*ఒక్క ఏడాదిలో వైసిపి ప్రభుత్వ అప్పులు, ఏపి 30ఏళ్ల అప్పులకు సమానం *2024కు వడ్డీ, అసలు చెల్లింపులకే రూ లక్ష కోట్లు చెల్లించాల్సి వస్తుంది *అత్యధిక గ్యారంటీస్ లో 4వ స్థానం, అత్యధిక అప్పుల్లో 6వస్థానం *దారుణంగా పడిపోయిన ఏపి క్రెడిట్ రేటింగ్
సమాజంలో ఏ కుటుంబానికైనా, ఏ ప్రభుత్వానికైనా అప్పులు కొత్తకాదు. ఆంధ్రప్రదేశ్ 64ఏళ్ల చరిత్రలో 1956నుంచి అన్ని ప్రభుత్వాలు అప్పులు చేస్తూనే వచ్చాయి.
2019-20నాటికి వైసిపి ప్రభుత్వం చేసిన అప్పుతో సహా (బడ్జెట్ అంకెల ప్రకారమే) ఏపి అవుట్ స్టాండింగ్ రుణాల మొత్తం రూ3,04,500కోట్లకు చేరింది. 64ఏళ్ల ఆంధ్రప్రదేశ్ అప్పుల చిట్టా మొత్తం ఇది. అంటే ఏడాదికి సగటున రూ5వేల కోట్ల లోపు అప్పు గత 64ఏళ్ళలో ఉంటే, ఈ ఒక్క ఏడాదే సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వం రూ70వేల కోట్లకు పైగా అప్పులు చేసింది.
విభజన తర్వాత ఏపిలో టిడిపి ప్రభుత్వ 5ఏళ్లలో(2014-19), ఏడాదికి సగటు అప్పు రూ26వేల కోట్లు ఉంది. అదే ఒక్క ఏడాది(2019-20)లోనే దానికంటె దాదాపు 3 రెట్లు అప్పులు జగన్ ప్రభుత్వం తెచ్చింది. ఇవన్నీ వాస్తవాలు, బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలే.
ఏడాదికి రూ70వేల కోట్ల చొప్పున వైసిపి అయిదేళ్ల పాలనలో రూ 3,50,000కోట్ల రుణభారం అదనంగా రాష్ట్రంపై మోపుతున్నారు. పాత అప్పులు కూడా దీనికి కలిపితే 2024నాటికి మొత్తం అప్పులు రూ6,54,500కోట్లకు చేరతాయి.
ఈ ఒక్క ఏడాదిలో వైసిపి ప్రభుత్వం చేసిన అప్పు, 30ఏళ్లలో రాష్ట్రం మొత్తం అప్పులకు సమానం. వైసిపి 5ఏళ్ల పాలనా అప్పులకు, 64ఏళ్లలో రాష్ట్రం మొత్తం అప్పులకు సమానం కానున్నాయి. చరిత్రలో లేనంత అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోతోంది. కనీవినీ ఎరుగని ఆర్ధిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ చిక్కుకోనుంది అనడానికి ఇదే సంకేతం.
వడ్డి చెల్లింపుల్లో వృద్ది, అసలు చెల్లింపుల్లో వృద్ది రెండూ కలిపితే ఏడాదికి రూ50వేల కోట్లు ఉంటుంది. వైసిపి చివరి ఏడాదిలో వడ్డీ చెల్లింపులు, అసలు చెల్లింపులకే రూ లక్ష కోట్లు చెల్లించాల్సి వస్తుంది.
విపరీతంగా అప్పులు చేయడం వల్ల, కేవలం అప్పుల మీదే ఆధారపడటం వల్ల ఏపి క్రెడిట్ రేటింగ్ దారుణంగా పడిపోతోంది. ఇకపై ఏపికి అప్పు కూడా దొరకని దుస్థితి ఏర్పడుతుంది. అటు అభివృద్ది పనులను ఆపేసి, ఇటు పేదల సంక్షేమం అటకెక్కి, రాష్ట్రం దివాలా తీస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించే పరిస్థితిలో రాష్ట్రం ఉండదు. ఇప్పటికే ఉద్యోగులకు ఇవ్వాల్సిన 4డిఏలు ఇవ్వకపోగా కరోనా వంకతో వాళ్ల జీతాల్లో 50% కోతపెట్టారు.
ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ రూ49వేల కోట్లు తెచ్చారు. అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటికి గ్యారంటీ ఇచ్చారు (కేర్ రేటింగ్స్ ప్రకారం).. గ్యారంటీస్ ఎక్కువ ఇచ్చిన రాష్ట్రాలలో 4వ స్థానంలో ఏపి ఉంది. (ఏపి బడ్జెట్ 2019-20, 2020-21ను బట్టే, కేర్ రేటింగ్స్ ) ఈ గ్యారంటీ లిమిట్స్ ను కూడా మన రాష్ట్రం దాటిపోయే ప్రమాదం ఉంది. టోటల్ ట్యాక్స్ రెవిన్యూలో 90%వరకు గ్యారంటీ ఇవ్వవచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కు గ్యారంటీ ఇచ్చే స్థితిలో కూడా రాష్ట్రం ఉండదు.
జిఎస్ డిపి, అప్పుల నిష్పత్తి 34.6%కు పెరిగిపోయింది, 2018-19లో టిడిపి హయాంలో 28% మాత్రమే. ఏడాదిలోనే జిఎస్ డిపి, అప్పుల అంతరం 6.6% పెరిగిపోయింది. అత్యధిక అప్పులున్న రాష్ట్రాల జాబితాలో 6వ రాష్ట్రంగా ఏపి మారింది.
ఎఫ్ ఆర్ బిఎం పరిమితిని కేంద్రం 3%నుంచి 5%కు పెంచినప్పటికీ, ప్రస్తుత ఏపి ప్రభుత్వం తెస్తున్న అప్పులను పరిశీలిస్తే ఫిస్కల్ డెఫిసిట్ కూడా భవిష్యత్తులో నియంత్రణ చేసే స్థాయిలో లేదనేది స్పష్టంగా తెలుస్తోంది. కేంద్రం పెంచిన 2% కూడా ఏమాత్రం సరిపోదు. 2020-21లో కరోనా తర్వాత, రాష్ట్ర రాబడులు దారుణంగా పడిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ ఆ ఉపద్రవం గురించి ఆలోచించే స్థితిలో వైసిపి ప్రభుత్వం లేదు. ఈ నేపథ్యంలో రెవిన్యూ డెఫిసిట్ 4% నుంచి 5% పెరిగేలా ఉంది.
అప్పులకు హద్దు, అదుపు లేకుండా సిఎం జగన్ రెడ్డి పాలన ఉంది. ఇప్పటికే రాష్ట్రం రాబడి పెరగక, కేపిటల్ ఎక్స్ పెండిచర్ కు తీవ్ర నిధుల కొరత ఏర్పడింది. 2019-20లో కేపిటల్ ఎక్స్ పెండిచర్ రూ10వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేక పోవడం తెలిసిందే. 2020-21లో ఆ మాత్రం కూడా ఖర్చు పెట్టలేరనేది ఇప్పటికే స్పష్టం అయ్యింది.
రెవిన్యూ డెఫిసిట్స్ పెరిగిపోవడం వల్ల, అప్పు తెచ్చిన సొమ్ములు కూడా రెవిన్యూ డెఫిసిట్ పూడ్చడానికి, వడ్డీల చెల్లింపునకు, అసలు చెల్లింపునకే సరిపోతాయి. అభివృద్ది పనులు, పేదల సంక్షేమానికి ఇకపై నిధుల లభ్యత మృగ్యం.
ఇప్పటికే డబుల్ డిజిట్ గ్రోత్ రేటునుంచి, రాష్ట్రం సింగిల్ డిజిట్ కు పడిపోయింది. కరోనాకు ముందే వృద్దిరేటు 4% పడిపోయింది. కరోనా తర్వాత ఇది రెండు మూడు రెట్లు పెరిగిపోయి రాష్ట్రంలో తిరోగమన వృద్ది( నెగటివ్ గ్రోత్) నెలకొంటుంది.
‘‘రివర్స్ టెండరింగ్ లకు తోడుగా రివర్స్ గ్రోత్ తెచ్చిన సీఎంగా జగన్ రెడ్డి’’ చరిత్రలో నిలిచిపోయారు.
మిషన్ బిల్డ్ ఏపి పేరుతో ప్రభుత్వ భూములను వేలం వేయడం మరో దివాలాకోరు చర్య. ఇది ‘‘బిల్డ్ వైసిపి మిషన్ తప్ప, బిల్డ్ ఏపి మిషన్’’ కాదు. చౌక ధరకు వైసిపి నాయకులకు కట్టబెట్టేందుకే భూముల వేలం తప్ప, దీనివల్ల రాష్ట్రానికి ప్రయోజనం శూన్యం. భవిష్యత్తులో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు, అభివృద్ది ప్రాజెక్టులకు భూములు లేకుండా చేయడం రాష్ట్రానికి అన్నివిధాలా అనర్ధదాయకమే..
‘‘రాష్ట్రం దివాలా తీసిందా, ప్రజల భూములు అమ్మేస్తున్నారు, ఇవి ప్రభుత్వ భూములు కావు, ప్రజల భూములని తెలుసుకోండి’’ అంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం ఒక హెచ్చరికగా తీసుకోవాలి.
జగన్ బ్యాడ్ విల్ తో, ఏపికి ఉన్న గుడ్ విల్ పోయింది. తప్పొప్పులు సమీక్షిస్తే జగన్ జమానాలో చోటు దక్కదు, అందుకే ఎవరూ నోరు తెరవడంలేదు. మీ స్వార్ధం కోసం సృష్టించిన ఇసుక కొరత పేదల జీవితాలను కల్లోలంలో ముంచింది. ఇసుక కల్లోలానికి కరోనా కల్లోలం తోడుకావడం గోరుచుట్టుమీద రోకటి పోటైంది. కమిషన్ల కోసం పిపిఏల రద్దు, ఏపి పరువు ప్రతిష్టలను గంగలో కలిపింది. వాటాల కోసం మీ బెదిరింపులు పెట్టుబడిదారుల గుండెల్లో గునపాలయ్యాయి. 14నెలల్లో ఏపికి వాటిల్లిన నష్టానికి పూర్తి బాధ్యత సీఎం జగన్మోహన్ రెడ్డిదే.
అభివృద్ది పనులు, సంక్షేమ పథకాల సమతుల్యత దెబ్బతింది. కేపిటల్ ఎక్స్ పెండిచర్ లో 35% కోతలే దానికి ప్రత్యక్ష సాక్ష్యం. తత్ఫలితంగా ఏపి అభివృద్ది అడుగంటింది, పేదల సంక్షేమం కొండెక్కింది. సమాజంలో సంపద సృష్టించడం చేతగాని వాళ్లకు, ఆ సంపద నాశనం చేసే హక్కు లేదు. వైసిపి ప్రభుత్వం గత ఏడాదిగా రాష్ట్రంలో సృష్టించిన ఆస్తి ఒక్కటి కూడా లేదు. ఒక్క ప్రాజెక్టు, ఒక్క రోడ్డు, ఒక్క వంతెన కట్టలేక పోయారు. ప్రజల రోజువారీ రాబడులను దారుణంగా దెబ్బ తీశారు. ఇసుక కొరతతో 40లక్షల భవన కార్మికుల ఉపాధి కోల్పోయేలా చేశారు. లాక్ డౌన్ లతో లక్షలాది వలస కార్మికులు స్వస్థలాలకు తిరిగివచ్చేశారు. చేతివృత్తుల వారి ఆదాయం పూర్తిగా పడిపోయింది. కొనుగోలు శక్తి తగ్గి, పొదుపు శక్తి క్షీణించి పేదరికం పెరిగిపోయింది.
ఈ పరిస్థితుల్లో విదేశాల్లో ప్రైవేటు వ్యక్తులనుంచి, ప్రైవేటు ట్రస్ట్ నుంచి అప్పులు తీసుకోవాలని చూడటం ఇంకో దివాలాకోరు చర్య. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రప్రభుత్వం ఆమోదించదు. విదేశాల నుంచి రుణాలు తెచ్చుకోవాలంటే ఆర్ బిఐ, కేంద్ర ప్రభుత్వం ఆమోదాలు ఉండాలి. కమిషన్లు ఇస్తామంటూ ప్రైవేటు వ్యక్తులు ప్రలోభపెట్టి ఇలాంటి అప్పులు అంటగట్టాలని చూస్తారు. వాటికి లోబడితే రాష్ట్ర ప్రయోజనాలను పాతర వేసినట్లే.
ఇకనైనా సీఎం జగన్ రెడ్డి కళ్లు తెరవాలి. చెడు తలంపులకు స్వస్తి చెప్పాలి. అనుచరుల ఆగడాలను అడ్డుకోవాలి. రాష్ట్రానికి నష్ట నివారణ చర్యలు చేపట్టాలి. పెద్దలు చెప్పే మాటలను గౌరవించాలి. తప్పుడు కేసులతో ప్రతిపక్షాలను వేధించడం మానుకోవాలి. సొంత లాభాలు, పగ-ప్రతీకారాలు పక్కనపెట్టి రాష్ట్రం గురించి, ప్రజల గురించి సీఎం జగన్ రెడ్డి దృష్టి పెట్టాలి.
(యనమల రామకృష్ణుడు, మాజీ ఆర్థిక మంత్రి, శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ )