జ్ఞాపకాలను స్టోర్ చేసుకునే పద్ధతి ఇలా మార్చి చూడండి

(CS Saleem Basha)
రాలిపోతున్న పువ్వులను చెట్టు పట్టించుకోదు
ఎందుకంటే
కొత్త పూలను పూయించడంలో
మునిగిపోయి ఉంటుంది..
ఇంతవరకు ఏం పోగొట్టుకున్నామన్న
దానికంటే ఇంకా ఏం పొందగలమన్నదే
జీవితమంటే
చాలామంది పోయిన దాని గురించో
లేకపోతే వచ్చే దాని గురించో
ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు
ఇప్పుడు ఉన్న దాని గురించి ఆలోచించరు .
“If you are depressed, you are living in the past
If you are anxious you are living in the future
If you are at peace, you are living in the present”
(మీరు విచారంగా ఉన్నారంటే గతంలో, ఆందోళనలో ఉన్నారంటే భవిష్యత్తులో, ప్రశాంతంగా ఉన్నారంటే వర్థమానంలో ఉన్నట్లు) అంటాడు Lao Tzu అనే చైనీస్ తత్వవేత్త, రచయిత.
ఈ క్షణంలో బతకడం – ఈ క్షణం బతకడం. ఈ రెండే సంతోషానికి మూలం. నిజానికి రెండు ఒకేలా అనిపించినా. రెండిటి మధ్య చిన్నతేడా ఉంది. ఈ మధ్యకాలంలో live in the moment and live the moment పై చాలా పుస్తకాలు వచ్చాయి.
మొదటిది ప్రస్తుతంలో ఉండటం, రెండోది ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయడం. ఇది పైకి కనపడే ఎంత కష్టమేమీ కాదు, పెద్ద కన్ఫ్యూజన్ కూడా లేదు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. చాలామంది పెళ్ళిలో భోజనాల దగ్గర ఏం మాట్లాడుకుంటారు? ఇది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ పెళ్లి గురించి కానీ, తింటున్న పదార్థాల గురించి గానీ చాలా తక్కువ మంది మాట్లాడతారు. ఎక్కువమంది మాట్లాడేది ఏంటంటే, ఆఫీసు విషయాలు, భోజనం తర్వాత ఏం చేయాలి, ఎక్కడ వెళ్లాలి, ఎలా వెళ్లాలి(ఏ వాహనం లేని వాళ్ళు), రేపు ఏం చేయాలి, శనివారం అయితే, ఆదివారం ఏం చేయాలో ప్లాన్ జరుగుతుంటుంది. ఇంకా కొంతమంది ఇంతకు ముందు హాజరైన పెళ్లికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటారు. భోజనం గురించి, బాగా ఉన్న పదార్థం గురించి నాకు తెలిసి ఐదు శాతం నుంచి 10 శాతం వరకు మాత్రమే మాట్లాడుకుంటారు. మీకు డౌట్ ఉంటే, ఈసారి ఏదైనా పెళ్లి కి వెళ్ళినప్పుడు గమనించండి.(మీకు డౌట్ వచ్చింది అంటే ఆ పెళ్లిలో ఏం మాట్లాడుతున్నారో భోజనం దగ్గర మీకు తెలిసి ఉండదు). ఒక పెళ్లి లోనే కాదు ఇంట్లో కూడా భోజనం చేసేటప్పుడు చాలామంది ఇది వేరే విషయాలు మాట్లాడుతారు. కొంతమంది రెండు మూడు పనులు ఒకటేసారి చేస్తారు. ఇది మీరు కూడా ఈ సారి మీ ఇంట్లో గమనించండి!
ఉదయాన్నే కాఫీ లేదా టీ తాగుతూ పేపర్ చదివేవాళ్ళు 90% మంది ఉంటారు. భోజనం చేసేటప్పుడు టీవీ చూడడం, లేదా సెల్ ఫోను భుజానికి మెడ కి మధ్యలో పెట్టుకుని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకసారి ఒక పనే చేయాలన్న సూత్రం చాలామంది చెయ్యరు. స్కూటర్ మోటార్ సైకిల్ నడిపేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడే వాళ్ళు రోడ్ల మీద మనకు చాలామంది కనపడతారు. సంతోషం మాట దేవుడెరుగు, ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది కదా. అలా ఎందుకు చేస్తారంటే, టైం లేక కాదు. అందరూ గమనించే విషయం ఏంటంటే, సినిమా హాల్లో సినిమా చూస్తూ(లేదా చూడకుండా) ఇతర విషయాలు మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇటువంటి వాళ్ళందరికీ ఈ క్షణంలో బతకటం తెలీదు.
మనం సాధారణంగా మన జీవితంలో,మంచి మంచి క్షణాలు, అనుభవాలు, జ్ఞాపకాలు ఎక్కడ స్టోర్ చేసుకుంటాం? చాలా సింపుల్. ఫోటో ఆల్బమ్స్ లో, లో లో కంప్యూటర్ లో, ఫోన్ లో, పెన్ డ్రైవ్ లో, డివిడి లో. చేదు జ్ఞాపకాలు, అవమానాలు, బాధాకరమైన విషయాలు, మర్చిపోవాలి అనుకున్నవి ఎక్కడ స్టోర్ చేసుకుంటాం ? మన మెదడులో! ఈ స్టోర్ చేసుకునే పద్ధతి మార్చి చూడండి. ఎంత బాగుంటుందో. మంచివి మెదడులో, చేదువి పెన్ డ్రైవ్ లో.
TODAY = ( The Opportunity to Do All things forgotten Yesterday) ఈరోజు అంటే ఏంటి? “నిన్న మనం రేపు ఎలా ఉంటుందో అని ఆందోళన పడిన రోజే ఈరోజు” .ఇంత చిన్న విషయం ఎందుకు ఆలోచించరు? మళ్లీ ఈ రోజు కూడా రేపు ఎలా ఉంటుందో అని ఆందోళన పడుతుంటారు. అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం లో జీవించడం సంతోషానికి మొదటి మెట్టు. నిన్న ఏదైనా చేయలేకపోతే, అది చేయగలిగే అవకాశమే ఈ రోజన్నది .
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో(కోవిడ్ నేపథ్యంలో) చాలామంది ఈ క్షణం,ఈరోజు మర్చిపోతున్నారు. నిన్న ఏం జరిగింది? ఎంతమంది చనిపోయారు? ఎన్ని కేసులు వచ్చాయి? అని ఆలోచిస్తున్నారు. లేదా రేపటి గురించి ఆందోళన చెందుతున్నారు. ఏం జరుగుతుంది? మనకి పాజిటివ్ వస్తే ఎలా? అనే విషయాలు ఆలోచిస్తున్నారు కానీ, ఈరోజు మనకు ఏమీ కాలేదు, మనకు పాజిటివ్ రాలేదు అన్నది ఎంతమంది ఆలోచిస్తున్నారు. ఈ క్షణాన్ని, ఈరోజు ని ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు? చాలా మంది పేపర్లు చదివో , టీవీ వార్తలు చూసో, వాట్సాప్ మెసేజ్ లు చూసో ఆందోళన పడి ఈ రోజంతా పోగొట్టుకుంటున్నారు. మనకేం కాలేదు అని ఆనందపడే వాళ్ళు తక్కువ మంది ఉంటారు.
ఒక చిన్న ఇన్స్పైరింగ్ కథతో ముగిస్తాను. ఒక జింక ప్రసవం కోసం అడవిలో ఒక చెట్టు కిందికి చేరింది. దానికి ఎడమ పక్క చక్కటి గడ్డి మైదానం ఉంది, దాని కుడివైపు ఒక నది ఉంది. ఆ స్థలం బావుంది అన్నీ జింక ప్రసవానికి సిద్ధమవుతుండగా దానికి ఎదురుగా ఒక సింహం కనబడింది. వెనక్కి వెళ్దామని చూస్తే ఒక వేటగాడు విల్లును సిద్ధంగా ఉన్నాడు. ఆకాశంలో కారు మేఘాలు కమ్ముకున్నాయి. ఉన్నట్టుండి పిడుగు పడి పక్కన ఉన్న గడ్డి అంటుకుంది. నలువైపుల ప్రమాదం పొంచి ఉంది. అప్పుడు జింక ఏం చేయాలి? బాగా ఆలోచించిన జింక తను ఏం చేయగలదో దానికి మాత్రమే (ప్రసవానికి) సన్నద్ధమైంది. అంతలో ఒక అద్భుతం జరిగింది. వేటగాడు బాణం వదులు తుండగా మెరుపు మెరిసి వాడి గురితప్పింది. బాణం వెళ్లి సింహానికి తగిలింది. వేటగాడు కళ్ళు కనపడక అదుపుతప్పి మంటల్లో పడిపోయాడు. హఠాత్తుగా వర్షం మొదలై మంటలు ఆరిపోయాయి. జింక సుఖంగా ప్రసవించింది. మనం కూడా చేయాల్సింది అదే. మనం ఏదీ ఆలోచించకుండా, ఏం చేయగలుగుతామో, మన చేతుల్లో ఏముందో అది మాత్రమే చేస్తుంటే సంతోషంగా ఉండే అవకాశాలున్నాయి.
CS Saleem Basha

(CS Saleem Basha వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)