కేశ సౌందర్యానికి మందారం ఓ వరం. చూడగానే మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే మందారం ఆరోగ్యం, అందం కూడా ఇస్తుంది. కేశ సౌందర్యానికి, చర్మ సౌందర్యానికి వాడే మూలికలలో మందారానికి ప్రత్యేక స్థానం ఉంది. జుట్టు సమస్యలను నివారించుటలో మందారం అద్భుతంగా పని చేస్తుంది.
1. చాలామందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతూ ఉంటుంది. జుట్టు తెల్లబడటం తగ్గాలి అంటే పావు కేజీ కొబ్బరి నూనెలో 10 – 15 మందార ఆకులు, కొన్ని రేకలు వేసి మరిగించాలి. ఈ నూనె చల్లారిన తర్వాత ఒక సీసాలో నిల్వ ఉంచుకుని జుట్టుకు రాస్తూ ఉన్నట్టయితే జుట్టు తెల్లబడటం తగ్గి, బాగా పెరుగుతుంది.
2. కొన్ని మందార పూలను కొబ్బరి నూనెతో కలిపి వేడి చేయాలి. తర్వాత ఆ నూనెను, పువ్వుల రసాన్ని పిండి వడకట్టాలి. తర్వాత ఆ నూనెను కుదుళ్లకు, చివళ్ళకు పట్టించాలి. గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. పాదాల పగుళ్లు తగ్గటానికి కూడా ఈ నూనెను ఉపయోగించవచ్చు.
3. జుట్టుకి కండీషనర్ లా కూడా మందార బాగా పని చేస్తుంది. మందార ఆకులు, పువ్వులు పేస్ట్ చేసి తలకు ప్యాక్ వేసుకుని ఆరాక శుభ్ర పరచుకోవాలి. ఇలా చేస్తే చుండ్రు కూడా తగ్గి జుట్టు మంచి రంగుతో ఉంటాయి.
4. ఎరుపు మందార పువ్వు చెట్టు ఆకులను తీసుకుని మెత్తని పేస్ట్ చేయాలి. ఈ పేస్టుకు ఒక గుడ్డును కలిపి తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. చుండ్రు తొలగించి చక్కగా ఎదగటానికి తోడ్పడుతుంది. తేమ కూడా సంతరించుకుంటుంది.
5. ఎరుపు మందార రేకులను బాగా ఎండబెట్టాలి. ఎండిన తర్వాత వాటిని వేయించి పొడి చేయాలి. ఈ పొడిని కనుబొమ్మలకు రాస్తూ ఉంటే వాటికి మంచి రంగు వస్తుంది అలానే బాగా పెరుగుతాయి కూడా.
6. మందార పువ్వుతో షాంపూ. ఎరుపు మందార రేకుల పేస్టుకు కలబంద జెల్ కలపాలి. దీనిని షాంపూలా వాడితే జుట్టుకు మంచి పోషణ అంది రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. జుట్టు ప్రకాశవంతంగా మారతాయి. ఈ పేస్టును ఫ్రిడ్జిలో పెట్టి వారం రోజుల వరకు వాడుకోవచ్చు.
7. పొడి చర్మానికి, పగుళ్లు ఉన్నప్పుడు ఎరుపు మందార రేకులను కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత ఈ నూనెను ముఖానికి రాస్తే సమస్య తగ్గుతుంది.
8. ఐరన్ లోపం ఉన్నవారు ఎర్ర మందార పువ్వు రేకులను నీళ్లలో వేసి సగం అయ్యేవరకు మరిగించి చల్లారిన తర్వాత తాగాలి. ఇలా 21 రోజులు చేస్తే శరీరానికి కావలసిన ఐరన్ లభిస్తుంది.