సింపుల్ గా ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ అంటే ఏమిటి?

(CS Saleem Basha)
సంతోషం అంటే ఎప్పుడో ఒకసారి వచ్చేది కాదు. నిరంతరం మనలో నుంచి బయటకు వచ్చేది. ఒకసారి సంతోషంగా, మరోసారి విచారంగా ఉంటున్నాం అంటే, సంతోషాన్ని ఒక సంఘటన లాగా తీసుకుంటున్నామని అర్థం. సంతోషంగా ఉండడానికి కారణం అవసరం లేదు. అది ఒక జీవన విధానం.
ఒక సెల్ ఫోన్ కొంటే సంతోషం వస్తుందా? మరి అయితే అంతకుముందు విచారం ఉందా? వస్తువుల వల్ల సంతోషం వస్తుంటే, అవి పోయిన తర్వాత సంతోషం పోయినట్లేనా? అంటే గెలిస్తే సంతోషం, ఓడిపోతే విచారం అయితే సంతోషం ఒక సంఘటన అవుతుంది తప్ప జీవన విధానం కాదు. సంతోషం అన్నది ఎప్పుడు ప్రవహించే నదిలా ఉండాలి. అది భౌతికమైనది కాదు. వస్తువుల మీద, గెలుపోటముల మీద, అవతలి వారి మీద అది ఆధారపడకూడదు. అప్పుడప్పుడు వచ్చే వర్షంలా కాదు.
సంతోషం ప్రతిసారి బహిర్గతం కావలసిన అవసరం లేదు. అదొక అంతర్గత భావన. అది వేరే వాళ్ళకి తెలియవలసిన అవసరం లేదు. ఎందుకంటే సంతోషం మనది. ఇతరులు సంతోషంగా ఉంటే మనము సంతోషంగా ఉన్నట్లేనా? కాదు కదా. మన సంతోషం మనది.
Happiness is an inner joy.. It is a delicate balance between ” what I want and what I have. ” చాలా మంచి మాట!
సంతోషం అంటే మనకి కావలసిన దానికన్నా మన దగ్గరున్న దానికి విలువ నివ్వడమే. ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. కానీ అర్థమైన తర్వాత నిజంగానే సంతోషం అంటే ఏమిటో తెలుస్తుంది. మనకు కావలసింది దొరకనప్పుడు, లేదా మనకు కావలసిన విధంగా పరిస్థితులు లేనప్పుడు మనం ఎలా ఉంటాం అన్నది మన సంతోషాన్ని నిర్వచిస్తుంది. సంతోషం అంటే ఎప్పుడూ మనకున్న దానితో తృప్తి పడడం పడడం కాదు. మనకు కావలసింది దానికోసం ప్రయత్నం చేసి అది సాధ్యం కానప్పుడు వచ్చిన దానితో లేదా ఉన్నదానితో తృప్తి పడడం. అంతే!
ఒకసారి బనగానపల్లి నవాబు గారు ( ఆ ఊర్లో ఇప్పటికీ సరదాకి చెప్పుకునే కథ ఇది) తన భవనంపై పచార్లు చేస్తూ ఉంటే, ఎండలో అర్థ నగ్నంగా ఉన్న ఒక వ్యక్తి ఏదో వెతకడం చూసి వాడిని తీసుకురమ్మని తన నౌకర్లను ఆదేశించాడు. వాడు రాగానే ఏం వెతుకుతున్నావు అని అడిగాడు. వాడు “అయ్యా నా రాగి పైసా పడిపోయింది. వెతుక్కుంటున్నాను ” అన్నాడు దానికి నవాబు ఆశ్చర్య పోయి ” ఇంత ఎండలో పైసా కోసం వెతుకుతున్నావా? వీడికి ఒక అష్రఫీ (వరహా అనుకోండి) ఇచ్చి పంపించండి” అన్నాడు. వాడికి అష్రఫీ ఇచ్చారు.
మళ్ళీ కాసేపటికి ,నవాబు కిటికీ లోంచి చూస్తే, వాడు మళ్ళీ అక్కడే వెతుకుతూ కనబడ్డాడు. నవాబు మళ్లీ వాడిని పిలిపించాడు. వాడు మళ్లీ అదే మాట అన్నాడు. నవాబు కోపం వచ్చి ఈసారి పది అష్రఫీలు ఇచ్చి పంపించాడు.
మళ్లీ మధ్యాహ్నం నవాబు చూస్తే వాడు ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. మళ్లీ వాడిని పిలవడం, వాడు అదే జవాబు చెప్పడం, నవాబు నూరు అష్రఫీలు ఇవ్వడం జరిగింది. . మర్నాడు మళ్లీ అదే తంతు. చివరిగా అదిఎంతదూరం వెళ్లిందంటే నవాబుకు కోపం వచ్చి. రాజ్యం రెండు భాగాలు చేయండి అన్నాడు. “ఏ భాగం కావాలి” అని వాడిని అడిగితే “ఆ పైసా వున్న భాగం ఇవ్వండి” అన్నాడు.
సరదాకి చెప్పుకుంటున్నప్పటికీ ఈ కథ ఇంతకుముందు ప్రస్తావించిన విషయాన్ని నిర్ధారిస్తుంది..
ఫలితంతో సంబంధం లేకుండా , భౌతికమైన వాటితో అవసరం లేకుండా కలిగే ఫీలింగే సంతోషం అంటే. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన అద్భుతమైన మాట చూద్దాం.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోஉస్త్వకర్మణి
స్థూలంగా దాని అర్థం ఏమిటంటే ” కర్మ మీద మాత్రమే నీకు అధికారం ఉంది. ఫలం మీద ఎప్పుడూ లేదు . అయినా సరే నీ కర్మ ను నీవు ఫలం తో సంబంధం లేకుండా చేయాలి” చాలా స్పష్టంగా చెప్పాడు కృష్ణుడు. కాబట్టి ఫలం కోసం పని చేయకూడదు. కర్మ నీ ధర్మం కాబట్టి ఫలం తో సంబంధం లేకుండా చేస్తూ ఉండాలి. ఇక్కడ స్పష్టంగా ఒక విషయం అర్థం చేసుకోవాలి ఫలం వస్తేనే సంతోషం కూడదు. నీ కర్మ నీకు సంతోషం ఇవ్వాలి.
ఫలితం అన్నది మన జీవితాల్లో ముడి వేసుకున్నది. రిజల్ట్స్ వచ్చిన రోజు ” పాసా, ఫెయిలా?” అన్న ప్రశ్న విద్యావిధానంలో సాధారణమైంది. చాలాసార్లు జీవితంలో ఫలితం అన్నది చేసిన పని కన్నా అత్యంత అత్యంత ముఖ్యమైనదిగా భావించడం సర్వసాధారణం. పరీక్ష రిజల్ట్స్, ఎలక్షన్ రిజల్ట్స్ దీనికి చిన్న ఉదాహరణ లు మాత్రమే.
Living in favourable and unfavourable conditions
is part of living. Being happy in both the conditions
is Art of living.

సంతోషం అన్నది ఒక సంఘటన కాదు. అది ఒక జీవన విధానం, మనం తీసుకోవాల్సిన నిర్ణయం. అది జీవితంలో ఒక భాగం కాదు. అదే జీవితం కావాలి. అది కొంచెం కష్టం కావచ్చు, కానీ అర్థం చేసుకుని, పాటిస్తూ పోతే కొన్నాళ్ళకి జీవితం సంతోషం మయమవుతుంది

CS Saleem Basha

(CS Saleem Basha వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)