సర్కార్ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పోతున్నది: వంశీ ఆందోళన

కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా విస్తరిస్తున్నపుడు  రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజలకు ప్రభుత్వ  దవాఖానలపై నమ్మకం పోయి, ప్రభుత్వ వైద్యంపై భరోసా సన్నగిల్లిందని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి మండిపడ్డారు.
2014 సంవత్సరంలో తెరాస అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు వైద్య ఆరోగ్య శాఖలో ఎలాంటి నియామకాలు చేపట్టలేదని, కనీసం ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ప్రారంభించలేదని దుయ్యబట్టారు.
వాస్తవానికి మన రాష్ట్రంలో ప్రజారోగ్య అవసరాల కోసం అదనంగా మరో 60 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, 125 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అవసరం ఉన్నా ఈ అసమర్ధ ప్రభుత్వం ఏ ఒక్క పి.హెచ్.సి గాని సి.హెచ్.సి గాని నిర్మించకపోగా, కనీసం కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ఐనా వైద్య సిబ్బందిని నియమించి వైద్యం కోసం వీది వీది తిరుగుతున్న ప్రజలకు ఈ చేతగాని ప్రభుత్వం వైద్య సేవలు అందించ లేక పోతుంది. కల్వకుర్తి నియోజకవర్గం లోని తోటపల్లి, మైసిగండి మరియు అచ్చంపేట నియోజకవర్గం లోని చారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలైన ఎన్నో ఆరోగ్య కేంద్రాలు ఈ దుస్థితికి సజీవ సాక్ష్యాలని వారు అన్నారు.
ప్రజారోగ్యం పట్ల సర్కారు నిర్లక్ష్య వైఖరిని తప్పుపడుతూ హైకోర్టు 2018 లోనే ప్రభుత్వాన్ని మందలించి, అవసరమైనన్ని ప్రాధమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలను నిర్మించాలని ఆదేశించినా ఇప్పటికీ ఏ ఒక్క కొత్త ఆరోగ్య కేంద్రాన్ని కూడా నిర్మించకపోవడం సర్కారు మొండి వైఖరికి తార్కణం ఆని అన్నారు.
హైద్రాబాద్ లోని ఉస్మానియా, గాంధీ, వరంగల్ లోని ఎమ్.జీ. ఎమ్ లాంటి బోధనాసుపత్రుల పర్యవేక్షణ చూసే డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో 70 శాతానికి పైగా వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నా ఈ ప్రభుత్వం నియామకాలు చేపట్టి ప్రజారోగ్యాన్ని కాపాడటంలో విఫలమైందని, రాష్ట్రం లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలలో, ఏరియా ఆసుపత్రులలో దాదాపు 40 శాతం ఖాళీలు భర్తీ కావలసి ఉందన్నారు.
2017, 2018 సంవత్సరాలలో నోటిఫికేషన్లు విడుదలై, పరీక్షలు కూడా పూర్తైనా దాదాపు 5 వేల పారామెడికల్ పోస్టులకు కూడా మూడు సంవత్సరాలు గడిచినా నియామకాలు చేపట్టని అసమర్ధ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను ఏవిధంగా గాలికి వదిలేసిందో సుస్పష్టం అవుతుందన్నారు.
ప్రైవేటు ఆసుపత్రులు పేద ప్రజల వద్ద నుండి సైతం లక్షల్లో దోచుకుంటున్నా ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తూ, చేష్టలుడిగి చూస్తూ ఈ దోపిడీకి పరోక్షంగా సహకరిస్తుందని విమర్శించారు.
ప్రభుత్వం విడుదల చేసిన జీ.ఓ 248 ఎక్కడా ఆచరణలో లేకపోయినా, ప్రభుత్వం ఏ ఒక్క ఆస్పత్రిపై కూడా చర్యలు తీసుకోలేదని, జీ.ఓ 248 ప్రకారం కోవిడ్ పరీక్ష కోసం కేవలం 2,200 రూపాయలు, ఐసోలేషన్ కోసం రోజుకు 4,000 రూపాయలు, ఐ.సి.యూకి రోజుకు 7,500 రూపాయలు, వెంటిలేటర్ సౌకర్యంతో పాటు ఐ.సి.యూ కి రోజుకి కేవలం 9,000 రూపాయలు మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా బడా ప్రైవేటు ఆసుపత్రులన్నీ ప్రభుత్వ అండతో బహిరంగంగా లక్షలకు లక్షలు దోచుకుంటూ కోవిడ్ కష్ట కాలంలో సైతం కోట్లకు కోట్లు గడిస్తున్నవని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంత మందితో పాటు గవర్నర్ గారు కోరినా, కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీ లో చేర్చక పోవడం ప్రభుత్వ నిర్లక్ష్య, నియంతృత్వ ధోరణికి నిదర్శనమని అన్నారు.
కోట్లాది ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి, కోవిడ్ నియంత్రణ పట్ల నిర్లక్షంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ కి తగు సమయంలో ప్రజలే బుద్ది చెబుతారని వారు హెచ్చరించారు.