ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర రాజధానికి సంబంధించి రెండు కీలక బిల్లులకు శుక్రవారం ఆమోదముద్ర వేశారు. దీంతో రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఏపీ రాజధాని వికేంద్రీకరణ(AP Decentralization andiInclusive development of regions Bill-2020) , సీఆర్డీఏ-2014 (AP Capital regions development authority Bill-2020) బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో మూడు రాజధానులు లైన్ క్లియర్ అయింది. 3 వారాల కిందట ప్రభుత్వం ఈ బిల్లులు పంపగా ఆయన శుక్రవారం ఆమోదం తెలిపారని, దీంతో శాసన ప్రక్రియ పూర్తయినట్టే అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఇపుడు కోర్టుల నుంచి న్యాయపరంగా ఎలాంటి సమస్యలు ఎదురుకాకపోతే, అమరావతి కేవలం శాసన రాజధాని (Legislative Capital) గా ఉండిపోతుంది. కార్యనిర్వాహక రాజధాని (Executive Capital) విశాఖపట్టణానికి తరలిపోతుంది. హైకోర్టు తదితర న్యాయపాలన విభాగాలతో కర్నూలు న్యాయపాలన(Judicial Capital) అవుతుంది.
అనేక వ్యవహారాల్లో కోర్టల నుంచి ఎదురుదెబ్బలు తింటున్న జగన్ ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద ఊరటే.
ఈ రెండుబిల్లులను ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఈ ఏడాది జూన్ 16వ తేదీన రెండోసారి ఆమోదించింది. మొదటిసారి 2020 అసెంబ్లీ పాస్ చేసినా జనవరి 22న కౌన్సిల్ లో పాస్ కాలేదు,
బిల్లులు కౌన్సిల్ లో ప్రవేశపెట్టడం తీవ్రవివాదానికి దారి తీసింది. కౌన్సిల నియమాల మీద, సంప్రదాయాల మీద సుమారు అయిదు గంటల పాటు రభస జరిగింది.59 మంది సభ్యులున్న కౌన్సిల్ లో తెలుగుదేశం పార్టీ అధిక్యత ఉంది.బిల్లు ను క్షుణ్ణంగా పరిశీలించేందుకు సెలెక్ట్ కమిటీకి పంపాలని తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించింది. స్పీకర్ దీనికి ఆమోదం తెలిపారు. దీనితో రాజధాని బిల్లుల వ్యవహారం వివాదంలో పడిపోయింది.
అయితే, కౌన్సిల్ సెలెక్ట్ కమిటీలను ఏర్పాటుచేయలేకపోయింది. సెలెక్ట్ కమీటీలకు బిల్లులను రెఫర్ చేయడం చెల్లదని కౌన్సిల్ సెక్రటెరీ కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభించనేలేదు.
2020 జనవరిలో కౌన్సిల్ వాటిని సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేయడంతో రాజధానుల వికేంద్రీకరణ ప్రక్రియ వాయిదా పడంది.
రాజధాని తరలించాలనేది ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వానికి కీలకమయిన ఎజెండా కావదంతో రెండో సారి ఈ బిల్లలను 2020 జూన్ 16న అసెంబ్లీ లో ప్రవేశపెట్టారు.అయితే, కౌన్సిల్ ఆమోదం తప్పని సారి కాదు కాబట్టి, కౌన్సిల్ పాస్ చేసినట్లుగానే భావించి (deemed to have been passed by the Council) అసెంబ్లీల ప్రవేశపెట్టి పాస్ చేయించారు.
తర్వాత ఈ ఏడాది జూన్ 19న ఈ రెండు బిల్లును గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదానికి పంపారు.
గవర్నర్ ఆమోద ముద్రతో శాసన రాజధానిగా అమరావతి, పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి.
కాగా అమరావతి రైతులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 225 రోజులుగా రాజధాని రైతులు దీక్షలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడంపై మండిపడుతున్నారు.
ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంలో కోర్టు వెలువరించిన తీర్పును గుర్తు చేస్తున్నారు రాజధాని రైతులు. ఆయన వ్యవహారంలో ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు తిప్పి కొట్టినట్టే… 3 రాజధానుల నిర్ణయానికి కూడా కోర్టులో బ్రేక్ పడుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగేవరకు తమ పోరాటం కొనసాగుతుంది అని చెబుతున్నారు.