పాజిటివ్ థింకింగ్: ఓటమికీ, గెలుపుకీ మధ్య తేడా ఇదే

(CS Saleem Basha)

“Attitude is a little thing that makes a big difference”

Attitude అంటే చాల విస్తృతమైనది. ఒక విధంగా చెప్పాలంటే దృక్పథం, వైఖరి. మన ఆలొచనలు, మన భావాలు, మన ప్రవర్తన, నమ్మకాలు ,ప్రాపంచిక పరిజ్ఞానం. సైకాలజీ ప్రకారం యాటిట్యూడ్ అంటే మన ఆలోచనలు- ఉద్వేగాలు, తదణుగుణంగా మన ప్రవర్తన, మన స్పందన. బయటి ప్రపంచానికి కనబడే మన వ్యక్తిత్వం మొత్తం అన్న మాట.
నీ యాటిట్యూడ్ బాలేదు, సరైన యాటిట్యూడ్ ఉండాలి, యాటిట్యూడే ముఖ్యం.. ఇలా ఎన్నో మాటలు మనం తరచూ వింటుంటాము.
సరైన యాటిట్యూడ్ ని (పాజిటివ్ యాటిట్యూడ్) గనక మనం మెరుగుపరుచుకుంటే ఏదైనా సాధించగలం. మనకు తెలిసిన లేదా మనం చదివిన కొంతమంది నాయకులు, స్పీకర్లు, వ్యాపారవేత్తలు గొప్ప వాళ్ళు అవ్వటానికి కారణం గొప్ప యాటిట్యూడ్. ఉదాహరణకి అబ్రహం లింకన్, గాంధీ, అబ్దుల్ కలాం, నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి గొప్ప వాళ్ళు ఒక గొప్ప వ్యక్తిత్వం ద్వారానే వాళ్లు చరిత్రలో నిలిచిపోయారు. కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్ ని పెంపొందించుకుంటే జీవితంలో ఏదయినా సాధించవచ్చు.
“యాటిట్యూడ్ మేక్స్ ద డిఫరెన్స్”. ఈ మధ్య బాగా ప్రాచుర్యం లోకి వచ్చిన మాట. సక్సెస్ ఫుల్ కావడానికి మంచి తెలివితేటలు మరియు నాలెడ్జ్ కావాలని మన అందరికీ తెలిసిన విషయమే. అయితే సైకాలజిస్ట్  కరోల్ డ్వెక్ చేసిన సర్వే ప్రకారం ఐక్యూ( intelligent quotient) కంటే కూడా సరైన యాటిట్యూడ్ ఉన్నవాళ్లే సక్సెస్ అవుతారని తేలింది. డ్వెక్ (Carol Dweck) చెప్పిన ప్రకారం యాటిట్యూడ్ అనేది రెండు రకాలు (Mindset: The New Psychology of Success). మొదటిది ఫిక్సెడ్ మైండ్ సెట్ (నెగటివ్ యాటిట్యూడ్!), రెండవది గ్రోత్ మైండ్ సెట్ (పాజిటివ్ యాటిట్యూడ్).
Basic mindsets(brainpickings.org)
మొదటి మైండ్ సెట్ విషయనికి వస్తే ఈ మైండ్సెట్ ఉన్నవాళ్లు తాము చేసే ప్రతీ విషయం సరైనదని అనుకుంటూ ఉంటారు. వాళ్లు ఒక చోట ఆగిపోతారు. మార్పును ఇష్టపడరు. స్థూలంగా చెప్పాలంటే వాళ్లు ఒకదానికి ఫిక్స్ అయిపోతారు. అదే గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళ విషయానికి వస్తే వాళ్లు తమని తాము మెరుగుపరుచుకోవడం అని అనుకుంటారు. మార్పుని ఇష్టపడతారు. వాళ్ల ఐక్యూ తక్కువగా ఉన్నా కూడా వాళ్లు దానిని అధిగమించగలరు. వాళ్లు సవాళ్లను ఒక అవకాశం గా భావిస్తారు. వాళ్ళు ముందుకే వెళతారు. ఇక విజయం సాధించడానికి మనం ఏ క్యాటగిరి లో ఉండాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే విజయం మనం ఓటమిని ఎలా స్వీకరిస్తాము దానిపై ఆధారపడి ఉంటుంది.

ఒకవేళ జీవితంలో విజయం సాధించాలి అనుకుంటే కచ్చితంగా మనం గ్రోత్ మైండ్ సెట్ ని అభివృద్ధి చేసుకోవాలి.విజయం అనేది మన తప్పు లో నుంచే పుట్టుకొస్తుంది. మన విజయం మనం చేసిన తప్పులు వాటి నుంచి ఏం నేర్చుకున్నాం అనే దాని పైనే ఆధారపడి ఉంటుంది.
వాల్ట్ డిస్నీ మన అందరికీ సుపరిచితమైన పేరే. ఒక గొప్ప కార్టూనిస్టుగా అతను చరిత్రలో నిలిచిపోయాడు. అతని కెరీర్ తొలినాళ్లలో అతను చాలా కష్టాలు పడ్డాడు. అతనిని ఒకసారి ఒక ఆఫీసు వాళ్ళు తరిమేశారు. వాళ్లు చెప్పిన దాని ప్రకారం అతనికి ఊహాశక్తి మరియు మంచి ఐడియా లు లేవని. కానీ ఆ తర్వాత అతను ఎంత గొప్ప వాడు అయ్యాడు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే గొప్ప హాలీవుడ్ దర్శకుడు స్టీఫెన్ స్పిల్ బర్గ్ ను కూడా ఆర్ట్ స్కూల్ వాళ్ళు చాలాసార్లు తిరస్కరించారు. ఒకవేళ వాళ్లు ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్నవాళ్లు అయ్యుంటే ఏమయ్యేదో ఒక్కసారి ఊహించండి. వాళ్లు గ్రోత్ మైండ్ సెట్ ను అలవర్చుకున్నారు కాబట్టే గొప్ప గొప్ప విజయాలు సాధించారు. గొప్ప వాళ్ళు అయ్యారు.
గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఒక సూత్రాన్ని పాటిస్తారు. అదే ” Walk the extra mile” అంటే అందరూ నడిచి ఆగిపోయిన చోటినుండి వాళ్ళు ఇంకా కొంచెం ముందుకు వెళతారన్నమాట.
అంటే మనం అనుకున్న దానికంటే కూడా ఇంకా ముందుకు వెళ్లడం. ఒకసారి గొప్ప మార్షియల్ ఆర్టిస్ట్, ప్రముఖ హాలీవుడ్ హీరో బ్రూస్ లీ , అతని స్టూడెంట్ మూడు కిలోమీటర్ల రౌండ్ పరుగు మొదలు పెట్టారు. ఒక రౌండ్ పూర్తయ్యింది.అప్పుడు బ్రూస్ తన స్టూడెంట్ తో “ మనం ఇంకో రెండు రౌండ్స్ వేద్దాం” అని చెప్పాడు. దానికి అతని స్టూడెంటు “ఇంకో రెండు రౌండ్లు వేస్తే నేను చచ్చిపోతాను” అని అన్నాడు. అప్పుడు బ్రూస్ లీ “అయితే చెయ్యి” అన్నాడు. అప్పుడు అతని స్టూడెంటు కోపంతో ఆ మిగతా రెండు రౌండ్ లను పూర్తి చేశాడు. అలిసిపోయి , కోపంతో ఊగిపోతూ బ్రూస్ దగ్గరకు వచ్చి తనును ఎందుకు పరిగెత్తమన్నావు అని అడిగాడు అప్పుడు బ్రూస్” నువ్వు ఒకవేళ ఆపేసి ఉంటే కచ్చితంగా చచ్చి పోయే వాడివి. నీకు నువ్వు సరిహద్దులు పెట్టుకుంటే నువ్వు ఏది సాధించలేవు. అది నీ జీవితాంతం అలాగే ఉంటుంది. నువ్వు ఒక చోట ఆగి పోతే అది నిన్ను చంపేస్తుంది. కాబట్టి మనిషి ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉండాలి” అని చెప్పాడు.
మన హద్దులే మనకు శత్రువులు. మనం ఎప్పుడైతే వాటిని అధిగమిస్తామో అప్పుడే విజయం సాధించ గలుగుతాము. మన హద్దులను దాటుకుని ముందుకు వెళ్ళడమే అసలైన విజయం. దాన్నే “walking the extra mile” అంటారు.
“ఓటమి పొందిన చాలామంది, విజయం ఒక్క అడుగు దూరంలో ఉన్నప్పుడు ఆగిపోయినవారే” అన్నాడు ఎడిసన్ ఒక సందర్భంలో. విజయం సాధించేవారికి, సాధించలేని వారికి మధ్య తేడా ఒక్క అడుగు (extra mile )మాత్రమే! ఫిక్సుడ్ మైండ్ సెట్ వాళ్ళు ఒక చోట ఆగిపోతే, గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఒక్క అడుగు ముందుకు వెళతారు. అంతే తేడా
నెగటివ్ కి ( -) పాజిటివ్ కి (+) మధ్య తేడ కూడా ఒక్క గీతే కదా!
CS Saleem Basha
(CS Saleem Basha వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)