(Ahmed Sheriff)
ప్రపంచ సైకిల్ దినోత్సం (World Bicyle Day) జరగడం ఇది నాలుగో ఏడాది. మొదటి సారి 2018, జూన్ 3న ఐక్య రాజ్యసమితి మొదటి సైకిల్ దినోత్సవం జరిపింది. సుమారు 56 దేశాలు సైకిల్ కు అనుకూలంగా చేపట్టిన క్యాంపెయిన్ తో ఐక్య రాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ 3ను సైకిల్ దినోత్సవంగా ప్రకటించింది. ఐజాక్ ఫెల్డ్ ప్రపంచ సైకిల్ దినోత్సవం లోగో రూపొందించారు. ప్రపంచ సైకిల్ రాజధాని నెదర్లాండ్స్. అక్కడ 17 మిలియన్ల ప్రజలకు 23 మిలియన్ల సైకిళ్లున్నాయి.
సైకిలు నా జీవితంలో అందమైన అనుభవాల, మరపు రాని జ్ఞాపకాల చాప్టర్ ప్రారంభించింది. నేను పదవ తరగతి చదువుతున్నపుడు మా నాన్నగారు గిఫ్ట్ గా నాకు సైకిల్ కొనీయడంతో ఈ చాప్టర్ కలర్ ఫుల్ గా మొదలయింది. సైకిలు యజమానిగా, నేనూ నాటి మధ్య తరగతి కలల ప్రపచంలోకి ప్రవేశించాను. ఎందుకు కలల ప్రపంచం అంటున్నానంటే, అపుడే సినిమా రొమాంటిక్ లైఫే జీవితంలోశక్తినింపేది. సినిమాల్లో హీరో హీరోయిన్లు సైకిల్ మీద దూసుకుపోతూ ఎన్ని పాటలు పాడలేదూ! అందుకే సైకిల్ చుటూ నా బాల్యం కలలన్నీ అల్లుకుపోయినపుడు దాన్నొక గిఫ్ట్ గా అందుకోవడం లో ఉన్న ‘మజా అనుభవించితే గాని తెలియదులే…’
అప్పట్లో ఒక సైకిలు, ఒక నేషనల్ ఎకో రేడియో, ఒక ఉషా టేబులు ఫ్యానూ, ఒక హెన్రీ శ్యాండజ్ వాచీ, బాటా చెప్పులు, టెర్రీ కాటన్ దుస్తులూ మధ్య తరగతి వాళ్లు గొప్పగా చూపించుకునే చిరుసంపద చిహ్నాలు.
సైకిల్ చేతికందడం, నాకు రెక్కలు రావడమే. ఇక మాటనీ(మ్యాటనీ అనే మాట ఇపుడు మాయమైంది. మధ్యాహ్నం వేసే సినిమాని మాటనీ అంటారు) కి వెళ్లడానికి బాడుగ సైకిలు కోసం పడి గాపులు పడనక్కరలేదు. నాకొక సైకిలు వచ్చింది. పాటలుపాడుకుంటూ దాని మీద దూసుకుపోవడం ఎంత థ్రిల్లో….
నేనూ సైకిలు మీద తెగ తిరిగే వాడిని. సినిమాలకు వెళ్లే వాడిని. సినిమా హాళ్లన్నీ మేమున్న కాలనీ కి మూడు మైళ్ల దూరం లో వుండేవి. సైకిలు వచ్చాక సినిమా(అప్పట్లో మేటనీ) కి వెళ్లడం నాకు సుళువై పోయింది. సైకిలు తొక్కుతూ ప్రయాణించడం లోని ఆనందం అనుభవిస్తే కానీ తెలియదు. అంతే కాకుండా సైకిలు ప్రయాణం మనలో ఆరోగ్యాన్నీ ఆత్మ విశ్వాసాన్నీ పెంచుతుంది.
ఈ ఆనందాన్ని కలకత్తావాసులు ఏనాడో పసి కట్టారు. సైకిలు నడపడం లో ని లాభాలు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . అదొక మంచి వ్యాయామం, శరీర ధృడతకి ముఖ్యంగా ఊపిరితిత్తులను బలో పేతం చేయడనికి బాగా పనికొస్తుంది. ఈ పాండెమిక్ లో కొరోనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి రొగనిరోధక శక్తి ని పెంచుకోవడానికి ప్రాధాన్యత పెరుగుతున్న నేపధ్యం లో సైకిలు వాడకం ఎంతో మేలు చేస్తుందనడం లో సందేహం లేదు. దీనికి పెట్రోలు ఖర్చు లేదు. నిర్వహణ ఖర్చు దాదాపు సున్న.
ఇన్ని సుగుణాలున్న వాహనం సైకిలు. భారత దేశం లోని అన్ని మెట్రో నగరాలతో పోలిస్తే కలకత్తాలోనే సైకిల్ ను ఎక్కువగా వాడేవారు. కలకత్తా వాసుల్లో సైకిలుకి గొప్ప ప్రాధాన్యతే వుంది. 1911 లో రవీంద్రనాథ్ టాగూర్ రాసిన “ Ponrokkha “ అనే చిన్న కథలో ఒక యువకుడు సైకిలును ఆకాంక్షించి దాని కోసం ఆరటపడతాడు. అది అతడికి స్వాతంత్య్రాన్ని, సంతోషాన్ని ఇస్తుందని చెబుతాడు. అయితెే, దురదృష్టం కలకత్తా వాసులు గత రెండు దశాబ్దాలుగా ఈ ఆనందానికి దూరమవుతూ వచ్చారు. అక్కడ రోడ్ల మీద క్రమంగా సైకిల్ తొక్కడాన్ని నిషేధిస్తూ వచ్చారు.సైకిల్ ప్రేమికులు అభ్యర్థనలను ఎవరూ ఖాతరుచేయలేదు. ఇపుడమయిందో తెలుసా? కలకత్తాలో సైకిళ్లు పెద్ద ఎత్తున ప్రత్యక్ష మయ్యాయి.
లాక్ డౌను నేపధ్యంలో హౌరా బ్రిడ్జి మీద బారులు తీరిన సైకిళ్లు నయనానంద కరంగా కనిపించాయని టెలిగ్రాఫ్ పత్రికలో వార్త వచ్చింది. అంతే నా సైకిల్ జీవితం ప్లాష్ బాక్ కళ్ల ముందుకదలింది. ఇది వేర కథ. కలకత్తా సైకిల్ గురించి చూద్దాం.
ఒకప్పుడు కలకత్తా లో ప్రజలు తమ ప్రయాణాలకు సైకిళ్లను విరివిగా వాడే వారు. అయితే కలకత్తా రోడ్లను క్రమంగా కార్లు ఆక్రమించడం, అక్కడి ట్రామ్ లు, కొత్త తయారయిన ట్రాఫిక్ రూల్సు, వాటిని పట్టించుకోని కలకత్తా వాసుల లైఫ్ స్టైల్… లో సైకిల్ కు దారి లేకుండా పోయింది. సైకిల్ వోడిపోయింది. పక్కన పడిపోయింది. ట్రాపిక్ పోలీసులు ఒక్కొక్క రోడు నుంచి సైకిలు వాడకాన్ని క్రమంగా నిషేధిస్తూ వచ్చారు. చివరకు రోడ్లమీద సైకిల్ కనిపించడం మాయమయింది.
అయితే కోవిడ్ 19 తో అన్ని రకాల వాహనాలు మూలన పడ్డాయి ఒక్క సైకిల్ తప్ప. సైకిల్ రోడ్ల మీద దూసుకొచ్చింది స్వైరవిహారం మొదలుపెట్టింది. ఎటుచూసినా సైకిళ్లే. కరోనా పోయాక కూడా కలకత్తా వాసుల జీవితాల్లోకి సైకిలు ఒక ప్రయాణ సాధనంగా మళ్లీ రాబొతోందా?
కలకత్తా నగర వీధుల్లో లాక్ డౌను కు ముందు దాదాపు 3 లక్షల కు పైగా సైకిళ్లు తిరిగితే లాక్ డౌను మొదలైన తరువాత వీటి సంఖ్య రెండు మూడు రెట్లు పెరిగిందట.. సైకిలు వాడకం ప్రజల జీవనో పాధిని నిర్వహించడానికి సహాయ పడటమే కాకుండా కొత్త బ్రతుకు తెరువుల్ని ఆవిష్కరిస్తోందట. అక్కడ సైకిలు సరుకుల రవాణా సాధనమయి ఎంతో మందిని ఆదుకుంది.
అయితే గత రెండు దశాబ్దాలలో అధికారులు దీని వాడకాన్ని నిరోధిస్తూ వచ్చి వీధుల నుండి బహిష్కరించారు. 2008 లో పోలీసు కమీషనర్ విడుదల చేసిన ఒక సర్కులర్ ద్వారామొదట కలకత్తా నగరం లోని 38 వీధుల్లొ దీని వాడకాన్ని నిషేధించారు. 2013లో వీటిని 174 వీధులకు పెంచారు. 2014 లో మరొక సర్కులర్ తీసుకువచ్చి వీటిని 62 కు తగించడం వేరే విషయం.కారణమేదయినా సరే, మొత్తానికి కలకత్తా అధికారులు సైకిల్ కు వ్యతిరేకమని అర్థమవుతుంది. సైకిలు వాడకం నిషిధం కాబట్టి, సైకిల్ తొక్కుతూ కనబడితే భారీ ఫైన్లు వసూలు చేయడం మొదలుపెట్టారు. దీనితో ప్రజలంతా బెంబేలెత్తి, సైకిళ్లను దాచేశారు.
ఈ జరిమానతో విసిగిపోయిన “జన” అనే కలకత్తా వాసి “కలకత్తా సైకిల్ సమాజ్” అనే సంస్థను స్థాపించాడు. ఈ సంస్థలోని వ్యక్తులు సైకిల్ని మర్యాద పూర్వకంగా కలకత్తా వీధుల్లో ఒక ప్రయాణ సాధనంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఆమోదం తో జూన్ 9 న పోలీసు డిపార్ట్ మెంటు ఒక తాజా సైకిల్ ప్రేమికుల ముఖాల మీద చిరనవ్వు మొలిపించే సర్కులర్ జారీ చేసింది. ఈ సర్కులర్ సారాంశమేమిటంటే పాండెమిక్ వల్ల పబ్లిక్ ట్రాన్సు పోర్టు పరిమిత మైనందున కలకత్తా వీధుల్లొ సైకిలు వాడకాన్ని అనుమతించడం.
ఇదే క్రమం లో మున్ముందు, కోవిడ్ 19 పాండెమిక్ ప్రభావం తగ్గి పోయినా సైకిలు వాడకం మీద వున్న నిషేధాన్ని ఎత్తి వేయడానికి ఇదే సరైన సమయమని కలకత్తా వాసులు భావిస్తున్నారు. ఆ దిశలో పని ప్రభుత్వం మీద వత్తి డి తీసుకురావాలనుకుంటున్నారు.
ఇంటర్నేషనల్ సైకిల్ క్యాపిటల్ అమ్ స్టర్ డాం
ఈ పరిస్థితుల్లో కలకత్తాని 1970 ప్రాంతం లో ఆంస్టర్ డాం తో పోల్చారు.
ఆంస్టర్ డాం అంటే ప్రపంచం లోనే సైకిళ్ల రాజధాని. సైకిళ్లకు సంబంధించి అంస్టర్ డాం లో BYCS అనే Global Network సంస్థ వుంది. ఇది సైకిలు వాడకాన్ని ప్రమోట్ చేస్తుంది. ఆంస్టర్ డాం లో సైకిలు తొక్కే వారిదే రాజ్యం. అయితే వీరు ఈ హొదా పొందడానికి ముందు చాలా కష్ట పడ్డారు. ఇప్పుడు ఈ నగరం లో విస్తృతమైన సైకిలు మార్గాల నెట్ వర్క్ వుంది. దీనివల్ల ఈ నగరం లో వయసు మీరిన వారూ, పిల్లలూ భయం లేకుండా తిరగడానికి వీలుంది. అయితే 1950, 60 ప్రాంతాల్లో సైకిలు నడిపే వారి ఉనికి తీవ్ర మైన సంక్షోభం ఎదుర్కొంది.
అప్పట్లో కార్ల వాడకం, ఇపుడు మనం హైదరాబాద్ లో లాగా విపరీతంగా పెరగడం మొదలయింది.యాక్సిడెంట్లు జరగడం మొదలయింది. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ప్రాణాలు పోయేవి. వీటిలో అధికంగా పిల్లలే.దీనితో స్టాప్ డి కిండర్మూర్డ్ (stop de kindermoord) (బాల్య హత్యలను ఆపండి) ఆందోళన మొదలయింది. ఈ అందోళనను భారీ గానే నిర్వహించారు. ఇదే సమయంలో డచ్ వారికి మరొక అంతర్జాతీయ సమస్య, తీవ్రమయిన చమురు సమస్య ఎదురయిందది. 1973లో జరిగిన అరబ్-ఇజ్రేల్ దేశాల మధ్య యుద్ధం జరిగింది. దీనిని పేరు యామ్ కిప్పూర్ (Yom Kippur war). ఈయుద్ధం హాలండ్ ఇజ్రాయేలు కు మద్దత్తు ఇచ్చింది. దీంతో అరబ్బులు ఆగ్రహించారు. హాలండ్ తో పాటు అనేక యూరోపియన్ దేశాలకు చమురు విక్రయించవద్దని అంక్షలు పెట్టారు. దీనితో చమురు ధర ఆకాశానికి ఎగిసింది. ఈ నేపధ్యం లో హాలండ్ లోని రాజకీయ నాయకులూ, అక్కడి అధికారులూ ఆయిల్ వాడటం తగ్గించడం అన్నింటికి మేలని భావించారు. పెట్రోలుడీజిల్ తో నడిచే ప్రయాణ సాధనాల కు ప్రత్యామ్నాయాల్ని వెదికారు. దీనికి సైకిలు బెస్ట్ అని నిర్ణయించారు. సైకిల్ వాడకాన్ని ప్రొమోట్ చేసారు. దీని కోసం దాదాపు 515 కిలో మీటర్లప్రత్యేక మార్గాలనీ, లేన్లనీ నిర్మించారు. దేశమొత్తం చూస్తూండానే, హాలండ్ సైకిళ్లకు అనుకూలంగా మారిపోయింది.(హాలండ్ అంటే నెదర్లాండ్స్. నిజానికి నెదర్లాండ్స్ లో హాలండ్ ఒక ప్రాంతమే అయినా, దాని డామినేషనవల్ల దేశానికంతటికీ హాలండ్ అనే పేరు వచ్చింది. ఇపుడు హాలండ్ వాడకం బాగా తగ్గిపోయింది. అంతా నెదర్లాండ్స్ అని మాత్రమే అంటున్నారు.)
నెదర్లాండ్సు లో 17.1 మిలియన్ల జనాభాకి 22.8 మిలియన్ల సైకిళ్లున్నాయి. అంటే మనుషుల కంటే సైకిళ్లే ఎక్కువ. ఏ రోజయినా ఉదయం 8 గంటల నుండి 9 గంటల మధ్య డచ్ రోడ్ల మీద ఇరవై లక్షల సైకిళ్ళుంటాయి. ఇలా మనవూర్లు సైకిల్ స్వర్గాలయి ఎంత బాగుంటుంది.
సైకిలు నా తొలి ప్రేమ. ఈ రోజు నేను ప్రాజక్టు మేనేజ్ మెంటు నిపుణుడిగా విమానాల్లోనూ, రకరకాల కార్లలోనూ, తిరుగుతూ ఎంతో వేగవంత మైన ప్రయాణాలు చేస్తూ వుండవచ్చు.
కానీ అప్పట్లో సైకిలు నేర్చుకునేటప్పుడు పడ్డ పాట్లు (అడ్డ పెడలు), బాలెన్సు తప్పి కింద పడిపోవడాలూ, ముళ్ల కంచెల్లోకి దూసుకెళ్లడాలూ మరువ లేనివి. సైకిల్ ను ఎన్నిరకాల తొక్కి ఆనందించవచ్చో. పడుతూ లేచే బ్యాలానికి సైకిల్ పరాకాష్ట. సైకిల్ తొక్కడం మొదలయితే, బాల్యం నుంచి బయటకొచ్చినట్లే. సైకిల్ మీద కొంచెం దూరం అడ్డ పెడలు తొక్కి బాలెన్సు పట్టాక మనల్ని సైకిలు అలా తీసుకెళ్లి పోతూ వుంటే కలిగే అనందం ఈ రోజు స్కై డైవింగ్ లో కూడా రాదేమో. అప్పుడు పొందిన ఆనందం లో ఇప్పుడు పదో వంతు కూడా పొందటం లేదు అనేది వాస్తవం. దీనికి కారణం కాలమే కావచ్చు. లెేదా జీవితం సాంకేతికమై వచ్చిన వేగమే కావచ్చు. ఈనాటికీ నాకు తెలిసిన ఆవిష్కరణలన్నింటిలోకీ సైకిలే నన్ను ఎక్కువ ఆశ్చర్యానికి లోను చేస్తుంది. స్టాండు వేయకుండా సైకిలు ను అలా వదిలేస్తే అది కింద పడిపోతుంది. అదే ఒక మనిషి ఎక్కి తొక్కుతూ వుంటే కింద పడదు. సైకిలు తయారు చేసిన వాళ్లకి ఈ విషయం ఎలా తెలిసిందా? అని ఆశ్చర్య పోతూ వుంటాను.
లాక్ డౌన్ సైకిల్ కు ప్రాణం పోస్తే, వేలాది మంది వలసకూలీలను సైకిల్ కాపాడింది. లాక్ డౌన్ లో ఉపాధి పోయిన ఈ కూలీలు, తమ సైకిళ్ల మీదే వందల వేల కిలోమీటర్లు ప్రయాణించి సొంతవూర్లకు చేరుకున్నారు. బస్సుల, ఆటోలు, రైళ్లు బందయినపుడు సైకిల్ దేశాన్ని ముందుకు తీసుకెళ్లింది.
వాడక పోయినా నాటి నా పాత సైకిలు ఇప్పటికీ నాతో పాటే మా ఇంట్లొ చక్కగా వుంది. అప్పుడప్పుడూ నేను , మా పాప కోసం కొన్న” లేడీ బర్డు” సైకిలు తొక్కుతూ సైకిలు తొక్కడం లోని ఆనందాన్ని అనుభవిస్తూ వుంటాను. గతం లోకి వెళ్లి వస్తూ వుంటాను.మళ్లీ సైకిల్ రోజులొచ్చి, మన హదరాబాద్ అమ్ స్టర్ డ్యామ్ లాగా సైకిల్ క్యాపిటల్ అయిపోతే, ఎంత బాగుటుందని పిస్తూ ఉంటుంది, నా సైకిల్ ను తుడిచి శుభ్రం చేస్తున్నపుడల్లా…
Ahmed Sheriff, PMP, CMQ/OE, ACS, FLMI, PSM
Consultant, PMP Certification, Project Management, Quality
Mob: +91 9849310610
Mob: +91 9849310610