తిరుపతిలో రోజుకు రోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉండటం, టిటిడి అర్చకులలో కూడా కరోనా కేసులు బయటపడతూ ఉండటంతో శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపే విషయాన్ని టిటిడి పరిశీలిస్తూ ఉంది. కనీసరెండు వారాలైనా తిరుమల, తిరుపతిలో లాక్ డౌన్ అవసరమని పురప్రముఖులు గత వారం రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా మొత్తం ఇపుడుకోవిడ్ హాట్ స్పాట్ మారింది. గత 24 గంటలలో 331 కేసులు నమోదయ్యాయి.దీనితో జిల్లా మొత్తం కేసులు 4వేలకు చేరుకున్నాయి. టిటిడికి చెందిన ఒక అర్చకుడు కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో ఆయనను చెన్నై అపోలోకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈవిషయాన్ని ఇవొ స్వయంగా ప్రకటించారు. ఈ అర్చకుడు చాలా కాలంగా షగర్, బ్లడ్ ప్రెజర్ తో ఉన్నారని కూడా ఆయన చెప్పారు.
ఈనేపథ్యంలో శ్రీవారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయవచ్చి తెలుసుకున్నారు.ఇప్పటి వరకు 15 మంది అర్చకులకు కరోనా పాజిటివ్ అని చెబుతున్నారు. దర్శనాల నిలిపివేతకు ప్రభుత్వానికి టీటీడీ నివేదిక పంపిందని, సోమవారం నుంచి ఇది అమలులోకి రావచ్చని తెలుస్తున్నది.
ఇదీ టిటిడి మీద విమర్శ
తిరుపతిలో కరోనా విస్తరిస్తూ ఉండటం, దీనిని ఖాతరుచేయకుండా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనాలు కొనసాగిస్తూ ఉండటం వివాదాానికి దారి తీసింది. చిత్తూరు జిల్లాలో, మరీ ముఖ్యంగా తిరుపతిలో కేసులు పెరుగుతున్నా , తిరుమలకు వస్తున్న భక్తులకు కోరానా లేదని,కేవలం టిటిడి సిబ్బందిలో మాత్రమే కరోనా ఉందని చెప్పి మెల్లిమెల్లిగా టిటిడి దర్శనాలను పెంచుతూపోతూ ఉండటం విమర్శలకు దారితీస్తూ ఉంది.ఈ సమయంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ తిరుమలను కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. ఈ వార్త ఎలెక్ట్రానికి మీడియాలో వస్తుండగానే, జిల్లా డాక్టర్ భరత్ గుప్తా ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు.
తిరుమలను రెడ్ జోన్ గా పొరపాటున చేర్చామని వివరణ ఇవ్వడం వెనక పైస్థాయి నుంచి వత్తిడి ఉందని తిరుపతిలో బాగా ప్రచారంలో ఉంది. గత మంగళవారం నుంచి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం లలో నిరవధిక పాక్షిక లాక్ డౌన్ విధించారు. ఉదయం ఆరునుంచి పదకొండగంటల దాకా షాపులను అనుమతించి అనంతరం లాక్ డౌన్ విధించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ఇది ఇండెఫినిట్ గా కొనసాగుతుందని కూడా అధికారులు ప్రకటించారు. ఇలాగే కర్నూలులో లాక్ డౌన్ విధించారు.అయితే, తిరుపతిలో మాత్రం అధికారలు కదలకపోవడం మీద విమర్శ ఉంది.