మాఫియా గుప్పిటి నుంచి గండి క్షేత్రాన్ని విడిపించండి: మానవ హక్కుల వేదిక

(Yanamala Nagireddy)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఇరుగు పొరుగు రాష్ట్రాలలో కూడా  గండి వీరాంజయస్వామి ఆలయం చాలా ప్రఖ్యాతి చెందిన క్షేత్రం. కోరిన కోర్కెలు తీరుస్తాండు కాబట్టి ఆయన అభయాంజనేయుడని కూడా పేరుంది.  దేశంలో శక్తివంతమని ప్రజలు నమ్మే ఆంజనేయస్వామి ఆలయాలలో గండి పేరు ముందుచెప్పుకోవాలి. గండి అంటే లోయ. పాపాఘ్ని నది ఒడ్డున ఉంటుది కాబట్టి ఈ ఆలయానికి గండి అంజనేయ స్వామి ఆలయమని పేరొచ్చింది. కడప పట్టణానికి 55 కిమీ దూరాన, వేంపల్లి పట్టణానికి 8 కిమీ దూరన ఉంటుంది. చుట్టూరఎత్తయిన  కొండలు,పక్కన  పవిత్ర పాపాఘ్ని నది చాలా ఆహ్లదకరమయిన వాతావరణంలో గండి క్షేత్రం ఉంటుంది. ఆలయానికి రోజూవేల  సంఖ్యలో భక్తులు వస్తూంటారు. రాబడి కూడా బాగానే ఉంటుంది.
 ఇలాంటి గుడి మాఫియా గప్పిట్లోకి జారుకుందని ప్రజలు అనుమానిస్తున్నారు. ఇక్కడ  జరుగుతున్న అనేక  అవాంఛనీయ సంఘటనలకు రాజకీయ అక్రమార్కుల జోక్యమే కారణమనే ప్రజలు వాపోతున్నారు.
అక్రమార్కుల మాఫియా రాజకీయాలనుండి గుడిని, భక్తుల నమ్మకాన్ని, కాపాడాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు  కె జయశ్రీ డిమాండ్ చేశారు.
ఈ మేరకు జయశ్రీ దేవాదాయశాఖ అధికారులకు, ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఇటీవల కడప జిల్లా, చక్రాయపేట మండలం గండి ఆంజనేయస్వామి ఆలయ పూజారి కుటుంబాలు ఆస్తి తగాదాల పేరుతొ బాహాటంగా కొట్టుకోవటం, అధికారులు పూజారులను సస్పెండ్ చేయడం జరిగింది.
కాగా గండిలో జరుగుతున్న వ్యవహారాలపై ఇటీవల ఒక భక్తుడు  దేవాదాయ కమిషనర్ కు ఫిర్యాదు చేయటంతో  వై.ఎస్. కొండారెడ్డి అనే నేతకు బాగా కోపంమొచ్చింది.దీనితో ఆయన అనుచరులు ఆ భక్తుడి  అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగారు.
ఈ  నేపథ్యంలో తాను  గండి గుడికి వెళ్లి పూజారి కుటుంబాలను , ఆలయ అధికారులను, స్థానిక ప్రజలను కలిసి వివరాలు సేకరించటం జరిగిందని,  వైసీపీ పార్టీ మండల ఇంచార్జి గా ఉన్న వైఎస్ కొండారెడ్డే వ్యవహారశైలే ఈ  ఘర్షణలకు  కారణమని తమ విచారణలో తేలిందని జయశ్రీ ఒక ప్రకటనలో ఆరోపించారు.
టిటిడి నిర్వాకమే ప్రస్తుత స్థితికి కారణం.
13 సంవత్సరాల క్రింద 2007 లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఈ ఆలయాన్ని టీటీడీ ఆధీనంలో తెచ్చారు. దీని వల్ల  ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని భావించి  గండి ఆలయాన్ని టీటీడీకి స్వాధీనం చేశారు.
అయితే టీటీడీ అధికారులు ఆలయ నిర్వహణను గాలికి వదిలేశారు.  సక్రమంగా  పర్యవేక్షించక పోవడంతో ఇక్కడ  అనేక అక్రమాలు, అవినీతి జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
2007 నుండి 2015 వరకు గండి ఆలయం ద్వారా టీటీడీకి 24 కోట్ల ఆదాయం వస్తే టీటీడీ కేవలం 7 కోట్లు మాత్రమే గండి ఆలయం అభివృద్ధికి ఖర్చు చేసింది. అందులోనే చేయని పనులకు రెండు కోట్ల మేరకు బిల్లులు చెల్లించారనే ఆరోపణలున్నాయి. అప్పట్లో కేజీ బంగారు సుమారు వంద కేజీల వెండి,  డిపాజిట్లు, రికార్డులు ఇప్పటికీ టీటీడీ వద్దనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కొందరు భక్తులు 2013 మరియు 2015లో  హై కోర్టులో కేసులు వేసి ఈ ఆలయ నిర్వహణను  టీటీడీ నుండి తిరిగి  దేవాదాయ శాఖకు అప్పగించటం జరిగింది. అప్పటి నుండి ఆలయ నిర్వహణ సులభతరమై ఆలయానికి కోట్లల్లో ఆదాయం కూడా పెరిగినట్లు పూజారులు, అధికారులు చెప్తున్నారు.
గండి గుడి టి‌టి‌డి పరిధిలో వున్నపుడు పూల ,పండ్ల అమ్మకం కాంట్రాక్ట్ ద్వారా 2.30 లక్షల ఆదాయం రాగా  దేవాదాయ శాఖ  హయాంలో అదే కాంట్రాక్ట్ వల్ల  సంవత్సరానికి 20 లక్షల ఆదాయం వచ్చిండి.  2015-2019 మధ్యలో ఎండోమెంట్ వారి ఆద్వర్యం లో నాలుగు కోట్ల పనులు చేయటమే కాక ,ఆరు కోట్లు స్వామి పేరు మీద డిపాజిట్ చేయటం జరిగింది. అందుకే అక్కడ పనిచేసేవారే కాకుండా, భక్తులు,చుట్టుపక్క గ్రామస్తులందరు ఆలయాన్ని  టి‌టి‌డి లో చేర్చకూడదని గట్టిగా చెబుతున్నారు.

ఇది ఇలా ఉండగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ జులై లో 4 కోట్ల ఆలయ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. అయితే  ఆగస్టు 2న గండి ఆలయాన్ని టీటీడీలో చేరుస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం, తిరుపతికి చెందిన నవీన్ అనే భక్తుడు హైకోర్టును ఆశ్రయించి గండి ఆలయాన్ని యధాతధంగా ఉండేటట్లు ఉత్తర్వులు తేవడం జరిగింది.
అయితే గండి ఆలయం టీటీడీ నిర్వహణలో ఉన్న సమయంలో ఆలయ వ్యవహారాలన్నింటిలో  జోక్యం చేసుకుంటూ అనేక రకాలుగా పెత్తనం చెలాయించి, దేవాలయ ఆదాయానికి గండి కొట్టి  ఆర్థికంగా ప్రయోజనం పొందిన వర్గాలు గుడిని ముఖ్యమంత్రికి తెలియకుండా తిరిగి టీటీడీ కి అప్పగించడానికి  యత్నిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారని జయశ్రీ వివరించారు.
టీటీడీ అధీనంలో ఉన్న 13 సంవత్సరాలలో  గండి ఆలయం ఏమాత్రం  అభివృద్ధి చెందలేదని, దేవాలయ ఆదాయం కూడా టీటీడీ తీసుకున్నదని, అందువల్ల గండి ఆలయాన్ని టీటీడీ లో చేర్చడం మంచిది కాదని భక్తులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఆమె వివరించారు.
ఈ సందర్భంలో ఆలయ పూజారి కుటుంబాలు కొట్టుకోవటం వెనుక, వారి కలహాల్ని పెంచి, పోషించటం వెనుక స్థానిక వైసీపీ మండల ఇంచార్జి వైఎస్ కొండారెడ్డి హస్తం ఉందనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి.  ఈ కారణాలను సాకుగా చూపి గండి గుడిని తిరిగి టీటీడీకి అప్పగించి తాను “గండి గుడి వ్యవహారాలలో తనదైన శైలిలో  చక్రం తిప్పడానికే ” కొండారెడ్డి ఇలాంటి వ్యవహారాలను ప్రోత్సహిస్తున్నారని గుడిలోపల, బయటా పలువురు  ఆరోపిస్తున్నారు. ఈ  విషయాన్ని ఒక భక్తుడు వాట్సాప్  ద్వారా దేవాదాయ శాఖ ఉన్నాతాధికారికి ఫిర్యాదు చేశాడు. ఇప్పుడతన్ని కొండారెడ్డి మనుషులు అనేక రకాలుగా బెదిరిస్తున్నారు. గండి గుడి విషయంలో ఫిర్యాదు దారుల్ని రక్షించి,  కొండారెడ్డి పాత్రపై విచారణ జరపాలని జయశ్రీ డిమాండ్ చేశారు.
వైఎస్ కొండారెడ్డి  ఘనచరిత్ర అందరికీ సుపరిచితమే!
వైఎస్ కొండారెడ్డి గారి ఘనచరిత్ర, వ్యవహార శైలి, ఆగడాలు, పంచాయితీలు, పార్టీలకు అతీతంగా ప్రజలకు బెదిరింపులు లాంటి ఘన కార్యాలన్నీ  స్థానికులకు గత దశాబ్ద కాలంగా సుపరిచితమే. కేవలం పేరులో ఉన్న వైఎస్ అనే రెండక్షరాల్ని ఆధారం చేసుకుని ఒక సాధారణ ఇంజనీర్ ఈరోజు కోట్లకు పడగలెత్తి చక్రాయిపేట మండలాన్ని తమ సామంత రాజ్యంగా మార్చుకున్నాడు. మంది, మార్భలాన్ని వెంట వేసుకుని, బహిరంగంగా మారణాయుధాలు చూపిస్తూ , అందర్నీ బెదిరిస్తూ అనేక శాంతి భద్రతల సమస్యకు కారణమవుతున్నాడనేది బహిరంగ సత్యం. వీరి వ్యవహార శైలిపై గతంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, వైసీపీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ గారికి, ప్రస్తుత కడప ఎం.పి  అవినాష్ రెడ్డికి, పులివెందుల నియోజకవర్గ భాద్యుడు భాస్కర్ రెడ్డికి పుంఖాను పుంఖాలుగా పిర్యాదులు వెళ్లినా కొండారెడ్డిగారి సామంత రాజ్యానికి, ఆయన అధికారానికి ఇప్పటి వరకు ఎలాంటి ఢోకా లేదని, అందుకు కారణం కేవలం ఆయన పేరుకు ముందున్న “వై.ఎస్.” అన్న రెండక్షరాలేనని  స్థానికులు వాపోతున్నారని జయశ్రీ తెలిపారు. ఆయన మాట వినక పొతే వైసీపీ కార్యకర్తలైనా, చివరకు  కడప ఎం. పి అవినాష్ రెడ్డి అనుచరులైనా వారికి వేధింపులు తప్పవని వైసీపీ రెండవ శ్రేణి నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారని ఆమె తన ప్రకటనలో వివరించారు.
 ఇప్పటికే మండలంలో ని ప్రజలకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్న వైఎస్ కొండారెడ్డి
 వ్యవహార శైలిపై విచారణ జరిపి, ఆయన ఆగడాలనుండి ప్రజలను కాపాడాలని,  వైసీపీ  మండల రాజకీయ భాద్యతల నుండి తప్పించి కనీసం మీ పార్టీ కార్యకర్తలనైనా కాపాడుకోవాలని ఆమె ముఖ్యమంత్రిని కోరారు.
అలాగే  “ఆలయ గత చరిత్రను పరిశీలించడంతోపాటు  భక్తుల , ప్రజల అభిప్రాయాన్ని సేకరించిన  తర్వాతనే ఆలయ నిర్వహణ పై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. గండి ఆంజనేయస్వామి ఆలయం ఎవరి ఆధీనంలో ఉంటే  అభివృద్ధి జరుగుతుందో రికార్డుల పరంగా పరిశీలించాలని, ఆలయ నిర్వహణలో రాజకీయ నాయకుల , కాంట్రాక్టర్ల జోక్యాన్ని నిరోధించి, ముఖ్యమంత్రి ఆశిస్తున్న అవినీతి రహిత పాలనను గండి దేవాలయానికి అందించి భక్తుల మనోభావాలను పరిరక్షించాలని జయశ్రీ కోరారు.
(గండి క్షేత్రం ఫోటో సోర్స్  మా రాయలసీమ facebook నుంచి
(Yanamala Nagireddy is a senior journalist from Kadapa)