కావలి మున్సిపాలిటీ పరిధిలో వున్న ముసునూరు గ్రామంలో తెలుగుదేశం సంస్థాపకుడు ఎన్టీయార్ విగ్రహాన్ని వైసిపి నేతల సహకారంతో ఏర్పాటుచేస్తున్నారు.
తెలుగుదేశం అభిమానులను ఆకట్టుకునేందుకు వైసిపి ఈ వ్యూహం ఎంచుకుంది. ఎన్టీఆర్ ను మహానటుడిగా గౌరవించడం వల్ల తెలుగుదేశం అభిమానుల మధ్య మంచిపేరు వస్తుందని వైసిపి నాయకులు యోచిస్తున్నట్లున్నారు. దీనితో ఈ విగ్రహావిష్కరణ సహకరిస్తున్నారు. రెండు పార్టీల మధ్య వైరం భగ్గున మండుతున్న రోజులలో ఇలా ఎన్టీఆర్ విగ్రహానికి వైసిపి నేతలు సహకరించడం విశేషం.
ఇలా వైసిపి నేతలు ఎన్టీయార్ విగ్రహాన్ని ఆవిష్కరించడం రాష్ట్రంలో ఇదే మొదటి సారి. గ్రామస్థాయిలోనయినా ఇదొక మంచి వ్యూహమని చెబుతున్నారు. ఇలాంటి చర్యల రాజకీయంగా వైసిపికి జనామోదం పెరుగుతుందని ఇక్కడ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఇపుడు వైస్సార్సీపీ నేతల సహకారం అందిండంతో అక్కడి ప్రజలు నెలకొల్పాలనుకొనే మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహం ముసునూరుకు చేరింది.
స్థూప నిర్మాణకార్యక్రమాలు చురుగ్గా సాగిపోతున్నాయి . వైస్సార్సీపీ కార్యకర్తల, ప్రజల అభ్యర్ధన మేరకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి ఈ విగ్రహ నిర్మాణ పనుల్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తుంది .
ముసునూరులోని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ప్రక్కన ఈ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే సూచనల ప్రకారం నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు . వైస్సార్ విగ్రహం , ఎన్టీఆర్ విగ్రహం స్థూపాల నిర్మాణాల్లో ఎలాంటి తేడాలు లేకుండా ఒకేలాగా ఉండేటట్లు నిర్మిస్తుండడం విశేషం .
ఈ ఎన్టీఆర్ విగ్రహం రాజమండ్రికి 40 కిలోమీటర్ల దూరంలో గల ” బొమ్మనూరు ” లో తయారుచేయించారు . గతంలో కావలి పట్టణంలో ఏర్పాటుచేసిన మాజీ పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి , మాజీమంత్రి కలికి యానాది రెడ్డి విగ్రహాలు తయారుచేసిన శిల్పి వడయారే ఈ ఎన్టీఆర్ విగ్రహాన్ని తయారుచేసినట్లు వైస్సార్సీపీ కావలి పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి తెలిపారు . ఈ శ్రావణమాసంలోనే ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణోత్సవం జరగొచ్చని – నిర్వాహకులు చేయిస్తున్న నిర్మాణపుపనులు చెప్పకనే చెబుతున్నాయి .