ఈ వినాశనానికి 75 ఏళ్ళు!

(CS Saleem Basha)
అవును! సరిగ్గా 75 సంవత్సరాల క్రితం ఒక ఘోరమైన విపత్తుకు కారణమైన “లిటిల్ బోయ్ (Little Boy) అనే అణు బాంబు సృష్టించిన అతిపెద్ద ఘోరం ఈ రోజే జరిగింది.
దాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఒక దేశం ఇంకా దాని ప్రభావం తాలూకు పరిణామాలతో బాధపడుతూనే ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ దేశం హిట్లర్ కు మిత్ర దేశం అయినందువల్ల ఆ దేశంలోని హిరోషిమా నగరంపై ఆగస్టు 6, 1945, ఉదయం 8.15 గంటలకి మొదటిసారి ఒక ఆటంబాంబు ప్రయోగించబడింది.
Little Boy/ National Museum of the U.S. Navy
మళ్లీ మూడు రోజుల తర్వాత నాగసాకి నగరంపై మరోసారి ‘ఫ్యాట్ మన్’ (Fat man) అనే ఇంకో ఆటంబాంబు వేయడం జరిగింది. చరిత్రలో అతిపెద్ద ఘోరంగా, మానవాళికి జరిగిన అతిపెద్ద విషాదంగా ఈ రెండు రోజులు నిలిచిపోయాయి.
Fat Man / National Museum of the U.S. Navy
1945 జూలై 16 నమన్హటన్ ప్రాజక్టు ( Manhattan Project ) లో భాగంగా యుఎస్  న్యూ మెక్సికో లోని Alamogordo ప్రాంతం లో జరుగుతున్న “ట్రినిటీ” పరీక్షలో ఈ ఘోరానికి అంకురార్పణ జరిగింది!
మొట్టమొదటి అణు విస్ఫోటనాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగారు. అణ్వస్త్రాలు సృష్టించే విధ్వంసానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచే దీనికి రంగం సిద్ధమైంది. మొదటిసారి ఇటువంటి విస్పోటం పరీక్షింపబడలేదు. అయినప్పటికీ శాస్త్రజ్ఞుడు మాత్రం ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. వారి నమ్మకం వమ్ము కాలేదు 13 కిలో టన్నుల విస్పోట పదార్థంతో చేసిన విస్పోటనం 4000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణంతో నగరాన్ని స్మశానం గా మార్చేసింది. చెక్క, కాగితంతో చేసిన భవనాలు మాడి మసైపోయాయి. వీటితో పాటు వేగంగా విస్తరించిన అణు ధార్మికత ప్రభావం వల్ల ఒక కిలోమీటర్ విస్తీర్ణంలో ఉన్న అందరూ కాలి బూడిదైపోయారు. రేడియో యాక్టివ్ పదార్థాలతో కూడిన బ్లాక్ రెయిన్ (వర్షం), తదనంతర పరిస్థితుల ప్రభావంతో మొదటి నాలుగు నెలల్లో దాదాపు లక్షన్నర మంది చని పోయినట్లు అంచనా! మూడు రోజుల తర్వాత నాగసాకి నగరంపై వేసిన మరో శక్తివంతమైన వంతమైన బాంబు (“Fat man”) మరింత వినాశనం సృష్టించింది. 500 మీటర్ల ఎత్తులో 21 కిలో టన్నుల విస్ఫోటన పదార్థం సృష్టించిన వినాశనం అంతా ఇంతా కాదు.
These aerial photographs show ground zero before and after the atomic bombing. Source: United States Army
16 జూలై 1945, ప్రపంచ చరిత్రలో ఒక దుర్దినం! మానవాళికి అత్యంత ప్రమదకరమైన అణు శకం (Atomic Age) లోకి అడుగుపెట్టిన రోజు. “” ఒక బోటులో ( తీరం) దగ్గరికి ఇటువంటి ఒక బాంబు తీసుకెళితే పోర్టు తో పాటు చుట్టుపక్కల ప్రదేశాలు అన్నింటినీ నీ సర్వనాశనం చేసే అవకాశం ఉంది”. 19 39 లో ఐన్స్టీన్ అమెరికా అధ్యక్షుడు, రూజ్వెల్ట్ కు రాసిన ఉత్తరంలోని భాగమిది! అయినా సరే జర్మనీతో యుద్ధ భయం అమెరికాను అణు బాంబు తయారు చేయడానికి ప్రేరేపించింది. కొంతమంది సైంటిస్ట్ ల తో అణుబాంబు తయారీ ప్రక్రియ పెద్దగా సఫలం కాలేదు.
1942 మొదలైన న్యూ మెక్సికో లో ఆరు వేలమంది సైంటిస్ట్ ల తో చేపట్టిన మాన్హట్టన్ ప్రాజెక్టు మాత్రం చివరికి మానవాళిని భయపెట్టే అస్త్రాలను తయారుచేసింది.
J. Robert Oppenheimer/ctbto.org
మాన్హట్టన్ ప్రాజెక్టు కు నేతృత్వం వహించిన రాబర్ట్ ఓపెన్ హీమర్ చాలా చిత్రమయిన మనస్తత్వం కలవాడు.” ఇప్పుడు నేను మృత్యువును, ప్రపంచాన్ని నాశనం చేస్తాను”. అనే భగవద్గీత శ్లోకాన్ని  ఉదా హరించడం విశేషం! ట్రినిటీ అంటే త్రయమే కదా?

జపాను ఆక్రమణను తిప్పి కొట్టాలంటే అలా చేయక తప్పలేదు అని అధికారికంగా అమెరికా సమర్థించుకుంది. అలా చేయకపోతే ఇంకా ఎక్కువ ప్రాణనష్టం కలిగేది అని సమర్థించుకుంది,బాంబే వేయదల్చుకుంటే జన సంచారం లేని ప్రాంతాల్లో వేసి జపాన్ ను హెచ్చరించవచ్చు కదా అని కూడా విమర్శలు చెలరేగాయి. ఏది ఏమైనా జరగకూడని విధ్వంసం జరిగిపోయింది. హీరోషిమా విధ్వంసం చాలా కాలం పాటు ప్రజలను వెంటాడింది .
బతికి ఉన్న వాళ్ళు సంవత్సరాల తరబడి సిగ్గుతో భయంతో కోపంతో బతికారు. అప్పట్లో చాలామంది జపనీయులు అణుధార్మికత వంశపారంపర్యంగా వస్తుంది అని నమ్మారు. ఆ విధ్వంసంలో బతికి బట్ట కట్టిన చాలామంది ఆ విషయాన్ని దాచి పెట్టారు. కొంతమంది హృదయాల్లో పగతో రగిలిపోతే మరికొంతమంది తర్వాత తమ వంతు వస్తుందని భయం భయంగా బతికారు. కొంత నిదానంగా ఆలోచించి విధ్వంసం తాలుకు అనుభవాలను ,జ్ఞాపకాలను తరువాతి తరం వారికి అందించడానికి సిద్ధపడ్డారు. విధ్వంసం సమయంలో పసికూనగా ఉన్న” కోకో కొండో” అనే ఆమె(ఇప్పుడు 75 ఏళ్ళు) పగతో రగిలిపోయింది. హిరోషిమా మీద అణుబాంబు వేసిన వ్యక్తి ని పట్టుకుని ఆ చెంపా ఈ చెంపా వాయించాలనుకుంది.
Koko Kondo,prominent atomic bomb survivor/ wikipedia
అలా ఆమెకి 1955 లో అవకాశం వచ్చింది. అప్పుడామెకి పదేళ్లు. అమెరికన్ టీ.వీ.ప్రొగ్రాం “దిస్ ఇస్ యువర్ లైఫ్” లో ఆమె తండ్రి రెవరెండ్ ఫ్యూజీ పాల్గొన్నాడు. బాంబర్ పైలెట్ పాల్ టిబ్బెట్(లిటిల్ బాయ్ బాంబ్ వేసిన వాడు) కు కో పైలెట్ గా ఉన్న రాబర్ట్ లూయిస్ ని కొండో ద్వేష పూరితమైన దృష్టితో చూస్తూ ఉండిపోయింది. టీవీ యాంకర్ రాబర్ట్ లూయిస్ ని ఒక ప్రశ్న అడిగింది”బాంబు వేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది” అని అప్పుడు లూయిస్ వేల అడుగుల పైనుంచి హీరోషిమా ను చూసిన తర్వాత నాకు ఒకటే మాట అనిపించింది. దేవుడా మేం ఎంత పని చేశాం” అని. ఆ సమయంలో లూయిస్ కళ్ళల్లో నీళ్ళు చూసి కొండో కరిగిపోయింది. ఆ తర్వాత ఆమె “లూయిస్ దుర్మార్గుడు కాదు, మనిషి అందుకే నాకు తెలుసు యుద్ధాన్ని ద్వేషించాలి, ఇతన్ని కాదు. లూయిస్ ని కలిసినందుకు చాలా సంతోషం . ఎందుకంటే నేను నా ద్వేషాన్ని వదిలేయటానికి అవకాశం కలిగింది” .హీరోషిమా ఇప్పుడు ఒక అందమైన నగరం కానీ ఇంకా అణ్వస్త్రాలు ఉన్నాయి. ఇంకో అణు యుద్ధం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. అందుకే అందరూ కలిసి అణ్వాస్త్రాలను నిషేధించే దిశగా కృషి చేయాలి అంటొంది. ఇప్పుడు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ అనుభవాలను, జ్ఞాపకాలను ఇప్పటికి తరాలకు అందించే ప్రయత్నం చేస్తోంది, కోండొ లాంటి వారు ఎందరో ఉన్నారు. జపాన్ కోలుకున్నప్పటికి, ఈ రోజుకీ ఆ బాంబింగ్ ఒక పీడ కలగా వెంటాడుతోంది.
“యుద్ధమంటే శతృవును చంపటం కాదు.ఓడించటం.” అని ఈ మధ్య ఓ సినిమాలో డైలాగ్. హిరోషిమా పై ఆటం బాంబ్ వేసిన తర్వాత ఈ డైలాగ్ కరెక్ట్ అనిపిస్తుంది.
కనీసం యుద్ధంలో, యుద్ధం చేసే వాళ్ళు చావాలి కాని, సాధారణ ప్రజలు చావటం కరెక్ట్ కాదు. “పోరాటం ఫలితం ప్రాణ నష్టమే అయినపుడూ, సంధి తప్ప మరో మార్గం లేదు” అని అల్లూరి సీతా రామరాజు సినిమాలో ఉన్న డైలాగ్ బావుంది. సంధికి అవకాశం ఉన్నా (రష్యా యుద్ధంలోకి దిగిన తర్వాత) జపాన్ పై బాంబ్ వేయటం అమెరికా కు సబబు కాదేమో? మొత్తమ్మీద అణ్వస్త్రాల ప్రయోగం మంచి పనికి కాకుండ, విధ్వంసానికి వాడితే ఎలా ఉంటుందో ప్రపంచానికి హిరోషిమా సంఘటన స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా ప్రముఖ తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ విజ్ఞానికి (knowledge) జ్ఞానానికి (wisdom) మధ్య తేడా ఏంటి అన్న దానికి చెప్పిన సమాధానం ప్రస్తావించటం సముచితం. విజ్ఞానం  అంటే బాంబు ఎలా తయారు చేయాలో తెలియటం, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది జ్ఞానం!!

 

CS Saleem Basha

(CS Saleem Basha వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటారు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాస్తుంటారు. ఫోన్:  9393737937)