విశాఖలో చెంచు కుటుంబాల పునరావాసంలో ఇంత నిర్లక్ష్యమా: ఇఎఎస్ శర్మ

(Dr EAS Sarma)
విశాఖపట్నం నగరం మధ్య ASR నగర్ అనే ప్రాంతంలో సుమారు 60 మంది చెంచు కుటుంబాలు వలస వచ్చి దశాబ్దాలుగా నివసిస్తున్నారు.
చెంచులు ఆదివాసీలు. మిగతా ఆదివాసీలతో పోల్చి చూస్తే చెంచులు  “అతి వెనుకబడిన ఆదివాసీలు (particularly vulnerable tribal groups-PVTG) ” గా పరిగణించబడుతారు. నగరంలో చిన్నకారు వృత్తుల ద్వారా వారికి చాలా తక్కువ ఆదాయం వస్తుంది. ASR నగర్ లో ప్రభుత్వ భూమిమీద గుడిసెలు కట్టుకుని నివసించేవారు.
2018 డిసెంబరులో (చలికాలంలో) అప్పటి ప్రభుత్వం, వారికి అదే స్థలంలో పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చి నిర్వాసితులను చేశారు. అద్దె ఇళ్లల్లో ఉండే స్థోమత లేకపోవడం వలన, వారు ఇంకెక్కడకు వెళ్లలేక అదే ప్రాంతంలో టార్పాలిన్లు తెచ్చుకొని అతి దీన పరిస్థితులలో ఉండవలసి వచ్చినది. జతపరిచిన ఫోటోలు అందుకు ఋజువు.

చలికీ, వర్షాలకు తట్టుకుని ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా, వారికి ఇళ్లను కట్టి ఇస్తారనే ఆశతో వారందరు ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు వారి ఆశలు నెరవేరలేదు. జతపరిచిన ఫోటోలను చూస్తే, ఈ రెండుమూడు రోజులుగా, విశాఖలో పడుతున్న వర్షాలలో  వారు ఎలాగ కష్టపడుతున్నారో మీకు అర్ధమవుతుంది.
మీరు ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ విధానం ఎంత  మంచిదైనా, అదే కారణంగా ఈ చెంచు కుటుంబాలకు ఇవ్వవలసిన ఇళ్ళు ఇంతవరకు నిర్మించ బడలేదని తెలుస్తున్నది. ఈ విషయం మీదృష్టికి వచ్చి ఉంటె మీరు ముందే జోక్యం చేసుకుని వారికి పక్కా ఇళ్లను ఇప్పించి ఉండేవారు.

మన రాజ్యాంగంలో ఇటువంటి ఆదివాసీలకు ప్రత్యేక హక్కులు ఉన్నాయి. విశాఖలో ఇటువంటి చెంచు కుటుంబాలు ఉన్నాయి అనే మాట మీ ప్రభుత్వం గిరిజన సమ్పక్షేమ శాఖ దృష్టికి ఎన్నిమాట్లు తీసుకు వచ్చినా, అక్కడి అధికారులు పట్టించుకోలేదు. ఆరు సంవత్సరాల క్రింద హుద్ హుద్ గాలివాన వచ్చినప్పటి నుంచి ఎన్నో మాట్లు, ఆ శాఖ అధికారులకు రాసినా, ఎవ్వరు కూడా వీరి గురించి పట్టించుకుపోవడం శోచనీయం. ఇటువంటి కుటుంబాలను, వారంతట వారే వచ్చి సహాయం అందించే బాధ్యత ఆ శాఖ అధికారుల మీద ఉంది.
ప్రస్తుతం కరోనా లాకుడౌన్ నిబంధనల కారణంగా ఈ చెంచు కుటుంబాలు వారికి వచ్చే కనీస ఆదాయాన్ని కూడా కోల్పోయారు. పైగా వారు కుండపోత వర్షాలలొ ఎలాగ నివసిస్తున్నారో చూడడానికి ఏ అధికారి కూడా రాలేదు.
మీ ప్రభుత్వం చేపట్టిన మంచి సంక్షేమ పథకాల ఫలితాలు ఈ 60 చెంచుకుటుంబాలకు పూర్తిగా అందడం లేదు. వీరిలో కొంతమందికి రేషన్ కార్డులు కూడా లేవు.
ఈ చెంచు కుటుంబాల సంక్షేమం మీద, మీరు స్వయంగా దృష్టి పెట్టి, సీనియర్ గిరిజన సంక్షేమ శాఖ అధికారులను వారి పరిస్థితి గురించి దర్యాప్తు చేయించవలసినదని నా విజ్ఞప్తి.
Dr EAS Sarma IAS (rtd)
విశాఖలో అభివృద్ధి ఫలితాలను పొందకుండా ఉన్న ఆదివాసీ కుటుంబాలు ఇంకా ఉన్నాయి. రెండుమూడు ప్రదేశాలలో నెల్లూరునుంచి దశాబ్దాలక్రింద వలస వచ్చి ఉన్న ఏరుకుల కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులను అటువంటి కోలనీలకు వెళ్లి వారి సమస్యల గురించి కూడా తెలుకోవాలి అని మీరు ఆదేశిస్తే బాగుంటుంది.

(ఇది డాక్టర ఇఎఎస్ శర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖ)

( Dr E.A.S.Sarma. Former Secretary, Government of India, Visakhapatnam 530002,Mobile: 91-9866021646)