సిటి బయట ‘సెక్రెటేరియట్ సిటి’ కట్టండి: ప్రభుత్వానికి సమాజ్ వాదీ పార్టీ విజ్ఞప్తి

(Prof S Simhadri)
నూతన సచివాలయ నిర్మాణం కోసం ప్రస్తుత సెక్రటేరియట్‌ను ఆగమేఘాల మీద తెలంగాణ ప్రభుత్వం కూల్చేస్తుంది. కరోనా వైరస్‌ తీవ్రంగా విస్తరిస్తున్నవేళ ప్రజల ఆందోళనను పట్టించుకోకుండా కూల్చివేత చేపట్టడం తగదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
సెక్రటేరియట్‌ను కూల్చడానికి ముందు హైదరాబాద్ భౌగోళిక స్థితిని, సాంస్కృతిక వైభవాన్ని, ఘనమైన చరిత్రను తెలుసుకుంటే మంచిది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్న ఆలోచన ఉండాలి. దాంతోపాటు నగర ప్రణాళికను, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలి.
తరుముకొస్తున్న కరోనా విపత్తును పట్టించుకోకుండా సచివాలయంపైనే దృష్టి పెట్టడం ప్రభుత్వానికి ఉండాల్సిన ధర్మం కాదు.
హైదరాబాద్‌ నగరానికి అనంతమైన చరిత్ర ఉంది. అద్భుతమైన సంస్కృతి ఉంది. కాకతీయుల కాలంలో గొల్లకొండగా ఈ నగర అభివృద్ధి మొదలైంది.1591 లో గోల్కొండ సుల్తాన్ మహ్మద్ కులీకుతుబ్‌షా హైదరాబాద్ నగరానికి అంకురార్పణ చేశాడు. ‘భూలోక స్వర్గంలా తన నగరం ఉండాలన్నది ఆయన స్వప్నం. ప్రపంచంలో ఏ నగరమూ దీనికి సాటి రాకూడదని కోరుకున్నాడు’.
ఇరాన్‌లోని అత్యంత అందమైన నగరం ఇస్ఫాహాన్ కంటే గొప్ప నగరాన్ని నిర్మించాలని ఆశించాడు. ఎటూ చూసినా పచ్చదనమే. పచ్చదనం చూడకుండా కులీకుతుబ్‌షా ఉండలేడు. కాబట్టి హైదరాబాద్‌ చుట్టూ ఉద్యానవనాలను ఏర్పాటు చేశాడు.
ఆయన ఇష్టపడి కట్టుకున్నఎనిమిది అంతస్తుల ఖుదాదాద్ మహల్ పైఅంతస్తు వరకు టెర్రేస్ గార్డెన్స్ కలిగి ఉన్నాయంటేనే మొక్కలపై వారికున్న ప్రేమ అర్థమవుతుంది. మూసి నదికి దక్షిణాన ఉన్న చిచలం గ్రామానికి చెందిన లింగయ్య కూతురు భాగమతి/ హైదర్ మహల్ ప్రేమకు గుర్తుగా ఈ నగరానికి పేరు పెట్టాడు.
ఆ తర్వాత హైదరాబాద్‌ను ‘సిటీ ఆఫ్ లేక్స్’ అని పిలిచేవారు. ఈ నగరం ఆరు వందల సరస్సులను కలిగి ఉండేది. దక్కన్‌ పీఠభూమి రుతుపవనాలతో కూడుకున్నది. ఇక్కడి అందమైన గుట్టలు, కొండలు, పచ్చదనం, సరస్సులు విదేశీ యాత్రికులకు ఆకర్షణగా మారాయి. పర్షియా, అఫ్గానిస్తాన్, టర్కీ, ఆఫ్రికాల నుంచి ఎంతో మంది ఇక్కడకి వచ్చి స్థిరపడ్డారు. భిన్నభాషల, సంస్కృతుల, నాగరికతల ప్రజలతో హైదరాబాద్ ప్రాముఖ్యత పెరిగింది.
Prof S Simhadri, President, Samajwadi Party, TS
ఈ నగరం నేడు కోటి జనాభా కలిగిన మెగా సిటీ . 1956 తరువాత ఇది చాలా రెట్లు పెరిగింది. ఆంధ్ర నుంచి వచ్చిన ఉన్నత వర్గాలవారు హైదరాబాద్‌ను కలల నగరంగా చూశారు. తమ సొంత గడ్డపైనే తెలంగాణ ప్రజలు పరాయివాళ్లుగా మారిపోయారు.
తమ ప్రజల ఆశలను, ఆకాంక్షలను గౌరవిస్తానని తెలంగాణ ఉద్యమం వాగ్ధానం చేసింది.
ఇప్పుడు హైదరాబాద్ మహానగరం అత్యధిక జనాభా, కాంక్రీట్ భవనాలు, బస్తీలతో నిండి ఉంది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న వాహనాలతో రోడ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ప్రతిచోట గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ లు నిత్యకృత్యంగా మారాయి. నగరంలో వర్షం పడినప్పుడు, రోడ్లపై ప్రయాణం నరకంగా మారింది.
కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకుంది. పచ్చదనం దాదాపుగా కనిపించకుండాపోయింది. భూ కబ్జాదారుల వల్ల చెరువులు కనుమరుగయ్యాయి. ఉష్ణోగ్రతలు తట్టుకోలేని పరిమితులకు మించి పెరుగుతున్నాయి. ప్రజలకు ఉదయం నడక కోసం గ్రీన్ ఎన్‌క్లేవ్‌లు, అవుట్‌లెట్‌లు లేవు. పిల్లలకు ఆట స్థలాలు లేవు. నగరం ఇప్పుడు సమస్యల వలయంగా మారింది.

వికేంద్రీకృత పట్టణీకరణ తెలంగాణ రాష్ట్ర పట్టణ పాలసీగా వుండాలి. బహుశా 2040 హైదరాబాద్ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా సెక్రటేరియట్ సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసుకోచ్చు.

ప్రైవేటు నివాసాలను కూల్చివేసి ప్రభుత్వం భూమిని సేకరించే పరిస్థితి లేదు. ఉన్న ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టారు. ఇలాగే కొనసాగితే కొంతకాలానికి గజం భూమి కూడా మిగలదు.
రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను సిటీకి దూరంగా నిర్మించుకోవడం పట్టణ ప్రణాళికబద్ధంగా వుంటుంది. హైదర్‌బాద్ అవసరాలకు తగినట్టుగా ప్రత్యేక సేవలు అందించే పరిస్థితి లేనందున సచివాలయాన్ని శివారు ప్రాంతాలకు తరలించవచ్చు.
నగరంలోపల కొత్త కాంక్రీట్ నిర్మాణాలను భరించే పరిస్థితి లేదు. పట్టణ ప్రణాళిక, జోనింగ్ నిబంధనలకు మరిన్ని బహిరంగ ప్రదేశాలు అవసరం. నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో బేగంపేట విమానాశ్రయాన్ని మార్చడం దీనికి ఒక ఉదాహరణ. మెట్రో, ORR వంటి రవాణా వసతులు ఉన్నందున సచివాలయ నగరాన్ని సిటీ వెలుపల ఏర్పాటు చేయడం సరైనది.
నివాసయోగ్యమైన నగరం కోసం హైదరాబాదీలు కృషి చేయాలి, చక్కటి వాతావరణం, సౌకర్యాలు, సేవల ఏర్పాటు ద్వారా గత గార్డెన్ సిటీ వైభవాన్ని తిరిగి పొందాలి.
హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా ఎదిగింది. సిటీ పరిసరాలలో విశాలమైన భూములు అందుబాటులో ఉన్నందున పట్టణ అభివృద్ధికి అనుకూలిస్తాయి. ప్రపంచ పట్టణీకరణ, అర్బన్ పాలసీ ‘కౌంటర్ అర్బనైజేషన్ ‘ ను ప్రొత్సహిస్తుంది.
వికేంద్రీకృత పట్టణీకరణ తెలంగాణ రాష్ట్ర పట్టణ పాలసీగా వుండాలి. బహుశా 2040 హైదరాబాద్ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా సెక్రటేరియట్ సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసుకోచ్చు.
మానవ విపత్తుగా మారే రాష్ట్ర ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో పాండమిక్ కరోనాకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంది.
(Prof S Simhadri,Samajwadi Party, Telangana,Cell No : 9490568899,WhatsApp: 8688943120)