(అహ్మద్ షరీఫ్)
ఆలం ఆరా సినిమా నిర్మాణం లో పాలుపంచు కున్న వాళ్లు, నటీనటులు, చివరికి ఆ సినిమా అప్పట్లొ చూసిన ప్రేక్షకులు కూడా ఈ రొజూ ఎవ్వరూ లేరు. దురదృష్టం అనండి, వనరులు లేకపోవడం అనండి, లేదా అశ్రధ్ధ అనండి ఎవరైనా ఆ చిత్రం చూడాలనుకుంటే సాధ్యం కాదు. ఎందుకంటే ఆ సినిమా మాయమైపోయింది. ఎవరో ఈ సినిమా గురించి రాసిన వివరణలూ విశ్లేషణలూ , కష్టపడి వెదికితే నేషనల్ ఫిల్మ్ అర్కయివ్ స్ ఆఫ్ ఇండియా (NFAI) లో అరాకోరా దొరికే స్టిల్ ఫోటొలు తప్ప, ఆనవాళ్లేలనేవేవీ లేకుండా ఆలం ఆరా సినిమా కాల గర్భం లో కలిసిపోయింది.
భారత దేశపు మొట్ట మొదటి టాకీ ఏది అనే ఒక జనరల్ నాలెడ్జి ప్రశ్నకు ఒక జవాబు గా మాత్రమే మిగిలి పోయిందీ ఈ చిత్రం. చివరికి ఒక్క కాపీ కూడా లేకుండా పోవడం వల్ల శాశ్వతంగా మూగపోయింది. దీని ప్రింట్ ను కాపాడుకో లేకపోయారు. కనీసం పనికిరాని ముక్కలు కూడా మిగుల్చుకోలేదు. నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఎర్పడానికి ముందే ఈ చిత్రం ప్రింట్లు మాయమయ్యాయట.
1931 మార్చి 14, భారత దేశపు మొట్టమొదటీ టాకీ సినిమా “ఆలం ఆరా” విడుదలయిన రోజు. తొలి పోస్టర్ మీద టాగ్ లైన్ ఎంటో తెలుసా “All Talking, Singing and Dancing”.
బాంబే మెజెస్టిక్ సినిమా ముందు బారులు తీరిన ప్రేక్షకులు. ఊహించని జన సందోహం. విరుచుకుపడ్డ అల్లరి మూకలు. ఒక సినిమాకి మొదటి సారి పోలీసు కట్టడి అవసరమైంది. టికేట్లు బ్లాక్ మార్కేట్ చేయొచ్చని తెలిసింది. పావలా (ఇరవై అయిదు పైసలు) టికెట్టు ఇరవై రెట్లు పెరిగి అయిదు రూపాయలకు అమ్ముడుపోయింది. ఈ చిత్రం ఏకధాటిగా ఎనిమిది వారాలు ప్రదర్శింప బడింది. అంతేకాదు, ఆరోజుల్లో రు. 50,000 భారీ బడ్జెట్ తో తయారయిన చిత్రమిది.
“కలల వెంట పరిగెత్తేవాడు, ఏదో ఒక రోజు తన కలను పట్టుకుంటాడు. దాని సహాయం తో ఆకాశం లో కి ఎగిరి ఎదురొచ్చిన సవాళ్ళ సముద్రాన్ని అవలీలగా దాటి ఆవలి ఒడ్దున వున్న తన గమ్యాన్ని చేరుకుంటాడు”
“ఖాన్ బహదూర్ అర్దేశిర్ ఇరానీ ఎవరో తెలుసా?” అని అడిగితే, వేళ్లమీద లెక్కింప దగిన ఏ కొద్దిమందినో తప్పిస్తే మిగిలిన వారందరూ తెలీదు అనవచ్చు.
అదే “భారత దేశపు మొట్ట మొదటి టాకీ సినిమా ఏది?” అని అడిగితే స్కూలు పిల్లల్తో సహా అందరూ ఆలం ఆరా అని జవాబు చెబుతారు. ఇది ఒక జి. కె. ప్రశ్న కాబట్టి.
భారత దేశం లో చాలా మందికి “ఆలం ఆరా” ఒక అధ్బుత సృష్టి అని తెలుసు . కానీ దాని సృష్టి కర్త అర్దేశిర్ ఇరానీ గురించి ఏ కొద్ది మందికి మాత్రమే తెలుసు
అర్దేశిర్ ఇరానీ – భారత దేశానికి వలస వచ్చిన ఒక జోరాస్ట్రియన్ కుటుంబం లో 1886 డిసెంబర్ 5 న పూనా (ఇప్పటి పూణె) లో జన్మించాడు. కొంతకాలం ఒక టీచర్ గా, ఒక కిరోసిన్ ఇన్స్పెక్టర్ గా పనిచేశాడు. తరువాత ముంబై లోని జె.జె స్కూల్ ఆఫ్ ఆర్ట్సు లో ఆర్ట్సు చదివాడు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ వారసత్వంగా వస్తున్న గ్రామఫోను పరికరాలూ, సంగీత వాద్యాల వ్యాపారాన్ని చేపట్టాడు.
కొద్దికాలం లోనే తన జీవితం ఇది కాదనీ, తాను ఏదయినా ఓ గొప్ప పని చేయాలని, భావించాడు. 1905 లో అమెరికా యూనివర్సల్ స్టూడియోస్ కి భారత దేశం లో ప్రాతినిధ్యం వహించాడు. మరో మిత్రుడి తో కలిసి ముంబై లో ని అలెగ్జాండర్ సినిమా నడిపాడు. ఇది నడుపుతున్నప్పుడే అతడు సినిమా నిర్మాణం లోని నియమాల్నీ, కష్టసుఖా లని, మెళకువల్నీ తెలుసుకున్నాడు. సినిమా నిర్మాణం పట్ల ఆకర్షితుడయ్యాడు.
ఇరానీ 1920 లో భోగిలాల్ దవే అనే మరో మిత్రుడి తో కలిసి స్టార్ ఫిలింస్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా 1922 లో “వీర్ అభిమన్యు” అనే మూకీ చిత్రం వచ్చింది. కొద్ది కాలానికి మెజెస్టిక్ ఫిలింస్, ఆ తరువాత 1926 లో ఇంపీరియల్ ఫిలింస్ సంస్థ స్థాపించాడు. ఇంపీరియల్ ఫిలింస్ సంస్థ ద్వారా వచ్చిందే ఆలం ఆరా .
1929 ప్రాంతం లో బాంబే ‘ఎక్సెల్సియర్’ సినిమాలో యూనివర్సల్ పిక్చర్సు వారి షో బోట్ (1929) సినిమాని ఇరానీ చూశారు. అది 40% శాతమే టాకీ, మిగతాదంతా మూకీ నే. ఈ చూస్తున్నపుడు ఒక పూర్తి స్థాయి టాకీ సినిమా తీయాలన్న అలోచన ఆయనకు వచ్చింది.
అప్పట్లో ఇంపీరియల్ స్టూడియో కి ఒక యంత్రాన్ని కూర్చడానికి అమెరికా నుంచి విల్ఫోర్డ్ డెమింగ్ (Wlford E Deming) అనే సాంకేతిక నిపుణుడు వచ్చాడు. ఇరానీ తన మిత్రుడు రుస్తోం భరూచాతో కలిసి శబ్దాన్ని రికార్డు చేయడం లోని మెళకువలు డెమింగ్ నుండి నేర్చుకున్నాడు. ఆ రొజుల్లో డెమింగ్ రోజుకి 100 రూపాయలు ఫీజు తీసుకునేవాడు. ఇరానీ దీన్ని ఆకాశ ధర గా పేర్కొన్నాడు. అంత డబ్బు ఇవ్వలేని పరిస్థితుల్లో తాను తీయ దలుచుకున్న సినిమాకి తనే శబ్దగ్రాహకుడుగా పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. తన టాకీ సినిమా బ్లాక్ అండ్ వైట్ కలకి రంగులు అద్దడం మొదలు పెట్టాడు.
ఆలం ఆరా కథ ఎంపిక :
అప్పటి వరకూ దాదాపు మూకీ సినిమాలన్నీ పౌరాణికాల చుట్టే తిరిగేవి. ఈ సాంప్రాదాయానికి విరుధ్ధంగా ఇరాని తన తొలి టాకీ సినిమాకి రాజ ప్రాసాదాలూ, రాజులూ, రాణులూ, సేనాధి పతులూ, వారి మధ్య సాగే కక్షలూ కుతంత్రాలూ, కొంత “లాస్ట్ అండ్ ఫౌండ్” మసాలాల తో నిండిన ఓ జానపద ప్రేమ కథని ఎంచు కున్నాడు. అప్పట్లో బాగా ప్రాచుర్యం లో వున్న ఒక నాటకం ఆధారంగా ఆలం ఆరా కథ తయారయింది. ఈ నాటకాన్ని జోసెఫ్ డేవిడ్ అనే నాటక రచయిత రాశాడు. అతడే ఈ నాటకాన్ని చిత్రానువాదం చేశాడు.
ఇదీ కథ :
ఒక రాజు, అతడికి నవబహార్, దిల్ బహార్ అని ఇద్దరు రాణులు. వీళ్లిద్దరూ సదా సవితి పోరులో వుంటారు. ఇద్దరికి పిల్లలు లేరు. ఒక రోజు ఒక ఫకీరు నవబహార్ గర్భవతి అవుతుందని రాజ్య వారసుడ్ని కంటుందని జ్యోస్యం చెబుతాడు. దీనితో నవబహార్ మీద దిల్ బహార్ కక్ష మరింత పెరిగిపోతుంది.
దిల్ బహార్ సేనాధిపతి ఆదిల్ ఖాన్ మీద మనసు పడుతుంది. ఆదిల్ ఖాన్ ఆమెను తిరస్కరిస్తాడు. ఇది భరించ లేక దిల్ బహార్ అతణ్ణి చెరసాల లో బంధించి, గర్భవతిగా వున్న అతడి భార్యను దేశ బహిష్కారం చేయిస్తుంది. ఆదిల్ ఖాన్ భార్య ఒక ఆడశిశువు (ఆలం ఆరా) కు జన్మ నిచ్చి చనిపోతుంది. ఆలం ఆరా దేశ దిమ్మరుల మధ్య పెరిగి పెద్దదవుతుంది.
ఒక రోజు తానెవరో తెలుసుకున్న ఆలం ఆరా చెరసాలలో వున్న తన తండ్రిని విడిపించు కోవడానికి వస్తుంది. అక్కడ యువరాజు ఆదిల్ జహంగీర్ ఖాన్ ప్రేమలో పడుతుంది. క్లైమాక్సు లో ఆదిల్ ఖాన్ (ఆలం ఆరా తండ్రి) ని చంపించే ప్రయత్నం లో దిల్ బహార్ పట్టు బడుతుంది. ఆమెకు శిక్ష పడుతుంది. ఆలం ఆరా యువరాజును పెళ్ళాడుతుంది. ఇదీ కథ.
నటీ నటుల ఎంపిక
కథ కుదిరిన తరువాత నటీ నటుల ఎంపిక మొదలయింది. మాట్లాడే సినిమా అనేసరికి భాష సమస్య వచ్చి పడింది. ఈ సినిమాని మరాఠీ, గుజరాతీ భాషల్లో కాకుండా ఎక్కువ మంది ప్రేక్షకులు వినే భాష లో తీయాలనుకున్నాడు. హిందీ, ఉర్దూ ల మిశ్రమ భాష ను హిందుస్తానీ గా మార్చి, సినిమాని హిందుస్తానీ భాష లో తీద్దామనుకున్నాడు.
అయితే అంత వరకు భాషా పరంగా ఉచ్చారణ పరంగా సవాళ్లను ఎదుర్కోకుండా, మూకీ సినిమాల్లో హీరోయిన్లు గా చలామణి అయిపోయిన ఆంగ్లో ఇండియన్ వనితలు పనికిరారని తెలిసి కొత్తముఖాల కోసం వెదికాడు. ఈ ప్రక్రియ లో, భాషా పరంగా ఉత్పన్నమైన సమస్యతో, ఇంపీరీయల్ స్టూడియోస్ అగ్ర తార సులోచన హీరోయిన్ గా స్థానం సంపాదించలేక పోయింది. ఈ స్థానాన్ని జుబేదా అనే అమ్మాయి దక్కించుకుంది. ఆ రకంగా అంతవరకూ హీరొయిన్ గా వెలిగిపోతున్న అగ్ర తార సులోచన భారత దేశపు మొట్టమొదటి టాకీ లో నటించే అవకాశాన్ని పోగొట్టుకుంది.
మిగతా పాత్రలన్ని ఎంపిక అయిన తరువాత చిత్రీకరణమొదలయింది.
చిత్రీకరణ
“కలలు నిద్రలో వచ్చేవి కావు అవి నిద్ర లేకుండా చేసేవి” అని అబ్డుల్ కలాం గారన్నారు. భావుకత నిండిన ఈ మాటల్ని నిజం చేస్తూ తన కలని సాకారం చేసుకోవడానికి ఇరాని నిజంగానే నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది.
షూటింగ్ ఇంపీరియల్ స్టూడియోస్ లో జరిగేది. ఈ ‘స్టూడియోని ఆనుకుని రైలు పట్టాలుండేవి.అప్పట్లొ సౌండు ప్రూఫ్ గదులు లేని కారణంగా పగలు షూటింగ్ చేయకుండా రాత్రుళ్లు అదీ చివరి రైలు వెళ్లిపోయాక రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారు జాము 4 వరకు చేసేవారు.
సౌండ్ రికార్డింగ్ కోసం అప్పట్లో తనార్ సింగిల్ సిస్టం రికార్డింగ్ సాంకేతికతను వాడారు. దీని వల్ల శబ్దం నేరుగా ఫిలిం మీద రికార్డు చేయ బడుతుంది. డబ్బింగు, ఎడిటింగు లాంటి సౌకర్యాలు లేనందున ఒక సారి రికార్డయిన మాటలు గానీ పాటలు గానీ మార్చాలంటే అంతవరకూ రికార్డు అయిన వాటిని తొలగించి మళ్లీ మొదట్నించి రికార్డు చేయాల్సి వచ్చేది . అందువల్ల చిత్రీకరణ చాలా జాగ్రాత్తగా చేయాల్సి వచ్చేది. అప్పట్లో మూకీ సినిమాలు చిత్రీకరించడానిక్ ఒక నెల పట్టేది. ఈ సినిమాని చిత్రీకరించ్డానికి నాలుగు నెలలు పట్టాయి.
మాటల రికార్డింగ్ కోసం నటులు మైక్రోఫోన్ లను కనిపించ కుండా దుస్తుల మధ్యలో దాచిపెట్టుకుని నటించేవారు. సినిమాలో సంగీతం వినిపించడం కోసం వాద్యకారులు చెట్ల వెనకా, ఫర్నిచర్ల వెనకా నక్కి కూర్చునే వారట . చిత్రానికి సంగీతం సమకూర్చడానికి తబలా, హార్మోనియం, వయోలిన్ – ఈ మూడు వాయిద్యాలను మత్రమే వుపయోగించారు.
అంతా చేసి ఈ చిత్రం లో ఏడు పాటల్ని రికార్డు చేసారు. అన్నీ హిట్ పాటలే. ఎకువ మంది ప్రజలు ఈ చిత్రాన్ని పాటల కోసం చూసే వారట. అందులో ఫకీరు పాత్రాధారి వజీరు మహమ్మద్ ఖాన్ పాడిన “దేదే ఖుదాకె నాం పె ప్యారే” అనే పాట సూపర్ హిట్ కావడం గమనించ దగ్గ విషయం. ఈ చిత్రం ప్లేబాక్ కు, సినిమాలో సంగీతానికుండే ప్రాముఖ్యత తెలియ జేయడానిక్ మొట్టమొదటి సారిగా తెర తీసింది.
ప్రముఖ దర్శకుడు శ్యాం బెనెగళ్ మాటల్లో “అది కేవలం ఒక టాకీ మాత్రమే కాదు. తక్కువ మాటలూ, ఎక్కువ పాటలతో సాగిన మాటల పాటల చిత్రం. చాలా పాటలతో నిండిన ఆ చిత్రం మున్ముందు తయారయ్యే చిత్రాల స్వరూపాన్ని స్థిర పరిచింది”
చరిత్ర అర్హులైన వారినీ, ఆశా వాదుల్నీ తన భుజ స్కందాల మీద ఎత్తుకుని భవిష్యత్తు లోని ఎత్తుల్ని చూపుతుంది. అవి చూసి అందుకున్న వారు భావి తరాల కోసం తాము కూడా చరిత్రల్ని సృష్టిస్తారు. అలా, ఆలం ఆరా ఎత్త్తుకున్న ముద్దుబిడ్డల్లో ముఖ్యమైన వారు ముగ్గురు.
వీరిలో ఎవరి గురించి చెప్పాలన్నా ఒక్కో చరిత్రను విప్పాల్సి వుంటుంది కాబట్టి అవసరమైన వివరాలు మాత్రమే చెప్పుకుందాం .
మెహబూబ్ ఖాన్ : (9 సెప్టెంబర్ 1907 – 28 మే 1964).
మెహబూబ్ ఖాన్ రంజాన్ ఖాన్ ఇప్పటి తరం వారికి అస్సలు తెలీక పోవచ్చు. కొంచం వెనక తరం వారికి మహబూబ్ ప్రొడక్షన్సు, బాంద్రా లోని మహబూబ్ స్టుడియో తెలిసి వుండవచ్చు. కానీ తరాల తేడా లేకుండా “మదర్ ఇండియా” సినిమా దాదాపు అందరికీ తెలిసి వుండవచ్చు. మదర్ ఇండియా సినిమా, సినిమా రంగ చరిత్రలోనే ఒక మహా కావ్యం.
ఇరానీ, మొట్ట మొదట ఆలం ఆరా కి సెలెక్ట్ చేసిన హీరో మహబూబ్ ఖాన్. ఇంపీరీయల్ స్టుడియోస్ ని అంటి పెట్టుకుని వుండేవాడు. అర్దేశిర్ ఇరానీ వద్ద అసిస్టెంటు గా , ఎక్ స్ట్రా నటుడిగా పనిచేస్తుండేవాడు. కానీ ఇరానీ తరువాత వ్యాపార పరంగా ఆలోచించి, కొత్తవాడి కన్నా కాస్త పేరున్న వాడయితే బావుంటుందని మహబూబ్ ఖాన్ ని తొలగించి అతడి స్థానం లో మూకీ సినిమాల మరాఠీ నటుడు మాస్టర్ విఠ్ఠల్ ని హీరో గా ఎంపిక చేసాడు.
దీనితో నిరాశ చెందిన మెహబూబ్ ఖాన్ తన దృష్టిని దర్శకత్వం వైపు సారించాలని నిర్ణయించుకున్నాడు . మొదట్లో సాగర్ ఫిల్మ్ కంపెనీ చిత్రాలకు దర్శకత్వం వహించడం మొదలు పెట్టాడు. 1945 లో స్వీయ సంస్థ మహబూబ్ ప్రొడక్షన్సు స్థాపించాడు. 1946 లో పాడే తారలు నూర్జహన్, సురయ్యా ,సురేంద్ర లు ముఖ్య పాత్రలు వహించిన చిత్రం “అన్ మోల్ ఘడీ” కి దర్శకత్వం వహించాడు. దీని తరువాత అతని ద్వారా “అందాజ్”, “ఆన్”, “అమర్” మొదలైన హిట్ చిత్రాలు వచ్చాయి.
1957 లో విదుదల అయిన మదర్ ఇండియా చిత్రం అతడికి ఎనలేని ఖ్యాతిని ని తెచ్చింది. ఈ చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు కాటెగిరీల్లో ఫిలిం ఫేర్ అవార్డుల్ని పొందింది. అంతే కాక ఆ సంవత్సరం ఆ చిత్రం ఉత్తమ విదేశీ భాషా చిత్రాంగా అకాడెమీ కి నామినేట్ చేయ బడింది.
40, 50, 60 దశకాల్లో దిలీప్ కుమార్, రాజ్ కపూర్, సునీల్ దత్, నర్గిస్, నిమ్మి, నాదిరా మొదలైన ప్రముఖ తారల్ని సినిమారంగానికి పరిచయం చేసిన ఘనత మెహబూబ్ ఖాన్ కే దక్కుతుంది.
పృథ్వీ రాజ్ కపూర్ : (3 నవంబర్ 1906 – 29 మే 1972)
ఈ పేరు వినగానే ఈతరం వారికి హిందీ చిత్రసీమ లో అల్లుకు పోయిన కపూర్ ఫామిలీ గుర్తుకు రావచ్చు. కొంచెం పాత తరం వారికి “హీర్ రాంఝా”, “మొఘలే ఆజం”, చిత్రాలు గుర్తుకు రావచ్చు. మరికొందరికి, పృథ్వి థియేటర్స్ వ్యవస్థాపకుడు, దాదా సాహేబ్ ఫాల్కె అవార్డు గ్రహీత (1972), రాజ్ కపూర్ తండ్రీ గుర్తుకు రావచ్చు.
పృథ్వీ రాజ్ కపూర్ ఆలం ఆరా లో సేనాధిపతి ఆదిల్ ఖాన్ పాత్రను పోషించాడు.
పృథ్వీ రాజ్ కపూర్ 1928 లో విడుదలయిన “దొ ధారి తల్వార్” మూకీ చిత్రం లో ఎక్ స్ట్రా నటుడి పాత్రలో నటించి తన నట జీవితాన్ని ప్రారంభించాడు. దాదాపు తొమ్మిది మూకీ సినిమాల్లో నటించిన తరువాత మొడటి టాకీ ఆలం ఆరా (1931) లో సహాయ నటుడిగా నటించే అవకాశం దక్కింది. 1941 లో సోహ్రాబ్ మోడీ దర్శకత్వం లో వచ్చిన “సికందర్” లో అతడి “అలెగ్జాండర్ ది గ్రేట్” పాత్ర అతడికి బాగా గుర్తింపు తెచ్చింది. 1944 లో, స్వీయ సంస్థ పృథ్వి థియేటర్సు ను స్తాపించి దాదాపు 16 సంవత్సారలలో 2662 షో లు చేసాడు. 1960 లో వచ్చిన “మొఘలే ఆజం” లో చక్రవరి అక్బర్ గాను, 1965 లొ వచ్చిన సికందరే ఆజం లో కింగ్ పోరస్ గానూ నటించిన పృథ్వీ రాజ్ కపూర్ కి ఈ రెండు పాత్రలు అమితమైన పేరు సంపాదించి పెట్టాయి.
1969 లో భారత ప్రభుత్వం ద్వారా పద్మ భూషణ్ అవార్డునూ, 1972 లో మరణానంతరం 1971 వ సంవత్సరానికి గాను దాదా సాహేబ్ ఫాల్కే అవార్డును పొందాడు.
పృథ్వీ రాజ్ కపూర్, రాజ్ కపూర్, షమ్మీ కపూర్, శశికపూర్ ల తండ్రి, , రణ్ ధీర్ కపూర్, రిషి కపూర్, ల తాత, కరిష్మా కపూర్, కరిన కపూర్, రణ్ బీర్ కపూర్ ల ముత్తాత.
. ఎల్. వి ప్రసాద్ : (17 జనవరి 1908 – 22 జూన్ 1994)
ఈ పేరు వింటూనే, ఈ తరం వారికి “ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్”, “ప్రసాద్ ఐ మాక్స్” అధినేత గుర్తు కు రావచ్చు. వెనక తరం వారికి ప్రసాద్ స్టూడియోస్, ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థలూ , ఇల్లరికం, భార్యా భర్తలు, బ్రహ్మచారి, ఆలూ మగలు, అర్ధాంగి, భార్యా బిడ్డలు మొదలైన సినిమాలు గుర్తుకురావచ్చు. ఇంకొంచం పాతవారికి ఒక నిర్మాతా, దర్శకుడు, నటుడూ దాదా సాహేబ్ ఫాల్కే అవార్దు గ్రహీత గుర్తుకురావచ్చు
ఆలం ఆరా లో రాజు సలీం ఖాన్ గా నటించిన వ్యక్తి .
1931 లో “స్టార్ ఆఫ్ ది ఈస్ట్” చిత్రం లో ఒక చిన్న పాత్ర లో నటించి తన నట జీవితాన్ని ప్రారంభించాడు ఎల్ వి ప్రసాద్. తరువాత తాను పని చేస్తున్న వీనస్ ఫిల్మ్ కంపెనీ ద్వారా ఆలం ఆరా లో నటించే అవకాశాన్ని పొందాడు.
1943 లో గ్రుహ ప్రవేశం సినిమా కి సహాయ దర్శకుడి బాధ్యత లు స్వీకరించిన ఎల్ వి ప్రసాద్, పరిస్థితుల ప్రభావం వల్ల ఆ చిత్రానికి దర్శకుడిగా మారాడు. అంతే కాక ఆ చిత్రం లో లీడ్ పాత్రలో నటించాడు. 1950 లో విజయా సంస్థ ద్వారా విడుదలయిన షావుకారు చిత్రానికి దర్శకత్వం వహించిన తరువాత దర్శకుడిగా ఎల్ వి ప్రసాద్ స్థానం సుస్థిరమై పోయింది. ఆ తరువాత ఒక దర్శకుడిగా, నిర్మాతగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అనేక చిత్రాలను నిర్మించాడు. 1962 లో ప్రసాద్ ఆర్టు పిక్చర్సు ద్వారా వచ్చిన భార్యా భర్తలు సినిమా కి నేషనల్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. 1970 లో హిందీ చిత్రం ఖిలోనా కి ఫిల్మ్ ఫేర్ అవార్దు, 1982 లో దాదా సాహేబ్ ఫాల్కే అవార్డునూ పొందాడు.
మరిన్ని విశేషాలు
హీరోయిన్ జుబేదా
ఈచిత్రానికి మొదట టైటిల్ రోల్ కి స్టూడియో హీరోయిన్ సులోచనను తీసుకోవాలనుకున్నారు.సులోచన ఇరాకీ యూదు. ఆమె అసలు పేరు రూబీ మైయర్స్. ఆమెకు ఉర్దూ హిందూస్తానీ సరిగ్గా పలకడం రాదు.అందువల్ల జుబేదా అనే మరొక నటిని ఎంపిక చేశారు.
మాస్టర్ విఠల్
విఠల్ ఆరోజుల్లో బాగాపాపులర్ మరాఠీ నటుడు. అంతేకాదు, భారతదేశంపు డొగ్లాస్ ఫెయిర్ బ్యాంక్స్ (Douglas Fairbanks) అనిపేర్కొచ్చింది. ఆయన ఆడవేషాలు వేస్తూ చిత్ర సీమలోకి ప్రేవేశించారు. ఆయన తొలిచిత్రం కల్యాణ్ ఖాజీన్ (Kalyan Khajina-1924).శారదా స్టూడియోస్ లోచేరి డాషింగ్ హీరో అయ్యాడు. అపుడు టాకీ వస్తుందని అంతా ఎదురుచూస్తున్నారు. సరిగ్గా అలాంటపుడు తొలిటాకీలోకి ఒక పాపులర్ నటుడిని తీసుకోవాలని ఇరానీ చూస్తున్నారు. మాస్టర్ విఠల్ ని ఆయన సంప్రదించారు. విఠల్ ఎగిరి గంతేసి , శారదా స్టూడియోస్ తో ఉన్న కాంట్రాక్ట్ ను రద్దు చేసుకుని ఆలం ఆరా టీమ్ లో చేరారు.
జిన్నా కనెక్షన్
ఆలమ్ ఆరాకి, ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అని పేరున్న ముహమ్మద్ అలీ జిన్నాకి కూడా కనెక్షన్ ఉంది. విఠల్ శారదా స్డూడియో కాంట్రాక్ట్ ను బ్రేక్ చేయడం పెద్ద లీగల్ ఇష్యూ అయిపోయింది. అపుడు జిన్నా బొంబాయిలో పేరున్న అడ్వకేట్. విఠల్ తరుఫున న్యాయవాది. విఠల్ కు ఆలమ్ ఆరాలో నటించే హక్కువుందని జిన్నా సమర్థవంతంగా వాదించారు. కేసును గెలిపించారు. జిన్నాకు నాటకాలంటే బాగా ఇష్టం. లండన్ లో న్యాయశాస్త్రం చదువుతున్నపుడు ఒక దశలో చదువు మీద బోర్ కొట్టింది. అపుడు ఆయన నాటకాల వైపు మళ్లాడు. ఒక షేక్స్పియరిన్ డ్రామ కంపెనీలో చేరాడు. అయితే, వాళ్ల నాయన బాగా కోపిస్టి. నాటకాలు, గీటకాలు కట్టి పెట్టి, బుద్ధిగా లాయర్ కోర్స్ పూర్తి చేసి ఇంటికి రావాల్సిందే అని గదమాయించారు.
మొదటి టాకీలో చివరి మూకీ పాత్ర
టాకీ చిత్రంలో నటించాలని కలగని, శారదా స్టూడియోతో బాండు తెంచుకుని, కోర్టుకేసులో కష్టపడి నెగ్గి వస్తే మాస్టర్ విఠల్ చిత్రంలో మట్లాడలేకపోయారు. ఆయన పాపులర్ నటుడే అయినా హిందూస్థానీ రాదు. ఈ విషయం షూటింగ్ మొదలయ్యాక తెలిసింది. ఇపుడెలా, ఆయన పాపులర్ డాషింగ్ హీరో కాబట్టి వదులుకోకూడదు. కొనసాగిద్దామా అంటే భాష బాగ లేదు. అందుకనీ మొదటి టాకీలో హీరోకి మాటల్లేకుండా మూగవాడిని చేశారు. మంత్రాగాడి మాయ వల్ల ఆయనకు మాటలు పోతాయి. అందువల్ల మాట్లాడే అవకాశం లేదు. ఇక మిగతా రోల్ మొత్తం ఆయన అర్ధ స్పృహలోనే ఉంటారు.కాబట్టి భాష బాగుందా అనేది సమస్య కాదు.
సమాప్తి
ఈ ముగ్గురూ 1910 వ దశకానికి చెందిన వారు. ముగ్గురూ ఆలం ఆరా దగ్గర కలిశారు. ముగ్గురికీ స్వీయ సంస్థలున్నాయి . ఈ ముగ్గురూ నటులుగా, రచయితలుగా, దర్శకులుగా, నిర్మాతలుగా, అన్ని రకాల పోర్టుఫోలియోలు నిర్వహించారు. వారి వారి వృత్తుల్లో, ప్రవృత్తుల్లో, నిష్ణాతులై, సినిమా రంగం అభివౄధ్ధి చెందడానికి అవస రమైన సేవలనూ, వనరులనూ సమకూర్చి, కొటాను కోట్ల రూపాయల లావాదేవీల తో, లక్షల మదికి ఉపాధీ కల్పిస్తున్న భారతీయ చిత్ర పరిశ్రమ, ఇప్పటి స్థాయి చేరుకోవడానికి మార్గ దర్శకులయ్యారు. అయితే భవిష్యత్తు తెలీని మొదటి టాకీ “ఆలం ఆరా” లో నటిస్తున్నప్పుడు సినిమా రంగానికి తమ వంతు తోడ్పాటు ఎలా వుంటుందో వీరికి కూడా తెలిసి వుండదేమో .
(Ahmed Sheriff, PMP, CMQ/OE, ACS, FLMI, PSM, Consultant, PMP Certification, Project Management, Quality, Mob: +91 9849310610)
ఇది కూడా చదవండి
రష్యా కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది, తొలివిడత ప్రయోగంలో దేశాధ్యక్షుడి బిడ్డ