నాటి హిందీ మేటి నటి ‘కుంకుం’ అనే జైబున్నీసాకు ఒక నివాళి

(Ahmed Sheriff)
సినిమాల్లో నటించాలని కోరిక వున్నా, కోరిక తీర్చుకోవడానికి కాకుండా, కుటుంబ భారాన్ని మోయడానికి సినిమాల్లో చిన్న చిన్న వేశాలు వేస్తూ తన నటనతో, నృత్యాలతో ప్రజలను ఆకట్టుకుని చిన్న పెద్దా తేడా లేకుండా అభిమానుల్ని సంపాదించుకుని హీరోయిన్ స్థాయి కి ఎదిగిన “కుం కుం” (KumKum) అసలు పేరు జైబున్నిసా(Zaibunnissa) (1934-2020).
కుం కుం 1934 సంవత్సరం బీహార్ లో ని హుస్సేనాబాద్ లో ఒక నవాబీ కుటుంబం  లో జన్మించింది.   తండ్రి నవాబ్ మంజూర్ హస్సన్ ఖాన్ పెద్ద భూస్వామి. అయితే తన ఆస్తులూ, భూమీ మొత్తం ప్రభుత్వ పరం అవడం తో కుటుంబం తో సహా అయన కలకత్తా చేరుకున్నాడు. కలకత్తా గాలి ఈ కుటుంబానికి, ముఖ్యంగా కుం కుం కు అచ్చి రాలేదు. ఆమె తండ్రి ఈ కుటుంబాన్ని వదిలేసి, మరొక స్త్రీని పెళ్ళి చేసుకుని పాకిస్తాన్ వెళ్లిపోయాడు. తిరిగి వీరి వంక కన్నెత్తి చూడలేదు.  కుటంబ భారం కుం కుం పై పడింది.
అంతకు ముందు చిన్న చిన్న పాత్రలు చేసినా 1954 లో  వచ్చిన గురుదత్ సినిమా “ఆర్ పార్” తో కుం కుం అందరి దృష్టిలో పడింది. రోజు కూలీ పాత్రలో ఆమె పాడిన  “కభి ఆర్ కభి పార్ లాగా తీరే నజర్” అనే పాట ఆమె ఐడెంటిటీ అయిపోయింది. ప్రజలు ఆమెను కభి ఆర్ కభి పార్   అమ్మాయి గా వ్యవహరించడం మొదలు పెట్టారు.
గురుదత్ మొదట ఈ పాటను నటుడు జగ్ దీప్ తో చిత్రీకరించాలను కున్నాడు. తరువాత, ఒక స్త్రీ పాత్ర తో చిత్రీకరిస్తే బాగుంటుందని అనుకున్నాడు. చిన్న పాత్ర,. “ ఎవరూ ముందుకు రాలేదు. చివరికి గురుదత్ ఈ పాటను కుం కుం తో చిత్రీకరించాడు. ఈ అభిమానం  వల్లనే కావచ్చు కుం కుం ఆ తరువాత గురుదత్ సినిమాలు మిస్టర్ అండ్  మిసెస్ 55” (1955), “సి.ఐ.డి.” (1956),  “ప్యాసా” (1957) లలో కనిపించింది.
కుం కుం ఒక నృత్య తార. తన నృత్యాలతో జనాన్ని ఆకట్టుకుంది.  1959 లో షమ్మికపూర్, రాజ్ కుమార్ నటించిన ఉజాలా హింది సినిమా వచ్చింది. ఈ సినిమాను ఆప్పట్లొ ప్రజలు వీరి కోసం కాకుండా,  “తెేరా జల్వా జిస్నే దేఖా” , “ఒ మొరా నాదాను బాలుమా న జానే జీకి బాత్”పాటలకు కుం కుం చేసిన నృత్యాల కోసం ఈ సినిమాను చూసారు.

 

కుం కుం పండిట్ శంభు మహరాజ్ వద్ద కథక్ నేర్చుకుంది. ఫోక్, క్లాసికల్ నృత్యాలలో ప్రావీణ్యం సంపాదించింది. 1960 లోవచ్చిన “కోహినూర్” సినిమా లోని “మధు బన్ మే రాధికా నాచే రె” పాట నటుడు దిలీప్ కుమార్ కీ, సంగీత దర్శకుడు నౌషాద్ కీ, పాడిన మహమ్మద్ రఫీ కీ పేరు సంపాదించినా, కథక్ నృత్యాన్ని అమోఘంగా ప్రదర్శించిన నృత్య తార, పాట లోని రాధిక,  కుం కుం మాత్రం తెర మరుగునే వుండిపోయింది.

 

అపట్లో టీ వీ లు, యూ ట్యూబులూ  లేవు. పాటల్ని ఎక్కువగా రేడియోలో వినడమే కానీ చూడడం తక్కువ.  “మిస్టర్ ఎక్స్ ఇన్ బాంబే”  సినిమాలో “మేరె మహబూబ్ ఖయామత్ హోగి ఆజ్ రుసువా తెరి గలియో మె మొహబ్బత్ హోగి”  ఈ పాట విని ఆ “మహబూబ్” తాలూకా హీరోయిన్ ఎలా వుంటుంది అని ఊహిస్తూ ఉండిపోయేవారు అప్పట్లో జనం.
లక్ష్మి కాంత్ ప్యారేలాల్ సంగీతంలో 1964 లో వచ్చిన ఈ పాట అప్పట్లో ఒక సెన్సేషన్.  కిశోర్ కుమార్ హీరో గా వచ్చిన ఈ చిత్రం లో  హీరోయిన్ గా నటించిన కుం కుం కి మంచి  పేరొచ్చింది. ఆ తరువాత “శ్రీమాన్ ఫంటూష్”, “గంగా కి లహరె”, మొదలయిన చిత్రాలలో ఆమె కిశోర్ కుమార్ కు జోడీ గా నటించింది.
ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/entertainment/how-songs-immortalized-movies-in-the-past/

హి మాన్ ధర్మేంద్ర మొదటి చిత్రం దిల్ భి తేరా హం భి తేరె లో ధర్మేంద్ర కు హీరోయిన్ గా నటించింది కుం కుం. ఆమె మరణ వార్త విని భావోద్వేగానికి లోనయి ఆమెను గుర్తు చేసుకుంటూ “నా మొదటి హీరోయిన్ ఆమె. అప్పటికే, మదర్ ఇండియా లాంటి చిత్రాలలో నటించిన అనుభవం వుంది ఆమెకు. కొత్తవారి ని వృత్తి లో కి ఎలా ఆహ్వానించాలి, వారి లో జంకు ఎలా పోగొట్టాలి, అన్న విషయాలు ఆమె దగ్గరే నేర్చు కున్నాను” అన్నాడు ధర్మేంద్ర.
దర్శక నిర్మాత రామానంద్ సాగర్ కు కూడా కుం కుం అంటే అభిమానం. 1968 లో సూపర్ హిట్ అయిన ఆంఖే చిత్రం లో, 1972 లో విడుదలయిన లల్కార్ చిత్రం లో మళ్లీ ఒక సారి ధర్మెేంద్ర సరసన నాయికగా నటించడానికి కారణం రామానంద్ సాగరే. ఈ చిత్రం అప్పుడు ఆమెను మొదటిసారి చూసినప్పటి రూపాన్ని గుర్తు చేసుకుని 12సంవత్సారల క్రితం ఎలా వుందో ఇప్పుడూ అలాగే వుంది అన్నాడట ధర్మేంద్ర.
నయా దౌర్ (1957),మదర్ ఇండియా (1957), షరారత్ (1959), కోహినూర్ (1960), రాజా ఔర్ రంక్ (1968), సన్ ఆఫ్  ఇండియా (1962)  మొదలయిన చిత్రాల తో కలుపుకుని కుంకుం దాదాపు 110 చిత్రాలో నటించింది. గొప్ప గొప్ప హీరో ల సరసన పనిచేసింది. అయినా ఒక గొప్ప హీరోయిన్ గా పేరు సంపాదించలేక పోయింది. కానయితే అభిమానుల్ని మాత్రం బొలెడు సంపాదించు కుంది.

 

 

“మనిషి కి డబ్బు అవసరం. అవసరం ఉన్నంత వరకే సంపాదించాలి కానీ దాని వెంకే పరిగెత్తి కాలాన్ని వృధాచేసుకో కూడదు. అలా దాని వెనక పరిగెత్తి కాలాన్ని వృధా చేసుకునేవారు దురదృష్ట వంతులే కాదు,  మూర్ఖులు కూడాను. ఎందుకంటే డబ్బు వచ్చాక  దాన్ని అనుభవించ డానికి సమయం ఉండదు”  అనేదిట కుం కుం తన సన్నిహితుల్తో.

చెప్పడమే కాకుండా చేసి చూపించింది ఆమె. లక్నో వాస్తవ్యుడు, సజ్జాద్ అలి ఖాన్ ను పెళ్లాడి న తరువాత ఆమె సినిమా రంగాన్ని వదిలేసి భర్త తో పాటు సౌదీ అరేబియాకు వెళ్లిపోయింది. దాదాపు 23 సంవత్సారాల తరు వాత 1995 లో భారత దేశనికి తిరిగి వచ్చి ముంబైలో స్థిర పడింది.. ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని గడిపి 86 ఏళ్ల వయసులో జూలై 28, 2020 నస్వర్గస్తు రాలయింది.
Ahmed Sheriff
(Ahmed Sheriff, PMP, CMQ/OE, ACS, FLMI, PSM, Consultant, PMP Certification, Project Management, Quality, Mob: +91 9849310610)

 

Like this story? Share it with a friend!