పాజిటివ్ థింకింగ్ : వెహికిల్ కు బ్రేకులు ఎందుకు ఉన్నాయో తెలుసా?

చాలామంది ఏమనుకుంటారంటే మన బైకుకి బ్రేకులు ఉండేది స్పీడ్ గా వెళ్లేటప్పుడు ఆపడానికి అనుకుంటారు. కానీ నిజానికి బ్రేకులు ఉండేది స్పీడుగా వెళ్లడానికి. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా, ఇది నిజం. ఒకసారి ఊహించుకోండి. అసలు బండికి బ్రేకులు లేకపోతే మనం స్పీడుగా వెళ్ళలేము. ఎప్పుడన్నా మన కు మోటార్ సైకిల్ కు బ్రేకు సరిగా పడ్డం లేదు అనుకోండి, అప్పుడు కొంచెం స్లోగా నే వెళ్తాం కదా. అసలు బ్రేక్ ఫెయిల్ అయితే బండి ఆపేస్తాం. చిన్నగా నడిపించుకుంటూ మెకానిక్ దగ్గరికి వెళ్తాం.
మనకు బ్రేకులు అడ్డంకి కాదు. ముందుకెళ్లడానికి, అది మనకు నచ్చిన వేగంతో వెళ్ళటానికి అవసరమైనవి. మనకు బ్రేకులు లేకపోతే, వేగంతో వెళ్లడం అనే మాట దేవుడెరుగు, అసలు ముందుకే వెళ్ళలేము. దీన్ని బట్టి అర్థం అయిన విషయం ఏంటంటే. మనం ఏదైతే నెగిటివ్ అనుకుంటాము. అదే పాజిటివ్ కావచ్చు!
ముఖ్యంగా చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ప్రతి దానికి అడ్డం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వాళ్ళు ఉండడం వల్లనే పిల్లలు జీవితంలో ముందుకు వెళ్తారు. అలాగే మనకు అడ్డం అనుకున్న ప్రతిదీ, నిజానికి మనల్ని ముందుకు నడిపేది కావచ్చు!
మన జీవితమనే బండికి బ్రేకులే లేకపోతే, బండి వేగంగా వెళ్లలేకపోవచ్చు, ఒకవేళ వేగంగా వెళ్లే ప్రయత్నం చేసినా బండి బోల్తా పడే అవకాశం ఉంది. అలాగే చాలాసార్లు నెగిటివ్ పరిస్థితులు, నెగిటివ్ మనుషులు మన లైఫ్ వెహికిల్ ని ముందుకు నడిపించే ఇంధనం కావచ్చు. ఈ పాజిటివ్ దృక్పథమే మనల్ని చాలాసార్లు ముందుకు నడిపించి ఉంటుంది. అది మనం తెలుసుకోలేక పోయి ఉండొచ్చు.
ఉదాహరణకు “ప్రతి అవమానం ఒక పాఠం నేర్పిస్తుంది. అవమానం మరచిపోవాలి పాఠం గుర్తుపెట్టుకోవాలి” చాలాసార్లు జీవితంలో మనం అవమానాలు ఎదుర్కొన్నప్పుడే ఏదైనా సాధించి ఉంటాం. కనీసం ఒకటి రెండు సార్లయినా ప్రతి ఒక్కరి జీవితంలో అది జరిగే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, మన జీవితంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొని ఉంటాము. చాలామంది మన పై రాళ్ళు వేసి ఉంటారు. విమర్శలే రాళ్ళు అనుకుంటే, ఆ రాళ్లతో మనం గోడ కట్టుకోవచ్చు, వంతెన కట్టుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు. లేదా మీద వేసుకుని గాయపడి, బాధ పడవచ్చు. నిజానికి మనం ఏదైనా వాహనములో వేసే పెట్రోల్ గాని, డీజిల్ గాని,( కిరోసిన్ అయినా సరే) తాగుతామా? లేదు కదా. అయితే అవి లేకపోతే, ఏ వాహనమైన ముందుకు కదలదు కదా? అలాగే మనమంతా తాగ గలిగే ఆల్కహాల్ కానీ, నీళ్లు కానీ వేస్తే బండి ముందుకు కదులుతుందా? నిజానికి ఉన్నత స్థాయికి చేరిన వాళ్ళ జీవిత వాహన ఇంధనం చాలాసార్లు ” నెగిటివ్” ఉంటుంది.
అత్యున్నత స్థాయికి చేరిన గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన జీవితంలో కూడా వైఫల్యాలు ఉన్నాయి. ఆయనే స్వయంగా చెప్పినట్లు” కంప్యూటర్ తప్పని చెప్తున్నప్పటికీ, నేను ముందుకి వెళ్లాను, ఒక రాకెట్ ని సముద్రంలోకి పడేశాను!”. అలా ఆ గొప్ప వైఫల్యాన్ని ఇంధనంగా వాడి, కొద్ది కాలంలోనే మరొక గొప్ప విజయాన్ని సాధించగలిగారు.
“అద్రక్ కే పంజే” నాటకం ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప నాటకంగా ప్రసిద్ధి చెందిన విషయం తెలుసు. అయితే రవీంద్ర భారతి లో వేసిన మొదటి ప్రదర్శన ఘోరమైన ఫెయిల్ల్యూర్! కనీసం టికెట్లు ప్రింట్ చేసిన డబ్బులు కూడా రాలేదు. రెండవసారి మళ్ళీ అక్కడే వేస్తే ఈ సారి గొప్ప ఫెయిల్ల్యూర్! మూడో సారి కూడా ఫెయిల్ల్యూరే! తరవత ఆ నాటకం ఒక గొప్ప, విజయవంతమైన నాటకం గా మారిపోయింది. ఓటమి అన్నదే విజయానికి పునాది అని బబ్బాన్ ఖాన్ నమ్మటమే దానికి కారణం!
ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. 1983 ప్రపంచ కప్ లో ఫైనల్స్ వరకు భారత్ ప్రదర్శన అంత బాలేదు. జింబాబ్వే తో కపిల్ ద్వారా సాధించిన భారీ విజయం తప్ప. ఆ మ్యాచ్ లో కపిల్ ఆడిన ఓ అద్భుత ఇన్నింగ్స్ మరపురానిది. 175 పరుగులతో భారత్ ని విజయం వైపుకు నడిపించాడు. అందుకే దాన్ని రణవీర్ సింగ్ హీరోగా (కపిల్ పాత్రలో) “83” గా తెరకెక్కిస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇక లగాన్ సినిమా గురించి చెప్పనవసరం లేదు.(ఈ రెండు మ్యాచ్ ల గురించి తర్వత విపులంగా చెప్తాను)
ఇంతకుముందే చెప్పినట్లు, అవమానాలు, తిరస్కారాలు, కష్టాలు, వైఫల్యాలు చాలా మందిని ఉన్నత స్థాయికి చేర్చటం మనం చూస్తూనే ఉన్నాం. అమితాబచ్చన్, సావిత్రి, సచిన్ టెండూల్కర్, మహేందర్ సింగ్ ధోనీ, అబ్రహం లింకన్, విల్మా రుడాల్ఫ్, అరుణిమ ఇలా వివిధ రంగాల్లో ఎంతో మంది ఉన్నారు. ఆ జాబితాతో వెయ్యి పేజీల గ్రంథం తయారవుతుంది.
” ప్రతి గొప్ప విజయం వెనుక కనీసం ఒక గొప్ప వైఫల్యం ఉంటుంది”, అన్నాడు థామస్ ఆల్వా ఎడిసన్. ఈయన గొప్ప విజయాల వెనుక, ఎన్నో వైఫల్యాలు ఉన్నాయి. గతంలోనే ఈ విషయం చాలాసార్లు ప్రస్తావించడం జరిగింది. ఈయనకు అత్యంత ఇష్టమైన కొటేషన్. “Success is 99% failure!”
CS Saleem Basha
(CS Saleem Basha వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)