(జూలై 31, మహాగాయకుడు మహమ్మద్ రఫీ వర్థంతి)
(CS Saleem Basha)
మహమ్మద్ రఫీ. ఈ పేరు వినగానే చాలామంది పాత తరం వాళ్ళకి వేసవికాలంలో మధ్యాహ్నాలు ఏ చెట్టు కింద కూర్చొనో, లేదా ఇంట్లో ఒంటరిగా కూర్చునో రేడియో వింటున్నప్పుడు అలా పిల్ల తెమ్మెరలా వచ్చి మనసును తాకే పాట గుర్తొస్తుంది.
రఫీ పాట హుషారుగా, ఉర్రూతలూపే జలపాతం లాంటిది కాదు. రఫీ పాట ఎవరిని డాన్స్ చేయించదు. రఫీ పాట ఒక సుడిగాలి కాదు. రఫీ పాట వేసవికాలంలో అలా మనసుల్ని, మనల్ని అలవోకగా తాకుతూ వెళ్ళిపోయే మలయమారుతం! రఫీ పాట మనుషుల్ని కాదు మనసుల్ని నాట్యం చేయిస్తుంది. రఫీ పాటంటే అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే గాలి వాన లాంటిది కాదు. రఫీ పాట గురించి చెప్పుకోవాలంటే ఏమీ ఉండదు. వింటే తెలుస్తుంది ఏమేమో ఉందని. ఎండాకాలము మధ్యాహ్నాలు కాశ్మీర్ కి కలి లోని “దీవాన హువా బాదల్” పాట వింటే పిల్ల తెమ్మెరలు అలా అలా తడిమినట్లనిపిస్తుంది.
వర్షాకాలం సాయంత్రాలు లోఫర్ సినిమాలో ధర్మేంద్రకు పాడిన “ఆజ్ మౌసం బడా బేఇమాను హై” అన్న పాట వింటే నిజమే ననిపిస్తుంది. చలికాలం సాయంకాలపు నీరెండలో సంగం సినిమాలోని ” ఏ మేరా ప్రేం పత్ర్ పడ్ కర్” అన్న పాట వయసుతో సంబంధం లేకుండా గుండెల్లో రొమాంటిక్ వేవ్ సృష్టిస్తుంది. రఫీ పాట జ్ఞాపకాల తుట్టెను కదిలిస్తుంది. ఒక్కో పాట మళ్ళీ ఒక్కో జ్ఞాపకమవుతుంది. ఆస్వాదించటానికి, నెమరువేసుకోటానికి, జ్ఞాపకాల్లో దాచి పెట్టుకోటానికి తప్ప మరేమి చేయటానికి వీల్లేని పాటలు పాడటం రఫి కే చెల్లింది. దోస్తీ సినిమాలో రఫీ “చాహుంగా మై తుఝే సాంజ్ సవేరే” పాటతో, అప్పటి ప్రధాని నెహ్రూ ని ఏడిపించటం విశేషం!
రఫీకి చాలామంది రసజ్ఞులైన అభిమానులు ఉన్నారు. వాళ్లంతా రఫీ పాట నే కాదు, రఫీ ని కూడా అభిమానిస్తారు. రఫీ పాట నచ్చని వాళ్ళు ఉండొచ్చేమో, కానీ రఫీ అంటే నచ్చని వాళ్ళు ఎవరూ ఉండరు. ఎవరికైనా సరే సహాయం చేయడం రఫీ తత్వం, అణుకువ, ఆత్మీయత రఫీ కి రెండు కళ్ళు. అహం ఇసుమంతైనా లేకపోవడం మహమ్మద్ రఫీ కి ఒక ఆభరణం! రఫీ ని అభిమానించే వాళ్ళు, ఆరాధించే వాళ్ళు, రఫీ అంటే పడిచచ్చే వాళ్ళు ఎంతమందో ఉండొచ్చు కానీ, రఫీని ద్వేషించే వాళ్లు మాత్రం ఎవరు ఉండరు. జూలై 31, 1980 తేదీన రఫీ అంతిమయాత్రలో సినీ రంగానికి సంబంధించి బొంబాయిలో ఆరోజు ఉన్న వారందరూ పాల్గొనడమే దీనికి నిదర్శనం.
రఫీ అభిమానుల జాబితాలో అనేక మంది గాయకులు, సంగీత దర్శకులు ఉండడానికి కారణం రఫీ ఉన్నత స్థాయి వ్యక్తిత్వమే! తెలుగులో ప్రముఖ గాయకుడు, వ్యాఖ్యాత, న్యాయనిర్ణేత మన ఎస్పి బాల సుబ్రహ్మణ్యం కు రఫీ అంటే అత్యంత గౌరవంతో కూడిన అభిమానం. ఆయన మాటల్లోనే అది చూడవచ్చు“”To me he is God, Gandharva, and Guru. What a voice! how expressive! The grace, with which he molded his voice for different actors, is unbelievable. I learned and still learn to listen to him. He lives as long as Music lives. I bow my head to you Janab, with reverence and Love. దీన్ని తెలుగులో అనువదించు కుంటే, ” అతను నాకు దేవుడు, గురువు, గంధర్వుడు. ఎంతో గొప్ప కంఠం. వివిధ నటులకు పాడడంలో ఆయన చూపిన వైవిధ్యం నమ్మలేం. నేను ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను, నేర్చుకుంటూనే ఉన్నాను. సంగీతం ఉన్నంత వరకు అతను అజరామరుడు. జనాబ్ రఫీ గారికి గౌరవంతో, ప్రేమతో శిరసు వంచి నమస్కరిస్తున్నాను”. రఫీ ప్రస్తావన రానిదే తనకు ఒక్క రోజు కూడా గడవదని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. రఫీ “దీవాన హువా బాదల్ “ పాట గురించి బాలు చక్కగా చేసిన విశ్లేషణ ఈ వీడియోలో చూడవచ్చు
https://youtu.be/iInyPAev4YU
రఫీ అభిమానుల జాబితాలో ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. ప్రముఖ గాయకుడు ముఖేష్ కుమారుడు నితిన్ ముఖేష్ పాటలు ప్రాక్టీస్ చేస్తాను అంటే ” మహమ్మద్ రఫీ గారి పాటలు పాడటం నేర్చుకో. మహమ్మద్ రఫీ లాగా కొంచమైనా పాడ గలిగితే, నువ్వు ధన్యుడు వే” అని చెప్పటం రఫీ యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది. ప్రముఖ గాయకుడు సోను నిగం రఫీ ని తండ్రిలా భావిస్తాడు. ఇంకా అనేక వర్ధమాన గాయనీ గాయకుల కు రఫీ ఆరాధ్యదైవం. ప్రముఖ గాయకుడు, రఫీ కి మిత్రుడు మన్నాడే అభిప్రాయం ప్రకారం, రఫీ లాగా పాడడం ఆయనతోపాటు ఎవరికీ సాధ్యం కాదు.
ఇక రఫీ అభిమానుల జాబితాలో కొంత మంది సంగీత దర్శకులు కూడా ఉన్నారు, మొదటివాడు, ఓ.పీ.నయ్యర్“ రఫీ అనే వాడు లేకుంటే, ఓపీ నయ్యర్ అనేవాడు ఉండేవాడు కాదు” అని ప్రకటించాడు. అలాగే మరో ప్రముఖ సంగీత దర్శకుడు మదన్మోహన్ కూడా రఫీ కి అభిమానే. ఎన్నో గొప్ప పాటలను స్వరపరిచాడు. సంగీత దర్శకులలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లక్ష్మీకాంత్-ప్యారేలాల్ జంట గురించి. రఫీ ఎక్కువ పాటలు(379) పాడింది వీళ్ల కోసమే. వీరిని ప్రోత్సహించింది కూడా రఫీ నే.
మహమ్మద్ రఫీ గొప్ప గాయకుడే. ఇందులో సందేహం లేదు. అయినా ఈ రెండు విషయాలు ప్రస్తావనార్హం. 1 బిబిసి ఛానల్ మహమ్మద్ రఫీ ‘సూరజ్’ సినిమాలో పాడిన” baharo phool barsao” పాటను నంబర్ వన్ పాటగా ఎంపిక చేసింది. రెండవది Outlook magazine 2006 లో బాలీవుడ్ లో … టాప్ 20 సాంగ్స్ ను ఎంపిక చేసింది. ఇందుకోసం అనేకమంది సంగీత దర్శకులను, పాటల రచయితలను, గాయకులను జడ్జీలుగా నియమించి ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన పది పాటలను ఇవ్వమని అడిగింది. అందులో ఎక్కువ ఓట్లు వచ్చిన పాటలను ఒకటి నుంచి పది స్థానాల వరకూ ప్రకటించింది. మొదటి స్థానంలో” చిత్ర లేఖ” సినిమాలో రఫీ పాడిన” 1. Man re, tu kaahe na dheer dhare” పాట ఉంది.
https://www.youtube.com/watch?v=uA2FhgF6VY4
రెండు మూడు స్థానాల్లో కూడా రఫీ పాటలే ఉన్నాయి. రెండూ గైడ్ సినిమాలో పాటలే. 1. తేరే మేరే సప్నే 2. din dhal jaaye. ఈ మూడు సినిమాలకూ సంగీత దర్శకత్వం వహించింది ఎస్.డి. బర్మన్ కావడం విశేషమేమీ కాదు. ఎందుకంటే “రఫీ అనే వాడు లేకపోతే నేను సినిమారంగంలో ఇంత ఎత్తు ఎదిగే వాణ్ని కాదు” అని చెప్పింది కూడా ఎస్.డి. బర్మనే ! తన కుమారుడు ఆర్.డి.బర్మన్ రఫీ ని పక్కన పెట్టడం నచ్చలేదు. అందుకే “ఆరాధన” సినిమాలో రెండు పాటలు రఫీ వి పెట్టాడు
రఫీ పాట మధురం, మాట సున్నితం, మనసు నవనీతం వెరసి మనిషి బంగారం. చాలామందికి రఫీ గురించి పెద్దగా తెలియదు. ఎందుకంటే రఫీ గురించి పెద్దగా తెలుసుకోవడానికి ఏమీ లేదు. అంతా తెరచిన పుస్తకమే! సాదాసీదా మనిషి., భేషజాలు, అట్టహాసాలు ఆడంబరాలు పెద్దగా లేని జీవితం. స్టూడియో లో పాట పాడేసి నేరుగా ఇంటికి వెళ్ళిపోయి పిల్లలతో క్యారం బోర్డు, బ్యాడ్మింటన్ ఆడుకోవడం. వీలైతే గాలిపటాలు(భాబి సినిమాలో పాట “చలి చలి రె పతంగ్ మేరి చలిరే..” రఫీ పాడటం యాదృచ్చికం!) ఎగురవేయడం. అంతే! పార్టీలు లేవు. పెద్దగా అలవాట్లు లేవు. ఒక లడ్డూ అంటే విపరీతమైన ఇష్టం ఉండేది. తీయనైన పాట పాడే రఫీకి వచ్చిన తీయనైన వ్యాధి లడ్డూను దూరం చేస్తే చిన్న పిల్లాడిలా బాధ పడడం రఫీ మనస్తత్వానికి అద్దం పడుతుంది.
రఫీ లో ఇంకో విశేషం ఉంది .అది అతని మొహం పై చెరగని నవ్వు. దీని పై ఓ ఆసక్తి కరమైన కథ ఉంది. హెచ్.ఎం.వీ గ్రాం ఫోన్ కంపెనీ, రఫీ పాడిన విషాద గీతలతో ఓ ఆల్బం తీయలనుకుంది.దానికోసం కొంత విచారంగా ఉన్న రఫీ మొహం కావాలని ఫోటోల కోసం వెతికితే ఒక్కటి కూడా కనపడలేదట!. దాంతో చివరికి ఎదో ఓ ఫోటోని ముద్రించారట.
రఫీ గాయకుడిగా ఎన్నో శిఖరాలను అధిరోహించాడు. దాదాపు 14 భాషల్లో పాటలు పాడాడు. ప్రసిద్ధులైన సంగీతదర్శకుల ఆధ్వర్యంలో నే కాకుండా, ముక్కు ముఖం తెలియని కొత్తవాళ్లతో కూడా రఫీ పాడటం, అతనికి అహం లేదని తెలియపరుస్తుంది. అంతేకాకుండా రఫీ డబ్బు మనిషి కాదు. డబ్బులు ఇవ్వలేదని, తక్కువ ఇచ్చారని, ఎక్కువ కావాలని రఫీ ఎప్పుడు డిమాండ్ చేయలేదు. పాట పాట పాడటమే ముఖ్యం అనుకునే వాడు. డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా పట్టించుకునేవాడు కాదు. పైగా కొంతమంది సంగీత దర్శకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేసేవాడు. అలాగే కొంతమంది నిర్మాతలను కూడా అతను ఆదుకున్నాడు. రఫీ లో ఉన్నమరో మరో గొప్ప గుణం ఎంతోమంది గాయకులకు ప్రోత్సాహం ఇవ్వడం. మహేంద్ర కపూర్ లాంటి సాటి గాయకుడికి రఫీ ఎంతో సహాయం చేశాడు. రఫీ కి పద్మశ్రీ ఇచ్చి, లతా మంగేష్కర్ కి పద్మభూషణ్ ఇచ్చినప్పటికీ, పద్మశ్రీని నిరాకరించ కుండా స్వీకరించడం రఫీ హుందాతనాన్ని సూచిస్తుంది
రఫి కొత్తలో కోరస్ లలో ఫాడాడు (నౌషాద్ సంగీతం) ఒక సారి రికార్డింగ్ ఇంకా మిగిలి ఉండగా కోరస్ పాడినవారిని మర్నాడు రమ్మన్నారు.డబ్బులు కూడా అప్పుడే ఇస్తామన్నారు. తన పని ముగించుకుని బాగా పొద్దు పోయాక నౌషాద్ స్టుడియో నుంచి బయటికి వస్తుండగా సాయంత్రం కోరస్ లో పాడిన కుర్రాడు(అంటే రఫి) గేటు బైట కనపడితే “ఏమయ్యా? ఇంకా ఇంటికి వెళ్ళలేదా?” అని అడిగితే అ కుర్రాడు(రఫి)” లేదు” అన్నాడు. “ఎందుకు?” అని అడిగితే,”రేపు మళ్ళీరావాలి కదా, ఇంటికి వెళ్ళి మళ్ళీ రావటానికి నా దగ్గర డబ్బులు లేవు” అన్నాడా కుర్రాడు. అప్పుడు నౌషాద్ “డబ్బులు అడగొచ్చు కదా?” అంటే, “ఎలా అడగాలి, పాట ఇంకా పూర్తి కాలేదు కదా?” అన్నాడు రఫి (అదే ఆ కుర్రాడు)!
ఒక సారి “ఇంపాలా” కారు కొన్నాడు. పాత డ్రైవర్(సుల్తాన్) కు అది నడపటానికి రాదు. అందరూ కొత్త డ్రైవర్ ను పెట్టుకోమన్నారు. రఫి కు అది ఇష్టం లేదు.అయితే ఏం చెయ్యాలో కూడా తోచలేదు. ఒక రోజు డ్రైవర్ ను పిలిచి ” ఇదిగో నీ కోసం కొత్త ట్యాక్సీ కొన్నాను. దీంతో నీ కుటుంబాన్ని పోషించుకో.నేను కొత్త డ్రైవర్ ను పెట్టుకుంటాను” అన్నాడు!
మరో సంఘటన .. “నీల్ కమల్” సినిమాలో పాడిన “బాబుల్ కి దువాయే..” పాట
ఇప్పటికి పెళ్ళిల్లలో వినిపిస్తూ ఉంటుంది. పెళ్ళికూతురిని తండ్రి సాగనంపేటపుడు(“బిదాయీ”)ఆ పాట ఉంటుంది. రికార్డింగ్ అయ్యాక నిర్మాత చెక్ ఇస్తే రఫి తీసుకుని ఇంటికి వెళ్ళాడు. కొంచెం సేపటికే తిరిగి వచ్చి నిర్మాతకు చెక్ వాపసు ఇచ్చాడు.”ఎందుకు” అని అడిగితే “కూతురిని సాగనంపటానికి నేను డబ్బులు తీసుకోను” అన్నాడు!
చిత్తూరు నాగయ్య రామదాసు సినిమాలో రఫీ తో పాడించాలి అనుకున్నాడు. అయితే రఫీ సెక్రెటరీ తో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆ విషయం రఫీ దాకా చేరలేదు. దాంతో చిత్తూరు నాగయ్య గారు నిరాశ పడిపోయారు. తర్వాత విషయం తెలుసుకున్న రఫీ మద్రాస్ కు వచ్చి ఆయన సినిమాలో ఒక హిందీ పాట పాడి మళ్లీ ఆయన డబ్బులతోనే విమానంలో ముంబై వెళ్లి పోయాడు. చిత్తూరు నాగయ్య గారు పారితోషికం ఇవ్వపోతే వద్దని చెప్పి ఒక్క రూపాయి మాత్రమే ఆయనతో తీసుకున్నాడు. అది రఫీ వ్యక్తిత్వపు మధురిమ. అలాంటివి చాలా ఉన్నాయి. నిజానికి రామారావు గారు తెలుగులో ఆయనతో పాడించాలని ఆయనను మద్రాసుకు రప్పిస్తే, రఫీ ఘంటసాల గారిని కలిసి, ” మీరు ఉండగా. నేను తెలుగులో పాడటం సరికాదు కదా” అని అడిగితే, ఘంటసాల గారు ప్రోత్సహించారట. దాంతో మహ్మద్ రఫీ తెలుగులో తల్లా పెళ్ళామా, ఆరాధన, అక్బర్ సలీం అనార్కలి సినిమాల్లో పాడటం జరిగింది. ఈ సినిమాలో దాదాపు అన్ని పాటలు డాక్టర్ సి.నారాయణరెడ్డి గారి రాయటం విశేషం. తెలుగు సరిగా రాక పోయినా, అది ఒక హిందీ గాయకుడు పాడుతున్నట్లు స్పష్టంగా తెలిసినా తెలుగు ప్రేక్షకులు దీని రఫీ ని ఆదరించారు. ఆరాధన సినిమాలో” నా మది నిన్ను పిలిచింది” ఒక హిట్ పాట.
అంతకుముందు భలేతమ్ముడు సినిమాలో ” ఇద్దరి మనసులు ఒకటాయే”, ” ఎంత వారు గాని” ఇలాంటి పాటలు కూడా తెలుగు శ్రోతలకు నచ్చాయి. అక్బర్ సలీం అనార్కలి చిత్రంలో ”తానే మేలి ముసుగు తీసి ఒక జవ్వని” తో పాటు “రేయి ఆగిపోనీ”‘ , ” సిపాయి'” పాటలు కూడా హిట్ కావడం విశేషం. అలా మహమ్మద్ రఫీ తన మధురమైన గాత్రంతో తెలుగు వారిని కూడా అలరించాడు.
మహమ్మద్ రఫీ వివాద రహితుడు. అయితే చంద్రునికి మచ్చ ఉన్నట్లు, రఫీ జీవితంలో లతా మంగేష్కర్ తో వచ్చిన రాయల్టీ వివాదం కొంత ఇబ్బంది పెట్టింది. రఫీ లతా కి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల కొంతకాలం పాటు ఇద్దరు డ్యూయెట్లు పాడలేదు.
ఆ తర్వాత శంకర్-జైకిషన్ సంగీత దర్శక ద్వయం వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చిన తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. దాదాపు ఆరు సంవత్సరాల పాటు లతా మంగేష్కర్ మహమ్మద్ రఫీ తో పాడలేదు, ఆ విరామంలో మహమ్మద్ రఫీ సుమన్ కళ్యాణ పూర్ ల జంట మంచి హిట్ పాటలు ఇచ్చింది, అలాగే రఫీ లత సోదరి ఆశా తో కలిసి పాడటం విశేషం.
” రఫి భయ్యా, భారత దేశంలోనే గొప్ప గాయకుడు మాత్రమే కాదు ఒక అద్భుతమైన వ్యక్తి కూడా. ఆయన స్వర స్థాయి ముందు నేను కాని, ఆశా కానీ, మన్నాడే కాని, కిశోర్ భయ్యా కాని సరిపోము.”- ఇదీ రఫీ గురించి లతా ప్రశంస. రఫి మరణం తర్వాత” పున్నమి చంద్రుడు వెళ్ళిపోయాడు. ఇక అంతా చీకటే” అని చెప్పింది కూడా లతానే. నచ్చని వాళ్ళు కూడా మెచ్చుకునే గొప్ప గాయకుడు రఫీ అనటానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా?
ఇక కిషోర్ కుమార్ తో రఫీ కి ఉన్న వృత్తిపరమైన పోటీ గురించి అందరికీ తెలుసు. చాలా మంది చాలా రకాలుగా దాని గురించి చిలువలు పలువలు చెప్పినా, ఇద్దరి మధ్య స్నేహం కూడా ఉండేది. శరారత్ (1956) , రాగిణి (1958) సినిమాల్లో కిషోర్ కుమార్ కి రఫీ పాటలు పాడడం విశేషం. ఇంకో విషయం ఇక్కడ చెప్పాలి. రఫీ అంతిమయాత్రలో రఫీ శవపేటిక దగ్గర కూర్చుని రెండు గంటలపాటు ఏడ్చిన ఏకైక వ్యక్తి కిషోర్ కుమారే! 1969లో కిశోర్ కుమార్ రాకతో మహమ్మద్ రఫీ వెనకబడి పోయాడు అన్న దాంట్లో పూర్తిగా నిజం లేదు. కొంత ఒరవడి తగ్గినా చివరికి రఫీ 1974 లో వచ్చిన ‘ హవస్ ‘ సినిమా ద్వారా మళ్లీ విజయ పథంలోకి దూసుకెళ్ళాడు. (ఇక్కడ రఫీ వ్యక్తిత్వానికి , నిజాయితీకి అద్దంపట్టే సంఘటన ఒకటి జరిగింది. “హవస్” సినిమా కు సంగీత దర్శకత్వం వహించిన ఉషా ఖన్నా ( మొట్టమొదటి సంగీత దర్శకురాలు) కు రఫీ పాడిన ” తేరీ గలియోన్ మే ” అన్న పాట లో కొంత నచ్చ లేదు. ఉషా ఖన్నా రఫీ కి మంచి స్నేహితురాలు. అందుకే రఫీ కీ ఏమీ చెప్పలేదు. తర్వాత రఫీ కి ఈ విషయం తెలిసి ” పాటని మళ్లీ రికార్డు చేయవలసింది. నాకు ఎందుకు చెప్పలేదు.” అని చెప్పాడు.) 1977 లో వచ్చిన “హమ్ కిసీ సే కం నహీ ” సినిమా ద్వారా జాతీయస్థాయిలో ఉత్తమ గాయకుడిగా అవార్డు పొందడమే దీనికి నిదర్శనం.
తుం ముఝే యూ భులాన పావోగే
జబ్ కభీ భీ సునోగే గీత్ మేరే
సంగ్ సంగ్ తుం భి గున్ గునావోగే
మీరు నన్ను అంత సులభంగా మర్చిపోలేరు
నా పాట ఎప్పుడు విన్నా సరే
నాతొ పాటు మీరు కూడా ఆ పాటని పాడతారు….
(మధుర గాయకుడు.. మహా మనిషి మహమ్మద్ రఫీ పాడిన మధుర గీతాల్లో ఇది ఒకటి)
నిజమే ! రఫీ ఎప్పటికి మరచిపోలేము. అసలు ఎలా మార్చిపోగలం?
(CS Saleem Basha వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)
LIKE THIS STORY? SHARE IT WITH A FRIEND