శ్రీరామ జన్మభూమి గుడి నిర్మాణ పూజ సందర్భంగా రాజకీయ,ఆర్థిక సామాజిక విశ్లేషకులు డాక్టర్ కే.నాగేశ్వర్ తన రోజువారి య్యుటూబ్ చానల్ ద్వారా శ్రీ రాముడి పాలనదక్షత గురించి శ్రీ రాముడి రాజ్య సంక్షేమభరితమైన సువర్ణ పాలన అద్భుతం గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. రామాయణం తన పదవయేటనే చదివేసిన విషయాన్ని గొప్పగా చెప్పుకున్నారు. అది ఆయన దృక్పథం, దాన్ని విమర్శించే రైట్ కూడా ఎవరికి లేదు. అయినా డాక్టర్ నాగేశ్వర్ గారిని విమర్శించే సాహసం ఇటు వామపక్ష మేధావులు గానీవ్వండి, అంబేద్కరిస్టు మేధావులు గానీవ్వండి విమర్శించినట్టు నేనూ చూడలేదు.
ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఈదేశంలోనే అతికొద్ది మంది బహుజన మేధావుల్లో అత్యంత ప్రతిభా సంపన్నుడు ఆయన జాతీయ,అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై ఒక స్పష్టమైన తాత్వికత కలిగిన మేధావి.
14-8-2020నాడు భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని విశ్లేషిస్తూ శ్రీ రాముడు ఓబీసీ,దళిత,గిరిజన, మైనారిటీల సంరక్షకుడైతే పార్లమెంట్ లో కులనిర్మూలన చట్టం కూడా ప్రవేశ పెట్టాలని నర్మగర్భంగా తన వ్యాసంలో ప్రకటించారు. దానిపై కొంతమంది ప్రగతిశీల ముసుగు వీరులు ఒంటికాలిపై నిలబడి మనువాదులు కులనిర్మూలన చట్టం తెస్తారా.. అంటూ డాక్టర్ అంబెడ్కర్ పాదాలకాడ తలబద్దలు కొట్టుకుంటున్న ప్రగతిశీల ముసుగు వీరులంతా ప్రొఫెసర్ ఐలయ్య మేధస్సు పాతివ్రత్యాన్ని రష్యా,చైనా ల్యాబ్ ల్లో పరిక్షలు చేయడానికి పోటీపడుతున్న తీరును చూస్తే నాకు వారిపై జాలికలుగుతుంది.
2017లో కోమట్లపై ఐలయ్యగారి పుస్తక వివాదం సందర్భంగా తన కులాన్ని సపోర్ట్ చేస్తూ డాక్టర్ నాగేశ్వర్ గారు,మరోవైపు రాజకీయ విశ్లేషకులు సిపిఎం రాష్ట్ర నాయకులు తెలకపల్లి రవి, ఐలయ్య పై సైద్ధాంతిక దాడి ప్రారంభించినప్పుడు, బహుజనులం మనకెందుకు లేకపాయే ఈసోయి అంటూ నేను డాక్టర్ నాగేశ్వర్ తెలకపల్లి రవి లను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను.
అప్పటికే సిపిఎం పార్టీ నిర్మాణం తో గొడవపడుతున్న నన్ను పార్టీ నుండి బయటకు పంపించే అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆధిపత్య వాదులకు మంచి అవకాశం దొరికింది అది వేరే విషయమనుకొండి. నా ముప్పై రెండు సంవత్సరాల కమ్యూనిస్టు ప్రస్థానంలో నేనేందుకు సిపిఎం నుండి బయటకు వెల్లిపోయానో వివరిస్తాను.
ఇక అసలు విషయం ఏమిటంటే ఐలయ్య పై కేవలం వర్గవాదులే కాదు మనువాదులు కూడా సమయం దొరికినప్పుడల్లా ఆయనపై వ్యక్తిగత దూషణలు, సైద్ధాంతిక దాడి చేస్తున్న విషయం తెల్సిందే.
తెలంగాణ ఎన్నికల కంటే ముందు ఐలయ్య గారు టి.మాస్, బిఎల్ఎఫ్,తెలంగాణ మేధావుల ఫోరమ్ తదితర సంస్థల ఏర్పాటు విషయంలో కీలకమైన పాత్ర పోషించారు.
అంతేకాదు ఈదేశంలో కుల సమస్యపై స్పష్టమైన సామాజిక దృక్పథం కలిగిన ఏకైక పార్టీ సిపిఎంపార్టీ మాత్రమే అని ప్రకటించారు ఆయనను కలిసిన ప్రతివారికీ సిపిఎంలో చేరి పనిచేయమని కోరేవారు. ఆ రోజు సిపిఎం బిఎల్ఎఫ్ ద్వారా దేశంలో నీల్ లాల్ శక్తులకు ఒక మార్గనిర్దేశం చేయగలదని ఐలయ్యగారితోపాటు లక్షలాదిమంది బహుజనులు ఆశించినమాట వాస్తవమే.
ఎప్పుడైతే సిపిఎం బిఎల్ఎఫ్ నుండి వెనక్కి వెల్లిపోయిందో ఐలయ్య ఆయనతో పాటు చాలా మంది మేధావులు ఉద్యమాల ఉపాధ్యాయులు ఉసా, కాకి మాధవ రావు, జేబి రాజు, ప్రొఫెసర్స్ ఐ. తిరుమలి, సుదర్శన్ రావు,ఈశ్వరయ్య,బి.సుదర్శన్ ఇంకా అనేక మంది మేధావులు నిరాశకు గురయ్యారు.
అప్పుడు ప్రొఫెసర్ ఐలయ్య కమ్యూనిస్టు పార్టీలు బహుజనీరణ చెందకుండా ఆ పార్టీలు ఈదేశంలో సోషలిజం నిర్మించడం అనేది అసాధ్యమని ప్రకటించారు. ఇటీవల కాలంలో కామ్రేడ్ ఉసా గారు అమరులయ్యాక తాను ఉ.సాలు కమ్యూనిస్టు పార్టీలనుండి బయటకు రావడానికి కారణం ఆయా విప్లవ, కమ్యూనిస్టు పార్టీలు బహుజనకులాల నాయకత్వంలోకి రాకుండా సామాజిక మార్పును ఆశించలేమని ప్రకటించారు.
దీంతో ఆయా ప్రగతిశీల సంస్థల్లోని మూసవాదులంతా రగిలిపోయే సందర్భంలో మోదీ రాముడు అందరివాడు! అని హెడ్డింగ్ తో రాసి వ్యాసాన్ని అడ్డుపెట్టుకోని తమదాడిని ఐలయ్యపై ప్రారంభించారు వర్గవాద ఆధిపత్యవాదులు.
ఒకే అంశంపై డాక్టర్ నాగేశ్వర్, ప్రొఫెసర్ ఐలయ్య విశ్లేషణలు చేస్తే డాక్టర్ నాగేశ్వర్ పై లెవ్వని నోర్లు, ఐలయ్యపై ఎందుకు లేస్తున్నాయి అనేది బహుజనులు ఆలోచించాలసిన అసలు విషయం.
వంద సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో బహుజనులు కోల్పోయిన భవిష్యత్తును తిరిగి పొందలేకపోయినా, పెరియార్ స్థాపించిన ఆత్మగౌరవ కమ్యూనిస్టు పార్టీ స్పూర్తిని కామ్రేడ్స్:మారోజువీరన్న మద్దికాల ఓంకార్,ఉసాల ఆత్మగౌరవ నీల్ లాల్ జమిలి పోరాట ఇరుసుపై ఫూలే-అంబేద్కర్ ల సోషలిస్టు వ్యవస్థను, గౌతమ బుద్ధుడి జ్ఞాన సిద్ధాంతమే మూలభారతీయుల విముక్తికి మార్గనిర్దేశం చేయగలదని నమ్మేవారంతా ఈగట్టునుంటారో గట్టునుంటారో.ఆలోచించండి… ఐలయ్య పై జరిగే ప్రతిదాడి బహుజన సమాజంపై జరిగే దాడిగానే చూడాలి.
(దండి వెంకట్,కన్వీనర్,బహుజన లెఫ్ట్ ఫ్రంట్ -బిఎల్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ)