నేనెట్లైనా హిందువునవుతా… అని ప్రొ. ఐలయ్య కంకణం కట్టుకున్నారా?: రాఘవ శర్మ

(అలూరు రాఘవ శర్మ)
ఐలయ్య గారు అబద్ధాలు ఆడడంలో సిద్ధ హస్తులు. సమాజం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన సంఘ సంస్కర్తలకు, కమ్యూనిస్టు యోధులకు కులతత్వాన్ని అంటగడుతూ చేసిన ప్రసంగాన్ని, పూర్వ పక్షం చేస్తూ ‘ఆధునిక మనువు ఐలయ్య’ ఎ లా అయ్యారో సోదాహరణంగా రాశాను.
ఐలయ్య గారు నా వాదనను పూర్వ పక్షం చేయ లేక, డొంక తిరుగుడు మాటలతో, మళ్ళీ పచ్చి అబద్ధాలను ఒక పీఠాధిపతి లాగా ప్రవచించారు. మదించిన వారి అబద్ధాలను నిజాల నిప్పుల పైన కాల్చి నిగ్గు తేల్చేందుకే ఈ వాస్త వాలను వివరిస్తున్నాను.
1.”సంప్రదాయ శాకాహార బ్రాహ్మణుడైన దేవులపల్లి వేంకటేశ్వర రావు విప్లవ వాదిగా నటించి , శూద్ర కమ్యూనిస్టు మేధావి అయిన తరిమెల నాగిరెడ్డిని తన అనుచరుడిగా చూపడమే లక్ష్యంగా పని చేశారు ” అని ఐలయ్య గారు ఆరోపించారు.
నాగిరెడ్డి కి, దేవులపల్లికి మధ్య లేని విభేదాలను సృష్టించిన ఐలయ్య గారు ఒక పచ్చి అబద్దానికి తెరలేపారు.
నిజానికి వీరిరువురు నాయకులు చివరి శ్వాస వరకు స్నేహంగానే ఉన్నారు. సీపీఐ నుంచి చీలినప్పుడు కానీ, మళ్లీ సీపీఎం నుంచి బైటికి వచ్చినప్పుడు కానీ, వీరిరువురు ఒకే మార్గాన కలిసి పయనించారు. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు విప్లవ కారుల సమన్వయ కమిటీని , ఆ తరువాత భారత కమ్యూనిస్టు విప్లవ కారుల సమైక్యతా కేంద్రాన్ని ఇరువురు నాయకులు కలిసి ఏర్పాటు చేశారు.
వీరిరువురు మధ్య వ్యక్తిగత కుటుంబ స్నేహం కూడా ఉండేది. ఒక సారి దేవులపల్లి ఇంటికి నాగిరెడ్డి వెళ్లారు. రాజకీయాలు చర్చిస్తున్నప్పుడు కాసేపటికి నాగిరెడ్డి లేవడానికి ఇబ్బంది పడుతున్నారు. అది గమనించిన దేవులపల్లి ఇంట్లోకెళ్ళి యాష్ ట్రే తీసుకొచ్చి ముందు పెట్టారు. నాగిరెడ్డి ఆశ్చర్య పోయి ” మీరు సిగరెట్లు తాగరు కదా ! మీ ఇంట్లోకి యాష్ ట్రే ఎలా వచ్చింది ? ” అని అడిగారు. ” మీరు ఎప్పుడైనా మా ఇంటికి వస్తారని , యాష్ ట్రే అవసరం అవుతుందని తెచ్చి పెట్టాను.” అని దేవుల పల్లి సమాధానమిచ్చారు.
Tarimela Nagireddy (facebook picture)
వారిరువురు మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. సీపీఎం నుంచి బైటికి వచ్చేసా క, అజ్ఞాతం లోకి వెళ్ళడానికి ముందు దేవులపల్లి హైదరాబాదులో ఉండి తన కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఆ సమయంలో సీపీఐ నాయకు డు చండ్ర రాజేశ్వర్ రావుకు ఏదో భోజన సమస్య ఏర్పడింది. దేవులపల్లి వారిని కొన్ని నెలల పాటు తన ఇంట్లోనే ఒక గదిని కేటాయించి, భోజన సమస్య తీర్చారు.
అక్కడి నుంచే చండ్ర రాజేశ్వరావు తన కార్య కలాపాలు సాగించారు. పంథాలో ఇద్దరివీ భిన్న మార్గాలై నా పరస్పరం గౌరవంగా మెలిగే వారు. అలాగే ఇతర కమ్యూనిస్టు నాయకుల మధ్య కూడా సత్సంబంధాలు ఉండేవి.
2. దేవుల పల్లి శాకాహార బ్రాహ్మణ వాది అని ఐలయ్య గారు మరొక అబద్ధం ఆడారు. నిజానికి దేవుల పల్లి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ వారు మాంసాహారి. మాంసం తినడం, తినక పోవడం అనేది వ్యక్తిగత ఆహార అలవాట్లకు సంబందించినది. ఆహార అలవాట్లను ఆధారం చేసుకుని ప్రజలను విడగొట్టాలని చూడడం సరికాదు. ఆహార విషయం లో కూడా ఐలయ్య గారు రాజకీయం చేయడానికి ప్రయత్నించి విఫల మయ్యారు.
నిజానికి చారిత్రకంగా వేద కాలంలో బ్రాహ్మణులు కూడా మాంసాహారులే. సంచార జీవనం నుంచి స్థిరమైన వ్యవసాయ జీవనం మొదలవడంతో , వ్యవసాయానికి అవసరమైన పశువులను చంపకూడదు అన్న భావన వచ్చింది. దాంతో కొందరిలో శాకాహారం మొదలైంది. దానికి తోడు అహింస ధర్మాన్ని ప్రవచించిన బౌద్ధం ప్రభావం కూడా ఒక వర్గంలో శాకాహారానికి దారి తీసింది.
గత ఆదివారం ఏ బీ ఎన్ ఆంధ్ర జ్యోతి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఐలయ్య గారు మాట్లాడుతూ ” నాకు బీఫ్ ఇష్టం. మా ఇంట్లో బీఫ్ వండరు. మా బ్రదర్, మా సిస్టర్ తో కలిసి ఉంటున్నాను. వారికి బీఫ్ అలవాటు లేదు. బయట దొరికినప్పుడు తింటాను ” అని చెప్పారు.
ఐలయ్య గారు ఇంట్లోనే భిన్న ఆహారపు అలవాట్లు ఉంటున్నప్పుడు , అయిన వాళ్ళతో అంత బాగా సర్దుకు పోతున్నారు. భిన్న జాతులు, మతాలు, కులాల వారు జీవించే వైవిధ్య సమాజంలో భిన్న ఆహారపు అలవాట్లను ఎలా తప్పుపడ తారు!? భిన్న ఆహారపు అలవాట్లు కూడా జీవ వైవిధ్యం లో భాగంగానే చూడాలి.
3. నాగిరెడ్డి ‘ తాకట్టు లో భారత దేశం ‘ అన్న గొప్ప గ్రంథాన్ని రాశారు. దేవుల పల్లి ‘ భారత జనతా ప్రజా తంత్ర విప్లవం ‘ అన్న మరో మహోత్కృష్ట గ్రంథాన్ని రాశారు. ఈ రెండు గ్రంథాలు ఆనాటి ఆంధ్ర కమ్యూనిస్టు విప్లవ కారుల సమన్వయ కమిటీ ఆమోదించి నవే. ఈరెండు పుస్తకాలు వారి వారి రచనలే. నాగిరెడ్డి గొప్ప ఉపన్యాసకులు. దేవులపల్లి బహిరంగ సభలలో కంటే కార్యకర్తలతో నే ఎక్కువగా మాట్లాడే వారు. విప్లవ ఉద్యమ అవసరాల కోసం పని విభజన కూడా ఉంటుంది. ఇద్దరూ విప్లవోద్యమం కోసమే జీవితాలను అర్పించిన వారు. ఇద్దరూ సమ వయస్కులు. నాగిరెడ్డి 1976 లోనూ, దేవులపల్లి 1984 లో నూ, అజ్ఞాత జీవితం గడుపు తోనే మరణించారు. వారు మరణించిన మూడున్నర, నాలుగు న్నర దశాబ్దాల తరువాత ఐలయ్య గారు ఇప్పుడు వారిద్దరి మధ్య తేడాలున్నాయి అని తక్కెడ లో తూయడానికి , తద్వారా కమ్యూనిస్టుల పైన వారు పుట్టిన కులాన్ని బట్టి నెత్తిన రాళ్ళు వేయ డానికి చూస్తున్నారు.
4.. “తుగ్లక్ ఆర్థిక విధానాలపై నాగిరెడ్డి (చదువుకునే ప్పుడు ) రాసిన పుస్తకాన్ని ఆయన అనుచరులు ఎందుకు పునర్ ముద్రించలేదు ? ” అని ఐలయ్య గారు ప్రశ్నించారు. కమ్యూనిస్టు విప్లవ కారులకు వ్యక్తిగత ప్రచురణలు ఉండవు.
విప్లవోద్య మానికి ఆపుస్తకం అవసరం అని నాగిరెడ్డి భావిస్తే ఆయనే ప్రచురించేవారు. వారు మరనించే వరకు జనశక్తి పత్రికకు, జనశక్తి ప్రచురణలు కు ఎడిటర్ గా ఉన్నారు కూడా. నాగిరెడ్డిని అసమర్థుడు అయిన నాయకుడిగా, తన అనుచరుడిగా దేవులపల్లి భావించేవారు అని ఐలయ్య ఒక తప్పుడు వ్యాఖ్యానం చేశారు. నాగిరెడ్డి రాసిన ‘ తాకట్టు లో భారత దేశం ” అన్న గ్రంథానికి నవీన్ చంద్ర పేరుతో దేవులపల్లి రాసిన ముందుమాట మరొకసారి చదివితే విప్లవోద్యమం లో నాగిరెడ్డి నిర్వహించిన పాత్ర పట్ల వారికి ఎంత గౌరవం ఉందో అర్థం అవుతుంది.
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో నాగిరెడ్డి చదువుతున్నప్పుడు రాజకీయాలలో చురుకుగా పాల్గొని విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరణకు గురయ్యారు. అలాంటి చరిత్ర దేవుల పల్లి కి లేదన్నట్టు రాసారు. ఇలాంటి విషయాలతో అమరులైన ఇద్దరు కమ్యూనిస్టు నాయకుల జుట్లకు ముడి వేయాలని ఐలయ్య గారు బెడిసికొ ట్టే పిచ్చి ప్రయత్నం చేశారు . దేవుల పల్లి కూడా డిగ్రీ చదువు తున్నప్పుడు వందేమా తర ఉద్యమంలో పాల్గొన్నందుకు పరీక్షలు రాయకుండా కళాశాల నుంచి బహిష్కరణకు గురయ్యిన విషయం ఉద్దేశ్య పూర్వకంగానే ఐలయ్య గారు మరుగున పరిచారు. విప్లవ ఉద్యమం, దాని నాయకుల వ్యక్తి గత విషయాలు కూడా రాయగలిగిన ఐలయ్య గారికి ఈ విషయం తెలియకుండా ఎలా ఉంటుంది!?
5. ఉత్పత్తితో, శ్రమతో , వ్యవసాయంతో సంబంధం లేని బ్రాహ్మణ నాయకత్వం వల్ల విప్లవం విఫల మైంద ని దేవులపల్లి ని దృష్టిలో పెట్టుకొని ఐలయ్య గారు రాసారు. దేవులపల్లిది కూడా వ్యవసాయ కుటుంబమే. వ్యవసాయంతో సంబంధమే లేకపోతే దోపిడీకి గురవుతున్న రైతులు, వ్యవసాయ కూలీల బాధలు ఎరిగి, గ్రామాల్లో తిరిగి , వారిని కూడగట్టి దేశంలోనే అతిపెద్ద తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటాన్నీ నిర్మించిన కమ్యూనిస్టు నాయకులలో దేవులపల్లి ఎలా కీలకం కాగలుగు తారు? నెహ్రూ సైన్యాన్ని సైతం ఎదురొడ్డి 1951 వరకు పోరాడుతూ, యువకులకు సైనిక శిక్షణ నిస్తో ఎలా నిలబడ గలుగుతారు!?
Devulapalli Venkateswara Rao (credits: countercurrents.org)
తన మాటల గారడీతో ఐలయ్య గారు చరిత్రను ఎంత చక్కగా వక్రీకరించారో చూడండి.
కమ్యూనిస్టు పార్టీ కేంద్ర నాయకులలో ఉన్న బ్రాహ్మణ కుల లాబీ వల్లనే దేవులపల్లి అతి చిన్న వయసులోనే కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారని ఐలయ్య గారు ఆరోపించారు. కమ్యూనిస్టు పార్టీలో నాయకత్వ స్థానాల లోకి వెళ్లాలంటే , యూనివర్సిటీ లో ఐలయ్య గారి లాగా ప్రమోషన్ల కోసం పైరవీలు, సిఫార్సులతో సాధ్యం కాదు. కుల గుంపును తీసుకెళ్ళి వీసీలను ఘెరావ్ చేయడం కాదు. సాయుధ పోరాటానికి గుండెకాయ వంటి నల్గొండ జిల్లాలో ఆ పోరాటానికి నాయకత్వం వహించబట్టే దేవులపల్లిని కేంద్రకమిటీ లోకి తీసుకున్నారు.
6. ఐలయ్య గారు ఉస్మానియాలో ప్రొఫెసర్ గా చేస్తూ సెంట్రల్ యూనివర్సిటీ లో ఎంపిక కావడానికి బ్రాహ్మణ కులంలో పుట్టిన హరగోపాల్ తన కులం వల్లనే సిఫార్సు చేయలేదని ఆరోపించారు. తాము ఎన్నుకున్న పౌరహక్కుల ఉద్యమానికి అంకితమై పని చేస్తున్న హరగోపాల్ వంటి మేధావులు నుంచి ఉద్యోగాలకు సిఫార్సులను ఐలయ్య గారు ఎలా ఆశిస్తారు!?
కెరీర్ కోసం, సిఫార్సుల కోసమే నా ఐలయ్య గారు కొంత కాలం పౌర హక్కుల ఉద్యమం లోకి వచ్చింది!? అలాంటివి గిట్టుబాటు కాకేనా హక్కుల ఉద్యమం నుంచి వెనుతిరి గింది!?
తిరుపతి ఎస్వీ యూ నివర్సిటీ తత్వ శాస్త్ర విభాగంలో లెక్చరర్ గా చేరిన వడ్డెర చండీదాస్ ( చెరుకూరి సుబ్రమణ్యేశ్వర రావు) లెక్చరర్ గా నే రిటైర్ అయ్యారు. జ్య పాల సార్త్ర్ తాత్విక చింతనతో మమేకమైన చండీ దాస్ ను యూనివర్సిటీలో పై అధికారులు ప్రమోషన్ కోసం దరఖాస్తు చేసుకోమ ని ఎంత కోరినా చేసుకోలేదు. ఇంత ఆదర్శంగా బతికే చండీదాస్ లాంటి వారి ముందు ఐలయ్య గారు లాంటి వారు అంగుష్టులే.
బ్రాహ్మణ కులంలో పుట్టిన వరవరరావు లాంటి వారినే గొప్ప కవులుగా కీర్తిస్తారు. కాళోజీకి కులం వల్లనే పీవీ పద్మ భూషణ్ ఇప్పించా రని ఐలయ్య ఆరోపణ.
దళిత కులంలో పుట్టిన జాషువా కు కూడా పద్మశ్రీ అవార్డు వచ్చిన విషయాన్ని విస్మరిస్తే ఎలా!? ప్రజాదరణ పొందడమే కొలబద్ద కావాలికానీ అవార్డులు, రివార్డులు కాకూడదు. కాళోజీ కమ్యూనిస్టు కాదు. ప్రజాస్వామిక వాది. ఎన్నికలు బహి ష్కరించమని నక్సలైట్లు ఇచ్చిన పిలుపును కాళోజీ బహిరంగంగా వ్యతిరేకించారు.
కోరే గాం కేసులో జైలులో దారుణమైన స్థితిలో ఉన్న ఎనబై ఏళ్లు దాటిన వరవరరావు పైన కూడా కులం పేరుతో ఐలయ్య గారు దాడికి వెనుకాడలేదు. కవిత్వంలో శివసాగర్ ( సత్యమూర్తి ) స్థానాన్ని ఎవరూ తగ్గించ లేదు. తగ్గించ లేరు కూడా. సాహిత్య చరిత్రలో వారి స్థానం పదిలం గానే ఉంటుంది.
7. ఐలయ్య గారు తాను రాసిన ‘ నేను హిందువు నెట్లైత ‘ అన్న పుస్తకానికి బాలగోపాల్ ముందుమాట రాయలేదని అలిగారు. అంతటితో ఆగకుండా అందుకు ఆయన కులమే కారణమని ఆరోపించారు. బాలగోపాల్ వంటి హక్కుల నేత పైన ఆరోపించడం అంటే తలెత్తి సూర్యుడి పైన ఉమ్మి వే యడమే. వరవర రావు తన ‘ జీవనాడి ‘ కవితా సంకల నానికి ముందుమాట రాయమని చెలం ను అడిగారు. చెలం జీవనాడి చదివి ‘నాకు ఎక్కడం లేదు’ అని సున్నితంగా తిరస్కరించారు ( త్రిపురనేని మధుసూదన రావు స్వయంగా చెప్పిన మాట ).
ముందుమాట రాయనంత మాత్రాన వరవరరావు చెలం పైన అలగ లేదు. కోపగించు కోలేదు. కుటుంబాలలో తోడి కోడళ్ళు, తోడి అల్లుళ్లు, పిల్లలు ఒకరి పైన ఒకరు అలగడం సర్వ సాధారణం. అది వారి అమాయకత్వం. ఐలయ్య గారి అలక అలాంటిది కాదు, ఉక్రోషంతో కూడుకొన్నది.
8. తమ ఇష్టాయి స్టాల తో సంబంధం లేకుండా బ్రాహ్మణ కులంలో పుట్టి నప్పటికీ, దాన్ని ఒదిలేసుకుని, మరొక సిద్ధాంతాన్ని నమ్ముతున్నట్టు ఆచరణలో చూపించిన ఎం. ఎన్. రాయ్, పీసీ జోషీ , చారు మజుందార్, బీటీ రణదివె, నంబూద్రిపాద్ , వినోద్ మిశ్రా, డాంగే, సీతా రామ్ ఏచూరి, దేవుల పల్లి తదితర కమ్యునిస్టు నాయకులలో బ్రాహ్మణ కులతత్వం ఉందని ఐలయ్య గారు కుల విషం చిమ్ముతూ, లేని కుల తత్వాన్ని రెచ్చ గొడుతూ, కమ్యూనిస్టు శ్రేణులలో ఒక గందర గోళం ను సృష్టించాలని చూస్తున్నారు.
సామాన్య ప్రజలతో మమేకమై పదిహేడేళ్లు అజ్ఞాత జీవితం గడిపి, అయిదేళ్ళు జైలు జీవితాన్ని కూడా గడిపిన దేవులపల్లి లాంటి కమ్యూనిస్టు నాయకులకు కులాన్ని అంటగట్టడం లో ఐలయ్య గారి ఉద్దేశ్యం ఏమిటి?
9. ఆగస్టు 23 వ తేదీన ఏ బీ ఎన్ ఆంధ్ర జ్యోతి ఛానెల్ కు ఐలయ్య గారు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ” నేను కమ్యూనిస్టు కాను ” అని ఆ ఇంటర్వ్యూ లో కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. సాక్షి లో ఆగస్టు 14. వ తేదీన ఐలయ్య గారు ‘ మోడీ..రాముడు అందరివాడే..’ అన్న వ్యాసంలో ప్రస్తుత మనువాద ఫాసిస్టు పాలక వర్గాలకు దగ్గర అవ్వాలని ఎలా ప్రయత్నం చేస్తున్నారో స్పష్ట మవుతోంది.
పౌర హక్కుల సంఘంలో పని చేసిన ఆ ఐలయ్య గారేనా ఇలా మాట్లాడేది! ఇలా రాసేది అని చాలా మంది ఆశ్చర్య పోతున్నారు.
” నేనెట్ల హిందువు నవుతా ? ” అని రాసిన ఐలయ్య గారే ” నే నెట్లాగై నా హిందువు నవుతా ” అని కంకణం కట్టుకున్నట్టు ఉన్నారు.
” నేను దేవుణ్ణి నమ్ముతున్నాను.” అని కూడా ఏ బీ ఎన్ ఛానెల్ లో తన మనసులో మాటను బయట పెట్టారు. మరొక అడుగు ముందుకు వేసి ” సెక్యులరిజంకా దిప్పుడు ఆధ్యాత్మిక సమానత్వం కావాలి” అని సర్వసంగ పరిత్యాగి లాగా, కొత్త పీఠాధిపతి లాగా ఐలయ్య గారు ప్రవచించారు.
10. ఐలయ్య గారి తాత్విక చింతనలో ఇంత మౌలిక మైన మార్పు ఎలా వచ్చింది !? వీసీ ని బెదిరించి ప్రమోషన్ల పొందినట్లు బీసీ కార్డు చూపించి మోడీ నీ ప్రసన్నం చేసుకోవడాని కా!? మోడీని భారత సింహాసనం ఎక్కించిన మనువాద హిందూ ఫాసిస్టు మూలాలు నాగ్ పూర్ లోని ఆర్ ఎస్ ఎస్ కేంద్ర కార్యాలయంలో ఉన్నాయని ఐలయ్య గారికి తెలియక కాదు. మోడీ ద్వారా మోహన్ భగవత్ ను కూడా ప్రసన్నం చేసుకునే పనిలో ఐలయ్య గారు ఇప్పుడు ఆధ్యాత్మిక పుష్పక విమానం ఎక్కారు.
Aluri Raghava Sarma
(ఆలూరు రాఘవ శర్మ,రచయిత, సీనియర్ జర్నలిస్టు.తిరుపతి)