సర్దార్ సర్వాయి పాపన్న పోరాటమే నేటి సామాజిక ఉద్యమాల దిశ

(అక్కల బాబుగౌడ్)
సర్దార్ సర్వాయి పాపన్న 370 జయంతి ఉత్సవాలు రాష్ట్రంలో వారంరోజులపాటు జరుపుకోవాలని గౌడ్ ఐక్య సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న చరిత్ర కనుమరుగైపోయిందని అనుకున్నారు.
పాపన్న రాజ్యపాలన, చరిత్రను భావితరానికి అందకుండా భూస్థాపితం చేశామనుకున్నారు. కానీ పాపన్న చరిత్ర శుద్ధి చేసిన విత్తనమై భూమిని చీల్చుకొని మొలకెత్తింది.
\సర్వాయి పాపన్న చరిత్ర ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే కాదు, ఆంధ్ర, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలోని జానపద కళాకారుల ఆటపాటల్లో సజీవమై ప్రజల నాల్కల మీద పాటై ప్రవహించి పది తరాలను దాటి నేటి తరానికి సర్వాయి పాపన్న చరిత్రను పదిలపరిచి, ప్రజల గుండెల్లో నిలిపిన ఘనత మన ప్రజల జానపద కళారూపాలకె దక్కిందన్న సత్యం మరువలేనిది.
ఛత్రపతి శివాజీ మహరాజ్, సర్దార్ సర్వాయి పాపన్న కన్న 20 సంవత్సరాలు ముందు జన్మించారు. 1674లో శివాజీ మహరాజ్ రాజుగా ప్రకటించుకుంటే, ఇంచుమించు ఇదే కాలంలోనే సర్దార్ సర్వాయి పాపన్న 1675 సంవత్సరంలో ఖలాషాపూర్ ను రాజధానిగా చేసుకొని సర్వాయి పాపన్న తన రాజ్య స్థాపన గావించి, పాలన ప్రారంభించరు.
ఇద్దరూ శూద్ర జాతికి చెందినవారే. ఆనాటి సామాజిక పరిస్థితులలో వర్ణాశ్రమ ధర్మం బలంగా అమలు జరుగుతున్న సాంప్రదాయాన్ని కాలరాచి కత్తిపట్టి యుద్ధం చేసిన యోధులు.
సర్వాయి పాపన్న సుమారు 30 ఏళ్లపాటు స్వయం పాలన చేశారు. శివాజీ మహరాజ్ కూడా 20 సంవత్సరాలకుపైగా రాజ్యపాలన చేశారు. కాని, ఛత్రపతి శివాజీకి దేశ చరిత్రలో దక్కిన స్థానం సర్దార్ సర్వాయి పాపన్నకు దక్కలేదు.
కనీస చారిత్రక ఆనవాళ్లు కూడా లేకుండా చేశారు. ఛత్రపతి శివాజీ మొఘల్ చక్రవర్తుల సైన్యానికి, పాలనకు వ్యతిరేకంగా, అదే సమయంలో స్వంత దేశ ఆదిపత్య సామాజిక వర్గాల కుట్రలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు.
అదే సమయంలో సర్దార్ సర్వాయి పాపన్న కూడా మొఘల్ చక్రవర్తుల ఆదీనంలోని గోల్కొండ సుబేదార్ల సైన్యంతో, తెలంగాణలో జమిందార్లు, జాగీర్దార్లు, దేశ్ ముఖులు, భూస్వాములతో ఏకకాలంలో యుద్ధం చేసి తన రాజ్యపాలన గావించారు.
1874 సంవత్సరంలోనే మొదటిసారిగా బ్రిటీష్ చరిత్రకారుడు జె.ఏ.బోయల్ (John Andrew Boyle) తెలంగాణ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడి జానపద పాట(Telgu Ballad Poetry 1874) ల్లో వున్న పాపన్న చరిత్రను వెలుగులోకి తెచ్చి ప్రపంచానికి పరిచయం చేశారు.
పాపన్న చరిత్రను దేశంలోని పాలకులు, ఆదిపత్య సామాజికవర్గం కనీసం తెలంగాణ గడ్డమీద కూడ ప్రజలకు తెలియకుండా జాగ్రత్తపడినప్పటికీ సర్వాయి పాపన్న చరిత్ర భారత ఉపఖండం దాటి, యూరప్ ఖండంలో పుస్తక రూపంలో ప్రపంచానికి అందించిన ఘటన రిచర్డ్ మాక్స్ వెల్ ఈటెన్ (Richard Maxwell Eaton)కు, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి దక్కింది.
దక్షిణ భారతదేశంలోని ఎనిమిది మంది మహనీయుల చరిత్రను “సోషల్ హిస్టరీ ఆఫ్ డక్కన్ : 8 ఇండియన్ లైవ్స్”  (Social History of the Deccan 1300-1761: Eight Indian Lives) పేర ఒక చారిత్రక గ్రంథాన్ని అరిజోన విశ్వవిద్యాలయానికి చెందిన రిచర్డ్ మాక్స్ వెల్ ఈటెన్ ఈ పుస్తకాన్ని రచించితే, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ప్రెస్ వారు 2005లో పుస్తకాన్ని విడుదల చేశారు.
అంతేకాదు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని లండన్ విక్టోరియా మ్యూజియంలో ప్రజల సందర్శన కోసం వుంచారు.
ఈనాటి సమాజం సర్వాయి పాపన్న పోరాటాన్ని, ఆశయాన్ని ఇప్పటి పరిస్థితులలో అధ్యయనం చేయాల్సిన అవసరం వుందా? అని ఉద్యమకారులు, విద్యావంతులు ఆలోచించాల్సిన అవసరం వుంది.
ఈనాడు మనకు ఎందరో మన ముందున్న మహనీయులు జీవితకాలం పోరాడిన పోరాటాలు, వారు అందించిన సిద్ధాంత భావజాలం, వారి త్యాగాలు, చరిత్ర పాఠాలు మనకు అందుబాటులో వున్నవి. అన్నింటికి మించి బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వుంది.
ఇంతటి గొప్ప ఉద్యమకారుల అనుభవాలు, ఆదర్శాలు, ఆశయాలు కలిగి వుండి ఈనాడు సామాజిక న్యాయం కావాలని సామ్యవాద తరహ సమసమాజ స్థాపన జరగాలని, సంక్షేమ రాజ్యం కావాలని, దోపిడిలేని పాలన కావాలని 70 ఏళ్లుగా మన స్వంత పాలకుల ఏలుబడిలోనే, అధికారానికి, అభివృద్ధికి, అవకాశాలకు దూరం చేయబడ్డ 85 శాతం అణగారిన సామాజిక వర్గాల ప్రజలు ఉద్యమాలు చేస్తూనే వున్నారు.
కానీ సామాజిక న్యాయం అందని ఎండమావి అయ్యింది. అందుకే ఈనాటి విద్యావంతులు ఆలోచించాల్సిన అవసరం వుంది. కానీ 350 సంవత్సరాల క్రితమే సర్వాయి పాపన్నకు సిద్ధాంతాలు తెలియవు. ప్రపంచ విప్లవాల అధ్యయనం అసలు లేదు. ఉన్నత రాజరిక వంశ పారంపర్యం లేదు.
ఒక సామాన్య కుటుంబ కులవృత్తి నేపథ్యం కలిగి, కల్లుగీత కార్మికునిగా జీవనం సాగిస్తున్న సగటు మనిషి సర్దార్ సర్వాయి పాపన్న.
ఆనాటి బలమైన మొఘల్ చక్రవర్తుల నిరంకుశ పాలనను, స్థానిక జమిందారులు, జాగీర్ దారులు, దేశ్ ముఖ్ లు, భూస్వాముల దోపిడిని, దౌర్జన్యాన్ని ఎదిరించి, యుద్ధం చేసి సామాజిక న్యాయపాలన స్థాపించి, ప్రజలను ఆనాటి పాలకుల దోపిడి, దౌర్జన్యం, నిరంకుశ పాలన నుంచి విముక్తి చేశారు.
సర్దార్ సర్వాయి పాపన్న కాలం నాటి నిరంకుశ పాలన, దోపిడి, దౌర్జన్యం ఈనాటి సమాజంలో లేవని కాదు. కాని ఈనాటి నిరంకుశ పానల, దౌర్జన్యం, దోపిడి రూపాలు మార్చుకున్నవి. ఆధునిక చట్టాల ప్రకారమే, ప్రజలు వేసిన ఓటు అధికారంతోనే, ప్రజలకు అర్థంకాని దోపిడి, ప్రశ్నించే గొంతులను నొక్కివేయడం, ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వ పాలన కొనసాగుతున్న పరిస్థితులను అర్థం చేసుకోవాలి.
సర్దార్ సర్వాయి పాపన్న యుద్ధం చేసి సాధించిన బహుజనుల సామాజిక న్యాయ రాజ్యం స్థాపించిన తెలంగాణ మీదనే, నేడు 93 శాతం బహుజన వృత్తుల ప్రజలను 7 శాతం వున్న ఉన్నత ఆధిపత్య సామాజిక వర్గం పాలిస్తున్న పరిస్థితులలో మెజారిటీ ప్రజలు పేదరికంలో, చాలిచాలని మధ్యతరగతి బుతకుపోరులో ఓడిపోయి, రాజీపడి జీవిస్తున్న నేటి తెలంగాణ ప్రజల పరిస్థితిని అర్థం చేసుకోవాలి.
సర్వాయి పాపన్న ఒక తిరుగుబాటుదారినిగా, యోధునిగా మారడానికి గల పరిస్థితులను, కారణాలను పరిశీలించాల్సిన అవసరం వుంది. ఆనాటి ముస్లిమ్ పాలకుల నిరంకుశ పాలన, గ్రామస్థాయిలో భూస్వాములు, దేశ్ ముఖ్ లు, జమిందార్లు, జాగీర్ధార్ల దోపిడీ, అణచివేత, వెట్టిచాకిరి, స్థానిక సుబేదార్ల ఆగడాలతో ప్రజలు పడుతున్న బాధలు, కష్టాలు, కన్నీళ్లు చూసిన సర్వాయి పాపన్నను ఒక సామాన్య మనిషి నుంచి ఎదిరించే ధీరున్ని చేశాయి.
దోపిడీ, దౌర్జన్యం, నిరంకుశ పాలనలో ప్రజలు రాజీపడి, బాంచన్ దొర అని బానిసలుగా బతుకుతున్న కాలంలో సర్వాయి పాపన్న అందరిలా రాజీపడి బానిస బతుకు బతకరాదని, ఆనాటి దోపిడీ, దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఎదురు తిరగాలనే ధృడ నిశ్చయాన్ని, ధైర్యాన్ని సర్వాయి పాపన్నను ఆనాటి దుర్భర పరిస్థితులు ప్రేరేపించావి.
ఆనాటి ప్రజల కష్టాలు, కన్నీళ్లు సర్వాయి పాపన్నను యుద్ధానికి, వీరమరణానికి ఉసిగొల్పాయి. అదే సమయంలో ఆనాటి బలమైన మొఘల్ సైన్యాన్ని ఎదుర్కొనడం, స్థానిక జమిందారులను, భూస్వాములతో యుద్ధం చేయడానికి తన ఒక్కనితో, తన ఒక్క కులంతో సాధ్యం కాదని తెలుసుకొని, సబ్బండ వృత్తుల పీడిత ప్రజలను, యువకులను సమీకరించుకొని చిన్నదండుతో ప్రారంభించి, 12 వేల సైన్యాన్ని, పదాతి, అశ్విక, పిరంగి, రహస్యగూఢాచారి వ్యవస్థ కలిగిన బలమైన సైన్యాన్ని ఏర్పరుచుకున్నాడు.
సర్దార్ సర్వాయి పాపన్న ఆ కాలంలోనే ఒక రాజ్యానికి వుండవలసిన అన్ని హంగులను, సమకూర్చుకొని, డచ్, ఫ్రెంచ్ దేశాల నుంచి ఆధునిక ఆయుధాలను కొనుగోలు చేసి, సంపదలను సమకూర్చుకొని, 20వేలకుపైగా కోటలను నిర్మించి, గెరిల్లా యుద్ధతంత్రంలో శత్రువు బలంగా వున్నప్పుడు నాలుగు అడుగులు వెనక్కి వేసి, శత్రువుపై ఆకస్మిక దాడులు
జరిపి, గోల్కొండ కోటను సైతం జయించి, పాపన్న తన రాజ్యాన్ని భువనగిరి, నల్లగొండ, తాటికొండ, వరంగల్, కొలనుపాక, చెరియాల, కీరంనగర్, హుజూర్ నగర్, హుస్నాబాద్ ప్రాంతాలను సుమారు 30 ఏళ్లు పరిపాలించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నవి.
మహనీయుల పోరాటాలు- సామాజిక బాధ్యత ఏమిటి? అనే విషయాన్ని నేటి విద్యావంతులు, ఉద్యమకారులు, ముఖ్యంగా నిరుద్యోగ యువత ఆలోచించాల్సిన అవసరం వుంది. నాకేం చేతనైతది అని అనుకుంటే నీకన్న అసమర్దుడు వచ్చి నిన్ను పాలిస్తాడు అన్న ఒక మహనీయుని సూక్తిని గుర్తుంచుకోవాలి.
సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతి ఉత్సవాలతోపాటు దేశంలో 70 ఏళ్లుగా అణచివేయబడ్డ సామాజిక వర్గాల ప్రజల కనీస హక్కుల నుంచి, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమ న్యాయం కోసం జీవిత కాలం పోరాడిన మహనీయులు జ్యోతిరావు పూలే, సావిత్రిభాయిపూలే, సాహుమహరాజ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, రామ్ మనోహర్ లోహియా, పెరియార్ ఇవి రామస్వామి మొదలైన మహనీయుల జయంతి, వర్ధంతి, విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాం, మహనీయుల త్యాగాలను గొప్పగా గుర్తు చేసుకుంటాం. ఎవరిండ్లకు వారు వెళ్లిపోతాం. ఎవరి పార్టీ జెండా వారు పట్టుకొని, ఆ పార్టీ అధినాయకున్ని మరోసారి అధికార అందలమెక్కించడానికి నేటి మన కుల సంఘాలు, ప్రజా సంఘాల పోరాటాలు, ఆధిపత్య సామాజికవర్గ ఆధీనంలోని పార్టీలను గెలిపించడానికి ఓట్ల సమీకరణలో మునిగిపోతాం. మన మహనీయుల ఆశయాలు మిగిల్చిన లక్ష్యం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వున్నట్లుగా నేటి మన పరిస్థితి అద్దం పడుతున్నది.
రాష్ట్రంలో 7 శాతం గల సామాజిక వర్గానికి స్వంత జెండా వుంది. ఎజెండా వుంది. భవిష్యత్తులో వారి ఆధిపత్య అధికారాన్ని నిలుపుకోవడానికి ప్రణాళిక సిద్ధంగా వుంది. మరీ మన ఉద్యమాలు, మనం ఎక్కడున్నాం. మనం చేసిన పోరాటాలు, ఉద్యమాలు ఎవరిని అధికారం అందలమెక్కించాయి. అందరూ ఆలోచించాల్సిన అవసరం వుంది.
ఈనాడు రాష్ట్రంలో 7 శాతం గల ఆధిపత్య సామాజికవర్గం ఆధీనంలో వున్న రాజకీయ అధికారాన్ని, అన్ని రంగాలపై గల వారి గుత్తాధిపత్యాన్ని కొనసాగించడానికి, ప్రణాళికబద్దంగా, ఉద్దేశపూర్వకంగా 93 శాతం గల బలహీనవర్గాల ప్రజలను కులంపేరుతో, మతం పేరుతో, పార్టీల పేరుతో విభజించి, ఐక్యం కాకుండా అన్ని విధాల నిరంతరం ప్రయత్నిస్తూ, ప్రజల ఉద్యమాలను ఎప్పటికప్పుడు పక్కదారి పట్టిస్తూ, నిర్వీర్యం చేస్తూ ఉద్యమ శక్తులను, నాయకత్వాలను సామ, ధాన భేద, దండోపాయలలో విచ్ఛిన్నం చేస్తూ, ఆధిపత్య వర్గాల పాలనను 70 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు.
ఈనాడు ప్రజాస్వామ్యం అగ్రకులీకరణ చెందింది. ప్రజాస్వామ్యం కొందరి చేతుల్లో కేంద్రీకృతమైంది. దేశ సంపద కొందరి చేతుల్లోకి వెళ్లిపోయింది. మెజారిటీ ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు.
కాబట్టి ఈనాడు దళితులు, ఆదివాసీలు, వెనకబడిన వర్గాల ప్రజలు, మైనారిటీలు ఐక్య రాజకీయ కూటమిగా ఏర్పడవలసిన అవసరం వుంది. పరస్పర బదలాయింపుతో ఈ సామాజిక వర్గాలు అంబేద్కర్ అందించిన ఓటు ఆయుధంతో మీ ఓటు మీకే వేసుకొని పాలకులవుతారా, మీ ఓటును అమ్ముకొని బానిసలవుతారా మీరే తేల్చుకోండని మహనీయులు బోధించారు. దేశంలోని అన్ని రంగాలను ప్రజాస్వామీకరించడానికి రామ్ మనోహర్ లోహియా సూచించిన సప్తక్రాంతిని, ఏడు విప్లవాలకు నాంది పలకాలి.
జీవితకాలం పోరాటం చేసి మహనీయులు అందించిన ఆశయాలు, లక్ష్యం పూర్తి చేయడానికి ఈనాటి విద్యావంతులు, ఉద్యమకారులు అణగారిన జాతిని చైతన్యం చేసి, ముందుకు నడిపించి, ప్రజల కోసం, ప్రజల పాలనను సాధించే దిశగా ఉద్యమాలు కొనసాగించిననాడే మహనీయులకు నిజమైన నివాళులు అర్పించినవారమవుతాం.
Akkala Babu Goud
(అక్కల బాబుగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సమాజ్ వాదీ పార్టీ, తెలంగాణ రాష్ట్రం)