్శకులు స్వర పరిచిన పాటలు పాడినప్పుడు, వేర్వేరు శైలుల పాటలు వస్తాయి. అయితే ఈ సిధ్ధాంతం ఒక్క ముకేష్ విషయంలో మాత్రం వర్తించదు. ఒక రకంగా చెప్పాలంటే ముకేష్ పాటల విషయం లో దీనికి విరుధ్ధంగా జరుగుతుంది. అంటే వేర్వేరు సంగీత దర్శకులు స్వర పరిచినా, ముకేష్ పాడే పాటలు అన్నీ ఒకే శైలి లో వున్నట్లు, ఒకే సంగీత దర్శకుడు స్వర పరిచినట్లు వుంటాయి. ఇదెలా జరుగుతుందో తెలీదు.
ఈ విలక్షణమైన స్వభావం సంగీత దర్శకులని ఏమార్చేదేమో, వాళ్లు ముకేష్ పాటలకు తయారు చేసే బాణీలు తమలో తాము కూడబలుక్కున్నట్లు గా ముకేష్ పాటల శైలి లో ఇంకి పోయెవి. ఈ విలక్షణ స్వభావాన్ని ఈ క్రింది పాటల్లో గమనించ వచ్చు.
“సుహానీ చాంద్ నీ రాతే హమే సోనే నహీ దేతీ ” అనే పాట “ముక్తి” సినిమాలోది. పాట బావుంటుందని వినే వాణ్ణి. ఒక రోజు నా పాటల అభిరుచి తెలిసిన నా మిత్రుడొకడు దీనికి సంగీతం ఎవరో తెలుసా? అని అడిగాడు. నేను వూహించి చెప్పిన సంగీత దర్శకుల పేర్లలో ఈ పాట స్వర కర్త పేరు తప్ప అందరి పేర్లూ వచ్చాయి. దీనికి సంగీతం ఆర్.డీ. బర్మన్ అంటే నమ్మలేక పోయాను. ఫాస్ట్ రిథం తో జలపాతాల్లా పరిగెత్తే పాటలు స్వరపరిచే ఆర్. డి. బర్మన్ ఈ పాటలో ఒక నిండైన కోనేటి లోతుల్ని స్పృశించాడు. ఈ పాట విన్న తరువాత దీనికి ఈ ట్యూన్ తప్ప మరోటి వుహించ లేము. దీనిలో పియానో మ్యూజిక్ హైలైట్ .
నన్ను ఆశ్చర్య పరిచిన మరో పాట “సంబంధ్” సినిమాలోని “చల్ అకేలా చల్ అకేలా” అనే పాట. దీని స్వరకర్త ఓ.పి.నయ్యర్. ఇప్పటికీ నమ్మలేను. ప్రతి సంగీత దర్శకుడికీ, తనదంటు ఒక శైలి వుంటుందని తెలుసు. ఈ విషయం లో ఓ.పి.నయ్యర్ మరీ ప్రత్యేకం. ఆయన పాటల్లోని స్వరం, రిథం, ఎంత ప్రత్యేకంగా వుంటాయంటే ఒక్క సారి ఆయన పాట ఒకటి వింటే వంద పాటల్లో ఆయన స్వర పరిచిన పాటని గుర్తు పట్టొచ్చు. అయితే ఈ పాట విని, ముందు తెలీక పోతే, మనం దీని స్వర కర్త గా ఓ.పి.నయ్యర్ అని వూహించి వుడే వాళ్లమా చెప్పండి ? ఈ పాట సంగీతం లో గిటార్ బిట్ల ను గమనించండి.
కల్యాణ్ జీ ఆనంద్ జీ “ఛలియా” చిత్రం కోసం స్వర పరిచిన “మేరె టూఠె హుయే దిల్ సే కొయి తో ఆజ్ యే పూఛె”
సంగీత దర్శకులు శంకర్ జైకిషన్ లు స్వర పరిచిన “ఆషిక్” చిత్రం లో ని “తుం జో హమారె మీత్ న హోతే, గీత్ యె మెరె గీత్ న హోతే”
“సాథి” చిత్రం కోసం నౌషాద్ స్వర పర్చిన “జొ చలా గయా ఉసె భూల్ జా” పాటల శైలి దాదాపూ ఒకటి గా అనిపిస్తుంది.
చెప్పోచ్చే దేమిటంటే, ఇది ముఖేష్ పాడే పాట అని సంగీత దర్శకుల మదిలో వుండి పోయిన భావం అంతర్లీనంగా ఆ పాట స్వరాన్ని ప్రభావితం చేస్తుందేమో . అలాగే దాని తో పాటు వచ్చే సంగీతమూ, సంగీత వాద్యాల ఎంపిక కూడా ఈ ప్రభావానికి లోనవుతాయేమో ? అనిపిస్తుంది.
దీని తరువాత చెప్పుకో తగ్గది ముకేష్ పాటల్లోని పలుకులు. నిస్సందేహంగా ముకేష్ పాడిన పాటల లిరిక్సు చాలా హుందాగా, సంపన్నంగా వుంటాయి. ఇది కూడా ఇంతకు ముందు లాగా ముకేష్ ప్రభావమేనేమో.ముకేష్ కోసం పాటలు రాసే రచయితలు వాడే పదాలు ప్రత్యేకంగా వుండటమే కాకుండా మనసులో నాటుకు పోయి పాట గొప్ప దనాన్ని మరింత ఇనుమడింప చేసేవిగా వుంటాయి.
“చాంద్ ఆహే భరేగా, ఫూలు దిల్ థాము లేంగే, హుస్ను కీ బాత్ చలీ తొ, సబ్ తెరా నాము లేంగె”.
(చంద్రుడు నిట్టూరుస్తాడు, పువ్వులు గుండెలు పట్టుకుంటాయి, సౌందర్యం గురించిన ప్రస్తావన వస్తే, అందరూ నీ పేరే తీసుకుంటారు)
“ఫూల్ బనే అంగారే” చిత్రం లో కళ్యాంజీ ఆనంద్ జీ స్వర పర్చిన ఈ పాట ను ఆనంద్ బక్షీ రాశాడు. రాజ్ కుమార్ (రాజ్ కపూర్ కాదు) మాలా సిన్ హ అభినయించిన ఈ పాట ముకేష్ గొంతు ద్వారా ప్రియురాలి సౌందర్య వర్ణనకీ, ప్రేమ స్వరూపానికి పరాకాష్ట.
“ఆ అబు లౌటు చలే… నైను బిఛాయే,… బాహే పసారే… తుఝుకో పుకారే దేశ్ తెరా”
(రా ఇక వెనక్కి వెళదాం, నయనాలు పరిచి, బాహువులు చాచి, నిన్ను పిలుస్తోంది నీ దేశం) “జిస్ దేష్ మె గంగా బహతీ హై చిత్రానికి” శంకర్ జైకిషన్ సంగీతం లో శైలేంద్ర రాసిన ఈ పాట విని దేశం కోసం వెనక్కి రాని మనిషి వుంటాడా?
“తారొ సె ప్యారే , దిల్ కె ఇషారె , ప్యాసే హై అర్మా ,ఆమెరె ప్యారే ఆనహి హొగ తుఝె, ఆనహి హొగా, ఆనాహి హోగా”
(తారల కన్న ప్రియమైన, హృదయపు సైగలు, దప్పిక గొని వున్న కోరికలు, రా నా ప్రియతమా నువ్వు తప్పక రావలసి వుంటుంది, రావలసి వుంటుంది, రావలసి వుంటుంది. )
“దీవానా” చిత్రానికి శంకర్ జైకిషన్ సంగీతం లో హస్రత్ జైపురి రాసిన ఈ పాట ప్రేమ తో ఆహ్వానించే భావనని అందలం ఎక్కిస్తుంది. మనస్సును ప్రశాంతంగా వుంచుకుని కళ్లుమూసుకుని ఈ పాట వింటే పాల పుంతలూ, పగడపు చెట్లూ కనిపిస్తాయి.
ఇలా రాస్తూ పోతే రాస్తూనే వుండాల్సి వస్తుంది.
ముఖేష్ శంకర్ జైకిషన్ సంగీత దర్శకత్వం లో అత్యధికంగా పాడాడు. దీనికి రాజ్ కపూరే ముఖ్య కారణం.
రాజ్ కపూర్ కి మొదట్నించీ తన సినిమాల ద్వారా ప్రజలకు సందేశాలు ఇవ్వాలనే తపన వుండింది. ఇది డైలాగుల ద్వారా కానీ, పాటల ద్వారా కానీ సాధ్యం. రాజ్ కపూర్ డైలాగు కింగేమీ కాదు. అందుకే అతడు పాటల మాధ్యామాన్ని ఎంచుకున్నాడు. అతడి అదృష్టానికి ముకేష్ దొరికాడు. ముకేష్ అంటే రాజ్ కపూర్, రాజ్ కపూర్ అంటే ముకెష్ గా సాగింది వాళ్లిద్దరి అనుబంధం.. రాజ్ కపూర్ తెర మీద అభినయించిన పాటని ఎవరైనా పొగిడినప్పుడు “నేను శరీరం నిండా రంధ్రాలున్న వేణువు లాంటి వాడిని. దాని గుండా ప్రవహించేగాలి అది సృష్టించే సంగీత ధ్వని ముకేష్” అని ముకేష్ ని పొగిడేవాడు రాజ్ కపూర్ .
తన టీము (ముకేష్, హస్రత్ జైపురి, శైలేంద్ర, శంకర్ జైకిషన్) తో కలిసి రాజ్ కపూర్ పాటల ద్వారా ఎన్నో సందేశాలిచ్చాడు. నిజానికి రాజ్ కపూర్ ప్రతి పాటలో ఎంతో కొంతయినా సందేశం వుంటుంది. అలా కాక,
“సజన్ రే ఝూఠ్ మత్ బోలో ఖుదా కే పాస్ జానా హై”
“దునియా బనానే వాలే క్యాతెరె మన్మే సమాయీ”
లాంటి, కేవలం సందేశలనిచ్చే పాటలు కూడా వున్నాయి. ముఖేష్ ను సంపూర్ణంగా తెలిసి వున్న రాజ్ కపూర్
మెరా నాం జోకర్ లోని “జానే కహా గయే వొ దిన్” పాట పాడించడానికి ఆలొచించాడట.
మానుతున్న గాయాల్నీ, మాసిపోయిన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకునే ఈ పాట లో ముకేష్ భావం పలికించ గలడా అని సందేహ పడ్డాడట. పాట రికార్డు అయినతరువాత ఈ పాటకు ఈ గొంతు తప్ప మరోటి న్యాయం చేసి వుండేది కాదు అనే నిర్ణయాని కొచ్చాడట. సందేశాలిస్తూ, ఇస్తూ చివరికీ ముకేష్ కీ తనకీ, కలిపీ చివరి సందేశం ఇచ్చాడు రాజ్ కపూర్.
“జీనా యహా మర్నా యహా, ఇస్కే సివా జానా కహా”,
జీ చాహె జబ్ హం కొ ఆవాజ్ దో హం హై వహీ హం థె జహా”
( ఇక్కడే జీవించాలి, ఇక్కడే మరణించాలి, ఇది కాక ఇంకెక్కడికి పోవాలి? “నీ మనసుకు ఎప్పుడని పిస్తే అప్పుడు నన్ను పిలు. నేను ఎక్కడ వుండే వాడినో అక్కడే వున్నాను.)
‘ది షో మాన్ ఆఫ్ ది మిల్లెనియం’ రాజ్ కపూర్, ముఖేష్ మరణవార్త విని దుఖితుడై ” నా గొంతు శాశ్వతంగా మూగ పోయింది” అన్నాడు.
మరిచి పోయిన వారిని సంస్మ రించు కుంటాం. మనలోనే వున్న వారిని ఆప్పుడప్పుడు తట్టి చూసుకుంటాం, కౌగిలించుకుంటాం. ముకేష్ విషయం లో ఇదే నిజం. అయన సంగీత ప్రియులందరిలోనూ వున్నాడు. చూడాలను కున్నపుడల్లా మనస్సుని తడితే కనిపిస్తాడు. ఆయన పాటలు విని ఎన్నో జీవితాలు ప్రేరణకు లోనయ్యాయి, ప్రభావితమయ్యాయి. ముకేష్ గతం, వర్తమానం, భవిష్యత్తు.
Ahmed Sheriff, PMP, CMQ/OE, ACS, FLMI, PSM
Consultant, PMP Certification, Project Management, Quality
Mob: +91 9849310610
Mob: +91 9849310610