సైరా బాను: చెరగని అందం- తరగని ప్రేమ!

(CS Saleem Basha)
మా చిన్నప్పుడు ఎవరైనా కన్నెపిల్లలు చక్కగా ముస్తాబు అవుతుంటే, ” ఏంటి సైరాబాను లా తయారవుతున్నావు” అనేవాళ్ళు. అదే కొంచెం పెద్దవాళ్ళనైతే “నువ్వేమనా సైరాబానువా?” అని ఎగతాళి చేసేవారు. అప్పట్లో ముస్లిం ల ఇళ్ళల్లో కూడా పెళ్ళిచూపులు ఉండేవి,కాని పెళ్ళికొడుకు తరఫున బంధువులు మాత్రమే పెళ్లిచూపులకి వెళ్ళే వారు. పెళ్ళికూతురు ఎలా ఉందో తెలుసుకోవాలంటే వాళ్ళ ఫీడ్ బ్యాకే అధారం. ఫోటో కూడా చూసే అవకాశం ఉండేది కాదు పెళ్ళికొడుక్కి. (ఇప్పుడు పరిస్థితి బాగా మారిపొయింది. ఇద్దరి మధ్య నేరుగా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.) పెళ్ళిచూపుల్లో పెళ్ళికూతురు అందంగా ఉంటే “సైరా బాను లా ఉంది” అనేవారు. అప్పట్లో సైరాభాను(సైరా “బానో” అని కూడా పిలుస్తారు) అందానికి ఐకాన్. చాలా సినిమాల్లో ఆమె నటన కన్నా అందానికి ప్రాధాన్యత నిచ్చి హీరోయిన్ పాత్రలు ఇచ్చారు. అలనాటి అందాల నటి సైరాబాను ఈరోజు(23.08.2020) తన 76వ జన్మదినాన్ని జరుపుకుంటోంది!
సైరా బాను తల్లి నసీమా బాను సినీనటి (నసీమా బాను, భారతీయ సినిమా మొదటి “బ్యూటీ క్వీన్” గా పేరుపొందింది) కావడం వల్ల, సైరా బాను కూడా నటి కావాలని లండన్లో Finishing School లో చదువుతుండగానే 1960 లో ఇండియాకి తిరిగి వచ్చింది.

 

ఇక్కడ సైరా భాను తల్లి నసీమా బాను గురించి కొంచెం చెప్పాలి. ఆమె స్కూల్లో చదువుకునే కాలంలో స్కూలుకు పల్లకిలో వెళ్ళేది. ఎందుకంటే ఆమె తల్లి( సైరాబాను అమ్మమ్మ) తన కూతురు అందం ఎవరికి కనిపించకూడదని అలా చేసేది. ఆమె తన కూతురిని డాక్టర్ని చేయాలనుకుంది . కానీ నసీమా బాను మాత్రం యాక్టర్ కావాలని కలలు కంటూ ఉండేది. ఈ నేపథ్యంలో సోహ్రాబ్ మోడీ Hamlet సినిమాలో ఆమె నటింపజేయాలని ఉంటే తల్లి మాత్రం ససేమిరా అంది. కానీ నసీం భాను మొండితనం ముందు తలవంచక తప్పలేదు. అలా హామ్లెట్ సినిమా లో నసీమా బాను నటించింది. ఆ సినిమా చూసిన ప్రేక్షకులు నసీమా బాను అందానికి దాసోహం అన్నారు. ఆమెకి తిరుగులేకుండా పోయింది
ఇక సైరా బాను “హమ్ హిందుస్తానీ” సినిమాలో నటించడానికి ఇండియాకి వచ్చినా ఆ సినిమాలో లీడ్ రోల్ ఇవ్వకపోవడం వల్ల అందులో ఆమె నటించలేదు. తర్వాత ఇండియన్ Elvis Priesley గా పేరు పొందిన షమ్మి కపూర్ జోడిగా ” జంగ్లీ” సినిమాలో నటించింది. తన మొదటి చిత్రంలో నటించే టప్పటికీ ఆమె వయస్సు 17 ఏళ్లు! తన తన ముగ్ధ మనోహర సౌందర్యం తో ప్రేక్షకులను సమ్మోహితుల్ని చేసింది. “ఎహ్ సాన్ తెరా హోగా ముఝ్ పర్..” అన్న పాటలో తన అందం తో ప్రేక్షకుల గుండెల్లో అలజడి రేపింది.

సినిమా తర్వాత షమ్మి కపూర్ తో బ్లఫ్ మాస్టర్ సినిమాలో నటించింది. సైరాభాను ఎక్కువ సినిమాలు చేసింది అప్పటి డాషింగ్ హీరో ధర్మేంద్ర తో. ఆమె రాజేంద్ర కుమార్ తో చేసిన “ఝుక్ గయా ఆస్మాన్”, ” ఆయి మిలన్ కి బేల” సినిమాలు సూపర్ హిట్. ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి. ఆమె రాజేంద్ర కుమార్ తో ప్రేమలో పడిన ట్లు అప్పట్లో అందరూ భావించారు. కానీ రాజేంద్ర కుమార్ అప్పటికే వివాహితుడు. ముగ్గురు పిల్లల తండ్రి. ఈ విషయం తెలిసిన సైరాబాను తల్లి, నసీమా బాను తన పొరుగు వాడైన దిలీప్ కుమార్ ను సైరాబాను కు హితవు చెప్పమని అభ్యర్థించిదట. దిలీప్ కుమార్ సైరాబాను కి సలహా ఇచ్చాడో లేదో గానీ, ఈ క్రమంలో ఆమె దిలీప్ కుమార్ తో ప్రేమలో పడడానికి దారి తీసిందని ఒక కథనం ఉంది.
మొదటి చిత్రంతోనే ఫిలింఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ గా నామినేషన్ పొందడం విశేషం. 1960-70 దశకం లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్ల జాబితాలో మూడో స్థానంలో ఉండింది.
1968 లో వచ్చిన ” Padosan” సినిమా ఆమె కెరీర్లో సూపర్ హిట్ సినిమా.
ఆ తర్వాత ఓ దశాబ్దం పాటు చాలా హిట్ సినిమాలు చేసింది. ఆమె అమితాబ్ బచ్చన్ తో ” జమీర్”, హేరా ఫేరీ అనే రెండు సినిమాల్లో నటించింది. హేరా ఫేరీ బాక్సాఫీస్ సూపర్ హిట్ సినిమా. ఆమె దిలీప్ కుమార్ తో కూడా బై రాగ్, గోపి, సగీనా అనే మూడు సినిమాలు చేసింది. అనేకమంది హీరోలతో సినిమాలు చేసినప్పటికీ, రాజేష్ ఖన్నా తో సినిమా చేయాలన్న ఆమె కోరిక తీరలేదు. Chotibahu సినిమా రెండు రోజులు షూటింగ్ తర్వాత, ఆమె అనారోగ్యంతో తప్పుకోవడం వల్ల అది కుదరలేదు. 1976 లో సునీల్ దత్ హీరోగా వచ్చిన ” “నెహ్లే పే దెహ్లా” ” ఆమె చివరి విజయవంతమైన సినిమా.

దాని తర్వాత వరుసగా కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆమె తన కెరీర్ కి మంగళం పాడింది. అధికారికంగా చివరి సినిమా 1988 లో విడుదలైన “”పైసలా” ” సినిమా
దిలీప్ కుమార్ తో ఆమె ప్రేమ కథ 8 ఏళ్ల వయసులో మొదలైంది. అప్పుడు దిలీప్ కుమార్ వయసు 30 ఏళ్ళు! ఎన్నో మలుపులు తర్వాత తన “కోహినూర్”( దిలీప్ కుమార్) ని ఆమె సొంతం చేసుకుంది. దాని వెనుక ఆసక్తికరమైన విశేషాలు ఎన్నో ఉన్నాయి.
సైరాబాను ” jhuk gaya aasman” సినిమాలో ఒక పాట పాడుతుంది. అది ” “తుంసే మిలీ నజర్ కే మేరే హోష్ ఉడ్ గయే!” దీని అర్థం “నిన్ను చూడగానే నాకు మతి పోయింది!” సరిగ్గా పాటలో లాగానే 8 ఏళ్ల వయసులో ” ఆన్” (1952) సినిమాలో దిలీప్ కుమార్ చూడగానే సైరాబాను కి మతి పోయింది. అప్పుడు వారి ప్రేమ కథ టైటిల్ ” ఆమెకు 8- ఆయనకు 30”.
ఆ సూపర్ హిట్ పాట ఈ వీడియోలో మీరు కూడా చూడొచ్చు

2010 లో ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పింది.” నా జీవితంలో రెండే కలలు. ఒకటి మా అమ్మ లాగా గొప్ప నటి కావడం, రెండు దిలిప్ సాబ్ ని పెళ్ళి చేసుకోవటం. దేవుడు నా రెండు కలలను నిజం చేశాడు”
” నేను దిలీప్ కుమార్ తో ప్రేమలో పడిన మరొక అమ్మాయిని కాదు. నాది పగటి కల కూడా కాదు. నా పై నాకున్న విశ్వాసం, దేవుడిపై నాకున్న నమ్మకం మీద ఆధారపడిన కల” ఒక ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా చెప్పింది. చివరికి 1966లో ఆ కల నిజమైంది. అప్పుడు వారి ప్రేమ కథ టైటిల్ ” ఆమె వయసు 22- ఆయన వయస్సు 44″.
తన జీవిత చరిత్ర “The Substance And The Shadow” లో ఆమెతో ప్రేమలో పడిన క్షణం గురించి దిలీప్ కుమార్ ఇలా రాశాడు
” నేను కారు దిగి ఇంటి ముందున్న అందమైన తోటలోకి అడుగు పెట్టినప్పుడు అక్కడ నిలిచి ఉన్న సైరా పై నా దృష్టి పడింది. అందమైన చీర లో మరింత అందమైన ఆమెను చూసి నేను నివ్వెర పోయాను. ఆమె ఇప్పుడు చిన్న పిల్ల కాదు. ఇంతకు ముందు ఆమెతో సినిమాలు చేయడానికి నేను ఇష్టపడలేదు. ఎందుకంటే ఆమె మరి చిన్నపిల్ల లాగా ఉంది. కానీ ఇప్పుడు అందమైన అమ్మాయి గా మారింది. నేను అడుగు ముందుకు వేసి ఆమె చేయి నా చేతిలోకి తీసుకున్నాను. అప్పుడు మా ఇద్దరికీ కాలం ఆగిపోయినట్టు అనిపించింది.”

 


అలా అందుకున్న ఆ చెయ్యి ఈరోజు వరకు ఆయన చేతిలోనే ఉంది. 54 ఏళ్ల ఆ వైవాహిక బంధం ఇప్పటికీ కొనసాగుతుండడం విశేషం!
ఇప్పుడు వారి ప్రేమ కథ టైటిల్ ” ఆమెకి 76- ఆయనకి 97″. వయసు పెరుగుతోంది, టైటిల్ మారుతోంది, అయినా ప్రేమ కొనసాగుతోంది! ఇది ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం!!
Saleem Basha CS

(CS Saleem Basha వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)