బిసిల అంతర్గత అనైక్యత? : ఊ. సా. ఎపుడో రాసిన వ్యాసం

బడుగు వర్గాల ఐక్యం కోసం హక్కుల కోసం నిరంతరం పోరాడిన మేధావి ఉ సాంబశివ రావు  ఈ రోజు కరోనా చనిపోయారు. ఆయన మరణం బిసి,దళిత ఉద్యమాలకు తీరనిలోటు. ఈ వర్గాలను రాజ్యాధికారంలో సమాయత్తం చేయడంలో ఎప్పటినుంచోఆయన శ్రమిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మానవహ హక్కుల ఉద్యమాలలో, యురేనియం మైనింగ్ వ్యతిరేక ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల విపరీతంగా పర్యటిస్తూ ఈ వర్గాల చైతన్యం కోసం పాటుపడుతూ వచ్చారు.
ఆయనను గుర్తు చేసుకుంటూ సెప్టెంబర్ 22, 2013 న ఆయన బిసిల అనైక్యత మీద రాసిన వ్యాసాన్ని బ్లాగ్ నుంచి తీసుకుని పునర్ముద్రిస్తున్నాము.

బిసిల అంతర్గత అనైక్యత?

(ఊ. సాంబశివరావు)
దేశంలో అత్యధిక జనాభాగల బిసిలు అన్యా యానికి కూడా అత్యధికంగానే గురవుతున్నారు. అన్యాయాన్నెదిరించి పోరాడటంలో కూడా అత్యంత వెనుకబడిపోయారు. అందుకు అగ్రకులాధిపత్య శక్తుల పరాపరాధం సగం కారణమైతే బిసిల స్వయంకతాపరాధం మరోసగం కారణం. బిసిలలో బిసి అస్తిత్వ స్పహ సరిగా లేకపోవటం, విడివిడి బిసికులాలు ఉమ్మడి బిసి చైతన్యంతో ఒకతాటి మీదకు రాలేకపోవటం, బిసిలలో అంతర్గత ఐక్యత లేకపోవటం అనే ముఖ్యాంశాలే బిసిల స్వయంకతాపరాధ వైఫల్యానికి మూలకారణాలని విజ్ఞలు చెపుతుంటారు. ఈ మూడు ముఖ్యాంశాల్లోకూడా బిసిల అనైక్యతా అంశం మరింత ముఖ్యమైందని వేరే చెప్పనక్కర లేదు.
అందుకే బిసిలు ఎదుర్కొంటున్న అన్నిరకాల అనర్ధాలకి మూలం బిసిలమధ్య అనైక్యతేనని అనేకమంది బిసి నేతలు నొక్కిచెపుతుంటారు.
బిసిలు దేన్ని సాధించుకోవాలన్నా బిసిలమధ్య ఐక్యత అవసరమని ఎవరెంత మొత్తుకొన్నా, అనైతక్యత వల్ల జరుగుతున్న అనర్ధాల గురించి ఎవరెంత వాపోయినా- అనైక్యత అలాగే కొనసాగుతున్నదంటే అది మాటలతోపోయే మామూలు అనైక్యత కాదని గ్రహించటం అవసరం. బిసిలను మాత్రమే పట్టిపీడిస్తున్న ఈ ప్రత్యేక అనర్ధదాయక అనైక్యత వ్యక్తిగతమైన, వ్యవస్థాగతమైన సాధారణ అనైక్యత కూడా కాదు. అగ్రకులాధిపత్య రక్షణ లక్ష్యంతో అగ్రకుల పాలకవర్గాలు సృష్టించిన కత్రిమమైన అసాధారణ వ్యూహాత్మక అనైక్యత. అదేమిటో పరిశీలించేముందు వ్యక్తిగత, వ్యవస్థాగత అనైక్యతల గురించి తెలుసుకుందాం.వ్యక్తిగత ఆస్తి ప్రాతిపదికపై వ్యక్తులను కలవారు- లేనివారిగా విభజించే వర్గ వ్యవస్థలో ఇరు వర్గాల మధ్య అనైక్యత ఉన్నా, కలవారికి వ్యతిరేకంగా లేనివారందర్నీ ఒక వర్గంగా శ్రామికవర్గంగా ఐక్యంచేసే అవకాశం ఉంది. కనుక వర్గవ్యవస్థలో శ్రామిక వర్గానికి చెందిన వ్యక్తులంతా ఓ శక్తిగా ప్రజాశక్తిగా, జనశక్తిగా మారి ప్రభంజనం సృష్టింగలరు. అందుకే ‘నువ్వు నేను కలిస్తే మనం! మనం మనం కలిస్తే జనం! జనం జనం కలిస్తే ప్రభంజనం’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ‘నోకియా కనెక్టింగ్‌ ద పీఫుల్‌’ అన్నట్లు, వర్గ వ్యవస్థలో శ్రామిక వర్గదక్పథం శ్రామిక వర్గ ఐక్యతను సాధించగలదు.
కనుక వర్గ వ్యవస్థ కేవలం అసాంఘిక వ్యవస్థ మాత్రమే అన్నాడు డా బి.ఆర్‌. అంబేడ్కర్‌. కానీ ‘బ్రాహ్మణిజం డిస్‌కనెక్టింగ్‌ ద ఇండియన్‌ పీపుల్‌’ గనుక కులవ్యవస్థ వ్యక్తుల్ని కుల సమూహాలుగా అసంఘటితపర్చి అంతస్థుల వారీగా విభజించి పాలిస్తుంది. అందుకే దాన్ని సంఘ వ్యతిరేక వ్యవస్థ అన్నాడు అంబేడ్కర్‌. కుల వ్యవస్థలో ప్రతివ్యక్తీ తన వ్యక్తిగత సొంత అస్తిత్వం కోల్పోయి పరాధీనమై కులాధీనమై పోతాడు గనుక, కులవ్యవస్థ సృష్టించే వ్యవస్థాగతమైన అనైక్యతకు అన్ని కులాలవారూ గురవుతారు. కులవ్యస్థలోని వ్యవస్థాగత అనైక్యతకు కేవలం బిసిలేకాక మిగతా కులాలవారు కూడా గురవుతున్నారు గనుక అది బిసిలు మాత్రమే ఎదుర్కొంటున్న ప్రత్యేక అనైక్యత కాదు.
వర్గ వ్యవస్థ కంటే కులవ్యవస్థ ప్రత్యేకమైనదే అయినా శ్రామికుల్ని ఐక్యంచేయటానికి శ్రామికవర్గ దక్పథం ఉన్నట్లే- అగ్రవర్ణేతర శూద్ర, అతిశూద్ర అస్పృశ్య కులాలవారిని ఓ కూటమిగా కూడగట్టటానికి దళిత వెనుకబడిన కులాల వారికి బహుజన దృక్పథం ఉంది. దేని మెథడాలజీ దానికుంది. ఆధునిక వైతాళికుడు మహాత్మజ్యోతిరావు ఫూలే అభివర్ణించినట్లు అగ్రవర్ణేతర శూద్ర వర్ణం నుండి విడదీసిన ఎస్సీ కులాల వారిని అతిశూద్ర అస్పృశ్యత ప్రాతిపదికపై కూడగట్టవచ్చు. ఇతర వెనుకబడిన కులాల వారిని శూద్ర బిసి ప్రాతిపదికపై కూడగట్టవచ్చు.
ఐడెంటిటీ అలయెన్స్‌ మెథడాలజీతో కులాలవారీ ఐడెంటిటీని పరిగణలోకి తీసుకొని వ్యక్తులను కులాలుగా, కులాలను ఎస్సీ, బిసి సమూహాలుగా, సమూహాలను బహుజన కూటమిగా కూడగట్టవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో 1994లో బిఎస్‌పి, 1999లో మహాజన పార్టీ(ఎంజెపి) ఈ మెథడాలజీని అనుసరించి వివిధ సామాజిక వర్గాలను కూడగట్టాయి. ఆనాడు ఎంజెపికి సామాజిక భూమికగా ‘మహాజన సంఘర్షణ సమితి’ (ఎం.ఎస్‌.ఎస్‌.) ఏర్పడినపుడు ‘విడివిడిగా ఎవరెంతమందో వారికంత వాటా? ఉమ్మడిగా మా దళిత బహుజనులకు 85 శాతం కోటా’ అనే నినాదం రూపొందించాం. ఈ నేపథ్యంలోనే బహు ‘జనం మనది! బలం మనది! జన బలిమితో జయం మనది’ అని ధన రాజకీయాలకి వ్యతి రేకంగా జన రాజకీయాల్ని రంగమెక్కించాం.
తర్వాత ఈ నినాదాన్ని అనేక బడుగువర్గ రాజకీయ శక్తులు బహుళ ప్రచారంలో పెట్టాయి. అదే సందర్భంలో కొన్ని బిసి, ఎంబిసి సంస్థలు బిసిల ఐక్యతకోసం ఈ నినాదాన్ని ఉపయోగిం చాయి. అత్యధిక జనాభాగల బిసి ‘జనం మనది! బలం మనది! ఐక్యమైతే జయం మనది!’ అని నినదించారు.
ఐక్యత అంటే బలం, అనైక్యత అంటే బలహీనత అనే అర్థంలో బిసిల మధ్య అనైక్యతను అధిగమించ టానికి బిసిలు ఈ నినాదాన్ని ఉపయోగించినా, బిసిల మధ్య అంతర్గత అనైక్యత మర్మంఏమిటి అనే అంశాన్ని మాత్రం నిర్ధిష్ఠంగా పరిశీలించలేదు. పరిశీలించినా దాన్ని ఛేదించే ప్రయత్నం చేయలేదు. అందువల్ల అనైక్యతను అధిగమించడం జరగడం లేదు. ఆ విధంగా బిసిల మధ్య అనైక్యతను అధిగమించకుండా బిసిలందర్ని సంఘటిత పర్చలేని అశక్తత ఒకవైపు, బిసి లందర్ని సంఘటితపర్చకుండా బిసిలు దేన్నీ సాధించుకోలేని అశక్తత ఇంకొకవైపు బిసిలను సంకటస్థితిలో పడవేస్తున్నా యి. బిసిల మధ్య ఉన్న అంతర్గత అనైక్యతను ఏదోఒక రూపంలో అధిగమించకుండా బిసిలను సంఘ టిత పర్చలేం, సంఘటిత పర్చకుండా బిసి డిమాండ్లేవీ సాధించలేం అనేది మాత్రం స్పష్టం.ఈ స్పష్టతతో మరో అడుగు ముందుక ుపోయి ఆలోచిస్తే- ఐక్యత, అనైక్యతలనేవి సాపేక్ష (రెలటివ్‌) అంశాలు. ఏదో ఒక సంబంధిత (రెలటివ్‌) కారణం లేకుండా వాటికవి అస్తిత్వంలో ఉండవు. అనైక్యతకి ఒక కారణం ఉన్నట్లే ఐక్యతకి ఒక ఆవశ్యకత ఉండాలి. కనుక అనైక్యతకి మూలకారణం ఏమిటో తెలుసుకొని దాన్ని ఛేదించితేనే ఐక్యత ఏర్పడుతుంది. ఐక్యత ఏర్పడాల్సిన ఆవశ్యకత ఉంటేనే దాన్ని ఛేదించటం జరుగుతుంది.
అలాంటి ఆవశ్యకతను బట్టి ఎవరి మధ్యనైనా ఐక్యత ఏర్పడాలంటే వారిమధ్య- మనమంతా ఒకటి- అనే ఏకత్వ ఐక్యతా భావన కలగాలి. ఐక్యతా భావన కలగాలంటే వారందరికీ సమాన అవకాశాలు లభించే ఉమ్మడి ప్రయోజనం ఉండాలి. ఈ ఉమ్మడి ప్రయోజనమే సమత్వానికి, సమత్వమే సమైక్యతకి నాంది పలుకుతుంది. ఇందుకు విరుద్ధమైన అసమత్వం అనైక్యతకి దారి తీస్తుంది.
నిజానికి అగ్రకుల పాలకవర్గాలు అందించే పరిమిత సంక్షేమ, రిజర్వేషన్‌ ఫలాల పంపిణీలో వివక్ష వల్ల అసమత్వం తలెత్తుతోంది. అవి ఒకవైపు కొన్ని అధిసంఖ్యాక బిసిల కులాల వారి స్వార్ధ ప్రయోజనాలను నెరవేర్చుతుంటే మరోవైపు మిగతా అల్పసంఖ్యాక బిసి కులాల వారికి ఎలాంటి ఫలాలు అందక అవి నిష్ర్పయోజనంగా మారుతున్నాయి. అలా స్వప్రయోజనానికి, నిష్ర్పయోజనానికి మధ్య పరస్పర విరుద్ధత ఏర్పడి, బిసిల మధ్య అంతర్గత అనైక్యత కొనసాగు తున్నది.
ఈ పరిమిత ఫలాల పంపిణీలో ఉన్న పరిమితిని అధిగమించి ‘బిసిలు సగం బిసిలకు సగం’ అనే సమాన అవకాశాల సాధన కోసం బిసిలను సంఘటితపర్చుదామంటే బిసిల ప్రయోజనాలమధ్య నెలకొన్న పరస్పర విరుద్ధత, దానివల్ల ఏర్పడిన అనైక్యత ఆటంకంగా మారుతోంది. అయితే బిసిలలో కొన్ని అధికసంఖ్యాక బిసి కులాలవారే, అందులోని స్వార్ధపర శక్తులే ఈ అనైక్యతకు కారకులని అనిపిస్తున్నా, ఇది పూర్తినిజం కాదు. వాళ్లు నిమిత్త మాత్రులు మాత్రమే. అసలు మూల కారకులు అగ్రకుల పాలకవర్గాల వారే. స్వతంత్ర భారతదేశంలో సామాజిక న్యాయం ద్వారా సమాన గౌరవం, సమాన అవకాశాలు కల్పిస్తామనే రాజ్యాంగబద్ధ హామీని తుంగలో తొక్కి బిసిలను అన్యాయానికి, అణచివేతకి గురిచేయటంతో సాధికారతకోసం బిసిలు సమన్యాయ సామాజికన్యాయ పోరాటం చేయాల్సి వస్తోంది. అంతేకాదు ఎస్సి, ఎస్టీలపట్ల ఒక వైఖరి, బిసిలపట్ల మరొకవైఖరి అనుసరించే వివక్షాపూరిత ద్వంద్వ వైఖరితో ఎస్సీ, ఎస్టీలను బుజ్జగించి, బిసిలను మినహాయించి, బహుజనులను విభజించిపాలించే కుట్రపూరిత కుటిల పన్నాగానికి పాల్పడటంతో, ప్రత్యేకించి బిసిలు బలిపశువులుగా మారుతున్నారు.
కాని ఈ పని కేవలం అగ్రకుల శక్తులే స్వయంగా చేయడంలేదు, చేయలేరు కూడా. మన వేలితోనే మన కళ్లు పొడిపించినట్లు మన బిసిలలోఉన్న కొన్ని అధిక సంఖ్యాక కులాలకు చెందిన స్వార్ధపర శక్తులచేత బిసిలను మభ్యపెట్టిస్తున్నారు. మన బిసిలచేతనే మనల్ని నమ్మించే కుటిలోపా యంతో బిసిలను బుట్టలో వేసుకుం టున్నారు. అంతేకాదు, అగ్రకులాధిపత్య రక్షణ లక్ష్యంతో ఓ పథకం ప్రకారం బిసిలకు వ్యూహాత్మక భాగస్వామ్యం దక్కనీయకుండా, జనాభా దామాషా వాటా లభించనీయకుండా సీలింగ్‌, క్రీమీలేయర్‌ వంటి అనేక ఆంక్షలు విధింటంతో బిసిలు వర్తమాన చారిత్రక అన్యాయానికి, అణచివేతకి గురవుతున్నారు. స్వయం గా తమ ఓట్లతో అధికారంలోకి రాలేని 15 శాతం అగ్రకుల శక్తులు 50 శాతం బిసి ఓట్లు కొల్లగొట్టి రాజ్యాధికారాన్ని పూర్తిగా కైవశం చేసుకుంటున్నారు.అందులో భాగంగానే అధిక సంఖ్యా క బిసికులాలకు పెద్దపీటవేసి, మిగతా అల్పసంఖ్యాక బిసిలకులాల వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి పక్కన పెడుతున్నారు. అందువల్ల పది పన్నెండు అధికసంఖ్యాక బిసి కులాలకు చెందిన వారు తప్ప మిగతా అల్పసంఖ్యాక బిసి కులాలవారెవరూ చట్టసభల గడపే తొక్కలేక పోతున్నారు.
అగ్రకుల పార్టీల దయాదాక్షిణ్యాలపై సీట్లిచ్చే పార్లమెంటు, అసెంబ్లీల సంగతి అలా ఉంచి రిజర్వేషన్‌ సదుపాయం ఉన్న స్థానిక సంస్థల్లో సైతం అల్పసంఖ్యాక ఎంబిసి కులాలవారు కనీసం గ్రామసర్పంచ్‌లుగా కూడా కనీస సంఖ్యలో ఎన్నిక కాలేకపోతున్నారు. రిజర్వేషన్‌, హక్కుగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం కోటాలో అయినా బిసిలందరికీ సమాన అవకాశాలు దక్కేటట్లు ఎబిసిడి వర్గీకరణ పాటించాలని వీరు డిమాండ్‌ చేస్తారా అంటే అదీ చేయరు. పైగా అలా డిమాండ్‌ చేయటం అంటే బిసిలను ఎబిసిడిల వారీగా విభజించటమేనని, బిసిలను చీల్చి, బిసిలలో ఉన్న సోకాల్డ్‌ ఐక్యతను విచ్ఛిన్నంచేయడమేనంటూ వాస్తవాన్ని రివర్స్‌చేసి మాట్లాడతారు.
అంతే కాదు అగ్రకుల పార్టీలు, ప్రభుత్వాధికారుల చేతకూడా అదే వాదనతో అఫిడవిట్లు తయారు చేయించి కోర్టుల్లో సైతం ఎంబిసిలకు న్యాయం జరగకుండా అడ్డుపడతారు. అడ్డుపుల్ల జీవోలు జారీచేయిస్తారు.ఇప్పుడేకాదు, గతంలో 1970లో అనంతరామన్‌ కమిషన్‌ విద్య, ఉద్యోగ రంగాల్లోని రిజర్వేషన్‌ ఫలాల్ని బిసిలందరికీ సమపంపిణీ చేయటంకోసం దేశంలో ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎబిసిడి వర్గీకరణను సిఫార్సు చేస్తే, ఆ సిపార్సుల్ని అమలు కానీయకుండా అడ్డుకోవటానికి, కోర్టుల్ని ఆశ్రయించారు. అప్పుడు కూడా వర్గీకరణ అంటే విభజనీకరణే అని వితండవాదం చేశారు. కానీ కోర్టులు ఈ వాదాన్ని అనుమతించలేదు.
అగ్రకులాలకు- అణగారిన కులాలకు మధ్య అసమాన పోటీని తప్పించటానికే వెనుకబడిన తరగతులవారికి ప్రత్యేకంగా కొంత కోటా కేటాయించటంకోసం రిజర్వేషన్‌ పాలసీ ప్రవేశపెట్టినట్టు గుర్తుచేశారు. అలాగే బిసిల వెనుకబాటుతనంలోఉన్న (మోస్ట్‌, మోర్‌ అండ్‌ లెస్‌బ్యాక్‌వర్డ్‌) అంతస్థులవారీ అంతర్గత అసమానతల రీత్యా ఎబిసిడి వర్గీకరణ అవసరమేనని హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు చెప్పాయి. రిజర్వేషన్‌ రాజ్యాంగబద్ధ విధానమైనట్లే వర్గీకరణ కూడా రాజ్యాంగ బద్ధమేనని స్పష్టం చేశాయి. నిజానికి ఎబిసిడి వర్గీకరణ అంటే విభజనీకరణకాదు.

“ఆశ్రిత బిసి నేతలు యాచించటం తప్ప శాసించలేరు”

అక్రమ పంపిణీని అరికట్టి సక్రమపంపిణీకి తోడ్పడే క్రమబద్ధీకరణే వర్గీకరణ. దీన్ని విభజనీకరణగా చిత్రించటం వక్రీకరణే. తమ స్వార్ధాన్ని కప్పిపుచ్చుకొనే స్వార్ధపరులే వర్గీకరణకు పెడార్ధాలు తీసి సామాన్య బిసిలందర్ని పెడదారిపట్టిస్తున్నారు.మన రాష్ట్రంలో ఎబిసిడి వర్గీకరణ ఉనికిలో ఉండటం వల్లనే బిసిలనుండి ఎంబిసిలను విభజించి పాలించే పాచికలు పారటంలేదు. ఇతర రాష్ట్రాలలో వర్గీకరణలేని కారణంగా బిసిల నుండి ఎంబిసిలను వేరుచేసి విభజించి పాలిస్తున్నారు. అంతేకాదు క్రీమీలేయర్‌ మినహాయింపుల విధానాన్ని అరికట్టటానికి కూడా ఎబిసిడి వర్గీకరణ ఉపకరిస్తుంది. క్రీమీలేయరైనా, బాటమ్‌లేయరైనా జనాభా దామాషా ప్రాతినిధ్యం ద్వారా సమాన అవకాశాలను కల్పించటం సామాజిక న్యాయ సూత్రమేగనుక ఈ సూత్ర బద్ధవైఖరితో క్రీమీలేయర్‌ పాచికను కూడా తిప్పికొట్టావచ్చు. కనుక ఉన్నకోటాని వర్గీకరణద్వారా పంచుకోవటంలో సమత్వాన్ని పాటించటానికి పాటుపడితే, ఈ సమత్వమే సమైక్యతకి నాంది పలికి, బిసిలను సంఘటితపర్చి, సంపూర్ణ సామాజిక న్యాయాన్ని సాధించుకోవటానికి మార్గాన్ని సుగమం చేస్తుంది.
నిజానికి బిసిల అంతర్గత అనైక్యతకి స్వార్ధపర బిసి నేతలు ప్రత్యక్ష కారకులు కాకపోయినా పరోక్ష కారకులవుతున్నారు. ఆ రకంగా బిసిలే బిసిలకు పరోక్షశత్రువులవుతున్నారు. పైగా అన్ని ప్రయోజనాలను అగ్రకుల శక్తులే అనుభవిస్తున్నప్పుడు కొన్ని ప్రయోజనాలనైనా కొంతమంది బిసినేతలు అనుభవిస్తే తప్పేమిటనే వితండవాదానికి దిగుతున్నారు. వారన్నట్లే కొన్ని ప్రయోజనాలను అనుభవించటం పెద్ద తప్పు కాకపోవచ్చు. కాని తమ స్వప్రయోజనాలకోసం అగ్రకుల శక్తుల ఆధిపత్య ప్రయోజనాల్ని కాపాడేవారు బిసిలందరి సామాజిక ప్రయోజనాలను నెరవేర్చే బాధ్యత చేపట్టలేరు. ఇలాంటి ఆశ్రీత బిసి నేతలు- బిసిలలో స్వతంత్ర ప్రత్యామ్నాయ సామాజిక రాజకీయ చైతన్యాన్ని ప్రోత్సహించలేరు. అగ్రకుల శక్తులు ఏ పార్టీలో ఉన్నా, ఆయా పార్టీలకతీతంగా తమ అగ్రకుల ఉమ్మడి ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నా వారిని చూసైనా వీరు నేర్చుకోరు, నేర్చుకోలేరు. కారణం అగ్రకుల శక్తులు ఇలాంటి ఆశ్రీత బిసి నాయకుల్లాగా ఎవరినీ ఆశ్రయించరు. ఎవరినైనా శాసించటమేతప్ప వారెవరినీ యాచించరు.
ఆశ్రిత బిసి నేతలు యాచించటం తప్ప శాసించలేరు. కనుక ఈ స్థితిలో మౌలిక మార్పు రావాలంటే బిసి ఉద్యమశక్తులు ఎలాంటి ఆశ్రిత బిసినాయకులపై ఆధారపడకుండా స్వతంత్య్ర ప్రత్యామ్నాయ శక్తులుగా ఎదగాలి. ఓట్లు బిసిలవి, సీట్లు అగ్రకులాల వాళ్లవా? ఇకపై సాగదు రాజకీయ రంగంలో అగ్రకుల ఆధిపత్యం! ‘బిసిల ఓట్లు సగం బిసిలకు సీట్లు సగం’ అని బిగ్‌బాంగ్‌లా బిసిలు బిగ్గరగా గొంతెత్తి సింహనాదం చేయాలి. అప్పుడే అన్ని రంగాల్లో బిసిలకు వ్యూహాత్మక భాగస్వామ్యం అనే సింహభాగం లభిస్తుంది. కనుక గులాంగిరి దాటి బరిలో దిగితేనే బిసిల మధ్య ఐక్యత ఏర్పడుతుంది. ఐక్యపోరాటంతోనే బిసిలకు దాస్యవిముక్తి లభిస్తుంది. పోరాడితే పోయేదేం లేదు దాస్య సంకెళ్లు, అనైక్యత తప్ప.

 

(article source: Khan Yazdani Library )