కోపాన్ని మేనేజ్ చేయలేకపోతే ఏమవుతుంది?

(CS Saleem Basha)
బౌద్ధం ప్రపంచానికి శాంతిని ఇచ్చింది. దీనికి సంతోషానికి సంబంధం ఉందా? అంటే ఉందనే చెప్పాలి. ఎందుకంటే గౌతమ్ బుద్ధుడు తన శిష్యులకు ఇచ్చిన జ్ఞాన గుళికలు ఇమ్యూనిటీ లాగా సంతోషాన్ని పెంచుతాయి. సంతోషం అత్యున్నత రూపం శాంతియే కదా!
ఒకసారి గౌతమ బుద్ధుడు దగ్గరికి ఒక ధనవంతుడువచ్చి ” నాకు సంతోషం కావాలి” అనిఅడిగాడు. బుద్ధడు నవ్వి ” ఒక పలక మీద అదే రాయండి” అని చెప్పాడు. అతను పలక మీద “నాకు సంతోషం కావాలి” అని రాసి బుద్ధుడికి ఇచ్చాడు. అది చూసిన బుద్ధుడు ‘ నాకు” అంటే అహం. దాన్ని తుడి చేయమన్నాడు. ఆ వ్యక్తి దాన్ని తుడిచేసాడు. మళ్లీ బుద్ధుడు “కావాలి” అంటే కోరిక దాన్ని కూడా తుడి చేయమన్నాడు. ఆ వ్యక్తి కావాలి అన్న పదాన్ని కూడా తుడిచేసాడు. అప్పుడు బుద్ధుడు మిగిలింది చదువు అన్నాడు. ఆ ధనవంతుడు దాన్ని చదివాడు. అంటే మొత్తం మీద అహము, కోరికలు లేనివాడు సంతోషంగా ఉంటాడు అని అర్థం చేసుకోవడం పెద్ద విషయమేం కాదు.
చాలామంది కోరికలు లేకపోతే సన్యాసుల్లా బతకాలి కదా? అని ప్రశ్నిస్తారు. అయితే కోరికలు ఇక్కడ బుద్ధుడు చెప్పింది సన్యాసుల్లా బతకమని కాదు. గొంతెమ్మ కోరికలు ఉండకూడదని. అహం అంటారా, సన్యాసులకే కాదు, సంసారులకీ కూడా ఉండకూడదు. దానివల్ల చాలా సమస్యలు వస్తాయి. అహం ఆనందానికి మొదటి అడ్డంకి. దీనికన్నా ముందు బుద్ధుడు చెప్పిన కోరికల గురించి చూద్దాం. నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు ఒక డ్యాం మొదటి గేటు ఎత్తుతారు. ప్రవాహం అలాగే ఉంటే మొత్తం అన్ని గేట్లు ఎత్తడానికి ఎక్కువ కాలం పట్టదు. ” మొదటి కోరికను అణుచుకోవడమే సులభం, దాని తర్వాత ఉత్పన్నమయ్యే కోరికల కన్నా!” అన్న బుద్ధుడి మాట అక్షర సత్యం.
ఒక చిన్న ఉదాహరణ చూద్దాం . మనకు కారు కొనే పరిస్థితి లేకున్నా( కంపేరిజన్ ఉండొచ్చు.. పక్క వాళ్లతో, కొలీగ్స్ తో) కారు కొంటాం అనుకోండి. అది మొదటి కోరిక. దాని తర్వాత ఉత్పన్నమయ్యే కోరికలు ఎక్కడన్నా పిక్నిక్ కి వెళ్లడం, లేదంటే వేరే ప్రదేశాలకు, టూర్లకు వెళ్లడం, సినిమాలకు వెళ్లడం, దూరపు బంధువుల పెళ్ళిళ్ళకి వెళ్లడం లాంటివి పుట్టుకొస్తాయి. కారు లేనప్పుడు అవన్నీ ఉండవు! ఎందుకంటే కారు లేనప్పుడు నలుగురు ఉన్న కుటుంబం బయటికి వెళ్లడం చాలా తక్కువ. ఇప్పుడు కారు ఉంది కాబట్టే నలుగురు ఒకేసారి వెళ్ళవచ్చు. “కోరికలే గుర్రాలైతే” అన్నది తరచుగా వినబడే మాట. అంటే కోరికలు గుర్రం లాగా పరిగెత్తితే కష్టం అన్నది దాని అర్థం ఏ విధమైన కోరికలు లేకుండా బతకమని కాదు, కోరికలను అణుచుకోవడం అంటే. మన తాహతుకు మించిన కోరికలు, ఇష్టాలు సంతోషాన్ని దూరంచేసి, దుఃఖాన్ని, చింతను కలిగిస్తాయి అన్నది దాని పరమార్ధం.
ఇక అహం గురించి ఎంత చెప్పినా తక్కువే! ” అహం ఆనందానికి అడ్డంకి”. అహం ఉన్నవాళ్ళు ఆనందంగా ఉండటం అరుదు. ఆ మాట వాళ్లు బయటికి ఒప్పుకోరు కానీ, లోపల వాళ్ళకి కూడా తెలుసు. ఆత్మగౌరవానికి, అహానికి మధ్య కొంచెం తేడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం ఆత్మగౌరవాన్ని అహం గా పొరపాటు పడవచ్చు. అహం ఒక వ్యాధి లాంటిది, ఎప్పటికీ పోదు. అది ఒక మత్తు లాంటిది, ఎప్పటికీ దిగదు. ఈ ప్రపంచంలో అందరూ గొప్పవాళ్ళే. ఎవరు ఎవరికి తక్కువ కాదు. అలాంటప్పుడు నేను గొప్ప అనుకోవడం, సంఘంలో స్నేహితులను దూరం చేస్తుంది, కుటుంబంలో, బంధువుల్లో దూరాన్ని పెంచుతుంది. అహంకారం ఉన్నవాళ్లు చాలామంది ఎవరు చెప్పినా వినరు. ” నేనే గొప్ప అంటే అహంకారం- నేను కూడా గొప్ప అంటే ఆత్మగౌరవం” అన్నది గుర్తు పెట్టుకోవాలి. అదే సంతోషానికి దారి తీస్తుంది. అహం ఉన్నవాళ్లు సంతోషంగా ఉండక పోవడమే కాకుండా, ఇతరులను కూడా సంతోషంగా ఉండకుండా చేస్తారు.
“ఎవరి మీద అయినా నువ్వు కోప్పడ్డం ఎలాంటిదంటే , నువ్వు విషం తాగి అవతలి వారు చచ్చిపోవాలని కోరుకోవడం లాంటిది.” ఎవరో చేసిన తప్పుకు మనకు మనం శిక్ష వేసుకోవడం లాంటిదన్నమాట. అంటేమనిషికి కోపం రాకుండా ఉంటుందా ఉండకపోవచ్చు. అందుకే కోపాన్ని మేనేజ్ చేయాలన్నమాట. అదే Anger Management. కోపం సంతోషానికి ప్రథమ శత్రువు.
“Never express your anger, explain it!” చాలా గొప్ప మాట. అవును నిజం. కోపాన్ని ప్రదర్శించకూడదు, వివరించాలి. మన కోపాన్ని వివరించక పోతే, కాలక్రమేణ అది ద్వేషం గా మారే అవకాశం ఉంది. అందుకే మన కోపాన్ని మర్యాదపూర్వకంగా అవతలి వాళ్ళకి తెలియజేస్తే, మన మనస్సు తేలికవుతుంది, లేకపోతే ఆ కోపాన్ని మోస్తూ మనం కూడా బాధ పడతాము. సరే, అవతల వాళ్ళు అర్థం చేసుకోలేక పోవచ్చు. కానీ మనకు మాత్రం శాంతి ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కోపం వచ్చినప్పుడు మాట్లాడటం అనేది ఎన్నో అనర్థాలకు దారి తీయవచ్చు. అందుకే ప్రదేశాన్ని వదిలి వెళ్లి పోవడం మంచిది. లేదా నవ్వి ఊరికే ఉండగలగాలి. కొంచెం కష్టమే. అయినా ఇది మన కోసం. అవతలి వాళ్ల కోసం కాదు. “Speak when you are angry and you will make the best speech you will ever regret ” దాని అర్థం కోపం ఉన్నప్పుడు మాట్లాడితే తర్వాత తీరిగ్గా విచారించాల్సి వస్తుంది. కోపం అన్నది ఒక నెగటివ్ ఎమోషన్. చాలా తొందరగా వచ్చే ఎమోషన్. అందుకే దాన్ని మేనేజ్ చేయడం కష్టమే. కానీ మేనేజ్ చేయకపోతే కోపం మనకే విషం అవుతుంది. ఎవరైనా కోపగించుకున్నప్పుడు శరీరంలో కొన్ని నెగిటివ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ” తన కోపమే తన శత్రువు.. తన శాంతమే తనకు రక్ష” అని పెద్ద వాళ్ళు చెప్పిన విషయం అక్షరాల నూరు శాతం నిజం.
“For every minute that you are angry, you lose 60 seconds of happiness!!” “Expectations always lead to disappointment”.
బుద్ధుడు చెప్పిన మరో గొప్ప మాట ఇది. కానీ ఈ స్వార్ధ ప్రపంచంలో, ఇచ్చిపుచ్చుకోవడం ఒక సాంప్రదాయమైన పరిస్థితుల్లో ఎక్స్పెక్ట్ (expect) చేయకుండా ఉండడం కష్టమే. అదే ఆశించిన తర్వాత అలా జరగకపోతే సంతోషం పూర్తిగా మాయమైపోయి, నిరాశ, విచారం, కొంత దుఃఖం, కాసింత కోపం రావచ్చు.
పరీక్షలో ర్యాంకు వస్తుందని ఆశించడం, రాకపోతే నిరాశకు గురి కావడం మనం కామన్ గా పెద్ద స్థాయిలో చూస్తున్న ఎక్స్పెక్టేషన్. సినిమా బాగుంటుందని ఖర్చు పెట్టి వెళ్లి, బాగా లేకపోతే డిసప్పాయింట్ కావడం, చిన్న స్థాయిలో చూస్తున్నాం. ఎవరింటికైనా వెళితే కూర్చోబెట్టి, మర్యాద చేసి కనీసం కాఫీ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయడం కామన్. అలా జరగకపోతే మళ్లీ డిసప్పాయింట్ మెంట్, ఇరిటేషన్. ఇవి సాధారణంగా సమాజంలో చూస్తూనే ఉన్నాం. కుటుంబాల్లో కూడా చిన్న చిన్న వాటికి (ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత) డిసప్పాయింట్ కావడం చాలా సాధారణమైన విషయమే. సినిమాకి తీసుకెళ్తానని చెప్పిన తండ్రి లేదా తల్లి సినిమాకి తీసుకెళ్ల లేకపోవడం, మోటార్ సైకిల్ కొనిస్తానని చెప్పి వాయిదా వేయటం. టూర్ కి తీసుకెళ్తాను అని చెప్పి క్యాన్సిల్ కావడం. ఇలాంటివెన్నో చూస్తుంటాం. క్యాన్సిల్ అనే పదం, పోస్ట్ పోన్ అనే పదం, వాయిదా అనే పదం నిరాశను కలిగిస్తుంది. ఆదివారాలు ఎవరన్నా భోజనానికి పిలిస్తే, ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం. అక్కడ మామూలు భోజనం ఉంటే కొంచం డిసప్పాయింట్ అవుతాం. ఏదైనా హోటల్లో ఫలానా ఐటమ్ బాగుంటుంది అని వెళ్లి, అది బాలేకపోతే డిసప్పాయింట్ మెంట్!
ఆశించడం తప్పు కాకపోవచ్చు గానీ, మనం ఆశించినట్లు జరగకపోతే బాధ పడకుండా ఉండటం మనకు కాస్తయినా సంతోషాన్ని మిగిలిస్తుంది.
చివరగా ఒక మాట. బౌద్ధం చెప్పిన విషయాలు చదివి లేదా విని మునుల్లాగా, ఋషుల్లాగా, సన్యాసుల్లాగా ఉండాల్సిన అవసరం లేదు. మనలాగే సంతోషంగా ఉండొచ్చు. అందరిని తనలా ఉండమని బుద్ధుడు చెప్పలేదు. ఎలా ఉంటే శాంతి సంతోషం ఉంటాయో చెప్పాడు అంతే!
సంతోషం అన్నది ఒక సంఘటన కాదు. ఎవరికి వారు తీసుకోవాల్సిన ఒక నిర్ణయం.. మరోసారి దీని గురించి చూద్దాం
CS Saleem Basha

(CS Saleem Basha వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)