అన్నీ ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు సంస్థలతో పోటీ పడేదెపుడు?

(Chalasani Narendra)
ఈ మధ్య నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విద్యావిధానంలో భారత దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకు వెళ్లే విధంగా అత్యాధునిక విద్యను అందించే ప్రయత్నం చేసినా ప్రాథమికమైన ప్రాధమిక పాఠశాల సంస్కరణల గురించి పెద్దగా దృష్టి సారింపలేదు.
ప్రస్తుతం ఉన్న వనరుల దృష్ట్యా ప్రభుత్వమే పాఠశాలలు నడపడం సాధ్యం కాదు. పోటీగా ప్రైవేట్ పాఠశాలలను ప్రోత్సహించడం పట్ల ఈ విధానం దృష్టి ఎటో పోయింది.
వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలలపై ప్రజాధనం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాలు జాతీయ సగటు తీసుకొంటే రూ 40,000 వరకు ఉంది. జాతీయ తలసరి ఆదాయం కన్నా ఏడు రేట్లు ఎక్కువ.
పైగా విద్యార్థులను ఆకట్టుకోవడం కోసం వారికి ప్రభుత్వం మధ్యాహ్నం భోజనం, ఉచిత యూనిఫామ్, ఉచిత పాఠ్య గ్రంధాలు  వంటి అనేక ఆకర్షణలు కల్పిస్తున్నది. అయినా దేశంలో సగం మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడం లేదు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2011 నుండి 2018 వరకు దేశంలో 2.4 కోట్ల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను విడిచి ప్రైవేట్ పాఠశాలల్లో చేరారు. పేద ప్రజలు, మురికివాడలలో ఉండే ప్రజలు, అణగారిన వర్గాలు సహితం తాము సరిగ్గా తినక పోయినా తమ పిల్లలకు మంచి చదువు కోసం ప్రైవేట్ పాఠశాలకు పంపాలని ఆరాట పడటాన్ని మనం చూస్తున్నాము.
నేడు ప్రభుత్వ పాఠశాలలు శిధిలావస్థలు ఎందుకు ఉన్నాయో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింహావలోకనం చేసుకోవాలి.  దేశంలోని 7 లక్షల పాఠశాలలో 100 మందికన్నా తక్కువగా విద్యార్థులు ఉన్నారు. ఒక లక్ష పాఠశాలలో 20 మందికన్నా తక్కువమంది విద్యార్థులు ఉన్నారు.

కేవలం ఉపాధ్యాయుల ఉద్యోగాలు కాపాడటం కోసం పాఠశాలలను ప్రభుత్వం నడపాలా?

ప్రైవేట్ పాఠశాలలకన్నా అత్యధికంగా జీతాలు పొందుతున్నా ప్రభుత్వ ఉపాధ్యాయుల నాణ్యత ప్రమాణాలు దారుణంగా ఉంటున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే దేశంలో ప్రతి నలుగురు ఉపాధ్యాయులలో ప్రతి రోజు ఒకరు పాఠశాలకు హాజరు కావడం లేదు. హాజరైన మరొకరు అసలు పాఠాలే చెప్పడం లేదు.
ఉపాధ్యాయుల ఎంపిక చాల లోపభూయిష్టంగా ఉంటున్నది. రాజకీయ, అవినీతి కారణాలతో వారిని ఎన్నికల సమయంలో తమ ప్రచార బాధ్యతలు చేపట్టేవారుగానే రాజకీయ నాయకులు  చూస్తున్నారు. ఉపాధ్యాయ పోస్ట్ లను అమ్ముకున్నందుకు ఒక ముఖ్యమంత్రి జైలుకు వెళ్ళవలసి రావడం చూసాము.
గతంలో యుపి, బీహార్ లలో ఉపాధ్యాయులకు అర్హత పరీక్షలు పెడితే 5వ తరగతి విద్యార్థుల గణిత గణాంకాలను సహితం సరిగ్గా వ్రాయలేక పోయారు. కేవలం 10 శాతం ఉపాధ్యాయులు మాత్రమే అర్హత పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. మనుగడలో లేని బీఈడీ కళాశాలల డిగ్రీ సర్టిఫికెట్ లతో పలు రాష్ట్రాలలో ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందుతున్నారు.
నూతన విద్యావిధానంలో ఎంతసేపటికి పాఠశాలలకు మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల శిక్షణ వంటి అంశాలకు తప్పా పాఠశాల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం ఏ విధంగా తీసుకు రావాలో ఆలోచించడం లేదు.
సర్వ శిక్ష అభియాన్ క్రింద ప్రతి పాఠశాలలో తల్లితండ్రుల కమిటీలు ఏర్పాటు చేసి, పాఠశాల నిర్వహణలో వారి పాత్ర ఉండాలని నిర్ణయించినా, మొదట్లో కొంత ఉత్సాహం చూపినా ఆ తర్వాత అమలు  పట్ల ఆసక్తి చూపడం లేదు.
పౌరులకు పాఠశాల నిర్వహణలో క్రియాశీల పాత్ర కల్పించాలి. ప్రతి పాఠశాల ప్రాంతంలో పౌరుల కమిటీలు ఏర్పాటు చేసి, పాఠశాలల యాజమాన్యంలో వారి పర్యవేక్షణ ఉండేటట్లు చూడాలి.
 ప్రైవేట్ పాఠశాలలు అనగానే వాటిని దోపిడీ కేంద్రాలుగా చూడటం కూడా భావ్యం కాదు. కొన్ని కార్పొరేట్ పాఠశాలలు ఉన్నప్పటికీ అత్యధికముగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలు సాధారణమైనవే. ఒక అంచనా ప్రకటం 70 శాతం ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు రూ 1,000 మించి లేవు. 40 శాతం పాఠశాలల్లో అయితే రూ 500 మాత్రమే ఉంటున్నది.
భారత దేశంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల వ్యవస్థ ప్రపంచంలోనే మూడవ పెద్దది కావడం గమనార్హం. అయితే నేడు సుపరిపాలన అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం కావడంతో ఒక ప్రైవేట్ విద్యాలయం స్థాపించాలి అంటే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడవలసి వస్తున్నది. సుమారు 125 అనుమతులు పొందాలి. నిజాయతీతో ప్రైవేట్ పాఠశాలలు నడపలేని పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా ప్రముఖ విశ్లేషకుడు గురుచరణ్ దాస్ ఒక సూచన చేశారు. ప్రభుత్వ – ప్రైవేట్ పాఠశాలల మధ్య ఆరోగ్యకరమైన పోటీకి అవకాశం కల్పించడం ద్వారా విద్యాప్రమాణాలు పెంచవచ్చని సూచించారు.
ఐదేళ్ల వయస్సు వచ్చిన ప్రతి విద్యార్థికి ఒక ఉపకారవేతనం ఇచ్చి, తన ఇష్టం వచ్చిన పాఠశాలలో ఆ మొత్తంతో చేరి, చదువుకొనే అవకాశం ప్రభుత్వం కల్పించాలని అయన ప్రతిపాదించారు.
విద్యార్థులు చెల్లించే ఫీజేల నుండే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల జీతాలు చెల్లించాలి. విద్యార్థులు లేని పాఠశాలలను మూసివేయాలి. అప్పుడు  ప్రభుత్వ   పాఠశాలల   ఉపాధ్యాయలు విద్యాప్రమాణాలు పెంపు పట్ల దృష్టి సారిస్తారు. ప్రామాణికత గల పాఠశాలలే నిలదొక్కుకో గలుగుతాయి.
విద్య హక్కు చట్టం ప్రకారం కూడా ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలి. ఆ విధంగా పేదలకు నాణ్యమైన చదువు అందేటట్లు ఈ నిబంధన పారదర్శకంగా అమలయ్యేటట్లు చూడాలి.
Chalasani Narendra

(Chalasani Narendra is a senior journalist from Hyderabad)