రాజకీయచట్రంలో ఎపి ప్రభుత్వోద్యోగ సంఘాలు

కరోనా కారణంగా ప్రభుత్వానికి నెల వారి రావాల్సిన ఆదాయం పడిపోయింది. ఫలితంగా మార్చి , ఏప్రిల్ నెల జీతాలను 50 శాతం చెల్లించింది. దీన్ని కోత అనడం కన్నా వాయిదా అనడం సముచితం. ఉద్యోగులు కూడా ఇబ్బందులు ఉన్నా అర్థంచేసుకున్నారు. పెండింగ్ జీతాలను త్వరగా చెల్లించాలని మాత్రమే ఉద్యోగులు కోరుకున్నారు. ఈ సమయంలో జీతాల చెల్లింపు కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం నమోదు అయినది. స్పందించిన కోర్టు తుది తీర్పులో రెండు నెలలలో పెండింగ్ జీతాలను 12 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. కోర్టు తీర్పు పై మీడియాలో వచ్చిన వార్తలు ఆధారంగా సచివాలయ ఉద్యోగుల నేతలు వడ్డీని కోరుకోవడం లేదు అంటూ చేసిన ప్రకటన వివాదంగా మారుతుంది.
రాజకీయచట్రంలో ఉద్యోగ సంఘాలు
ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వానికి సంబంధం లేదు, ఉండకూడదు. 2014 విభజన ఉద్యమం నుంచి ఉద్యోగ సంఘాలు తమ పని పక్కన పెట్టి ప్రభుత్వ రాజకీయ అజెండాను ముందుకు తీసుకువెళ్లే పనిని భుజానికెత్తుకొని పోరాడుతున్నారు. అశోక్ బాబు నాయకత్వంలో ఇది పతాకష్టాయికి చేరింది. ఫలితం ఉద్యోగుల సమస్యలు పక్కదారి పడుతున్నాయి. పోనీ వారిని ప్రో ప్రోత్సాహించిన పార్టీలు లాభ పడ్డాయా అనుకుంటే అదిలేదు.
హైకోర్టు తీర్పు పై ఉద్యోగ సంఘాల ప్రకటన పర్యవసానాలు
కోర్టు తీర్పు ఎపుడు ఫిటీషనర్ అభిమాతానికి అనుగుణంగా ఉండదు. నిబంధనలు , చట్టం ప్రకారం ఉంటుంది. వాస్తవానికి ఉద్యోగులు వడ్డీతో కూడిన బకాయిలు కోరుకోవడం లేదు. బకాయిలు చెల్లించాలి అని మాత్రమే కోరుకుంటున్నారు. చట్ట ప్రకారం ఉద్యోగుల జీతాలపై కోత విధించాలి అంటే అది ఆర్థిక పరిస్థితి విషమంగా ఉన్నపుడు ఆర్థిక అత్యవసర పరిస్థితి పెట్టునపుడు మాత్రమే సాధ్యం అవుతుంది.
విశ్రాంత ఉద్యోగుల విషయంలో అప్పుడు కూడా పరిమితులు ఉంటుంది. పరస్పర సహకారం నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే పరిస్కారం. రెండు నెలల సగం జీతాన్ని చెల్లింపు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వాటిని పరిశీలించిన  కోర్టు తన తీర్పును వెలువరించింది. ఇక్కడ నేతలు వాదిస్తున్నది తాము అది కోరుకోవడం లేదు అని.
వ్యక్తులు కోరినట్లు తీర్పులు ఉండవు. కరోనా సమయంలో ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు ఉద్యోగులు కూడా సిద్ధంగా లేరు. కానీ అనేక డీ ఏ లు పెండింగులో ఉన్న నేపద్యంలో పెండింగ్ జీతాలు త్వరితగతిన కావాలన్న కోరిక మాత్రం బలంగా ఉన్నది. ప్రభుత్వం కూడా ఇవ్వడానికి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. నిజానికి సంఘాల నేతలకు ముందు చూపు ఉండి ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి బకాయిలను ఎప్పుఫు చెల్లిస్తారో జీఓ ఇప్పించి ఉంటే సమస్య వచ్చి ఉండేది కాదు. చేయాల్సిన పని చేయకుండా. కోర్టు ఆదేశాలు నేపద్యంలో తమకు జీతాలు వస్తున్నాయి అన్న సంతోషం వ్యక్తం అవుతున్న పరిస్థితులలో ఇలాంటి ప్రకటనల వలన ఉద్యోగులలో చెడ్డ పేరుతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి సంబంధం లేని సమస్యలు తెచ్చి పెట్టినట్లు అవుతుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ నుంచి ఒక ఏడాది పాటు ప్రతి నెలా ఒక రోజు జీతం కరోనా సహాయ నిధికి ఇస్తున్నారు. అది కూడా ప్రతి ఉద్యోగి సమ్మతి తీసుకుని. అలా దాదాపు 12 రోజుల జీతాన్ని తీసుకుంటున్నారు. డీ ఏ లు కూడా వాయిదా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మార్గాన్ని ఎంచుకుని ఉంటే ఎక్కువ నిది. న్యాయపరమైన సమస్యలు ఉండేవి కాదు. ఉద్యోగులు ప్రభుత్వానికి నేతలు వారధిగా ఉండి ఉండాల్సింది. తమ ప్రకటనలో కరోనా సమయంలో ఉద్యోగులు విధులకు హాజరు కాకపోయినా ఎక్కడా ప్రభుత్వం ఇబ్బందులు పెట్టలేదు అంటూ చేసిన వ్యాఖ్యలు చూస్తే నాయకులకు కనీస కార్మిక చట్టాల పట్ల అవగాహన కూడా లేదు అనిపిస్తుంది.
హైకోర్టు తీర్పు పట్ల ఉద్యోగులలో సంతోషం వ్యక్తం అవుతుంది. కానీ ఎవరూ వడ్డీతో కూడిన బకాయిలు కావాలని కోరుకోవడం లేదు. ఉద్యోగ సంఘాల నేతలు. కోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్లడం కాకుండా ఉద్యోగుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని వడ్డీని తీసుకోవాలని లేదు కనుక ముఖ్యమంత్రి సహాయనిధికి వడ్డీ రూపంలో వచ్చిన డబ్బులను జమ అయ్యేలా ఉద్యోగుల అనుమతితో చేయాలి. అది ప్రభుత్వానికి నిధి , ఉద్యోగులకు ట్యాక్స్ వెసులుబాటు వస్తుంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం ఉద్యోగుల వ్యతిరేకతను మూటగట్టు కోవడమే కాకుండా సంబంధం లేని ప్రభుత్వానికి కూడా కొత్త చిక్కులు తెచ్చిపెట్టినవారు అవుతారు.
(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, రాయలసీమ విద్యావంతుల వేదిక, తిరుపతి)