తిరుపతి, ఆగష్టు 21: చిత్తూరు జిల్లాలో కోవిడ్ కేసులు ప్రమాద స్థాయికి చేరుకున్నాయని వైసిపి ఎమ్మెల్యే, కోవిడ్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు.
ప్రారంభ దశలో 2,3 శాతంగా ఉండి, గత నెల నుండి 6 శాతంగా , గత 17,18 రోజుల్లో 17 శాతానికి పెరిగి, తత రెండు రోజులుగా 20 నుండి 25 శాతానికి చేరి చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక కేసులతో మొదటి స్థానం చేరుకోవడం ప్రమాద స్థాయి అని ఆయన హెచ్చరించారు.
ఈ రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటీన్ ప్రకారం గత 24 గంటకలలో నమోదయిన 1103 కొత్త కేసులతో చిత్తూరు జిల్లా కొత్త కేసులలో మూడో స్థానానికి వచ్చింది. మొదటి స్థానం 1312 కేసులతో తూర్పుగోదావరిది కాగా, 1131 కేసులతో పశ్చిమ గోదావరి రెండో స్థానంలో ఉంది. ఇపుడు చిత్తూరు టాప్ కు వస్తూ ఉన్నది . ఈ రోజు జిల్లాలో నమోదయిన మొత్తం కేసులు 27676. యాక్టివ్ కేసులు 9932, మరణించిన వారు 304 మంది. గత 24 గంటలలో 16 మరణాలతో చిత్తూరు జిల్లా నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది.
ఈ వాస్తవం నేపథ్యలో ఆయన ప్రసంగిస్తూ ప్రజలు ఇకనైనా మేలుకోవాలని భూమన కరుణాకర రెడ్డి అన్నారు.
శుక్రవారం మద్యాహ్నం స్థానిక ఇఎస్ఐ ఆసుపత్రి వద్ద కోవిడ్ పేషెంట్ల అడ్మిషన్, డిశ్చార్జ్, కోవిడ్ బారిన పడిన వారి ఆరోగ్యం గురించి బందువులు తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన ఇఎస్ఐ రెసెప్షన్ కౌంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంల కొ-ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్తా, జెసి (డి) వీరబ్రహ్మం, తుడ వీసీ హరికృష్ణ పాల్గొన్నారు.
ఈ సంధర్బంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి యంత్రాంగం, వైద్యులు, పారిశుద్ద్య కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నా, ప్రజల్లో అవగాహన లేక జిల్లాలో కేసులు పెరగడం బాధాకరమైన విషయం అని భూమన అన్నారు.
భౌతిక దూరం పాటించి, మాస్కులు ధరించి, శానిటైజర్, సబ్బులతో చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు ప్రజలు ఇకనైనా పాటించాలని సూచించారు.
కోఆర్డినేషన్ కమిటీ కో ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోగ్యం , ఆహారం, వసతులపై శ్రద్ధ పెట్టి చేస్తున్నారని తెలిపారు. ప్రధాన ఆరోపణలు చికిత్స పొందుతున్న వారి బందువులు అడ్మిషన్ లో ఉన్న మావాళ్ళ ఆరోగ్యం తెలుసుకోలేక పోతున్నామని తెలియజేస్తుండడంతో అన్నీ ఆసుపత్రులు, కేర్ సెంటర్ల వద్ద రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటులో భాగంగా నేడు ఇఎస్ఐ వద్ద ప్రారంభించామని, మరో రెండు, మూడు రోజుల్లో అన్ని చోట్ల ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
వైద్యులు సమాధానం ఇవ్వలేదనే ఆరోపణలు వద్దని , వారు పిపిఇ కిట్లు వాడి లోపలికెళితే ఫోన్ కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంటుందని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాబోవు 45 రోజులు అత్యంత కీలకమని హెచ్చరికలు చేశాయని, కష్ట పడుతున్న జిల్లా యంత్రాంగానికి ప్రజలు తమ వంతుగా కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్తలు ముఖ్యమని అన్నారు.
ఆనంతరం గోవిందరాజ స్వామి సత్రాలను కోవిడ్ కేర్ కోసం పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఇఎస్ఐ సూపరింటెండెంట్ బాలశంకర్ రెడ్డి, తుడా సెక్రెటరీ లక్ష్మి, సెంట్రల్ కమిటీ మురళీకృష్ణ రెడ్డి, ఐఎంఎ డాక్టర్లు కృష్ణప్రశాంతి, యుగంధర్, తుడా డిఇఇ రవీంద్ర, అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.