పోతిరెడ్డిపాడు జలదోపిడీని అడ్డుకోండి, కేంద్ర మంత్రికి వంశీచంద్ రెడ్డి లేఖ

*ఆంధ్రరాష్ట్ర టెండర్ల ప్రక్రియను ఆపండి
*తెలంగాణ ముఖ్యమంత్రి మత్తునిద్రలో ఉన్నాడు
జాతీయ, అంతర్జాతీయ జల చట్టాలకు వ్యతిరేకంగా, కృష్ణా బేసిన్ నీళ్లను పెన్నా బేసిన్ కు తరలిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తలపెట్టిన జలదోపిడీలో భాగంగా సంగమేశ్వరం వద్ద, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టడానికి విడుదల చేసిన టెండర్ నోటీసును వెంటనే ఆపుచేయించాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ గారికి ఏఐసీసీ కార్యదర్శి లేఖ రాశారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగులేటర్ కి 4 కిలోమీటర్ల దిగువన శ్రీశైలం కుడి ప్రధాన కాలువలోకి రోజుకు 3 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసే విధంగా రూ.3278 కోట్లు 18 లక్షల వ్యయంతో 30 నెలలలో పనులు పూర్తయ్యే విధంగా జులై 15న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్ నెం.1SE/2020-21 జారిచేసిందని, ఆగస్టు 3వ తేది వరకు టెండర్లు సమర్పించడానికి సమయం నిర్ధారించిందని లేఖలో పేర్కొన్నారు.
తక్షణమే సమావేశం ఏర్పాటు చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టతలపెట్టిన ప్రాజెక్టుల డి.పి.ఆర్ లు ఆధ్యాయనం చేసి, అవి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి అనుగుణంగా ఉన్నవో లేదో తేల్చాలన్నారు, మే నెలలో కేంద్ర మంత్రి గారు కృష్ణానది యాజమాన్య బోర్డు (కే.ఆర్.ఎమ్.బి)ను ఆదేశించడం జరిగిందని గుర్తు చేశారు.

మంత్రిగారి ఆదేశానుసారం జూన్ 4న నిర్వహించిన కే.ఆర్.ఎమ్.బి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, వారు చేపట్టతలపెట్టిన ప్రోజెక్టుల డి.పి.ఆర్ లు సమర్పించేవరకు ఆ ప్రాజెక్టుల ఏరకమైన పురోగతి కూడా చేపట్టొద్దని ఆదేశించిందని పేర్కొన్నారు.
ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డి.పి.ఆర్ సమర్పించక పోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ టెండర్లు పిలవడం జరిగిందని ఆరోపించారు.
ఆంధ్ర జలదోపిడీ వల్ల జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి, డిండి, ఎస్.ఎల్.బి.సి, ఏ.ఎమ్.ఆర్.పి ప్రాజెక్టులకు నీళ్ళందక దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు ఎడారి ప్రాంతాలుగా మారడమే కాక, హైద్రాబాద్ కు త్రాగునీటి సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదముందని, తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి ఇంత నష్టం జరిగే ప్రమాదం ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో మత్తు నిద్రలో జోగుతున్నారని మండిపడ్డారు.
కే.ఆర్.ఎమ్.బి, అపెక్స్ కౌన్సిల్, సి.డబ్ల్యు.సి సాంకేతిక అనుమతులు లేకుండా, అన్ని నిబంధనలు, చట్టాలు ఉల్లంఘించి జలదోపిడికి పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై తగు చర్యలు తీసుకొని, వెంటనే ప్రభుత్వం జారీచేసిన టెండర్ ప్రక్రియను నిలిపేసే విధంగా ఆదేశించాలని మంత్రి గజేందర్ సింగ్ షేకావత్ గారిని ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి కోరారు.