కరోనా మహమ్మారి జర్నలిస్టులను భయాందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి ఎంతోమంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఎందరో ఆసుపత్రుల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే మనోజ్ అనే యువ క్రైం రిపోర్టర్ కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు తెలంగాణ సర్కారు తరఫున ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందలేదని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ఈ తరుణంలో జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ లో కరోనా చికిత్సను చేర్చాలని టి జర్నలిస్టుల ఫోరం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఫోరం నేతలు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వివరాలు ఇవీ…
జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ (JHS)లో కరోనా చికిత్సను చేర్చండి
మంత్రి ఈటలకు T జర్నలిస్టుల ఫోరమ్ విజ్ఞప్తి
జర్నలిస్ట్ హెల్త్ స్కీం(JHS) లో కరోనా వైద్యాన్ని చేర్చాలని T జర్నలిస్టుల ఫోరమ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ని T జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షులు పల్లె రవికుమార్, ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, కార్యదర్శులు కోడికంటి శ్రీనివాస్, పాలకూరి రాజు తదితరులు బీఆర్కే భవన్ లో కలిసి వినతి పత్రం అందజేశారు. కరోనా ఉధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు ను మంత్రికి వివరించారు. అనేక మంది జర్నలిస్టులు వైరస్ బారినపడుతున్న విషయాన్ని అధ్యక్షులు పల్లె రవికుమార్ మంత్రికి వివరించారు. ఈ కష్ట కాలంలో ప్రభుత్వం జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు భరోసా ఇవ్వాలని కోరారు.
డిమాండ్స్:
– తక్షణమే జర్నలిస్టుల హెల్త్ స్కీమ్(జీహెచ్ఎస్) లో కరోనా వైద్యాన్ని చేర్చాలి
– పేద, మధ్యతరగతి ప్రజలు మెరుగైన వైద్యం పొందేలా ఆరోగ్యశ్రీలో కరోనా వైద్యాన్ని చేర్చాలి
– ప్రైవేటు ఆస్పత్రులో చార్జీలను క్రమబద్దీకరించి, నియంత్రించాలి.
– గాంధీ ఆస్పత్రికి పేషెంట్ల రద్దీని తగ్గించడంతోపాటు సౌకర్యాలను మెరుగు పరచాలి.
– కేసులు వేగంగా పెరుగుతున్న దృష్ట్యా టిమ్స్ ను అందుబాటులోకి తెచ్చి వైద్య సేవలను ప్రారంభించాలి
-ప్రతి జిల్లా ఆస్పత్రిలో 100 పడకలు ఏర్పాటు చేసి, పేదలకు కరోనా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి.
తాము దృష్టికి తీసుకు వచ్చిన అంశాలపై తక్షణమే స్పందించి తగిన ఆదేశాలివ్వాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కు T జర్నలిస్టుల ఫోరమ్ విజ్ఞప్తి చేసింది.