బాధించే ఒక చిన్న కరోనా కఠోరం…

(CS Saleem Basha)
కరోనా వ్యాధి నేపథ్యంలో అందరూ ” నెగిటివ్ గా” ఉండాలని కోరుకుంటున్నారు!! అంతవరకూ ఓకే, కానీ జీవితంలో మాత్రం పాజిటివ్ గా ఉండాలి!! దీని అర్థం కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఏమాత్రం నెగిటివ్ గా ఉండకూడదు. అలాగే రానివాళ్ళు కూడా. కరోనా పాజిటివ్ వచ్చినా దాన్ని జయించడానికి ” పాజిటివ్ ” దృక్పథమే రోగనిరోధకశక్తిని పెంచే ముఖ్యమైన ఆయుధమని శాస్త్రజ్ఞులు పదే పదే చెబుతున్నారు. ఇది గుర్తించాలి.
ఈమధ్య వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్న ఒక చిన్న ప్రయోగం ఇది. క్రీస్తు శకము 980-1037 కాలంలో IBN SINA అనే ఇస్లామిక్ తత్వవేత్త చేసిన పరీక్ష ఇది. రెండు గొర్రెలను వేరువేరుగా ఒక బోన్ లో పెట్టాడు. ఒక తోడేలును ఒక గొర్రె మాత్రమే కనబడే విధంగా కట్టి ఉంచాడు. తోడేలు దానిని ఏం చేయకపోయినా రెండు నెలల తర్వాత తోడేలును నిరంతరం చూస్తూ ఉన్న గొర్రె భయంతో ఒత్తిడికి గురై చనిపోయింది. దీన్నిబట్టి అర్థమైన విషయం ఏంటంటే ఎప్పుడూ నెగిటివ్ గా ఆలోచించిన గొర్రె ఒత్తిడికి గురి అయింది.. దాని శారీరక ఆరోగ్యం పైన తోడేలు తాలూకు ( చంపేస్తుంది ఏమో) నెగిటివ్ ఆలోచన తీవ్రమైన ప్రభావం చూపింది. నెగిటివ్ ఆలోచనలు ఇలాంటి ప్రభావాలే చూపే అవకాశం ఉంది
సాధారణంగా మన జీవితాల్లో నెగిటివ్ ఆలోచనలు ఒక భాగం. ఎందుకు మనుషులు ఎక్కువ నెగిటివ్ గా తక్కువ పాజిటివ్ గా ఉంటారు అన్న దానిమీద చాలా సంవత్సరాల నుంచి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అన్నిటికన్నా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నెగిటివ్ కి పవర్ ఎక్కువ. పాజిటివ్ కి పవర్ తక్కువ! అవును, ఇది కొంతవరకు రుజువైంది. నిజానికి నెగిటివ్ గా ఉన్న మనుషులు, చాలామంది వాళ్లకి తెలియకుండానే నెగిటివ్ అయి ఉంటారు. సమాజంలో బలంగా ఉన్న నెగిటివ్ అంశాలు వారిని sub-conscious (సుప్తచేతనావస్థ ) గా ప్రభావితం చేసి ఉంటాయి అదే ” సామాజిక ప్రభావం”. అయితే కొంతమంది ఆ ప్రభావానికి లోను కాకుండా conscious (చేతానావస్థ) గా పాజిటివ్ గా మారతారు.

Like  this story? Share it with a friend!

ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఎవరైనా పాస్ అవుతే అది ఎక్కువమందికి తెలియదు. అదే ఫెయిల్ అవుతే చాలామందికి తెలిసిపోతుంది. ఇంకొక చిన్న విషయం, ఎవరైనా ఫెయిల్ అయితే, వెంటనే తన ఫ్రెండ్స్ రిజల్ట్స్ కనుక్కునే ప్రయత్నం చేయడం చాలా సందర్భాల్లో, లేదా ఒకటి రెండు సందర్భాల్లో ( కనీసం చిన్నతనంలో) దాదాపు ప్రతి ఒక్కరికి జరిగే ఉంటుంది. నేను కూడా చిన్నప్పుడు ఒకటి రెండు సార్లు అలా చేసి ఉంటాను. ఆరో తరగతి ఎంట్రన్స్ రాయకుండా స్కూల్ లో సీట్లు వచ్చేవి. నాకు అలా రాలేదు. మా ఫ్రెండ్స్ ( ఎక్కువగా డాక్టర్ల పిల్లలు) కి వచ్చింది. నేను కూడా అప్పుడు అలాగే అనుకున్నాను. అఫ్ కోర్స్, తర్వాత నాకు ఎలాగోలా సీటొచ్చింది. ఏదైనా స్పోర్ట్స్ కు ఒక పిల్లవాడు సెలెక్ట్ కాలేదు అని తెలిసి, మన ఫ్రెండు సెలెక్ట్ అయ్యాడో లేదో అని వెంటనే తెలుసుకోవడం అలాంటిదే. ఇలాంటివి ఎన్నో అంశాలు సమాజంలో చాలా కామన్. తమ అబ్బాయి ఎంసెట్ లో తక్కువ ర్యాంకు తెచ్చుకున్న సందర్భంలో, పొరుగునే ఉన్న వాడి ఫ్రెండ్ కి మంచి ర్యాంకు ఎలా వచ్చిందో అన్న చర్చ చాలా కాలం పాటు చేసి బాధపడే తల్లిదండ్రులు చాలా మందిని నేను చూశాను. ఇంకో విషయం ఏంటంటే ఆ ఫ్రెండ్ గురించి చాలా నెగిటివ్ విషయాలు కూడా చెబుతారు. ఉదాహరణకి “వాడు మా వాడి కన్నా ఎక్కువ ఇంటలిజెంట్ కాదు. పైగా ఎప్పుడూ సినిమాలు, షికార్లు అని తిరుగుతుంటాడు. రాత్రి పూట కూడా ఎక్కువసేపు చదవడు. తొందరగా నిద్రపోతాడు..” ఇలా ఎన్నో నెగిటివ్ అంశాలు చెప్తారు. ” మా అబ్బాయి బాగా రాయలేదు. ఆ పిల్లవాడు బాగా రాశాడు. అందుకే మంచి ర్యాంకు వచ్చింది.” అని ఒప్పుకునే, లేదా చెప్పుకునే తల్లిదండ్రులు అరుదుగా ఉంటారు. వాళ్లు పాజిటివ్ థింకర్స్.

https://trendingtelugunews.com/top-stories/features/rtc-staff-passengers-force-family-to-get-down-the-bus-with-deadbody/

ఒక అమ్మాయికి మామూలుగా సాంప్రదాయబద్ధంగా పెళ్లయింది. చాలామంది బంధువులు వచ్చారు. పెళ్లి ఘనంగా జరిగింది. ఒక అమ్మాయి ఎవర్నో ప్రేమించి పెళ్లి చేసుకుంది, అది తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ఒక అమ్మాయి కులాంతర వివాహం చేసుకుంది, తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ఒక అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి ఒకరిని పెళ్లి చేసుకుంది. ఒక అమ్మాయి పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. ఒక అమ్మాయి పెళ్లయిన పది రోజులకే విడాకులు తీసుకుంది. పైన చెప్పిన అన్ని పెళ్లిళ్ల గురించి చర్చ జరుగుతుంది. ఏ పెళ్లి గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది?? అది పెద్ద రహస్యమేమీ కాదు!
మొదటి పెళ్లి గురించే తక్కువ చర్చ జరుగుతుంది. లేదా దీని గురించే ఎక్కువ చర్చ జరిగినా, బాగున్న అంశాల గురించి చాలా తక్కువ, బాగా లేని అంశాల గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. ఉదాహరణకి. ” అన్నీ బాగున్నాయి కానీ, స్వీట్లు మూడు రకాలే పెట్టారు, జాంగ్రీ బదులు డ్రై ఫ్రూట్ లడ్డు పెట్టి ఉంటే బాగుండేది, …” ఇలా ఉంటాయి. ” రంధ్రాన్వేషణ” అన్నది సమాజంలో తరచూ వినబడే పదం. అదేంటంటే ఒక ఇంట్లో అదేపనిగా ఏదైనా రంధ్రము( కన్నము ) ఉందేమో అని వెతకడం. అయితే ఒక విషయం గమనించాలి. నెగిటివ్ గా మాట్లాడే వారు ఆ పని ఇంటెన్షన్ గా చేయకపోవచ్చు, సబ్ కాన్షియస్ గా అది ఒక అలవాటుగా మారి ఉండవచ్చు. అందుకే నెగిటివ్ వ్యక్తులనే పూర్తిగా తప్పు పట్టలేము. అది ఒక సామాజిక, సబ్ కాన్షియస్ ఎఫెక్ట్!

చాలామంది ఏదన్నా జరుగుతుందేమో అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. ఉదాహరణకి మోటార్ సైకిల్ ఫ్రెండ్ తీసుకెళ్లాడు అనుకుందాం. చాలా సేపటికి రాకపోతే మోటార్ సైకిల్ ఇచ్చిన వాళ్ళు ( చాలామంది) కీడునే శంకిస్తారు. పెట్రోల్ అయిపోయిందేమో, క్లచ్ వైర్ కట్ అయిందేమో, బండికి యాక్సిడెంట్ అయిందేమో, పోలీసులకి దొరికిపోయి చలానా పడిందేమో, ఇలా ఎన్నో రకాలుగా ఊహించుకోవడం మొదలవుతుంది. పాజిటివ్ ఒక్కటి గూడా ఊహించరు ( పొరపాటు పడవద్దు. అందరూ అలా ఉండకపోవచ్చు. సమాజంలో ఎక్కువభాగం అలా ఉంటారని అంచనా!).

“కీడెంచి.. మేలు ఎంచాలి”అన్న సామెత చూడండి. ఏందుకు కీడు ఎంచాలి?? చాలామంది దీనికి జవాబు చెప్పలేరు. “నా మనసు ఎందుకో ఈడు శంకిస్తోంది” .ఈ డైలాగ్ చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. ఇది సమాజం ద్వారా ఉత్పత్తి అయిన నెగిటివ్ ఎఫెక్ట్.

అందుకే ప్రతి వాళ్లు నెగిటివ్ నుంచి పాజిటివ్ గా మారే ప్రయత్నం కాన్షియస్ గా ( చేతన తో) చేయవలసిన అంశం. ప్రస్తుత ప్రపంచంలో అది కొంచెం కష్టమే అయినా, ప్రయత్నిస్తే సాధ్యమవుతుంది.
Saleem Basha CS

(సి.ఎస్.సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)