మంగళగిరి అంటే పానకాల స్వామి, ఆ పైన చింతక్రింది కనకయ్య, ఎవరీ కనకయ్య?

మంగళగిరిలో పానకాల లక్ష్మీనరసింహ స్వామి తరువాత గుర్తుంచుకోవలసిన వ్యక్తి చింతక్రింది కనకయ్య.
మంగళగిరి చరిత్రతో పానకాల స్వామి చరిత్ర ఎలా ముడిపడి ఉందో అలాగే కనకయ్య  పేరు కూడా ముడిపడి ఉంది. వితరణ శీలి, విద్యాదాత కనకయ్య మంగళగిరిలోని అత్యంత ఉన్నత వ్యక్తులలో ఒకరుగా నిలిచారు.
పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో చదువుకున్న ప్రతి వ్యక్తికి ఆయన పేరు గుర్తుంటుంది. ఆయన ముందు చూపుతో వేసిన పునాది వల్ల ఇప్పటికే లక్ష మందికిపైగా విద్యావంతులు అవడానికి అవకాశం ఏర్పడింది.
ప్రతి పిల్లవాడు మనసికంగా ఎదగడానికి, పరిణతి చెందడానికి విద్య ఎంతో ముఖ్యమైనది. ఆ విషయాన్ని ఆయన స్వాతంత్ర్యానికి పూర్వమే గుర్తించారు. మాటలతో కాకుండా చేతలతో చూపించారు. విద్యా సంస్థ ఏర్పాటుకు ఆ రోజుల్లో ఆయన రూ.26,000 లు విరాళం ఇచ్చారు. దాంతో 1944 ఆగస్టు 29న మంగళగిరిలో ఆయన పేరుపై ఉన్నత పాఠశాల ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి పునాదిపడిది. మంగళగిరి, కాజ, చినకాకాని, పెదవడ్లపూడి, ఆత్మకూరు, ఇప్పటం, వడ్డేశ్వరం, ఎర్రబాలెం, నవులూరు, బేతపూడి తదితర చుట్టుపక్కల గ్రామాల పిల్లల పిల్లలందరికీ 74 ఏళ్లుగా కులమతాలు, పేదగొప్ప బేధంలేకుండా చింతక్రింది కనకయ్య ఉన్నత పాఠశాల విద్యనందిస్తోంది.
ఈ విద్యా సంస్థకు విరాళం ఇచ్చినవారందరూ పద్మశాలీయులే కావడం ఓ విశేషం. ఈ హైస్కూల్ కమిటీకి తొలుత వ్యవస్థాపక అధ్యక్షులుగా కనకయ్య గారే ఉన్నారు. ఓ అర్ధ శతాబ్ధం పాటు ఈ ప్రాంతంలోని దాదాపు అందరూ ఈ హైస్కూల్ లోనే విద్యనభ్యసించారు. ఇక్కడ చదివిన వారు ప్రభుత్వంలో ఐఏఎస్ వంటి ఉన్నత పదవులతోపాటు వివిధ స్థాయిలలో ఉద్యోగాలు చేశారు. చేస్తున్నారు. దేశవిదేశాల్లో అత్యున్నత విద్యావంతులు, డాక్టర్లు, శాస్త్రవేత్తలుగా స్థిరపడ్డారు. మంత్రి, ఎమ్మెల్యేల వంటి అనేక రాజకీయ పదవులు అలంకరించారు. ఈ ప్రాంతంలోని ఉద్దండులందరూ ఇక్కడ చదివినవారే.
వరదప్ప గారి కుమారుడైన కనకయ్య భార్య పేరు దుర్గమ్మ. ఆ దంపతులకు రమాకాంతం, వరదయ్య ఇద్దరు కొడుకులు. వీరమ్మ, లక్ష్మమ్మ, వెంకాయమ్మ, రావమ్మ, వీరాంజమ్మ, సుక్కమ్మ, సావిత్రి ఏడుగురు ఆడపిల్లలు. మంగళగిరి నుంచి శాసన మండలికి ఇప్పటి వరకు ఎన్నికైన ఏకైక వ్యక్తి దామర్ల రమాకాంత రావు ఆయన 4వ కుమార్తె రావమ్మ భర్త. రమాకాంతం కుమారుడు కనకయ్య ప్రస్తుతం సీకే హైస్కూల్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నారు. ఆ కాలంలో కనకయ్య గారు ఈ ప్రాంతంలో పెద్ద వ్యాపార వేత్త. పోగాకు వ్యాపారం చేసేశారు. నిడమర్రు రోడ్డులో పెద్ద రైస్ మిల్లు నిర్వహించారు. ఇంకా పలు వ్యాపారాలు చేసేవారు. జిల్లాలో పలుకుబడి కలిగిన రాజకీయ వేత్తలలో ఒకరుగా నిలిచారు. 1948లో ప్రాంతంలో మంగళగిరి గ్రామ పంచాయతీ అధ్యక్షులుగా ఉన్నారు. మంగళగిరి అభివృద్ధికి పునాది వేసి ఈ ప్రాంత ప్రజల హ్రుదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న కనకయ్య గారు 1950లో కన్నుమూశారు.
(శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ మొబైల్: 9440222914)